summaryrefslogtreecommitdiff
path: root/39561-0.txt
diff options
context:
space:
mode:
authorRoger Frank <rfrank@pglaf.org>2025-10-14 20:13:04 -0700
committerRoger Frank <rfrank@pglaf.org>2025-10-14 20:13:04 -0700
commit12da143fe1bf393e60d3e93e4c8ffc421e9cade4 (patch)
tree9cf579f8637ddd9156067e92fb2d385349ad8b56 /39561-0.txt
initial commit of ebook 39561HEADmain
Diffstat (limited to '39561-0.txt')
-rw-r--r--39561-0.txt5078
1 files changed, 5078 insertions, 0 deletions
diff --git a/39561-0.txt b/39561-0.txt
new file mode 100644
index 0000000..a7c2777
--- /dev/null
+++ b/39561-0.txt
@@ -0,0 +1,5078 @@
+The Project Gutenberg EBook of Agnigundam, by Rama Mohana Rao Mahidhara
+
+This eBook is for the use of anyone anywhere at no cost and with
+almost no restrictions whatsoever. You may copy it, give it away or
+re-use it under the terms of the Project Gutenberg License included
+with this eBook or online at www.gutenberg.org
+
+
+Title: Agnigundam
+
+Author: Rama Mohana Rao Mahidhara
+
+Release Date: April 28, 2012 [EBook #39561]
+
+Language: Telugu
+
+Character set encoding: UTF-8
+
+*** START OF THIS PROJECT GUTENBERG EBOOK AGNIGUNDAM ***
+
+
+
+
+Produced by Volunteers at Pustakam.net
+
+
+
+
+అగ్నిగుండం
+
+మహీధర రామమోహనరావు
+
+
+
+
+విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
+
+చంద్రం బిల్డింగ్స్, విజయవాడ-520004
+
+
+
+
+ప్రచురణ సంఖ్య : 939
+
+ప్రతుల సంఖ్య : 2000
+
+ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి, 1980
+
+వెల : రూ. 8/-
+
+ముద్రణ:
+
+స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్.
+
+విజయవాడ-520004
+
+
+
+
+పూజ్యమిత్రులు
+
+శ్రీపాద లక్ష్మీనరసింహంగారి
+
+స్మృతికి
+
+
+
+
+జాగ్రత్త పడవలసిన ఘట్టం
+
+
+ఒక పెద్ద పోలీసు అధికారి ఒక మేధావుల సభలో హైద్రాబాద్‌లో ప్రసంగిస్తూ ప్రజలలో హింసా ప్రవృత్తీ, దౌర్జన్య
+దృక్పథం పెరిగి పోయిందన్నారు. పోలీసు బలగానికికూడా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పినా, ప్రజలలో ఆ ప్రవృత్తి తీవ్రం
+కావడంచేతనే పోలీసులలోనూ దాన్ని ప్రతి క్రియారూపంలో చూస్తామనేది ఆయన వాదన సారాంశం.
+
+ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ వర్గాలు, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న అవినీతి, ప్రజా వ్యతిరేకత, హింసా
+ప్రవృత్తికి ప్రతిక్రియగానే ప్రజలలో దౌర్జన్యకాండమీద మొగ్గుదల ప్రబలుతూంది. ఒక లారీనో బస్సునో తగలపెట్టేరన్నా,
+ఒక పోలీసు స్టేషను మీద రాళ్ళు విసిరేరన్నా, ఒక ఆఫీసరునో, కళాశాలాధికారినో చెయ్యి చేసుకున్నారన్నా, ప్రత్యర్ధిని
+ఒంటరిగా చిక్కించుకొని పొడిచేశారన్నా చివరికి నక్సలైట్ వుద్యమం చెలరేగిందన్నా ఇది సమాజంలో నోరుగలవాళ్ళూ, అధికారం
+గలవాళ్ళూ నిర్భయంగా సాగిస్తున్న అన్యాయాలూ, దురంతాల ప్రతిక్రియగా వస్తున్నదేగాని వేరుకాదు. నా 'రధచక్రాలలో' ఒక
+వాక్యం వుంది: "నిప్పు ముట్టించేవాళ్ళమూ మనమే, చెయ్యి కాలి ఏడ్చేవాళ్ళమూ మనమే"--నని. నిజానికి పాలకవర్గాలు
+చేస్తున్నదదే.
+
+ఈ నవలలోని ఘటనలన్నీ నేనే అనుభవించినవో, స్వయంగా చూసినవోనే. వానికి నవల రూపం ఇవ్వడంలో వెనక ముందులూ, కొన్ని
+సర్దుబాట్లూ, తగు మాత్రపు సాగదీయడాలూ వున్నా ఇవన్నీ జరిగినవే. అయితే అవి జరిగినవి 12-13 ఏళ్ళ క్రితం.
+ఈనాడవి మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి. ఇటీవలి డాక్టర్లు, లెక్చరర్లు, బ్యాంకు ఉద్యోగులు మొదలయిన వారి సమ్మెలు
+ప్రభుత్వ, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి ప్రతిక్రియా రూపమేగాని వేరుకాదు. సాధ్యమైనంతవరకు
+ఒరగ దోసుకుపోయే స్వభావంగల మధ్యతరగతులలోకి కూడా ఈ ఆత్మరక్షణ భావం బలపడిందంటే సామాజిక పరిస్థితులు ఎంత
+క్షీణిస్తున్నాయో అర్థం చేసుకోగలం.
+
+తెలుగు దేశం నాకో అగ్నిగుండంగా కనిపించింది. ఈవేళ ఆ స్థితి మరింత క్షీణించింది. హింసా, అన్యాయాలను ప్రభుత్వం తన విధానంగా
+మార్చుకొంది.
+
+ఇదో జాగ్రత్త పడవలసిన ఘట్టం.
+
+మహీధర రామమోహనరావు
+
+1-2-1980
+
+అమీర్‌పేట
+
+
+
+
+ఒక మాట
+
+
+1967 జూన్‌లో ప్రభుత్వపు రిట్రెంచిమెంటు పథకంతో తెనుగు దేశం అట్టుడికి నట్లున్నప్పుడు మిత్రులు కొసరాజు
+శేషయ్యగారూ నేనూ ఆనాటి పరిస్థితిని యితివృత్తంగా తీసుకొని నవలలు వ్రాయాలనుకున్నాం.
+
+ఆ రోజు మొదలుకొని ఒకటి రెండు నెలలు నేను చూసినవి, వింటున్నవి, అనుభవిస్తున్నవి, చదువుతున్నవి కాగితం మీద పెట్టేను.
+అలవాటు పడిపోవడంచేత మనకు కనిపించని భయానకమైన సామాజిక విశీర్ణత-గతి వానిలో కనిపించింది.
+
+ఆ ఘటనలకు ఒక కథా రూపం కల్పించి ఆనాడే కాగితం మీద పెట్టేను. కాని, ఆ కథకు ముగింపు ఎలాగో అర్థం కాలేదు. వానిని
+కట్టగట్టి పెట్టెలో పడేశా.
+
+రెండేళ్ళ అనంతరం శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్లు జిల్లాలలో నక్సలైట్ పోరాటాలు, విద్యావంతులలో వ్యాపిస్తున్న నిహిలిస్టు
+ధోరణులు, ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక ధోరణులు, రాజకీయ పార్టీల విచ్ఛిన్న స్థితి, నిస్తబ్ధస్థితి
+నుంచి బయటపడటానికి కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న కృషి చూసేక, నా నవలకు ముగింపు అర్థం అయిందనిపించింది.
+
+ఒకటి రెండు మార్పులూ, చేర్పులూ, చివరన రెండు మూడు ప్రకరణాల జోడింపుతో నవల పూర్తి అయింది.
+
+అదే 'అగ్నిగుండం' అదో అగ్నిగుండం. మీ ముందుంది.
+
+-రచయిత
+
+24-12-71
+
+మద్రాసు
+
+
+
+
+ఒకటో ప్రకరణం
+
+
+ఆంధ్రప్రభుత్వం తలపెట్టిన పొదుపు ప్రయత్నం ఊళ్ళంపట ఊరేగింపులు సాగిస్తున్న మంత్రుల ప్రయాణపు ఖర్చుల్ని గాక, తన
+బతుకు తెరువుకు ఏకైకాధారంగా వున్న ఆ రెండు వందల యాభై రూపాయల నెల జీతాన్నీ సమూలంగా కోసేస్తున్నదని తెలిసేవరకు రామారావు
+నిర్విణ్ణుడే అయాడు.
+
+"ఇప్పటికే కొన్ని సబ్జక్ట్సుకి లెక్చరర్లు లేరు. ఉన్నవాళ్ళు చాలక కొన్ని క్లాసులు జరగడం లేదు. ఇంకా వున్నవాళ్ళని
+తగ్గించడం వలన చదువులు మరింత చెడతాయి...."
+
+"వెరీ....వెరీ సారీ. నేను చెయ్యగల దేమీలేదు."--అని ప్రిన్సిపాలు మరోమారు ఇంగ్లీషులో తన బాధా, తెలుగులో తన
+అసమర్థతా కనబరిచేడు.
+
+"మనది అసలే దరిద్రదేశం. ప్రక్కనున్న రాష్ట్రంతో పోలుస్తే మనకి చదువూ తక్కువే. అటువంటప్పుడు ఉన్నవాళ్ళచేత
+పకడ్బందీగా పని చేయించుకొని దేశాన్ని సుందరంగా, సౌభాగ్యవంతంగా...."
+
+స్వాతంత్ర్యదినోత్సవపు ఉపన్యాసధోరణిలో పడిపోతున్నాననిపించి రామారావు మాట మధ్యలోనే ఆగిపోయేడు.
+
+"డబ్బు లేనప్పుడు ప్రభుత్వం మాత్రం చెయ్యగలదేముంది? ప్రభుత్వమే చెయ్యి వెతకవేస్తే కాలేజీ కమిటీ ఏంచేస్తుంది?"--అంటూ
+ప్రిన్సిపాలు టీచర్లను తగ్గించవలసి రావడాన్ని సమర్ధించడానికి ప్రయత్నించేడు. కాని, ఆయన కంఠస్వరంలో ఆ విశ్వాసం
+వినబడలేదు.
+
+"కమిటీ చెయ్యగల దేమీ లేదా?"
+
+ప్రిన్సిపాల్ ఎటోచూస్తూ సమాధానం ఇవ్వలేదు. తన ప్రశ్నకు తానే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు, రామారావు.
+
+"ఇప్పటికే కాలేజీలో టీచింగ్ స్టాఫ్ కన్నా నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎక్కువగా వుంది."
+
+ప్రిన్సిపాల్ నిట్టూర్పు విడిచాడు.
+
+"పనులు అల్లావున్నాయి...."
+
+"ప్రిన్సిపాల్ గారూ! ప్రమాదం వచ్సినప్పుడేనా మొగమాటాలూ, భయాలూ వదలిపెట్టాలి. కాలేజీ నిర్వాహణ ఖర్చులో 80 శాతాన్ని
+యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషను భరిస్తున్నప్పుడు టీచింగ్ స్టాఫ్ ని గట్టిపరుచుకోవాలి. కాని, మన కాలేజీ కమిటీ...."
+
+"మన దనేదేమిటి? అన్నిచోట్లా జరుగుతున్న పనే ఇక్కడా చేశారు."--అని ప్రిన్సిపాల్ యథాశక్తి కాలేజీ పాలకకమిటీ
+అపరాధాన్ని తగ్గించేందుకు ప్రయత్నించేడు.
+
+"అందరూచేస్తే దేశద్రోహం ఘరానాపని అవుతుందా సార్! కమిటీ సభ్యులు పోటాపోటీగా తమ అనుచరుల్నీ, బంధువుల్నీ, వారి
+సిఫారుసుల్నీ తీసుకొని, పని లేకపోయినా గుమాస్తాలుగా, అట్టెండర్లుగా, వేసేస్తూంటే పట్టనట్లు వూరుకున్నాం. ఈవేళ...."
+
+"వాళ్ళని తరిమెయ్య మంటావు...." అన్నాడు ప్రిన్సిపాల్ అతని వాదం సమర్థనీయం కాదన్నట్లు.
+
+"కాలేజీలు చదువుకోసమా, కాక సెక్రటరీగారి తమ్ముడు మామగారి మేనల్లుడికి అట్టెండరు వుద్యోగం ఏర్పాటు కోసమా--అన్నదానిని
+పట్టి వుంటుంది."
+
+ప్రిన్సిపాల్ నిరుత్తరుడయ్యేడు. ఒక్క క్షణం వూరుకొని--"నా చేతుల్లో ఏమీలేదు, రామారావూ నా చేతుల్లో ఏమీలేదు అన్నాడు."
+
+ఆయన బాధ ఎరిగిన రామారావు నిరుత్తరుడయ్యాడు. నిరుడు ఒక ఇంగ్లీషు లెక్చరరు అనవసరంగా ఒక విద్యార్థిని అవమానించేడు.
+కాలేజీ పిల్లలంతా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండుచేస్తూ సమ్మె చేశారు. ఆ లెక్చరరుకు కమిటీలో వెనకదన్ను వుంది. చాలా
+గొడవ జరిగింది. తెలివైన ఇద్దరు విద్యార్థులకు టి. సి. లిచ్చి పంపెయ్యవలసి వచ్చింది. ఆ లెక్చరరు ఇక్కడే వుండి రోజూ
+ఏవేవో సమస్యలు తెచ్చి పెడుతూనే వున్నాడు. ప్రిన్సిపాల్ ఏమీ చెయ్యలేక పోతున్నాడు. అదే ఒక్కమాటలో చెప్పేడు.
+
+"నా చేతుల్లో పనా? నీ వెర్రిగాని...."
+
+"కాలేజీ కమిటీని కలుసుకోమంటారా?"
+
+ఆ అమాయకత్వానికి జాలి పడుతున్నట్లు ప్రిన్సిపాల్ ముఖం పెట్టేడు. అదేం లాభంలేదని ఆయన ఎరుగును. కనక ఉపశమన
+వాక్యాలతో సంతృప్తి పరచ దలిచేడు.
+
+"కలుసుకోడంలో తప్పేమీ లేదు. కాని, వాళ్ళూ ఏం చెయ్యలేరు. అనవసరం. ఈ పాడు వుద్యోగం లేకపోతే బతకలేక పోతావట.
+గోల్డ్ మెడలిస్టువి. తెలివి ఉంది. చొరవ ఉంది. కుర్రవాడివి, బోలెడు జీవితం ముందున్న వాడివి...."
+
+"అన్నీ వున్నాయికాని అంచుకు తొగరే లేద"ను కున్నాడు రామారావు. పైకిమాత్రం అవహేళనను మిళితం చేసి, తన బాధ తెలిపేడు.
+
+"అదేనండి దుఃఖం. ఇంత బతుకు గడవాలే ఎల్లాగరా యనే...."
+
+"ఠట్, ఠట్." కోప్పడుతున్నట్లు ధ్వనించేడు ప్రిన్సిపాలు.
+
+రామారావు మరింత ఉక్రోషం కనబరిచేడు.
+
+"యయాతి వంటి వాడెవరన్నా దొరికితే బాగుండును. ఓ ఏడాది బతికే దారి చూపుతే జీవితం అంతా ఇచ్చేద్దును."
+
+ప్రిన్సిపాల్ కళ్ళలో హాసరేఖలు తోచేయి.
+
+"మేథమెటిక్సు వాడివి. ఆర్టిలరీలోకి నీవంటివాళ్ళ అవసరం వుంటుంది. యయాతి ఆధునికావతారమే దేశభక్తి. పోయి సైన్యాలలో
+రిక్రూట్ కారాదూ?"
+
+రామారావు తెల్లబోయేడు. ప్రిన్సిపాల్ లేచివచ్చి అతని భుజం తట్టేడు.
+
+"ఒక్క చిన్న దెబ్బకే జీవితం అంతా కొల్లబోయినట్లే బాధ పడితే ఎల్లాగయ్యా! జీవితం అంటే ఏమిటనుకొన్నావు? జీవించేందుకు
+నిరంతరం సాగించే ఘర్షణే జీవితం అంటే."
+
+"ఇది చిన్న దెబ్బా? ప్రిన్సిపాల్ గారూ! రామారావు బతుకు దృష్ట్యా చూసినా ఇది చిన్న దెబ్బేం కాదు. దేశం దృష్ట్యా చూసినా
+కాదు. ఈవేళ వుద్యోగంనుంచి తీసేస్తున్నది నన్నొక్కడినే అనుకోను."
+
+"కాదు...."
+
+"రిట్రెంచిమెంటు ఆలోచనను ఎన్నికలకోసం వెనక్కి పెట్టేరు. ఏరు దాటడం అయిపోయింది. కనక తెప్పలకి ఇప్పుడు నిప్పు
+ముట్టిస్తున్నారు. దేశంలో చదువు కనీస ప్రమాణానికి కూడా చేరలేదు. పరిశ్రమలు లేవు. ప్రాజెక్టులు లేవు. హాస్పిటళ్ళు లేవు.
+పదివేలమందికో డాక్టరన్నా లేడు. ఉన్నవాళ్ళని కూడా మాకొద్దు పొమ్మంటున్నారు. దేశం ఏమవాలి? దేశంలోని జనం ఏమవాలి?
+ఇరవయ్యేళ్ళ స్వాతంత్ర్యం దేశానికీ, మనకీ, తెచ్చిందీ, ఇచ్చిందీ ఈ దుఃఖమూ, ఈ నిర్వేదమూ మాత్రమేనా? దీనినేనా మీరు
+చిన్నదెబ్బ అనేది?"
+
+ఆ ఆవేశం చూసి ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. ఏం చెప్పడానికీ తోచలేదు. టేబిలుమీది కాగితాలు సర్ది, పేపర్ వెయిట్ లు మార్చడం
+మొదలు పెట్టేడు.
+
+రామారావు ఒక్క నిముషం ఆగి, తన అభిప్రాయం స్పష్టం చేసేడు.
+
+"మనుష్యుల్ని తోసెయ్యగల వాళ్ళకి దేశం కాబట్టదు. దేశాన్ని గౌరవించలేనివాడు మనుష్యుల్నీ మన్నించలేడు."
+
+ప్రిన్సిపాల్ పరధ్యాన్నంగానే అనేసేడు--"అంతేలే, అంతేలే...."
+
+"సెలవిప్పించండి."
+
+"వెళ్ళిరా. ఆందోళన పడకు, అన్నీ సర్దుకొంటాయి."
+
+ప్రిన్సిపాల్ అనునయం, ఓదార్పు అతని చెవి చొరడంలేదు. దేశభక్తి గురించి ఆయన చేసిన వ్యాఖ్య మనస్సులో మెరుగుతూంది.
+వెనక్కి తిరిగిన వాడే మళ్ళీ ఆగేడు.
+
+"దేశభక్తిని అంత చులకనగా తీసుకోలేనండి. దేశ రక్షణ కోసం ఆయుధాలు తీసుకోడం, సైన్యాలతో చేరడం తప్పు కాదు. కాని,
+కిరాయి కోసం, తిండిలేక సైన్యంతో చేరవలసిన స్థితి మనిషికీ, దేశానికీ కూడ ఆరోగ్యం కాదు."
+
+ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. కనుబొమ్మలు ముడిచేడు. అంతలో నవ్వేడు.
+
+"ఇదిగో, చూడు. నా వయస్సేమిటి? సూపర్ ఆన్యుయేషన్ కూడా ముగుస్తూంది. ఇంకో నాలుగు నెలలు, ఈ వయస్సువాడి నుంచి ఆక్రోశం,
+అనుతాపం తప్ప ఆశించి లాభం లేదు."
+
+ఈ మారు తెల్లబోవడంవంతు రామారావుది. పడుచువాళ్ళు ఆక్రోశపడీ, ఆవేశపడీ లాభంలేదని చెప్తున్నాడా అనిపించింది. వయస్సులో
+వున్నావు. అమీ, తుమీ తేల్చుకో. దేశం అంటే వున్న అభిమానాన్ని క్రియతో చూపమనడమా, ఆ మాటకు అర్థం?
+
+అంతలో సర్దుకొన్నాడు. ఆ దూరాన్వయమూ, కవ్వింపు ఆలోచనా ఆయనకు వుండవనిపించింది. అంతలో ఆయనే అన్నాడు.
+
+"ధైర్యంగా వుండు. నే చెప్పగలదంతే. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని వస్తూండు. సబార్డినేట్ ననే సంకోచం కూడా ఇంక
+అక్కర్లేదు."
+
+"చిత్తం. సెలవు."
+
+
+
+
+రెండో ప్రకరణం
+
+
+"ఏమిటిహ."
+
+--అన్నాడు, వెనకనుంచి హడావిడిగా వచ్చి, కాలేజీ గేటులో అందుకున్న సహభాగి రామలింగేశ్వరరావు. పరధ్యానంగా, ఏదో
+ఆలోచించుకుంటూ పోతున్న రామారావు వెనక్కి తిరిగేడు.
+
+"నువ్వా."
+
+"ఇంక పనేముంది మరి."
+
+అంత మానసిక వ్యధలోకూడ అతనిని చూడగానే కలిగిన తేలిక భావాన్ని రామారావు దాచుకోలేక పోయేడు. ఆ రోజున తనతోపాటు
+ఉద్యోగంనుంచి తీసివేయబడిన వారిలో అతనూ వున్నాడని తెలుసు. అయినా, అడిగేడు.
+
+"ఏం? నీకూనా?"
+
+రామలింగేశ్వరరావు ముందు తలాడించేడు. అంతలో ఆ మాటలో ఏదో హేళన భావం ధ్వనించినట్లు తోచింది.
+
+"నీకూనా, అంటే?"
+
+"ఎన్నికల్లో అంత చాకిరీ చేసేవు. నెగ్గించేవు. విజయోత్సవంతో బొంగురుపోయిన గొంతుక స్వాధీనం కావడానికి పదిరోజులు పట్టింది.
+అంతల్లా నినాదాలు ఇచ్చేవు. ఆయనమీద అన్ని ఆశలు పెట్టుకున్నావే--అని."
+
+రామలింగేశ్వరరావుకి కోపం బదులు విచారం కలిగింది.
+
+"వారం క్రితంకూడా అదే అన్నాడోయి--మనమాట మాటే. నీ వుద్యోగానికి ఏం ఢోకాలేదు. వెళ్లిరా--అన్నాడు. చివరకి ముంచేసేడు."
+
+"ఆయన మాటల్లో తఖావతు ఏమీలేదు. నిజమే చెప్పేడు. ఆ వుద్యోగానికి ఢోకా ఏం వుంది? అదల్లాగే వుంటుంది. వాళ్ళవాడెవడో
+వచ్చేదాకా వుంటుంది. మధ్యన పొయ్యేది నువ్వు...."
+
+"అంతేనంటావా?"
+
+"చూస్తాంగా." అన్నాడు, రామారావు తేలికగా. కాని, రామలింగేశ్వరరావు అంత తేలికగా తీసుకోలేకపోయేడు.
+
+"నీకేం బ్రహ్మచారిగాడివి, ఒంటరిగాడివి. ఏ ట్యూషన్లు చెప్పుకున్నా నీ పొట్ట నిండుతుంది. నేనేం చేసేది? పెళ్ళాం, ఓ పిల్లవాడూ
+నాకు తోడు. వాళ్లనేం చెయ్యను?"
+
+"బ్రహ్మచారిగాడివి నీకేం--" అన్నమాటకు రామారావుకు నవ్వొచ్చింది. "రేపెల్లాగరా" అని తాను బాధ పడుతున్నాడు.
+
+అతని నవ్వు చూస్తే రామలింగేశ్వరరావుకి అభిమానం అనిపించింది.
+
+"ఈ లం....జా....కొడుకుల్ని వురితీసినా పాపం లేదు."
+
+"ఎన్నుకొని పంపింది, వురితియ్యడానికా, పాపం!"--రామారావు కృత్రిమమైన జాలి నభినయించేడు.
+
+"నేను దేశానికి నిజంగా ద్రోహం చేసేననే అనిపిస్తూంది."
+
+రామారావు అతని ముఖంవంక చూసేడే తప్ప ఏమీ అనలేదు.
+
+"ఏమంటావు?"
+
+"రిట్రెంచిమెంటు ఆలోచనలు జరుగుతున్నాయని ఎన్నికలకు ముందే అందరూ ఎరుగుదురు. ఎన్నికలైన మర్నాడే ఖజానా ఖాళీ అయిపోయిందని
+తెలుసుకొన్నారనుకోకు."
+
+"ఊ."
+
+"నీ కానాడు అనిపించలేదు."
+
+"వాళ్ళ మాటలు నమ్మేను."
+
+"నీ దాకా వచ్చి వుండకపోతే ఇప్పుడూ ఆ నమ్మకం చెదిరి వుండేది కాదు."
+
+ఆ ఆరోపణలో నిజం లేకపోలేదని రామలింగేశ్వరరావు ఎరుగును. ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఇద్దరూ ఒకరి ప్రక్కనొకరు
+నడుస్తూ బస్సు స్టాపువేపు వెడుతున్నారు.
+
+కొంతదూరం వెళ్ళేక రామారావే అన్నాడు.
+
+"ఈ రావులూ, రెడ్లూ నిజాయితీ లేనివాళ్ళు అనను. అయితే వాళ్ళ మినహాయింపులూ, పరిధులూ, పరిమితులూ వేరు."
+
+రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
+
+"వాళ్ళు తను ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్నారనే అంటావేమిటి, కొంపతీసి."
+
+"చిన్న పిల్లాడల్లే మాట్లాడకు"--అని రామారావు గదిమేడు--"ఒక మనిషేమిటి? పార్టీయే అనే దేమిటి? వాళ్ళ నిజాయితీ
+తెలుసుకోడానికీ, కొలవడానికీ మాటలు కాదు, చూడవలసింది. చేతలూ వాటి ఫలితాలూను."
+
+"ఔను." అన్నాడు రామలింగేశ్వరరావు. కాని, ఆ మాటలో విశ్వాసం వినిపించలేదు.
+
+"ఏమిటి నీ సందేహం?"
+
+"కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళ తరవాత దేశం 1947లో వున్నట్లుగానే లేదు."
+
+"ఉందని ఎవరన్నారు?"
+
+"చదువులు....పరిశ్రమలు....ప్రాజెక్టులు....దేశం మొత్తం మీద చూడు."
+
+"ఔను."
+
+"అందుచేతనే మోసపోయాను. వానిని చూపించే మోసపుచ్చేరు."
+
+రామారావు నవ్వేడు.
+
+"ఇంకా అల్లాగే మోసపోతుండడానికి ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏమిటి?"
+
+తనదాకా వచ్చిందనే తప్ప, రామలింగేశ్వరరావుకి మరో కారణం కనబడలేదు. అయితే ఆ మాట ఒప్పుకోలేదు. తప్పించుకున్నాడు.
+"నువ్వే చెప్పు"
+
+రామారావు చెప్పేడు. దేశం మొత్తం మీద పెట్టుబడిదారీ – ధనిక భూస్వామ్య వ్యవస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం చేస్తున్న
+పనులన్నీ ఎల్లా తోడ్పడుతున్నాయో చెప్పేడు.
+
+"కనకనే పెట్టుబడిదారీ విధానంతో పాటుగా దాని వెనువెంబడి వుండే పీడలన్నీ మనకూ అనుభూతం అవుతున్నాయి."
+
+రామలింగేశ్వరరావు నవ్వేడు.
+
+"ఎలక్షన్ వుపన్యాసం యిచ్చేవు."
+
+రామారావుకు అభిమానం అనిపించింది. తన మాటల్ని అంత తేలిగ్గా తోసెయ్యడమా?
+
+"ఉత్పత్తి ఒక మూల పెరిగింది. రెండో మూల ధరలూ పెరిగేయి. నిజానికవి తగ్గాలి, కాని, అలా జరగడంలేదు."
+
+ఆలోచనకు వ్యవధినిస్తూ, రామారావు ఒక్క క్షణం ఆగేడు. కాని, రామలింగేశ్వరరావు ఆలోచనకు నిరాకరించేడు.
+
+"నేను ఎకనమిక్స్ వాడిని కాదు."
+
+"అక్కర్లేదు. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలకే అది ముడిపడ్డం లేదులే."
+
+"మరి?"
+
+"ఉత్పత్తికీ, పంపిణీకీ సంబంధం లేదు. ఎవరి వాయిద్యాలు వారివి. తీర్ధానికి తీర్ధం, ప్రసాదానికి ప్రసాదంగా వున్న ఈ
+పరిస్థితి మారాలి."
+
+"అంటే కమ్యూనిజం రావాలి." అన్నాడు. రామలింగేశ్వరరావు ఎకసక్కెంగా.
+
+రామారావు నవ్వేడు.
+
+"పేర్లమీద అంత ఎలర్జీ పెంచుకోకూడదు. అది అట్టే ఆరోగ్యకరమయిన లక్షణం కాదు. పోనీ సోషలిజం పేరు నచ్చితే అల్లాగే
+పోనిద్దాం."
+
+"ఆ మాట కాంగ్రెసే అంటూంది కదా."
+
+"ఇంకనేం. దాని ఫలితాల గురించి విచారం ఎందుకు?"
+
+"దాని అర్ధం ఒక్కటే. సోషలిజం సంఘంలోని బాధలకు విరుగుడు కాదు."
+
+"సోషలిజం అనే మాటను గబ్బు పట్టించడమే కాంగ్రెసు వారి వ్యూహమనీ, అంతవరకూ ప్రజలలో సోషలిజం యెడవున్న అభిమానాన్ని
+ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం దాని ఎత్తుగడ అనీ అంటే ఓ మాటు నా మీద పడిపోయావు గుర్తుందా?"
+
+రామలింగేశ్వరరావు వూరుకున్నాడు.
+
+"ఇప్పుడేమంటావు?"
+
+"నీ అభిప్రాయం తప్పంటా."
+
+"అన్నీ తెలిసి ఆత్మహత్య చేసుకోదలిచినవాడిని ఆపడం కష్టం. అసంభవం."
+
+"దొంగ వర్తకుల్ని ఉరి తియ్యాలని నెహ్రూ అన్నట్లు మీరు తరుచు జ్ఞాపకం చేస్తుంటారు, సరిగ్గా అదే మందు. వాగ్దానాలను
+అమలు జరపని వాళ్ళని ఓ అరడజను మందిని ఉరితీసేస్తే సంఘంలో సమస్యలన్నీ సర్దుకుపోతాయి." అంటూ రామలింగేశ్వరరావు
+సగర్వంగా చూసేడు.
+
+రామారావు నవ్వేడు.
+
+"మందు మంచిదే. ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? ఎప్పుడు మొదలెడతావు?"
+
+
+
+
+మూడో ప్రకరణం
+
+
+ఎటూ కానివేళ కాలేజీ నుంచి తిరిగి వస్తున్న వాళ్ళిద్దర్నీ చూసి కిళ్లీ బడ్డి రత్తమ్మ చిరునవ్వుతో పలకరించింది.
+
+"ఏం బాబులూ! అప్పిడే ఎలిపోతుండారు. ఎండగావుంది. దయి సేయిండి. ఓ సోడా తాగి పోదురుగాని...."
+
+వారి సమాధానం కోసం ఎదురు చూడకుండానే రత్తమ్మ కిందనున్న నీళ్ళ తొట్టెలోంచి రెండు సోడాకాయలు తీసింది. రెండు గ్లాసులు తొలిచి
+సిద్ధం చేసింది. నిమ్మ చెక్కలు తీస్తూంది. రెండో వేపున మాటలు చెప్పుకు పోతూంది.
+
+"రామారావు బాబూ! మావోడికి ఎక్కడన్నా కుసింత పని సూపించలేవా బాబూ! వూరకే తిరిగి సెడిపోతున్నాడు. ఏదన్నా పనిలో వుంటే
+నన్ను డబ్బులకి పీక్కు తినడవేనా తగ్గుతుంది. నువ్వెరగవేంటి? ఈ కొట్టు మీదున్నదే గంద నా ఆస్తి. పెద్దదాన్నయిపోనా. నే
+తిన్నా, ఆడికెట్టినా దీని మీదే గంద. రోజూ పై కరుసుకి కూడా "తేముండా" అంటే ఎక్కడ సచ్చేది బాబూ!"
+
+ఆమె అభ్యర్ధన విని రామలింగేశ్వరరావు మందహాసం చేసేడు.
+
+"అడుగుతూ, అడుగుతూ మంచివాళ్ళనడిగేవు, మామ్మా!"
+
+రత్తమ్మ చాల నొచ్చుకుంది.
+
+"సదువుకున్నోళ్ళు, మీరే అల్లాగంటే."
+
+"రేపు ఈ కాలేజీ వేపు రావలసిన పని మాకే లేదు. ఈ క్షణం నుంచి మేమూ నీ మనమడూ...."
+
+రత్తమ్మకి ఆ మాట అర్ధం కాలేదు.
+
+"టురాన్స్‌పర్ గీనా? ఎక్కడికి? ఏ వూరెల్తుండారు?"
+
+"ఎక్కడకుంది?--ఇంటికే."
+
+"రత్తమ్మ తెల్లబోయింది. అసలు విషయం చెప్పకుండా అల్లా నలిపి చంపడం రామారావుకి నచ్చలేదు.
+
+"మమ్మల్ని వుద్యోగాలనుంచి తీసేశారు. డబ్బివ్వలేం. పొమ్మన్నారు."
+
+"డబ్బుల్లేవూ?"
+
+"వాళ్ళన్నారు. ఇచ్చీది వాళ్ళు కదా." అన్నాడు రామలింగేశ్వరరావు.
+
+"ఉట్టిది బాబూ! దొంగ నాయాళ్ళు కితం వోరమే గందా, కర్రిపద్దాలు కొడుక్కి కాలేజీలో బంట్రోతు పనేసిండ్రు. అల్లాగే మావోడికీ
+ఇత్తారేమోననుకుంటే మిమ్మల్ని తీసేశారూ."
+
+"మళ్ళీ కనిపిస్తుంటాంలే మామ్మా. ఇక మీద తీరుబడేగా." అంటూ రామారావు ముందడుగేసేడు. ఓ నిముషం అక్కడ నిలబడదామనీ,
+కిళ్ళీబడ్డీ రత్తమ్మ సానుభూతి వాక్యాలు వినాలనీ వున్నా, మిత్రుడు నడుస్తుండడం చేత రామలింగేశ్వరరావూ కదలవలసి వచ్చింది.
+
+"ఎల్లి రాండి బాబూ! నోట్లో ముక్కున్నోళ్ళు. ఇంత దేశంలో బతకనేక పోతారంట." అంటూ రత్తమ్మ ధైర్యం చెప్తూంటే "అంతేలే,
+అంతేలే" అని సాచేసేరు.
+
+పత్రికల్లో నిరుద్యోగం గురించి వస్తున్న వార్తలకు సాక్ష్యంగా రత్తమ్మ పక్క కొట్లవాళ్ళకి తమరిద్దరినీ చూపి చెప్పడం
+వెనుకనుంచి వినిపిస్తూంటే ఆ ఇద్దరూ ఆమెను గురించే ఆలోచిస్తున్నారు.
+
+ఆమెలాగ కిళ్ళీ కొట్టేనా పెట్టుకుని బతకగలమా అని రామారావు ఆలోచన.
+
+రామలింగేశ్వరరావు ఆలోచనలో కొంచెం తేడా వుంది.
+
+"ఈ ముండకి మనమడుగా పుట్టినా సుఖపడుదుం. ఈ ముండా వుద్యోగాలు వుండడం, పోవడం ఏడుపు లేకుండా వున్నన్ని రోజులూ
+జల్సాగా...."
+
+"మళ్ళీ మనమడుగా ఎందుకు? ఆ ముండగా పుడితే మంచి మనస్సేనా వుంటుంది కదా." అంటూ, రామారావు మిత్రుని ఆలోచనకు చికాకు
+పడ్డాడు.
+
+"మనస్సు మంచిదైతే అన్నం వుంటుందంటావా? లేదు సోదరా! కాదు, వట్టి భ్రమ. ఎంతమంది నెత్తిన చెయ్యి పెట్టగలుగుతే అంత
+అన్నం ఇది ఈ ప్రపంచ సూత్రం. సిద్ధాంతాలనేవి వట్టి హంబగ్."--రామలింగేశ్వరరావు మాటమీద మాటగా ఆవేశంతో
+అరిచేస్తున్నాడు.
+
+రామారావుకి ఆశ్చర్యం కలిగింది.
+
+"ఏమిటీ వుప్పెన."
+
+తాము నడిరోడ్డు మీద వున్నామనీ, ఆ అరుపుల అవసరం ఏమీ లేదనీ, అప్పుడే దారినపోతున్న వారొకరిద్దరు నిలబడిపోయి,
+ఆశ్చర్యంగా తమరిని చూస్తున్నారనీ గమనించి రామలింగేశ్వరరావు గమ్మునైపోయాడు.
+
+అంతలో బస్సు రావడంతో ఇద్దరూ కంగారు కంగారుగా దానిలో ఎక్కేసేరు.
+
+
+
+
+నాలుగో ప్రకరణం
+
+
+ఏలూరు రోడ్డు సెంటరులో బస్సు దిగుతూనే రామారావు ఎదురుగా వున్న హోటలు కేసి దారి తీసేడు.
+
+"రా. ఓ అర కప్పు కాఫీ తాగితే, ఓపిగ్గా దుఃఖ పడొచ్చు."
+
+అతడు దారి తీసిన హోటల్లో ప్రవేశించడం రామలింగేశ్వరరావుకి ఇష్టం లేదు.
+
+"ఆనాడు ధరలు పెంచేసి గంద్రగోళం తెచ్చిన ప్రబుద్ధులలో వీడొకడు. ఈ వేళ మళ్ళీ పాల వాళ్ళతో పేచీలు తెచ్చేడని తెలిసింది.
+వీళ్ళని అభిమానించడం ద్రోహం."
+
+"అమ్మన్న అమ్మకి మొగుడు. విస్సన్న తల్లికి మొగుడూను. ఇందులో తక్కువ తిన్నవాడెవడూ కాదు. సరే నడు. నీ మాటెందుకు
+కాదనాలి."
+
+ఇద్దరూ హోటలులో అడుగుపెట్టేరు. లోపల మబ్బు మబ్బుగా వుంది. గోలగా వుంది. సెర్వరొకడు ఖాళీగా ఉన్న టేబులు చూపేడు.
+
+టేబిలు మీద పరచిన మొజాయిక్ స్లాబు బీటలువారీ, పెచ్చులూడీ వుంది. అంతక్రితం తినిపోయినవారి ఎంగిలిపాత్రల స్థానాల్ని గుర్తు
+చేస్తున్నట్లు ఈగలు పోగులు పోగులుగా ముసిరి పచార్లు చేస్తున్నాయి. వచ్చే పోయే వారితో హోటలు బిలబిలలాడుతూంది. చిత చిత,
+నీళ్ళు, ఎంగిలి పళ్ళేలు, సెర్వర్ల వెర్రికేకలతో ఆ ప్రదేశం ఎప్పుడూ తోచనంత అసహ్యంగా వుంది.
+
+వారు సెర్వరు చూపిన టేబిలు వద్దకు వెళ్ళడానికి సందేహిస్తూ, శుభ్రంగావున్న మరో చోటు కోసం చూస్తూండడం కౌంటరులో వున్న
+యజమాని పద్మనాభయ్య గమనించేడు.
+
+"ఒక్క క్షణం ఆగండం"టూ లేచి వచ్చేడు. ఓ కుర్రవాడిని పిలిచి, దగ్గరుండి టేబులు శుభ్రం చేయించేడు.
+
+"ఇల్లా దయ చెయ్యండి."
+
+వారిద్దరినీ కూర్చోబెట్టేక, సెర్వర్ని కోప్పడ్డాడు.
+
+"మనుష్యుల్ని చూసుకోవద్దూ. ఏం కావాలో జాగ్రత్తగా ఇయ్యి." అని పురమాయించి వెళ్ళి తన స్థానం అలంకరించేడు.
+
+పద్మనాభయ్య వెనక తిరిగేక సెర్వరు అతడిని తినేసేలా చూసేడు. కాని, ఏమీ అనలేదు. లోపలి కెళ్ళి రెండు గ్లాసుల నీళ్ళు
+తెచ్చి బల్ల మీద టప్పున పెట్టేడు. అతని వేళ్ళనున్న జిడ్డు సంక్రమించిందో, గ్లాసులనే జిడ్డు వుందో, అసలు నీళ్ళే
+మురికివో గ్లాసులోని నీటిమీద జిడ్డు పొర మిలమిల లాడుతూంది. ఇద్దరూ ఆ నీరు ముట్టుకోలేక పోయేరు.
+
+"ఒక కాఫీ, ఒక టీ."
+
+సెర్వరు వెళ్ళిపోయేడు.
+
+"నీ అభిమానాలూ, అహంకారాలూ చాలా ఎలిమెంటల్ సుమా."
+
+ఆ వ్యాఖ్య ఏమిటో, ఎందుకో అర్ధంగాక రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
+
+"హోటలు రేట్లు మొదట పెంచినది ఇతడు కాదనేదొక్కటే నీకు తృప్తి. కాని, ఈ హోటలు వున్న తీరు నీ బుర్రకి
+తట్టలేదు...."
+
+మరుక్షణంలో సెర్వరు రెండు గ్లాసులలో పొగలు చిమ్ముతున్న ద్రవపదార్ధాన్ని వారిముందు పెట్టేడు. ఒక గ్లాసులోది వొడుపుగా బార
+ఎత్తునుంచి, ఒక్క చుక్క చిందకుండా, ధారగా చల్లారబోసి రామలింగేశ్వరరావు ముందుంచేడు. తాను బిల్లు వ్రాయడానికి చెవి వెనక
+నుంచి పెన్సిలు తీస్తున్నాడు.
+
+"పనిలో పని నా కాఫీ కూడా సాగతీసి పెట్టు" అన్నాడు రామారావు గంభీరంగా.
+
+సెర్వరు ముఖాన చిరునవ్వు.
+
+"అవసరం వుండదు. చూసుకోండి."
+
+రెండు గ్లాసులలో వున్న ద్రవ పదార్ధం ఒకే రంగులో వుండడం చూసి, రామలింగేశ్వరరావుకి అనుమానం కలిగింది.
+
+"నా గ్లాసులో పదార్ధం ఏ జాతిదయ్యా."
+
+"తమరడిగిందే తెచ్చా, సార్" అన్నాడు సెర్వర్, అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.
+
+"అతన్నడగాలా....? చప్పరించి చూడు. కిరోసిన్ వాసన వున్న వేడి శబరి నీళ్ళు కాఫీ. వాటికే కించిత్తు తారు వాసనుంటే
+టీ. అంతేనా?" అన్నాడు రామారావు సెర్వరును ధ్రువపరచమన్నట్లు.
+
+హోటలులో సరుకుల మంచి చెడ్డల బాధ్యత తనదెంత మాత్రమూ కాదన్నట్లు ముఖంపెట్టి సెర్వరు అంతక్రితం కనబడిన చిరునవ్వు
+చెరిపేసుకొన్నాడు. మాట్లాడకుండా, ఇద్దరి మధ్యా, బల్ల మీద వున్న నీటి మడుగులో బిల్లు అద్ది, వెళ్లిపోయేడు.
+
+
+
+
+అయిదో ప్రకరణం
+
+
+కౌంటరులో ఉన్న పద్మనాభయ్యకు వారి సంభాషణ వినబడే అవకాశం లేదు. కాని, అతని కళ్ళకి అసాధారణ గ్రహణ శక్తి
+వుంది. ధుమధుమలాడుతున్న మొహాలతో వేర్వేరు బల్లల వద్ద కూర్చున్న వారందరికీ ఓదార్పుగా "బజారంతా మండిపోతూంది." అని తానే
+ఏడ్పు మొహం పెట్టేడు.
+
+ఇడ్లీ మీద వూది అది గాలిలో చక్రంలా లేవగలదేమో పరీక్షిస్తున్న యువకుడికది ఓదార్పు.
+
+గారెలోకి సాంబారు కావాలంటే మరో అయిదు పైసలవుతుందంటున్న సెర్వరు కది సమర్ధన.
+
+మినపట్టులోకి కొబ్బరి పచ్చడి తెమ్మంటున్న గ్రామీణుడికి అది అసాధ్యమని చెప్పడం.
+
+కాఫీ, టీలు అసహ్యంగా వున్నాయన్న తమ వ్యాఖ్యకు అది సమాధానంగా తీసుకున్నాడు, రామారావు.
+
+కోపం వచ్చింది. కాని, కోపం వచ్చి ఏం చెయ్యడం? అసలు కోపగించవలసినది ఎవరి మీదనో కూడ అర్ధం కావడం లేదు. దానిని
+ఎల్లాగ ప్రకటించాలి? అదీ తెలియలేదు కనక వెక్కిరింత, అపహాస్యం ఆసరా చేసుకున్నాడు.
+
+"ఆ మంటలమీద వెచ్చబెట్టేరా ఏం, కాఫీకి పొగ వాసనొచ్చింది?"
+
+ఆ మాటకు హాలంతా తలెత్తి చూసింది. ఎవరో కోపంగా ఖాళీ గ్లాసు చప్పుడయ్యేలాగ బల్ల మీద దప్పున పెట్టేరు.
+
+"ఈ ముండా వేడి నీళ్ళకి ఇరవై పైసలుట"
+
+రామారావు వెక్కిరింతకే మనస్సు లోలోపల కుతకుతలాడుతున్న పద్మనాభయ్య యీమారు ఆగ్ బబూలా అయిపోయేడు. గ్లాసు చేసిన
+చప్పుడును బట్టి ఆయనెవరో ఆ "ముండా వేడి నీళ్ళ"ని ఖర్చు చేసినట్లే గ్రహించేడు. ఇచ్చింది తాగేసి పైగా వ్యాఖ్యలా?
+సమాధానం అనేక పాఠాంతరాలలో మనస్సుకు వచ్చింది. ఎదటి మనిషికి సంఘంలో ఉండగల బలం, హోటలులో తన వాళ్ళ వత్తాసుపట్టి
+ఇదివరలో ఇటువంటి సమయాలలో అనేకమార్లు వుపయోగించినవే. ఒక్కొక్కప్పుడు చెయ్యి చేసుకోడం దాకా వెళ్ళిన ఘట్టాలూ వున్నాయి.
+
+కాని, అతనికిప్పుడా కోపం చూపగల ధైర్యం లేదు. ఏడెనిమిది నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళన కాలంలో జనసమూహం
+రవీస్ కాలవ ఒడ్డునున్న పోలీసు స్టేషను, ఏలూరు కాలవ లాకుల వద్దనున్న సంజీవరెడ్డి విగ్రహంతో పాటు మూడు నాలుగు
+హోటళ్ళని కూడా ధ్వంసం చేసిన విషయాన్ని అతడు మరవలేదు.
+
+తినే పదార్ధాల ధరలు పెంచేరనీ, నాణ్యం తగ్గించేరనీ కొన్ని రోజులు గలభా జరిగేక, ఆ రోజున జనం తమ కసి
+తీర్చుకున్నారు.
+
+తన హోటలుకి ఎదురుగా ఓ నూరు గజాలలో పోలీసులు జనం మీద కాల్పులు జరిపి ఇద్దరిని చంపేసేరు. కొందరికి గాయాలు తగిలేయి.
+ఆనాడు పోలీసులు పెట్టిన కేసుల్లో కొందరు యీనాటికీ అవస్థలు పడుతున్నారు. ....జనం వెనక్కి తగ్గేరు. కాని, వాళ్ళ
+గుండెల మంట చల్లారలేదు. పొగలు చిమ్ముతూంది. మొగాలలో ధుమ ధుమ అల్లాగే వుంది.
+
+అందుచేతనే పద్మనాభయ్య తన కోపాన్ని ఏ రూపంలోనూ కనబరచడానికి ధైర్యం చెయ్యలేకపోతున్నాడు. బల్లల వద్ద నడుస్తున్న
+వ్యాఖ్యలు విన్నప్పుడూ, టిఫిన్ తిని డబ్బులిచ్చేటప్పుడు వారి చూపులు గమనిస్తుంటేనూ అతనికి వెన్నుపూసలోంచి వణుకు
+పుట్టుకొస్తూంది. 1966 అక్టోబరు 1 వ తేదీని మళ్ళీ చూడాలనే ఉత్సాహం అతనికి ఏ కోశానా లేదు. కనక అంత కోపం
+చల్లార్చుకొని మాటల ప్రవాహంలో ఆత్మరక్షణకు పూనుకొన్నాడు.
+
+"ఏప్రిల్ నెలలో పంటలు నాలుగు మూలలా అందివచ్చినప్పుడు ఏటికి అవతలా, ఇవతలా గ్రామాలలో అపరాల పంటనంతనూ
+ప్రాణధారిమల్ కోనేసేడు. క్వింటాలుకి డెబ్భై నుంచి నూట పాతిక వరకూ ధర పెట్టేసేడు. అతడికి కావలసిన పెట్టుబడినంతనూ
+బేంకులిచ్చేయి. పంటంతా చేతబట్టుకొని నిలవ పోసేక ఇక నా పరుగందుకోండి అన్నాడు. ఒక్క వారంలో కందుల ధర క్వింటాలుకి
+రెండువందల యాభైకి పెంచేసేడు. ఇదేమి అన్యాయమని అడిగే నాధుడు లేడు. ముండా గవర్నమెంటు."
+
+తానిస్తున్న నీళ్ళ కాఫీకీ, హెచ్చు ధరలకీ, రుచీ పచీ లేని తినుబండారాలకీ, హోటలు అపరిశుభ్రతకీ కీలకం ఎక్కడుందనుకోవాలో
+పెద్ద గొంతుకతో వినిపించేడు. ఆ సమాచారం తక్షణ ఫలితం ఇచ్చింది. జనం నోరు విడింది.
+
+"వీళ్ళమ్మా! అంతా తోడి దొంగలు."
+
+"లం....జా....కొడుకులు."
+
+ఎన్నికైన పదసాహిత్యం హాలు నలుమూలల నుంచీ వినిపిస్తూంది. ఆ బూతులూ, తిట్లలో తనకూ వాటా వున్నా, పద్మనాభయ్య
+పట్టించుకోలేదు. తన ప్రయత్నం విజయవంతం అయింది. అంతేచాలు. ఆ ధోరణి వదలకూడదు.
+
+"ఈ మధ్యనే మార్వాడీవాడు కొట్టు కట్టించేడు. దానిలో అన్ని దుకాణాలతోపాటు మంగలి దుకాణం పెట్టిస్తున్నాడు. ఆ దుకాణం
+తెరవడానికై రావలసిందిగా మొరార్జీ దేశాయిని అడగటానికి ప్రాణధారిమల్ మొన్న ఆదివారం నాడు స్వయంగా డిల్లీ వెళ్ళేడు...."
+
+అటువంటి వార్త అసంభవం కాకపోవడమే, అందరూ దానిని నమ్మడానికి కారణం.
+
+పైగా ఆ మాటల్ని జనం నమ్ముతారా అన్నది ముఖ్యం కానే కాదు. వారి మనస్సులకి ఏదో పని కల్పిస్తూ, మాటలు దొర్లించడం
+ముఖ్యం. ప్రభుత్వం, బ్యాంకులు, మార్వాడీలు....వాళ్ళు చేస్తున్నదే ఇదంతా. తాను ఆ ప్రవాహంలో ఒక పూచికపుల్ల మాత్రమేనని
+జనానికి నచ్చచెప్పగలుగుతే మంచిది. అదో అదనపు లాభం.
+
+"దొంగలూ, దొంగలూ వూళ్ళు పంచుకొంటున్నారు."
+
+"గాడిద కొడుకులు."
+
+"తల్లివేపునుంచా, తండ్రివేపునుంచా"--అంటూ ఒకరు తిట్లతో చమత్కారం ఒప్పించడానికి ప్రయత్నించేరు. ఆ మాటకి పద్మనాభయ్య
+పెద్దగా నవ్వేడు. అతడాశించినట్లు ఎవ్వరూ ఆ నవ్వు నందుకోలేదు.
+
+"వాళ్లకి సిగ్గూ, శరం లేదు. జనం తిడుతున్నారన్న బాధలేదు. ఎవరెన్ని తిడితేనేం? వాళ్ళపని జరిగిపోతూంది. తిట్ల వలన
+శరీరం మీద గాయాలేం కావు."--అంటూ పద్మనాభయ్య బాధితులలో తానూ ఒకడినన్నట్లు సాయించేడు.
+
+హాలులోంచి ఒకరు అందించేరు.
+
+"రాష్ట్రానికి ఒక నక్సల్‌బరీ అంటుకుంటే తప్ప ఈ రోగానికి మందు లేదు."
+
+చమత్కారాలనుంచి భయానక రసానికి దారితీసిన తన వాగ్ధోరణికి తానే హడలిపోయాడు, పద్మనాభయ్య. చటుక్కున మాటలు నిలిపి
+గల్లా డ్రాయర్ మూసేసేడు, దాని మీద దాడి జరుగుతుందేమో నన్నట్లు.
+
+ఆ ప్రిస్క్రిప్షన్ వినవచ్చిన వేపు తిరిగి చూసేడు, రామారావు. తాను పనిచేసిన కాలేజీలో చదువుతున్న కుర్రాడే. అతనిపక్క
+మరో పడుచువాడు. అదీ ఎరిగిన ముఖమే అనిపించింది. కాని, గుర్తు రాలేదు.
+
+"నక్సల్‌బరీలో వుద్యమం ప్రారంభమయ్యాక అక్కడ ఇడ్డెన్లు పెద్దవి చేసి, మంచి కాఫీ ఇస్తున్నారా
+యేమయ్యా!"--అని రామారావు హాస్యమాడేడు.
+
+బల్లల దగ్గరున్న వాళ్ళు ఫక్కున నవ్వేరు. ఆ యువకుడు తిరగబడి చూసి, తల తిప్పుకొన్నాడు. అతడెవరో తన్ను గుర్తు
+పట్టేడని రామారావు గ్రహించేడు అతనెవరు?
+
+"నక్సల్‌బరీ ఈ వేళ ఫేషనయిపోయింది" అని రామలింగేశ్వరరావు విచారం వెలిబుచ్చేడు.
+
+జనం దృష్టి తన హోటలు మీదినుంచి మళ్ళిందని పద్మనాభయ్య ప్రాణం కుదుట పడింది. ఇద్దరు విద్యావంతులు తనకు ఆసరాగా
+వున్నారనే ధీమా ఏర్పడింది. ఆ అవకాశం పోనీదలుచుకోలేదు.
+
+"ఇంతింత కుర్రాళ్ళుకూడా రాజకీయవేత్తలూ, దేశ నాయకులూ అయిపోతున్నారు. అందుకే దేశం ఈకాడికి వచ్చింది. కాకపోతే మన దేశంలో
+పెద్దవాళ్ళంటే ఎంత భయం, ఎంత భక్తి? మర్యాదా, మప్పితం లేకుండా మసలడం ఎప్పుడేనా ఎరుగుదుమా?"
+
+మాటల ఆవేశంలో పద్మనాభయ్య రేడియో వాల్యూం బాగా పెంచేసేడు. ఎనౌన్సరు మాటలు కొట్టవచ్చినట్లు వినిపించేయి. మధ్యాహ్నం
+రెండుగంటలవేళ వెంకటేశ్వర స్వామికి ఎవరో మేలుకొలుపులు పాడుతున్నారు.
+
+మేలుకోవయ్య -మ
+మ్మేలుకోవయ్య.
+
+గూబ మీద కొట్టినట్లయి రామారావు గమ్మున లేచేడు.
+
+"ప్రస్తుతానికి మేలుకొనే వున్నాం. లేచిపోతున్నాం కూడా. కాస్త ఆ గోల ఆపవయ్యా స్వామీ."
+
+ఆ కుర్రవాని మాటను ఎగతాళి చెయ్యడం పద్మనాభయ్యకు అలుసు ఇచ్చిందని మనస్సు కలక వేస్తూంటే ఈ గోల ఒకటి.
+
+"లేస్తావా, రామలింగం! లేక వెంకటేశ్వరుడిలాగా నువ్వూ మొద్దు నిద్దర్లోనే వున్నావా?"
+
+వారిద్దరూ వెళ్ళిపోతే తనకు మాట ఆసరా వుండదన్నంత భయంతో పద్మనాభయ్య అంత వేగంగానూ రేడియో వాల్యూం తగ్గించేసేడు.
+
+"కూర్చోండి. కూర్చోండి. తగ్గుతోనే పెడతా. అసలెందుకులెండి. తీసేస్తా."
+
+పద్మనాభయ్య రేడియో గొంతుక నొక్కేసినా వారు కూర్చోలేదు.
+
+నక్సలైట్ల ప్రసంగం తెచ్చిన కాలేజీ స్టూడెంటూ, అతనితోవున్న యువకుడూ కౌంటరు వద్ద బిల్లు చెల్లిస్తున్నారు.
+
+"నీ పేరు వెంకట్రావు కదూ!"--అడిగేడు రామారావు.
+
+"ఔనండి." అంటూ అతడు సిగ్గుపడి వెనక్కి తగ్గేడు.
+
+"చూడు. నీ నక్సల్‌బరీ వుద్యమం ఏదో ఈ హోటలునుంచే ప్రారంభం చెయ్యకూడదూ. బెజవాడ ఆరోగ్యమేనా బాగుపడుతుంది."
+
+"అబ్బే అదేం లేదండి."
+
+"నీ వెనకాల మేమంతా వుంటాంలే"
+
+ఆ మాటల్లో పద్మనాభయ్యకు పిసరంత కూడా హాస్యం కనబడలేదు. చటుక్కున డ్రాయరు మూసేసి, తాళం కూడా తిప్పేసేడు. మొగాన
+కత్తివాటు వేసినా, నెత్తురు చుక్క లేదు. పెదవులు అదురుతున్నాయి.
+
+ఆ ముఖం చూసేక రామారావుకి తృప్తి కలిగింది. క్షణం క్రితం వున్న చింత, కలక తీరింది.
+
+వెంకట్రావుతో వున్న మిత్రుడికి ఆ ఎగతాళి నచ్చలేదు.
+
+"అన్‌సంగ్, అన్‌వెప్ట్ జట్టులో పడిపోకుండా మేస్టారికి నీపేరు తెలిసింది. ఇంక ఫర్వాలేదు" అన్నాడు.
+
+ఆ మాట వెనక నున్న పొడుపు అర్థమయి రామారావుకి కోపం వచ్చింది. 'ఇది యు.జి. వెలుగు కాబోలు' ననుకొన్నాడు.
+
+"వెంకట్రావూ! నీపేరు తెలియకుండా రహస్యంగా వుంచుతున్నావనుకోలేదు సుమా. కాలేజీకి వస్తూపోతూ వుంటే మా అందరిలాగే
+వుంటున్నావనుకొన్నా. అల్లా చెప్పు."
+
+ఆ హేళనకు వెంకట్రావు కంగారుపడ్డాడు. "అదేం లేదండి"
+
+రామారావు మెట్లు దిగుతూ రెండోవాని వేపు చూసి "సెలవు మేస్టారూ!" అన్నాడు.
+
+రోడ్డు మీదికి వచ్చేక రామలింగేశ్వరరావు అడిగేడు.
+
+"ఆ రెండో అతడెవరు, మన కాలేజీ స్టూడెంటేనా?"
+
+"అల్లాంటి అనవసరపు ఆసక్తి చూపవద్దనే అతని సలహా. ఎవరైతేనేం, అంజనా సుతుడు"
+
+వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ కిల్లీలు బిగించి సిగరెట్లు తీసుకొంటున్నారు. నిలుచున్న తీరు చూసేక అతడెవ్వరో చటుక్కున
+గుర్తువచ్చింది.
+
+
+
+
+ఆరో ప్రకరణం
+
+
+1966 అక్టోబరు 1 సాయంకాలం నాలుగు-అయిదుగంటల మధ్య.
+
+ఏడెనిమిది నెలల క్రితం--ఇదే రోడ్డుమీద--ఆ ఫోటో స్టూడియో. మేడమీద చూసిన మొహమే.
+
+ఆనాటి ఘటనలన్నీ మెదడులో సుళ్ళు తిరుగుతూంటే రామారావు ఆ యువకుని వేపే చూస్తూ నిలబడిపోయేడు. అతడు ఎందుకు ఆగినదీ
+అర్థంగాక రామలింగేశ్వరరావు ఆదుర్దా చూపుతున్నాడు.
+
+"రోడ్డు మీద అల్లా నిలబడిపోయాడేమిటి? ఆత్మహత్య చేసుకోవాలనుందా? మనం నడుస్తున్నది బెజవాడ రోడ్డుమీద అని
+మరిచిపోకు."
+
+రామారావు అతనికే సమాధానం ఇచ్చేలోపునే వెంకట్రావూ, అతని మిత్రుడూ దగ్గరకొచ్చేసేరు.
+
+"నేనెవరో తెలుసుకోవాలని ఇందాకటినుంచి మీరు మహా యిదైపోతున్నారు." అనేశాడు వెంకట్రావు మిత్రుడు.
+
+ఆ మాటలలోని కటుత్వాన్నికూడా అర్థం చేసుకోలేనంత ఆనందం కలిగింది రామారావుకి.
+
+"గాయాలు పూర్తిగా మానిపోయేయా? మేస్టారూ! సంతోషం. గుర్తుపట్టలేదు, మొదట. చాల సంతోషం!"
+
+రామారావు ముఖంలోనూ, మాటలలోనూ కనిపిస్తున్న, వినిపిస్తున్న సంతోషాన్నీ, ఆప్యాయతనూ ఆ యువకుడు లెక్క చేయలేదు.
+
+"ఆ మాటే చెప్దామని వచ్చా. మీరు రివిజనిస్టులయి వుంటారు. లేకపోతే అంత తెలివిగా, మాకుపకారం చేస్తున్నట్లు నటిస్తూ,
+పోలీసాళ్ళకి వప్పచెప్పడం మరొకరివల్ల జరగదు."
+
+గూబకు బెత్తెడు చూసి కొట్టినట్లయింది. రామారావు ఆ ఆరోపణకు దిగ్భ్రమ చెందేడు.
+
+ఆ రోజున--,
+
+ఏలూరురోడ్డే వస్తున్న రామారావుని సందుమూలలో వున్న పోలీసులు రైఫిళ్ళు చూపి నిలవబెట్టేసేరు. ముందుకు పోనివ్వమన్నారు. ఏం
+చెయ్యడానికీ తోచక అతడు ఎదురుగా తెరిచివున్న ఓ ద్వారంలో చొరబడ్డాడు. అది మెట్లగది. పైకి వెళ్ళేడు. అక్కడ తుపాకీ
+రవ్వలు తగిలి రక్తం కారుతున్న ముగ్గురు యువకులకు నలుగురైదుగురు మిత్రులు ఉపచారాలు చేస్తున్నారు.
+
+ఆ గాయాలు సెప్టిక్ అయి కుర్రవాళ్ళు నిష్కారణంగా చచ్చిపోతారని, వారిని తాను హాస్పిటలుకు చేర్చేడు. చేర్చేందుకు ఎంత
+గొడవయింది. అడుగడుగునా పోలీసుల అదలింపు. రైఫిళ్ళు చూపి బెదిరింపు. కాని డబాయించి, దెబ్బలాడి వారిని హాస్పిటలుకి చేర్చేడు.
+
+"మీ మాటలకి మోసపోయి వాళ్ళిద్దరూ హాస్పిటలు బెడ్ ఎక్కేరు. నాకు మొదటినుంచీ అనుమానమే. మొదట మీ మీద కాదులెండి,
+హాస్పిటలులో ఇచ్చే సహాయంమీద అపనమ్మకం. అయితే ఆ అపనమ్మకమే నన్ను 'సేవ్' చేసింది...." అంటున్నాడు ఆ
+యువకుడు....
+
+తరవాత రెండుమూడు నెలలకి విశాలాంధ్ర షోరూమ్‌లో తనకు బాగా పరిచితుడైన ఒక కమ్యూనిస్టు నాయకుడు కనిపించి ఆ
+రోజున తన తమ్ముడిని హాస్పిటలులో చేర్పించి వుండకపోతే ఇప్పుడు నడుస్తున్న కేసుల బెడద వుండేది కాదన్నాడు. ఆ విషయాన్నే
+ఈ యువకుడు మరో మాటలలో చెప్తున్నాడు.
+
+"జనాన్ని కాల్చి చంపుతున్న పోలీసులు మిమ్మల్ని మేం వున్న మేడ దాకా ఎందుకు రానిచ్చేరు? అక్కడ ఎవరో వున్నారని మీకు
+ఎల్లా తెలిసింది? మీకు వాళ్ళతో లాలూచీవుంది, కనక వదిలేరు. మొదట తోచలేదు గాని మీరు కిందికెళ్ళి రిక్షాకూడా ఎల్లా
+తేగలిగేరు? వాళ్ళతో షరీకయ్యేరు గనకనే సాధ్యమయింది."
+
+ఇన్నాళ్ళకు ఓ ప్రజాద్రోహిని నడివీధిలో పట్టుకొని కడిగేసే అవకాశం దొరికిందని ఆ యువకుడు ఊగిపోతున్నాడు.
+
+ఆ అన్యాయారోపణకు దిగ్భ్రమ చెంది, ఆందోళనలో ఆరిపోయిన పెదవులు నాలికతో తడుపుకున్నాడు, రామారావు. అంతవరకూ సాగించినట్లు
+వెక్కిరింతలూ, వేళాకోళాలా మాటున తన అసమ్మతిని ప్రకటించడం మంచిది కాదు. సరాసరి సమాధానం చెప్పుకోవాలి.
+
+"అన్యాయం, మిస్టర్! సబినస్పెక్టరుతో ఎంతో ఘర్షణపడి, గాయపడ్డ వాళ్ళని హాస్పిటలుకు తీసుకెళ్ళడానికి ఒప్పించగలిగా."
+
+"ఎక్జాట్లీ, ఆ సబినస్పెక్టరుది మట్టిబుర్ర. వాడే కాదు. రవీస్ కాలవ వంతెన మొగలో తాలూకాఫీసు మూలలో, ఏలూరు కాలవ
+లాకు మొగ వద్ద పోలీసువాళ్ళు మిమ్మల్ని ఆపేరు. మీరు అదే సమాధానం ఇచ్చేరు. మేం విన్నాం. ఆ మాటలోనే అసలు 'క్లూ'
+వుంది--యిందాకా మీరు కాల్పులు కాల్చినపుడు గాయపడ్డారురా గాడిదలూ! అంటే--ఆ ఘర్షణలలో ముందు పేటీన వున్న వాళ్ళు అర్థం
+చేసుకోరేం--అని చెప్పినట్లే. ఆ రోజున మాకు అర్థం కాలేదు. మొదట పోలీసు వాళ్ళూ తెలియకనే అడ్డం పెట్టేరు. మీ మాట విని
+తెలివి తెచ్చుకున్నారు. మా వాళ్ళో, కేసుల్లో పడేవరకూ తెలుసుకోలేదు."
+
+రామారావుకి సహనం పోయింది. చర్రుమన్నాడు.
+
+"అర్థం చేసుకోడానికి మెదడు సరియైన స్థితిలో ఉండాలి. మీలో లోపం అదేనని తోస్తూంది."
+
+--అంటూ రామారావు గిరుక్కున తిరిగేడు. ఆ యువకుడు ఫక్కున నవ్వాడు.
+
+"మీ ఫ్రెండ్స్‌కి కాస్త కబురందించరాదూ. ఫలానా వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఆ రోజున హాస్పటల్‌లో
+చేరకుండా తప్పించుకు పోయేడు...."
+
+రామారావు టక్కున వెనక్కి తిరిగి ఆ యువకుడికి సమీపంగా వచ్చేడు. పళ్ళు కొరుకుతూ, మాటల్లో అసహ్యం ఉమిసేడు.
+
+"ఇల్లాంటి పనికిమాలిన ప్రజ్ఞలకు, దురహంభావానికీ మూలం అర్థం అయింది....నీకు కాదులే, నాకు. నీకు చచ్చినా అర్థం కాదు,
+నాకు తెలిసింది. యిందాకా హోటలులో నీ నోటి దురద విన్నా, అదో ఫేషనయి పోయిందన్నాడు మా ఫ్రండు. కాదు, చేతకాని దురహంభావం నీ
+చేత అల్లా అనిపించింది. నీ రాజకీయాలు అంతే. లేకపోతే మనిషిలో యింత "కార్యకారణ వివేచన శక్తి" ఏర్పడదు. ఫస్టుగా
+ఉంది. పోనీ బండి. యిందాకా హోటలు కౌంటరు వద్ద వెంకట్రావు నూరడించేవు. కాని, ఆ వూరడింపు నీకే."
+
+రామారావు విసురు చూసి వెనుకంజ వేసిన మిత్రుణ్ణి వెంకట్రావు వెనక్కి లాక్కుపోయేడు.
+
+"నీ విసురు చూస్తే దవడలు వాయించేస్తావని కంగారు పడ్డా"నని రామలింగేశ్వరరావు మిత్రుని చేయి పట్టుకొని తీసుకుపోయేడు.
+
+రామారావు నెమ్మదిగా చేయి విడిపించుకొన్నాడు. "నడు పోదాం"
+
+యిద్దరూ నడుస్తున్నారు.
+
+"ఎవరతడు?"
+
+"యిందాకా గుర్తురాలేదు. ఉక్కు వుద్యమం సందర్భంగా ఈ వూళ్ళో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళలో ఒకడు. ఆ రోజున
+ఇతడినీ, మరో యిద్దరినీ నేను హాస్పటలుకు చేర్చా. ఆ జన సమ్మర్దంలో యితడు తప్పిపోయేడు. మిగిలిన యిద్దరినీ మాత్రం
+చేర్చేను. యితడూ చేరే వుంటాడులే అనుకున్నా. చేరలేదన్న మాట. అప్పటికి యిప్పుడే చూడడం. పోలీసాళ్ళకి వప్పచెప్పడానికే
+హాస్పిటలులో చేర్చానంటాడు. వాలకం చూస్తే రాజకీయ అతివాదం మాటున మతిభ్రష్టుతనాన్ని కమ్ముకుంటూన్న నోటి దురదగాడల్లే
+వున్నాడు. తనమీద కాల్పులు కాల్చిన వాళ్ళ మీదకన్న గాయాలకు కట్టు కట్టించబోయినవాని మీద కసి చూపడం మరో మనిషి
+చెయ్యడు"
+
+రామలింగేశ్వరరావు నవ్వేడు.
+
+"మంచి అనుశీలన, పరిశీలన గలవాడు. లేకపోతే నీ రాజకీయాలు అంత నిశితంగా పట్టెయ్యలేడు."
+
+మిత్రుని మాటలు వినిపించుకొనే స్థితిలో లేడు, రామారావు. ఈ ఘటన అతని మనస్సును కలచివేసింది. ఏదో ఆలోచిస్తూ,
+నడుస్తూన్నాడు.
+
+"అరకొరగా చేస్తే మంచిపని అయినా మంచి ఫలితం యివ్వదు. గాయాలతో చచ్చిపోతారని హాస్పిటలులో చేర్చా, మంచిదే. కాని,
+అవకాశం తీసుకొని పోలీసువాళ్ళు వాళ్ళని కేసుల్లో దూర్చేరు. తప్పు నాదేనా? కాదా? నేనేం చేసి వుండాలి?--ఎప్పుడూ
+ఆలోచించనేలేదు."
+
+ఆ ఆలోచనను రామలింగేశ్వరరావు అంగీకరించలేదు.
+
+"మనుష్యులు బాధలో వున్నారని చెయ్యగల సాయం చేసేవు. వుద్యోగం మానుకొని హాస్పటళ్ళ వెంటా, తరవాత కోర్టుల వెంటా కూడా
+తిరగాలా? అదే అయితే మీ చావు మీరు చావండని వూరుకోడం నయం అంటాను...."
+
+రామారావు ఆ వాదాన్ని ఒప్పుకోలేదు.
+
+"మనం వాళ్ళ వెంట హాస్పిటళ్ళకు తిరిగేమా? కోర్టుల వెంట తిరిగేమా అన్నమాట వాళ్ళకీ అంత ముఖ్యం కాదు. తమర్ని విడిచి
+పెట్టలేదనే ధైర్యం, తమరిని బలపరిచే వాళ్ళు కొందరున్నారనే సంతృప్తీ కావాలి. ఆ భాగం నా వలన సమకూడలేదు. హాస్పిటలులో
+చేర్చేక మరి నేనటు తొంగికూడా చూడలేదు, నా పని తీరిందనుకున్నా. కాని, ఆ అరకొర పని నా రాజకీయాల్ని కూడా అవమానం
+పాల్చేస్తూంది...."
+
+రామలింగేశ్వరరావు తన ప్రశ్నకి సమాధానం రాలేదన్నాడు.
+
+"వుద్యోగం మానుకుని నువ్వు వాళ్ళ మంచాల వద్దా, కటకటాల యివతలా పరిచర్యలు చెయ్యవలసిందేనా?"
+
+రామారావు ఆలోచిస్తున్నాడు.
+
+"చెప్పవేం?"
+
+"దారిపొడుగునా పోలీసులతో పేచీ పెట్టుకుంటూనే హాస్పిటలుకు తీసుకెళ్ళేనా లేదా...."
+
+"అయితే...."
+
+"అల్లాగే...."
+
+"కోర్టు కేసుల్లో కూడానా?"
+
+"కేసు అన్యాయమైనదవునా కాదా. దానిమీద జనాన్ని కూడగట్టడం, గొడవ చెయ్యడం అవసరమే. మనం వున్న వ్యవస్థలో
+ఏమరుపాటు పనికిరాదని దాని అర్థం."
+
+రామలింగేశ్వరరావు నిస్పృహతో ఒక్క దండం పెట్టేడు.
+
+"నీ రాజకీయాలు తగలడ్డట్టే వున్నాయి. వీధేపోయే పెద్దమ్మా మా యింటి దాకా వచ్చివెళ్ళమన్నట్లు లేనిపోని తద్దినాలు తెచ్చుకోక
+తప్పదనేటట్లయితే పరోపకారం ఏటిలో కలవనీ. ఈ ప్రజాసేవ చెయ్యకపోతే కొంప మునిగిపోదు."
+
+
+
+
+ఏడో ప్రకరణం
+
+
+ఇంటికి వచ్చేసరికి వీధి అంతా పిల్లలతో నిండి గోలగా ఉంది.
+
+డ్రైనేజీ గొట్టాలు వేయడానికై తవ్విన కందకాల మీద కుర్రవాళ్ళు 'లాంగ్ జంప్' ప్రాక్టీసు చేస్తున్నారు. అంతా పది
+పన్నెండేళ్ళలోపు వాళ్ళు. రెండు నిలువుల లోతున్నట్లున్న ఆ గోతులలో పడిపోరు కదా--అనిపించింది.
+
+కాని, వాళ్ళకా భయం వున్నట్లే లేదు. పెద్దవాళ్ళు భయపెట్టకుండా వొదిలేసేరనుకోలేము. కాని, కుర్రవాళ్ళకి ఆడుకొనేందుకు
+స్థలాలు కావాలి. అవే లేవు. పట్టణం పెరిగిపోతూంది. దానికో క్రమం లేదు. అందుకు ప్రయత్నమూ లేదు. నడిరోడ్లు జనతా పాకీ
+దొడ్లు. వీధులు ఆది వరాహ విహార భూములు. మునిసిపల్ ఆఫీసులు లంచగొండితనం నేర్పే కళాశాలలు. పాఠశాలలు అసమర్థ
+పరిపాలనకు సాక్షీభూతాలు.
+
+ఇంక కుర్రవాళ్ళ ఆట స్థలాల సంగతి ఎవరికి పట్టింది? వాళ్ళదారి వాళ్ళు చూసుకొంటున్నారు. ఉన్నంతలోనే కొంచెం వినోదం, కాస్త
+వ్యాయామం కల్పించుకొంటున్నారు.
+
+వాళ్ళ వుల్లాసం, వాళ్ళ గంతులు, కవ్వింపులు, కీచులాటలు చూస్తూనే రామారావు తన కోపం మరచిపోయేడు. తన మానసిక వ్యధ
+మరచేడు. ఒక్క నిముషం నిలబడి వాళ్ళ ఆటలు చూసేడు. వాళ్ళకి ఒకటి రెండు సలహాలు ఇచ్చేడు. కాని, వాళ్ళు
+వినిపించుకోలేదు. నవ్వొచ్చింది.
+
+ఓ కుర్రవానిని పిలిచేడు.
+
+ఆ పిలుపు విని ఇంటి ప్రధానద్వారం తెరుచుకొని ఒక తరుణి తొంగి చూసింది.
+
+"పిలిచేరా"
+
+"లేదండి."
+
+ఆమె లోపలికి వెళ్ళిపోలేదు. పిల్లల ఆటలు చూస్తూ ఆమె కూడా అక్కడే నిలబడింది.
+
+"ఓరి, మీ కడుపు ఉడక! పడ్డారంటే కుంటివాళ్ళయిపోతారర్రా!" అంటూ నవ్వింది. వెంటనే ఓ కుర్రవాడు కుంటి నడకను
+అభినయించేడు. నలుగురు కుర్రవాళ్ళూ గొల్లున నవ్వేరు.
+
+మరల కందకం మీదుగా దాటడం ప్రారంభమయింది. రామారావు ఓ కుర్రవానిని పిలిచేడు. గంతేముందు ఊతం కోసం పరుగు తీసే ప్రయత్నంలో
+వున్నాడు వాడు. పిలుపు విని నిలబడ్డాడు.
+
+"ఎందుకండి!"
+
+"నీ పేరేమిటోయ్,"
+
+వాడు చెప్పేలోపున వెనకనుంచి వేరొకడు అందించేడు,
+
+"బాబండి"
+
+"అది సరిలే. కృష్ణాజిల్లాలో మగపిల్లవాడిని బాబు అనడం, ఆడపిల్లను బేబీ అనడం ఓ ఫేషను. అసలు పేరు ఏమిటని?"
+
+మరో కుర్రాడు వచ్చి నిలబడ్డాడు. వానికి ఈ ఆరా అంతా ఎందుకో తెలుసుకోవడం అవసరంలా తోచింది.
+
+"ఎందుకేమిటండి?"
+
+"అబ్బే మరేంలేదు. మీరెవరన్నా జారి పడిపోయి కాలు విరుచుకుంటారనుకోండి. హాస్పిటలుకి తీసుకెళ్ళాలి కదా. పాపం, ఎవరి కాలు
+అనుకొని కట్టుకట్టాలి వాళ్ళు. వాళ్ళకి ఏం పేరంటే, ఏమని చెప్పాలి అని." అన్నాడు, రామారావు గంభీరంగా.
+
+గుమ్మంలో నిలబడ్డ సుశీల ముఖాన చిరునవ్వు కనపడింది.
+
+"ఓస్. అదా." అని కుర్రాడు వెనుతిరిగేడు.
+
+మొదటి కుర్రవాడు తనపేరు 'సుబ్బారావు' అని చెప్పుకున్నాడు. మరుక్షణంలో "హూప్" అని కందకం అవతలికి గెంతేడు.
+
+ఇంక వరసన పేరు చెప్పడం, గెంతడం ప్రారంభమయింది.
+
+"రంగనాధం--హూప్"
+
+"జయరాం--హూప్"
+
+"సారథి--హూప్"
+
+గుమ్మం లో ఉన్న సుశీల ఫక్కున నవ్వింది. ఆమెను చూసి రామారావూ నవ్వేసేడు.
+
+"వాళ్లెవళ్ళూ మన మాట వినిపించుకొనే ధోరణిలో లేరు."
+
+వాళ్ళని హాస్యం చేయబోయి, తానే హాస్యం పాలయినందుకు అతనికి కోపం రాలేదు. తలనెప్పీ, చిరాకూ అనిపించలేదు.
+
+"నెల్లాళ్ళ క్రితం ఆ పై వీధిలో ఓ కుర్రాడు...." అంటూ ఆ ఘటన గుర్తు వచ్చి సుశీల వణికిపోయింది.
+
+వర్షాలు పడి డ్రైనేజీ కందకాలు నిండేయి. పది పన్నెండేళ్ళ వాడు గట్టుమీద నడుస్తూ కాలుజారి కందకం లో పడిపోయేడు. మర్నాడు
+మోటారు తెచ్చి నీరు తోడించేశాక గాని, అంచులు జారిపడిన మన్నులో కూరుకుపోయిన ఆ కుర్రవాని శవం దొరకలేదు.
+
+ఆ మాట గుర్తు వచ్చి సుశీల ముఖం వివర్ణం అయింది.
+
+"ఈ వీధులు ఎప్పుడు బాగుపడతాయో గాని, పిల్లలిద్దరూ ఇంట్లోకి వచ్చి కనబడేవరకూ ప్రాణాలు ఇల్లా ఉంటున్నాయి." అంది,
+గుప్పిడి మూసి తెరుస్తూ.
+
+రామారావు మాట తప్పిస్తూ....
+
+"మీరు అప్పుడే వచ్చేశారే." అన్నాడు.
+
+"శనివారం కదూ, బాంకు పని ఒంటిగంటకే అయిపోతుంది."
+
+"మీ పనే బాగుందండీ."
+
+కాని, సుశీలకి కాలేజీ ఉద్యోగాల మీద మోజు.
+
+"మీ కంటేనా? వర్షాకాలం, వేసంకాలం, శీతాకాలం పేరుతో మూడు నెలలు సెలవులు. మిగిలిన వాళ్ళతో పాటు పండుగలూ, పబ్బాలూ
+వుంటాయి." అందామె టీచర్లకు దొరికే సెలవులు తలుచుకొని లొట్టలు వేస్తూ.
+
+రామారావులో ఆ వుత్సాహం కనబడలేదు. కాని ఒప్పుకొన్నాడు. "నిజమేలెండి."
+
+
+
+
+ఎనిమిదో ప్రకరణం
+
+
+"ఏమిటి, తలుపులన్నీ బిగించుకు పడుకున్నాడు?" అంటూ నారాయణ గది గుమ్మంలో నిలబడి ప్రశ్నిస్తూంటే, రామారావు లేచి కూర్చుని,
+ఆహ్వానించేడు--"రాండి".
+
+"ఒంట్లో బాగాలేదేమో, ఇందాక కూడా ఎల్లాగోనే కనిపించేడు." అంది, సుశీల వెనకనుంచి.
+
+"విశేషం ఏం లేదండీ. కొంచెం తల నొప్పిగా వుంటే పడుకున్నా. దానికి తోడు ఈ కుర్రాళ్ళ గోల ఒకటి".
+
+"వెళ్ళిపోయారు లేండి. తలుపులు తియ్యండి. కాస్త గాలేనా వస్తుంది"--అంటూ సుశీల లోపలికి అడుగుపెట్టి కిటికీ తలుపులు బారుగా
+తెరిచింది.
+
+"ఏం జ్వరం ఏమన్నా ఉందా? చూసుకొన్నావా?"
+
+"వుండండి. వేడి వేడి కాఫీ పడితే అన్నీ సర్దుకొంటాయి. ఎండలో వచ్చేరు కదూ. అందుకు వచ్చి ఉంటుంది తలనొప్పి."
+
+రామారావు వద్దంటున్నా వినిపించుకోకుండా సుశీల తమ వాటా లోకి వెళ్ళిపోయింది.
+
+"అనవసర శ్రమ" అన్నా ఆమె వినిపించుకోలేదు.
+
+"కాఫీ తాగడం శ్రమా?" అని నారాయణ హాస్యమాడేడు.
+
+"వచ్చేటప్పుడు బజారులో తాగి వచ్చేనండీ."
+
+"బజారులో తాగితే? ఇప్పుడింటివద్ద తాగు. యిదిగో యిప్పుడు నువ్వు మొహమాటపడితే నీతో పాటు నన్నూ ఎండగడతావు. మాట్లాడకు"
+
+యింక రామరావేం మాట్లాడలేదు. మాట మార్చేడు.
+
+"ఎటూకాని వేళ మీరు యింట్లో ఉన్నారు, ఏమిటి విశేషం?"
+
+"పాల సప్లయిదార్లకీ, హోటళ్ళ వాళ్ళకీ ఖరీదుమీద పేచీలు వచ్చేయి."
+
+"ఎందుకు?"
+
+"కోవా సరిగ్గా రావడం లేదని మా డబ్బులు కోసేస్తున్నారు. తాము మాత్రం సరుకుల ధరలన్నీ పెంచేశారు. మా ధరా పెంచమన్నాం."
+
+ఆ ధరల వివరాలేమీ తెలియని రామారావు ప్రశ్నలు ప్రారంభించేడు.
+
+"యింతవరకేం యిస్తున్నారు? మీరేం అడుగుతున్నారు?"
+
+"ఇప్పటి వరకు లీటరుకి 80 పైసలే."
+
+"అబ్బ! అంత తక్కువా?"
+
+"హెచ్చు మొత్తం తీసుకొంటారు. వాళ్ళే పెట్టుబడులూ పెడతారు."
+
+"ఓహో"
+
+"అయినా, అది చాల తక్కువ. మేము 83 పైసలు అడుగుతున్నాం."
+
+ప్లేటులో రెండు కప్పుల నిండా పొగలు చిమ్ముతున్న కాఫీ పట్టుకొని, సుశీల వచ్చింది. వస్తూనే--
+
+"రేపటి నుంచి వీరు మనకి పాలు లేకుండా చెయ్యబోతున్నారు." అంది.
+
+"అదేమిటి?"
+
+"టవునికి పాల సప్లయి బందు చెయ్యాలంటూ మనింట్లో మాత్రం రెండు శేర్లు పొయ్యమంటావు. ఆ పని చేస్తే మరి మన్ని చూసేక
+ఎవ్వడూ కింద వుమ్మెయ్యడు."--అన్నాడు నారాయణ భార్య వేపు కొరకొరా చూస్తూ.
+
+"నేననేదది కాదు. మీరు వూళ్ళోవాళ్ళకి ఎందుకు మానాలి? మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న పన్నెండు పైసలు
+ఎక్కువిస్తున్నారే."
+
+రామారావు ఆశ్చర్యం కనబరిచేడు.
+
+"సమ్మె అంటే అందరికీ సమ్మే. పంక్తితో బాలభిక్షం ఉండదు."--అని నారాయణ ముదలకించాడు.
+
+సుశీల పేచీ ఏమిటో రామారావుకి చెప్పింది.
+
+"హోటలు వాళ్ళు 80 పైసలు బదులు 83 పైసలు యివ్వమన్నారు గనక యిప్పుడే లీటరుకు 95 పైసలు యిస్తున్న మన మీద
+సమ్మె ప్రకటిస్తున్నారు." అంది సుశీల, మగడిని కవ్విస్తూ.
+
+"బహుశా మనల్ని తగ్గించి యివ్వమంటున్నారేమో, దానికైతే సమ్మె అనవసరం స్వామీ." అంటూ రామారావు సుశీలను బలపరిచేడు.
+
+నారాయణకి ఏం చెప్పడానికీ తోచలేదు. డబాయింపు ప్రారంభించేడు.
+
+"సమ్మెలు అన్నవి ఒక పెద్ద పోరాటానికి తయ్యారీ తినిపించడం వంటివి. సమష్టిగా పోరాటం జరపడంలో ప్రజలకి శిక్షణ
+యివ్వడం అన్నమాట. దానిని అల్లాటప్పా వ్యవహారంగా చూడగూడదు." అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ, నారాయణ.
+
+"యిప్పుడిస్తున్నట్లు లీటరుకి 95 పైసలు గాక రూపాయి యిమ్మన్నా జనం ఇస్తారు. మంచి పాలు పోస్తామని తీసుకుంటున్నారు కూడా.
+మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న ఎక్కువే యిస్తున్నారు కదా"--సుశీల అంది.
+
+"అవును కదా"--అన్నాడు రామారావు.
+
+"ఒకవేళ హోటలు వాళ్ళతో సమ్మె తప్పనిసరి అయితే జనాన్ని మీకు తోడు తెచ్చుకోవాలి. కొన్ని నష్టాలకి సిద్థపడయినా
+చెయ్యవలసిన పని అది. యిక్కడ ఆ సమస్యా లేదే. అకారణంగా, అన్యాయంగా జనానికి యిబ్బంది కలిగించి వాళ్ళని వ్యతిరేకం
+చేసుకోడం--యిదేమి పద్ధతి"--అని సుశీల మగణ్ణి నిలదీసింది.
+
+"ఔను కదా." అన్నాడు రామారావు.
+
+"అదీగాక, వూరి జనం ఎన్నడూ లీటరు పాలకి 20 తులాల కోవా వస్తూందా లేదా అని చూసుకోడం నే వినలేదు. మీరు కేవలం కుళాయి
+నీళ్ళే ఇస్తే తప్ప ఇదేమిటనేనా అడగరు కదా." అన్నాడు.
+
+"ఆ నపుంసకపు జడ్డితనాన్ని, మేకల్లా, కోళ్ళల్లా గొంతు కోసేస్తున్నా నోరు మూసుకు కూర్చోడాన్ని జనానికి వంటబట్టించేశారు.
+అల్లాంటి దుస్థితి నుంచి జనాన్ని బయట పడెయ్యడం మా పని అనుకోలేదు. కాని, ఇప్పుడు నీ మాట విన్నాక మా సమ్మెకి
+వున్నసామాజిక ప్రాముఖ్యం అర్థం అవుతూంది. ఇది మూడు పైసల పేచీ కాదు. అంత కన్న పెద్ద విలువవున్నదేనన్నమాట. థాంక్స్.
+ఇంత మంచి, గొప్ప అంశాన్ని తోపింప చేసినందుకు రొంబ థాంక్స్."--అంటూ వెక్కిరింతగా, నారాయణ మూతి బిగించేడు.
+
+"మీరు కోరినా, కోరకపోయినా మీ కోరిక ఫలిస్తుంది. అయితే మీరనుకున్నట్లు కాదు. ఈ సమ్మె ముగిసేసరికి సగం ఇళ్ళకి మీరు
+పాలు పోసే పని వుండదు." అంది సుశీల.
+
+"పాలు, మజ్జిగా మానేస్తారా?"
+
+"మానరు. గవర్నమెంటు పాల బూత్స్ మీద పడతారు. వెన్న తీసేస్తారనీ, పాలపొడి పాలు ఇస్తారనీ, కాచి చల్లార్చడం వలన
+పాల రుచి పోతుందనీ, జబ్బులు చేస్తాయనీ మీ వాళ్ళింతవరకు తెగ బోధిస్తున్నారు, బెదరకొడుతున్నారు. ప్రజలు కొత్తదంటే చూపే
+భయంతో, బూత్ దగ్గరి కెళ్ళడం క్యూలో నిల్చోడం అంటే వున్న నామోషీతో, ఇంకా ఎన్నో కారణాలు--ఆ పాలో, పాపాలో మీ వద్దే
+కొనుక్కుంటున్నారు. యింక ఆ జడ్డితనం వదిలిపోతుంది. " అంది సుశీల, వెక్కిరింతగా.
+
+"పెట్టీ బూర్జువా మనస్తత్వం మీ సమ్మెతో చప్పగా వదిలిపోతుంది. " అన్నాడు రామారావు.
+
+"రివిజనిస్టుల విశాలాంధ్రలో వాడు చెప్పినట్లే చెప్పేవు."--అన్నాడు నారాయణ, వెలపరం కనబరుస్తూ.
+
+"అంటే మీ మిత్రులలో కొందరికింకా మెదడు పని చేస్తూందన్నమాట." అంది సుశీల.
+
+"పని చేసేలా చేసేను. ఓ శకున పక్షి గాడు, పరమ అభాజనుడు నీలాగే మొదలు పెట్టేడు. ఎంత దెబ్బలాడవలసి వచ్చింది?"
+
+రామారావు నవ్వేడు.
+
+"వాళ్ళ నోరు నోక్కేసేరన్నమాట."
+
+"అయితే అసలు జడ్డితనం వదలవలసినది వాళ్ళకి. తప్పని ఎరిగీ, మీ నోటికి జడిసి." "....అదయి వుండదు. మీరు
+చేసేది తప్పని చెప్పేరు. మీరు పోరు పెట్టుకొన్నారు. సరే మనదేం పోయింది. మంచో చెడ్డో మీరు గోతులో దిగుతామంటే పేపర్లో
+వెయ్యక తప్పదు కదా, వేసుంటారు." అని పూర్తి చేసింది.
+
+పెళ్ళాం మాటలు వినేసరికి నారాయణ కోపం పట్టలేకపోయేడు.
+
+"ఏడిశావు పోదూ, నీ బతుక్కి రాజకీయాలు అర్ధం అవుతాయా, ఏడుస్తాయా? అల్లా బాంకులో అంకెలు కూడుకుంటూ...."
+
+తెగేదాకా లాగకూడదని ఎరిగిన సుశీల వెనక తగ్గింది. ఏదో పని కల్పించుకొనేందుకు వెళ్ళి, ఇంకా మూసే ఉన్న రెండో కిటికీ
+తెరిచింది.
+
+"ఫాను వేసుకొంటే మాత్రం మూసిపెట్టిన గదిలో గాలి ఆడుతుందా?" అంటూ మాట మార్చింది.
+
+"బెజవాడ వీధులకీ, పరిశుభ్రతకీ చుక్కెదురు." అని రామారావు ఆమె ప్రయత్నానికి సాయపడ్డాడు.
+
+"నిజమే అనుకోండి."
+
+"ఆ మంచం కిటికీ దగ్గిరికి లాక్కో. గాలేనా వస్తుంది." అని నారాయణ సలహా ఇచ్చేడు.
+
+"ఇవన్నీ ఎందుగ్గాని, ఆ కుర్చీలు అల్లా లాక్కోండి. కాస్సేపు మీరిద్దరూ కూర్చుని కబుర్లు చెప్తూంటే తలనొప్పి అదే
+తగ్గిపోతుంది."
+
+"తలనొప్పి తగ్గించే మాటలు ఒక్కరికే సాధ్యం. ఆ అవకాశం కాస్తా మీరే పాడు చేసుకొన్నారు."--అంది సుశీల.
+
+"మీ అందరి మాటా వినివుంటే నా తలనొప్పి ఆవిడకీ, ఆమెనుంచి మీ అందరికీ కూడా చుట్టుకొనేది. నేను వినిపించుకోలేదో, మీరంతా
+సుఖపడ్డారో...." అన్నాడు, రామారావు గంభీరంగా.
+
+"మేమందరం అదనపు తలనొప్పి తెచ్చుకుని, అయ్యో కుయ్యో అంటున్నాం. పెళ్లి చేసుకోలేదో, బతికేవో " అన్నాడు నారాయణ.
+
+"మీకేమండీ అదృష్టవంతులు. నెలకు నాలుగైదు వందలు తెచ్చే భార్య ఇంట్లో వున్నారు. ఎన్నేనా కబుర్లు చెప్తారు."
+
+"అడుగడుగునా ఎన్ని గండాలు! ఎవరికి వాళ్ళే పక్కవాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టాలని చూసేవాళ్ళే. కేంద్ర మంత్రి నుంచి మా ఏజంటు
+దాకా, ఈ నాలుగు వందలలో ఎంత చొర్రి పెట్టగలమని చూసేవాళ్ళే."--
+
+"వెధవముండకి నమస్కరిస్తే నన్ను పోలి బతకమందిట." నారాయణకేసి అంతా గుప్పించేరు.
+
+"దేశం, ప్రజలూ ఏమయిపోయినా సరే పార్టీలు ముఖ్యం అనుకొనే నాయకత్వం వున్నంతకాలం మనం ఎవరికి నమస్కరించబోయినా
+వెధవముండలే అయి కూర్చుంటారు."--అంది సుశీల విసురుగా.
+
+ఆ మాట విసురు తన మీద వేసుకుంటూ రామారావు ఆ భార్యా భర్తలమధ్య దుమారం రేగకుండా సర్దేశాడు.
+
+"చంపేశారు, నోరు నోక్కేసేరు."
+
+సుశీల సర్దుకుని మాట మార్చింది.
+
+"తిరపతమ్మ గారు ఏమన్నా వ్రాసారా? ఎప్పుడొస్తారు?"
+
+రామారావు తల్లి తిరపతమ్మ. ఆమె కూతురు కొత్త కాపురంలో సాయం చెయ్యటానికి వెళ్ళింది.
+
+"నా స్థితి ఏదో తేలేవరకూ ఆమె రాకపోవడమే మంచిది. అక్కడుండడమే సుఖం."
+
+"మీరేం తిన్నారో, ఏలా వున్నారో ననుకుంటూ తిన్నన్నం వంట బట్టకపోవడం సుఖమా?"--అంది సుశీల.
+
+"తేలడానికేముంది?"--అన్నాడు నారాయణ. "పెళ్ళి వాయిదా వేసుకోనే వేసుకున్నావు. పుష్కరాలు వచ్చేశాయి. ఈ ఏడాది గోదావరి
+పుష్కరాలు. వచ్చే ఏడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళకు పనికిరాదు. ఇహ తేలడానికేముంది?"
+
+"మీకు తెలియదులా వుంది. నా వుద్యోగం వైభోగం ఈ పూటతో ముగిసింది."
+
+అదేదో అతి సామాన్య విషయం అయినట్లు చెప్పబోయినా అతని కంఠం పట్టేసింది.
+
+దంపతులిద్దరూ ఉలిక్కిపడ్డారు.
+
+"అయ్యో!" అంది సుశీల.
+
+"రెట్రెంచిమెంటా." అన్నాడు నారాయణ.
+
+రామారావు నిశ్శబ్దంగా తల ఆడించేడు.
+
+"వూరుకోవద్దు." నారాయణ సలహా.
+
+"ఉహు." అన్నాడే గాని, వూరుకోకపోవడం ఏమిటో రామారావుకు తెలీలేదు.
+
+"మీ ఒక్కరికేనా?"
+
+"మా కాలేజీలో ముగ్గురం. నాతో వస్తుంటాడు రామలింగేశ్వర్రావని, ఆయన...."
+
+"ఆయనకూనా?" సుశీల ఆశ్చర్యం.
+
+"ఆహా."
+
+"వాళ్ళు పొమ్మంటే లేచి వచ్చేసేరా?" అంటూ నారాయణ ఆశ్చర్యం ప్రకటించేడు.
+
+"ఏం చేయమంటారు?" అని సుశీల ఆశ్చర్యంగా మగని ముఖం వంక చూసింది.
+
+"ఆ ప్రిన్సిపాల్‌ని నాలుగు తన్నాలి, ఏం చెయ్యడం ఏమిటి? జాతి నిర్వీర్యం అయిపోయింది. మిలిటెన్సీ చచ్చిపోయింది. ఏం
+చేస్తారుట!"
+
+మగనికి మతి వుండే మాట్లాడుతున్నాడా అన్నట్లు సుశీల తెల్లబోయింది. నారాయణ సాగించేడు.
+
+"మనుష్యుల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క క్షణం పరాగ్గా వుంటే కాలి కింద గోతులు తవ్వుతున్నారు. వద్దు.
+వూరుకోవద్దు. మనం బతికే వున్నామని చూపాలి. చూపడానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఉహు. ఊరుకోవద్దు."
+
+"నిజమేనండి. ఊరుకోకూడదు. కాని, ప్రిన్సిపాల్‌ని తన్నితే పని జరుగుతుందా?"--అంటూ సుశీల సందేహం కనబరచింది.
+
+"మరొకరిని తన్నితే మాత్రం?" అన్నాడు రామారావు.
+
+కాని నారాయణ ఒప్పుకోలేదు.
+
+"రొట్టెకి రేవేమిటి? ఎవరికి వెష్ట మోసినప్పుడు వాళ్ళు బడితె బాజా ప్రారంభించెయ్యాలి. అసలుమనిషి వీడు కాకపోయినా
+అసలువాడిచేతిలో కీలుబొమ్మ. అసలువాడెవరు? మిగులు వాడెవరని మీన మేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే ఈ లోపున మనల్ని
+నమలకుండానే మింగేస్తారు."
+
+"అందుచేత ఎవరినో ఒకరిని తన్నడం తప్పదంటారు." అంది సుశీల. రామారావు తెల్లబోయాడు.
+
+"మీరు వ్యక్తి దౌర్జన్యవాదాన్ని సమర్థిస్తున్నట్లుంది. మార్క్సిజం...."
+
+నారాయణ వెడనవ్వు నవ్వేడు.
+
+"అయ్యా, మార్క్సిజాన్నేగాని, మరో ఇజాన్నేగాని దేశ కాల పాత్రలకి సమన్వయం చేసుకోవాలి. అలాగాక ఆ బాధల్ని రూళ్ళకర్ర
+సూత్రాలు చేసుక్కూర్చుంటే వచ్చే ఇబ్బందే ఇది. ఇన్ని యుగయుగాలుగా మహనీయులు చెప్పిన ఆశయాలూ, చూపిన ఆదర్శాలూ వారితోనే
+గబ్బుపట్టి పోవడానికి కారణం ఏమిటంటావు?"
+
+"ఏమో. నేనంతవరకు చదువుకున్నట్లు కనిపించడం లేదు"--అన్నాడు రామారావు.
+
+ఆ వెక్కిరింత అర్ధమయిందో, లేదో అర్ధమయినా లెక్కచెయ్యదలచలేదో నారాయణ తన ధోరణినే సాగించేడు.
+
+"మార్క్సు ఊహించినా చూసి ఉండని పరిణామాల్ని లెనిన్ పెట్టుబడిదారీ విధానంలో చూసేడు. సామ్రాజ్యవాద దశలో మన ఎత్తుగడలు
+ఇల్లా ఉండాలన్నాడు. తరవాత యునైటెడ్ ఫ్రంట్ ఎత్తుగడల్ని...."
+
+"అవీ కొత్త కాదండి, అసలు వర్గపోరాట సూత్రానికి మార్క్సే...."అంటూ రామారావు మాట కలపబోయేడు, కాని నారాయణ మాట
+సాగనివ్వలేదు.
+
+"డైలెక్టిక్సు స్వామీ డైలెక్టిక్సు. ఫాసిజం మార్క్సు కాలానికి లేదు, లెనిన్ కాలానికీ లేదు...."
+
+"కాని, అది వూహించలేని విషయం కాదు. జాక్ లండన్ తన 'ఐరన్ హీల్ 'లో దానిని వూహించాడు...."
+
+"రాజకీయ పోరాటాన్ని వూహల మీద పెంచుకు పోడానికి వీలులేదు. ఆ స్థితి 35 నాటికి వచ్చింది. అయితే ఈ వేళ పరిస్థితి
+వేరు...."
+
+రామారావు నిశ్శబ్దంగా వింటున్నాడు. హఠాత్తుగా నారాయణ ప్రశ్నించేడు.
+
+"వింటున్నావా?"
+
+"ఆ"
+
+"దోపిడీ, దౌర్జన్యాలూ ఉత్పత్తి విధానంతోపాటు సామాజికం అయ్యాయి. ప్రతివాడూ పక్కవాడిని దోచుకుంటున్నాడు. రెండో వాడిమీద
+దౌర్జన్యం చేస్తున్నాడు. ఈవేళ దోపిడీ, దౌర్జన్యాలు వర్గాల సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి. అసలు దోపిడీకీ, దౌర్జన్యానికీ
+మూలాన్ని దొరకపుచ్చుకోడం ఈవేళ అసాధ్యం. 1943లో బెంగాలు కరువుకి 50 లక్షల మంది చచ్చిపోయారన్నారు. ఎలకలూ,
+దోమలూ, ఈగలూ కన్నా హీనం ఆ కరువు మనుష్యకృతం. కాని ఏ మనిషి? అల్లాంటి పరిస్థితే నెహ్రూ అధికార కాలంలో కూడా ఏ
+చిన్న ప్రయాణంలోనైనా రాకపోలేదు. వచ్చినప్పుడు దానికి కారకుల్లో ఒక్కడిని పట్టుకు ఉరితియ్య గలిగేడా?"
+
+"అంటే అర్ధం దానికి కారణం ఎవడో ఒక వ్యక్తి కాదనీ, అసలు కారణం సమాజ నిర్మాణంలోనే ఉన్నదనీ కాదా."
+
+"అదే నే చెప్పేది, ఘోరాలు జరిగి పోతుంటాయి. దానికి బాధ్యత ఎవరో చెప్పడానికి ఉండదు. కనక నిశ్శబ్దంగా చావవలసిందేనా?
+1943లో ఎలకల్లా చచ్చిపోయిన ఆ 50 లక్షలమందీ, ఒక్కో నూరుమంది ఒకణ్ణి పట్టుకొని నలుచుకు తినేస్తే సంఘం ఇల్లా
+వుండేనా? ఆ పనికి ఎగబడి వుంటే అంతమంది చావనక్కర్లేకుండానే వ్యవహారాలూ సర్దుకొని వుండేవి కావా?"
+
+"మీ మాటలు అర్ధం కావు. ఒక వేపున కనిపించిన వాడినల్లా కొట్టమంటారు. రెండోవేపున పదిమందీ ఏకం అయి దెబ్బలాడమంటారు.
+ప్రతి వాడినీ తన్నడం ప్రారంభిస్తే పదిమందీ ఏకం కావడం జరుగుతుందా?" అని సుశీల అడ్డం వచ్చింది.
+
+"ఆ సామూహిక వీరత్వం రావాలంటే ఎంత నిర్మాణం కావాలి, ప్రజల్లో ఎంత ప్రబోధం కావాలి? ఎంత అనుభవం వుండాలి? కాని, మీరు
+చెప్తున్న పద్ధతిలో ఆ మూడూ కూడ నష్టమేనే." అన్నాడు రామారావు.
+
+"ఈత వస్తే గాని నీళ్ళలో దిగవద్దంటావు. అల్లా మంచంమీద పడుకుని కాళ్ళూచేతులూ కొట్టుకొంటూవుండు. ఈత చేతనవుతుంది." అని
+చిరాకుతో నారాయణ లేచేడు. ఆయన వెనకనే సుశీల లేచింది.
+
+
+
+
+తొమ్మిదో ప్రకరణం
+
+
+"లెక్చరరుగారు ఇంట్లోలేరేమిటి? ఎక్కడా అలికిడి వినబడ్డం లేదు." అంటూ భాగ్యలక్ష్మి ఎగతాళిగా రామారావు వాటా వేపు తల
+ఎగరేసింది.
+
+అందులోని వెక్కిరింతను అర్ధం చేసుకోనట్లే సుశీల మాట్లాడేసింది.
+
+"పాపం, ఈ రిట్రెంచిమెంటు కత్తి ఆయన మీద పడింది. ట్యూటరు వుద్యోగం కాస్తా పోయింది. ఏం చెయ్యడమా అని దిగులు
+పడుతున్నారు."
+
+"దానికింత పాపం; తాపం ఎందుకు? నాలుగెకరాలున్నదాన్ని చూసుకున్నాడుగా. ఆ తరవాయేదో పూర్తయితే...."
+
+"అల్లాంటి వాడైతే ఎకరాలతో పాటు ఓ చిన్న వుద్యోగం వున్నదాన్ని కూడా చేసుకోవచ్చు. దానికైతే వెతకనే పనిలేదు...."
+
+"సడే. సంబడం. చేసుకొంటూ, చేసుకొంటూ...." చటుక్కున భాగ్యలక్ష్మి నిగ్రహించుకొని మాట మార్చేసింది. "సినీమాకిగాని
+వస్తావేమో అడిగి రమ్మంది, అక్క."
+
+"యింకా పిల్లలు యింటికి రాలేదు. ఏ పనీ కాలేదు, ఇంట్లో. ఈ వేళ రానులే."
+
+"పిన్నిగారున్నారుగా, ఓ పూటకి ఆమె దగ్గిర వుండలేరా?"
+
+"వుండడం ఒక్కటేనా? వాళ్ళకెన్ని చేస్తే వుండడం మాటొస్తుంది."
+
+ఆమె మాట పూర్తికాకుండానే వీధిలోంచి "అమ్మా" పిలుపు వినబడింది.
+
+సుశీల ముఖం విచ్చుకుంది.
+
+"అరుగో వచ్చేసేరు." అంటూ లేచింది.
+
+"రాక ఎక్కడికి పోతారేం? మా అక్క, నువ్వు, మా వదిన మీరంతా ఒకే పాఠాలు చదివినట్లున్నారు. డ్రైనేజీ గోతులు, లారీలు,
+పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు....అబ్బ!"
+
+"పెళ్ళి చేసుకొని ఓ పిల్లవాణ్నో, పిల్లదాన్నో కన్నాక చెప్దువులే...."
+
+"నాకు పెళ్ళివద్దు. పెళ్ళయినా పిల్లలు వద్దు. వున్నా మీలాగ భయపడను."
+
+సుశీల చిరునవ్వు నవ్వింది.
+
+"ఆడ, మగ భేదం లేకుండా, ప్రతివాళ్ళూ వరసక్రమంలో ఏదో రోజున చెప్పే మాటలే. కాని తరవాత ఒక్కటీ గుర్తుండదు...."
+
+"సరే. చూద్దుగానికా."
+
+వీధి గుమ్మంలో ఆరేళ్ళ హేమ కనబడింది. అక్కడినుంచే ఫిర్యాదు చేసింది.
+
+"అన్నయ్య రావడంలేదే, అమ్మా! ఒరేయ్, అమ్మతో చెప్పేస్తున్నా...."
+
+ఆయాసపడుతూ హేమ లోపలికి వచ్చింది. ఆమె రెండు భుజాలనీ రెండు పుస్తకాల సంచులు, రెండు చేతులలో రెండు కేరియర్లు. ఆ వేషం
+చూసి భాగ్యలక్ష్మి ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి హేమకి సిగ్గేసింది. ఏదో అవమానం జరిగినట్లు ఏడుపుమొహం పెట్టింది.
+
+"చూడే అమ్మా! తన సంచీ, కేరియరూ అన్నయ్య అరుగుమీద పారేసేడు."
+
+సుశీల వెళ్ళి కూతురు భుజాలనున్నవీ, చేతులలోవీ తీసుకుంది.
+
+"వాడి సంగతి చెప్దాంలే. ఏడీ వాడు? ఇంట్లోకి రాకుండా ఏం చేస్తున్నాడు?"
+
+ఆ మాటలింకా పూర్తికాకుండానే వీధిలో పెద్దగోల వినబడింది. సుశీలా, భాగ్యలక్ష్మీ అటు పరుగెత్తేరు.
+
+"చంద్రం కాలుజారి పడిపోయేడండి." – అన్నమాట విని, సుశీల ఒక్క వురుకున కందకం గట్టున నిలబడింది.
+
+"వద్దంటున్నా వినలేదండి." అంటూ కుర్రవాళ్ళు ఆ ప్రమాదం బాధ్యత తమది కాదని చెప్పుకొంటున్నారు. ఆ మాటలేవీ సుశీల చెవిని
+చొరడం లేదు. కందకంలో నిలబడి వెర్రినవ్వులు నవ్వుతూ తన సాహసాన్ని గొప్పగా వర్ణించుకుంటున్న కొడుకును చూస్తూ గమ్మున
+లోపలికి వురికింది. ఆ వురకడంతో కాలు మడతపడి చదికిల బడిపోయింది. కూర్చునే కుర్రవాడిని దగ్గరకు లాక్కుని ముద్దులాడింది.
+
+"దెబ్బ ఎక్కడ తగిలిందిరా, నాన్నా."
+
+అంతమందిలో తనకేదో దెబ్బ తగిలినట్లు ఆదుర్దా చూపడం, ముద్దు చేయడం చంద్రశేఖరానికి చాలా చిన్నతనంగా కనిపించింది. తల్లి
+చేతుల నుంచి విడిపించుకొని, దూరంగా జరిగి, తన సాహస చర్యను సాభినయంగా వర్ణించసాగేడు.
+
+"అందరికన్నా దూరం దూకేనమ్మా. మట్టిగడ్డ మీద కాలుపడింది. గోవిందా అని ఇల్లా పడిపోయేను."
+
+పడిపోయిన విధాన్ని అభినయించి చూపడంలో మళ్ళీ తల్లికి దొరికిపోయాడు. యీమారామె వానిని వదలలేదు.
+
+"గొప్పపని చేసేవులే."
+
+"అల్లా కూర్చునే వున్నారేమిట"న్న ప్రశ్న వినబడి, సుశీలకు తాను కూర్చునే వున్న విషయం గుర్తు వచ్చింది. చటుక్కున
+లేవబోయింది. కాని సాధ్యం కాలేదు. అంతవరకూ కొడుకును గురించిన ఆదుర్దాతో ఆమెకు కాలు బాధ గుర్తు రాలేదు. ఇప్పుడు
+లేవలేకపోతూంది.
+
+"ఏమయిందేమిటి?" – అని భాగ్యలక్ష్మి ప్రశ్నిస్తూంది. పరిస్థితి గమనించి ఆమె ఇంట్లోంచి నిచ్చెన తెచ్చి వేసుకొని దిగి
+వచ్చింది. ఆమెతోనే వచ్చిన సుశీల తల్లి గట్టు మీదనుంచే "ఏమయిందే అమ్మా!" అంటూంది.
+
+అంతవరకూ తోచివుండని బాధ కాలినరాల్ని తోడేస్తూంటే సుశీల "అబ్బా" అంటూంది. కాలు రాయడానికి భాగ్యలక్ష్మి చెయ్యి జాపింది.
+కాని సుశీల మొర్రో అనేసరికి వదిలేసింది.
+
+"చూడు. నీ మూలంగా అమ్మ కాలు నొప్పెట్టింది." అని భాగ్యలక్ష్మి కోప్పడుతూంటె చంద్రశేఖరం బిక్కమొహం వేసేడు.
+
+"అంచుకి వెళ్ళకండర్రా. మీరు కూడా పడిపోతారు!" అని గట్టు మీద పిల్లల్ని బతిమలాడుతూంది. ఆ గోల గంద్ర గోళం విని
+ఇరుగు పొరుగులు వచ్చేసేరు. తొంగి చూడడంతో వాళ్ళు కూడా తమ మీద పడే ప్రమాదం వున్నదని అప్పుడే దిగి వచ్చిన రామారావు
+గ్రహించేడు. నిద్రలో బయట కేకలు విని ఉలికిపడి అతడు పరుగెత్తి వచ్చేడు.
+
+"ముందు నువ్వు పైకెక్కు."
+
+భాగ్యలక్ష్మి తిరగబడి చూసింది. నువ్వా నన్ను ఆజ్ఞాపించేదన్నట్లు. కానీ రామారావు మరో మాటకు అవకాశం ఇవ్వలేదు.
+
+"ఊ. త్వరగా పిల్లవాడినందుకో."
+
+సుశీల చూపు కూడా గ్రహించి, భాగ్యలక్ష్మి గబగబ నిచ్చెన నెక్కేసింది. ఆమె ఇంకా పై మెట్టు మీద వుండగానే క్రింది నుంచి
+రామారావు కంఠం.
+
+"గట్టిగా పట్టుకో."
+
+వెనుతిరిగి చూసింది. పిల్లవాడిని పైఎత్తున నిలబెట్టి రామారావు సుశీలను లేవదీయబోతున్నాడు.
+
+"లేవగలరేమో చూడండి."
+
+ఆమె కాలు రాసుకుంటూ లేవబోయింది. కాని, మరల చదికిలబడింది.
+
+లాభంలేదు. రామారావు నొప్పిపెట్టిన కాలు తొక్కిపెట్టి, ఆమె నడుముకు చేతులు చుట్టి బలంగా లేవనెత్తి గుంజేడు. అదురు తిన్న
+నరాలు కొంతవరకు సర్దుకొన్నాయి. కాని, కాలు నేల మోపగల స్థితిలో లేదు. నిచ్చెన ఎక్కడం ఎల్లాగ? జనం కందకం అంచుకు
+చేరి తలో సలహా ఇస్తున్నారు. సలహాలు వుపయోగం ఉన్నా, లేకపోయినా గట్టుతో సహా వారంతా తమ మీద పడే ప్రమాదం వుంది.
+రామారావు వొంగి చటుక్కున సుశీలను భుజాన వేసుకొన్నాడు.
+
+"భయపడకండి."
+
+తీసుకెళ్ళి మంచం మీద కూర్చోపెట్టేడు.
+
+"ఎర్రమన్ను వుడికించి కట్టండి."
+
+"చింతపండూ, సున్నం అయినా సరే."
+
+ముసలమ్మ ఆశీర్వదిస్తూంటే రామారావు తన గది వేపున నడిచేడు.
+
+
+
+
+పదో ప్రకరణం
+
+
+వినోదం చూడవచ్చిన వారూ, ప్రమాదాన్ని పరామర్శించ వచ్చిన వారూ వదిలిపెట్టేవరకూ ఎంత చిరాకుగా వున్నా, చెప్పిన మాటే
+చెప్తూ, రామారావు అరుగు మీదనే నిలబడిపోవలసి వచ్చింది.
+
+వారంతా వెళ్ళిపోయాకనే అతడు తన వాటాలో ప్రవేశించేడు. చికాకుగా వుంది. ఉక్క, చెమట, స్నానం చెయ్యాలని ఆశ.
+
+వెళ్ళి, కుళాయి తిప్పేసరికి అది కంయ్ మంది. పక్క వాటాలోంచి సుశీల తల్లి కేకేసింది.
+
+"ఈవేళ కుళాయిలు రాలేదు నాయనా!"
+
+"కృష్ణానది పక్కనుండగా నీళ్ళ కరువు. దరిద్రగొట్టు మునిసిపాలిటీ." అని తిట్టుకున్నాడు. ప్రాణం వుసూరుమంది. నిలబడి
+పోయేడు.
+
+"ఎక్కడో బాగులో, దోగులో తగులడుతూండి వుంటారు" – అన్నాడు కోపం పట్టలేక.
+
+"నీళ్ళు రావు. జాగ్రత్త పడండి – అనేనా చెప్పి చావరు" – అంది ముసలమ్మ లోనుంచే.
+
+నోటీసు పంపడం ఇంటింటికీ చెప్పడం అనవసర శ్రమ కాదా? బాధ ఎల్లాగూ తప్పదు. ముందుగానే చెప్పి ఏడిపించడం ఎందుకనుకొని
+వుంటారు. అన్నాడు తిట్టలేక కసి పట్టలేక.
+
+"పండుగొచ్చేసరికి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ మామూళ్ళ కోసం ముష్టికి బయలుదేరడం కష్టమనిపించదు." అంది ముసలమ్మ.
+
+"త్రాగడానికా? స్నానానికా?"
+
+"స్నానం చెయ్యాలనేమో ఇందాకా పనిమనిషిని మీ స్నానాల గదిలో కూడ నీళ్ళు పొయ్యమని చెప్పేను చూసుకోండి." అంది, ఆ సంభాషణ
+అంతా వింటున్న సుశీల.
+
+"బాల్చీలు కావేసినట్లున్నాయి. మరిచిపోయి వుంటుంది. అదేనా తక్కువ తిన్నది." అన్నాడు, రామారావు తెచ్చికోలు శాంతంతో.
+
+"మా గదిలో పోయించాను. వాడుకోండి."
+
+పక్కనే వున్న భాగ్యలక్ష్మికి పని పురమాయించింది.
+
+"ఆ చెంబూ, బాల్చీ, సబ్బూ కాస్త ఆ గదిలో పెట్టి రావే."
+
+రామారావు వద్దన్నాడు.
+
+"తరవాత చూస్తాలెండి"
+
+అలా అన్నాడేగాని కూజాలో నీళ్ళు చూశాక మరో ఆలోచన తోచింది. హస్పిటళ్ళలో రోగులకు చేయించే "సోప్ బాత్" గుర్తొచ్చి అంత
+చిరాకులోనూ నవ్వొచ్చింది.
+
+"Simple living and high thinking. భారతదేశపు పారమార్థికతకి ప్రపంచం జోహార్లు చెప్పక
+చస్తుందా?"
+
+
+
+
+పదకొండో ప్రకరణం
+
+
+తన వెనకవేపున బరువు బాల్చీ దబ్బున పెట్టిన చప్పుడయి, రామారావు ఉలికిపడి, ఈలపాట ఆపేడు.
+
+ఆ"సోప్‌బాత్" ఇంచుమించు తడిగుడ్డతో తుడుచుకోవడం వంటిదే అయినా, ఆమాత్రానికే ప్రాణం ఎంతో హాయిగా వుంది. చిరాకు
+తగ్గి ఈలపాట దానంతట అదే వచ్చేసింది. ఆ హుషారులో భాగ్యలక్ష్మి నీళ్ళ బాల్చీతో రావడాన్ని అతడు గమనించలేదు. బాల్చీ
+చప్పుడు విని తిరగబడి చూసేడు. భాగ్యలక్ష్మి, నడుమున రెండు చేతులూ పెట్టుకొని ఆయాసపడుతూ నిల్చునుంది. తడిసిన
+అండర్‌వేర్‌తో ఇంచుమించు నగ్నంగా వున్న తన స్థితికి సిగ్గుపడి అతడు కూర్చున్న పీటమీదనే వెనక్కి
+తిరిగేడు.
+
+"ఏమిటిది?"
+
+"నీళ్ళు"
+
+"అది సరిలే. ఎందుకూ అని."
+
+"తమరు తానమాడాలని."
+
+"అదీ బాగానే వుంది. నీకీ శ్రమ ఎందుకని....వద్దన్నా కాదా?"
+
+ఒక్కక్షణం భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపులు తన వొళ్ళంతా తడుముతున్నట్లనిపించింది.
+
+"బాగుంది. Thanks--వెళ్ళు."
+
+"నాకెందుకు. ఆ సుశీలమ్మగారికి చెప్పుకో. ఓ బాల్చీడు నీళ్ళు యిచ్చిరా తల్లీ! ఆ వొళ్ళు వేడేనా తగ్గుతుంది అని తరుముతే
+తెచ్చేను."
+
+"నా ఒళ్ళు వేడి ఆమెకెందుకు తెలిసిందబ్బా!" అన్నాడు, రామారావు వెక్కిరింతగా.
+
+ఆ ప్రశ్నకోసమే కాచుక్కూర్చున్నట్లు భాగ్యలక్ష్మి చటుక్కున అనేసింది.
+
+"కౌగలించుకున్నప్పుడు తెలిసి వుంటుంది."
+
+భాగ్యలక్ష్మి స్వభావం ఎరిగిన రామారావు ఎర్రబారి చూసేడు.
+
+"సంతోషించాం. వెళ్ళిరా."
+
+భాగ్యలక్ష్మి కదలలేదు. పైగా--
+
+"ఏమిటి నీ వుద్దేశం? అంతమంది ముందు, పట్టపగలు, పరాయి ఆడదాన్ని, నీకన్నా పెద్దదైతే మాత్రం, పిల్లల తల్లిని అల్లా
+కౌగలించుకోడం, చేతుల్లో ఎత్తుకుని రావడంలో నీ వుద్దేశం ఏమిటి? రేపు ఆవిడ తల ఎత్తుకోవాలా?"
+
+సుశీలయందున్న గౌరవం కొద్దీ అతడామాటను సాగదియ్యలేకపోయాడు. అందుచేత వెక్కిరింత, వేళాకోళంతో తోసివెయ్యబోయేడు.
+
+"ఔను సుమా!" అన్నాడు. ఆ కందకంలో ఆవిడను వదిలేసి, మీ అందరి సానుభూతి ప్రదర్శనలకూ అవకాశం ఇవ్వకుండా పైకి తేవడం
+ని....ఝం....గా చాలా....తప్పు."
+
+భాగ్యలక్ష్మి కళ్ళు చురచురలాడేయి....
+
+"సిగ్గు లేకపోతే సరి."
+
+ఆమె కోపం ఏమిటో, ఎందుకో రామారావు ఎరుగును. కానీ గుర్తించదలచుకోలేదు.
+
+"నిజమే. మనిషికి అభిమానం, అహంకారమే గాక సిగ్గు కూడా అవసరమైన ఆడగుణాల్లో ఒకటని నాకు గుర్తులేదు సుమా."
+
+"ఆడది కనిపిస్తే నీకేమీ గుర్తుండదు. ఎదో పేరున ముట్టుకోవాలి."
+
+ఆ మాటతో రామారావు కళ్ళు నిప్పులు కురిసేయి. అతికష్టం మీద కంఠాన్ని నిగ్రహించుకున్నాడు.
+
+"నీకు నీమీద అభిమానం కన్న ఇతరుల పాతివ్రత్యం కాపాడ్డం మీద ఎక్కువ శ్రధ్ధ సుమా."
+
+ఒక్కనిముషం క్రితం కలిగిన సిగ్గు మాట మరిచిపోయాడు. లేచి ఆమె రెక్క పట్టుకొని వరాండా గుమ్మంవేపు నడిపించేడు.
+
+"సినీమాలూ, నాటకాలూలో లాగ లెంపకాయకొట్టే ఆలోచన పెట్టుకోకు. అప్పుడు నిజంగా విలన్‌నైపోతా."
+
+చెయ్యి విడిపించుకుంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడింది.
+
+"చెయ్యొదులు."
+
+"ఆడదానివి. చెయ్యేనా పట్టుకోకపోతే నీ ఆడతనానికే అవమానం కాదూ"
+
+గుమ్మం వెలుపల నిలవబెట్టి తలుపు వేసుకుంటూ హితోపదేశం చెసేడు.
+
+"మీ యింట్లో వుండడంలేదనీ, మీరంతా నా ఆరోగ్యం, నా మర్యాదా గురించి ఇంత శ్రధ్ధ తీసుకోనక్కర్లేదనీ నీకు ఎల్లా
+నచ్చచెప్పడమో తెలియడం లేదు. ఇక అనవసరంగా...."
+
+తరవాత ముగింపు ఏమిటో తలుపు చప్పుడుతో భాగ్యలక్ష్మికి వినిపించనేలేదు.
+
+
+
+
+పన్నెండో ప్రకరణం
+
+
+సుశీల పడుకుని వున్న గది గుమ్మంలో నిలబడి "కాపడం పెట్టేరా? ఎల్లా వుంది?" అని అడుగుతున్న రామారావుని లోపలికి
+ఆహ్వానించింది.
+
+"రాండి. ఆ కుర్చీ లాక్కోండి. అప్పుడే స్నానం అయిపోయిందా?"
+
+"ఎంతసేపేం?"
+
+"ఇప్పుడే కదా భాగ్యలక్ష్మి బాల్చీ పెట్టి వచ్చింది?"
+
+"ఆమె వచ్చేసరికే నా స్నానం అయిపోయింది."
+
+"నీళ్ళెక్కడివి? మొగమోటపడ్డారా?"
+
+"భాగ్యలక్ష్మిని పాపం ఎందుకు శ్రమ పెట్టేరు? అంత పెద్ద బాల్చీని నీళ్ళతో ఈడ్చుకొచ్చి, పాపం వొగిర్చేసింది. నాకు అవసరం
+అనిపిస్తే నేను తెచ్చుకోకపోయేనా? మీ యింట్లోనా నాకు మొహమాటం?"
+
+ఆ రెండు కుటుంబాల మధ్య దగ్గరదో, దూరపుదో బంధుత్వం వుందని సుశీల ఎరుగును. రాకపోకలున్నాయి. కాని, వ్యవహారాలు చూస్తే
+ఎక్కడో ఏదో లోపం వుందనిపిస్తుంది. ముఖ్యంగా భాగ్యలక్ష్మి.
+
+"అబ్బే. యిందులో ఏం వుంది? భాగ్యలక్ష్మి ఒకరికి సాయం అంటే వెనక తియ్యదు. చాలా మంచిపిల్ల."
+
+"నేనెరగనా? పి.యు.సి., బి.ఎస్.సి., లు నేను వాళ్ళింట్లో వుండే చదువుకొన్నా. మీరెరగరేమో."
+
+"మీ అమ్మగారు అంటుంటారు."
+
+"నాకు తెలుసు. అయితే ఆమెకు శ్రమ ఇవ్వడం అనవసరం అని గాని...."
+
+సుశీల యింకా ప్రసంగాన్ని సాగతీయదలచుకోలేదు. మాట మార్చింది. కొంతసేపు డాక్టరుకు కాలుచూపడం అవసరమా, ఆయన్ని
+తీసుకురావడమా, లేకుంటే వెళ్ళడం ఎల్లాగ--అనేక విషయాలు కబుర్లలో దొర్లేయి.
+
+ఒక నిమిషం ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి రామారావు లేచేడు.
+
+"చూడండి, మీ విషయంలో నేనేమన్నా అనుచితంగా వ్యవహరించి వుంటే క్షమించండి."
+
+సుశీల తెల్లబోయింది.
+
+"మీమాట నాకర్ధం కాలేదు."
+
+"అర్ధం కాకపోతే బాధ లేదు. వదిలెయ్యండి. సరే, పోయొస్తా."
+
+సుశీల ఆలోచనలో పడింది. ఆ క్షమాపణకి యిప్పుడవసరం ఏమిటి? భాగ్యలక్ష్మి ఏమన్నా అందా? ఆమెకు అతడంటే ఏదో
+చులకనభావం. మగాడు, గడుసువాడు కనక తేలడు. కాని, రామారావుకీ వుంది అటువంటిదేదో. వాళ్ళ వైమనస్యాలమధ్య తన
+ప్రసక్తి ఏమిటి?
+
+"మనుష్యులకి ఒకరినొకరు పీక్కు తినడం ఆనందమా, కాలక్షేపమా?"
+
+
+
+
+పదమూడో ప్రకరణం
+
+
+"సినీమాకొస్తావేమో అడిగి రమ్మంటే కాలు విరుచుకున్నావని ఓ గంట పోయాక కబురు తెచ్చింది, భాగ్యం. చూసొద్దామని బయలుదేరా"
+నంటూ వచ్చిన సుపర్ణను చూసి సుశీల సంతోషంతో ఆహ్వానించింది.
+
+"రావే. రా. నిద్ర రానప్పుడు మంచం మీద పడుకుని వుండవలసి రావడం ఎంత కష్టమే. అబ్బ." అని చిరాకు పడింది.
+
+"పడుకో, లేస్తావెందుకూ? కుర్రాడు ఏడీ? వాడికేం దెబ్బ తగలలేదు కద." అంటూ సుపర్ణ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని
+కూర్చుంది.
+
+"పిల్లలిద్దర్నీ తీసుకొని అమ్మ ఇప్పుడే పక్క యింటి కెళ్ళింది. అదీ అదృష్టమే, వాడికేం తగలలేదు."
+
+"పోనీలే. పిల్లగాళ్ళు కారుగాని...."
+
+"ఒక్క నిమషం కాలూ, చెయ్యీ వూరుకోదు కద."
+
+పిల్లల మాటలూ, అల్లర్లూ గురించి కొంతసేపు విచారం, సంతోషం, విసువు, ఉత్సాహం వారి మాటలలో మారి మారి వినిపించింది. తరువాత
+ప్రమాదం ఎల్లా జరిగిందో, ఆ క్షణంలో తన మనస్స్థితి ఏమిటో సుశీల కొంతసేపు వర్ణించింది. అదీ విసుగనిపించింది.
+
+"అబ్బ, పాడుదెబ్బ. కాస్సేపు మరో కబుర్లేవేనా చెప్పు. పిల్లని తీసుకొచ్చేవు కాదేం? ఏడాది వెళ్ళిందా? మీ ఆయన ఎప్పుడు
+వస్తారుట. నీ ప్రయాణం ఎప్పుడు?"
+
+"వుద్యోగరీత్యా హైద్రాబాదు వెళ్ళేరు. ఆదివారం మెయిలుకి టిక్కెట్లు తీసుకొని రెడీగా వుండమన్నారు."
+
+"ఎల్లుండి పొద్దుటేనా?"
+
+"కాదు. పైవారం."
+
+"ఎక్కడికి పార్వతీపురమేనా?"
+
+"ఆ. అంతా గొడవ గొడవగా వుంది. కొండవాళ్ళనీ, కోయవాళ్ళనీ రెచ్చగొట్టి వూళ్ళు దోసిస్తున్నారు, కమ్యూనిస్టులు."
+
+"మొగుడు పోలీసు ఆఫీసరు అయినందుకు నీకు పాఠాలు బాగానే వంటబడుతున్నాయి."--అని నవ్వింది
+సుశీల, సుపర్ణ తెల్లబోయింది.
+
+"అదేమిటే, అల్లా అంటావు? మాకు తెలిసిన కుటుంబం ఒకటుంది. వర్తకులు, ఇంక ఆ ప్రాంతాలకు వెళ్ళం బాబోయని యింటిదగ్గిరే
+కూర్చుంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే...."
+
+"వీళ్ళు ఏంచేసి ఎందుకు భయపడుతున్నారో. చెప్పేటప్పుడంతా సుగుణాభిరాములే."
+
+"వాళ్ళేమిటి? చెయ్యడం ఏమిటి? నువ్వు మరీను. అక్కడి సరుకు తెచ్చి ఇక్కడా, ఇక్కడిదక్కడా అమ్ముకొనే రకం. ఒకరి
+జోలికీ సొంటికీ పోయేరకం కాదు."
+
+"ప్రపంచం మనకు కనిపించేటంత అమాయకంగా వుందనుకోకు. సరిలే. ఏమిటి కథ. భాగ్యలక్ష్మికింకా పెళ్ళి మాట ఆలోచించడంలేదా?"
+అంటూ మాట మార్చింది, సుశీల.
+
+ఆ ప్రశ్న రాగానే సుపర్ణ అటూ, ఇటూ చూసింది. నెమ్మదిగా గొంతు తగ్గించి--"రామం ఇంట్లో వున్నాడా?" అంది.
+
+తాను భాగ్యలక్ష్మి పెళ్ళి సంగతి అడుగుతూంటే, సుపర్ణ రామారావు వున్నాడా అని అడగడం సుశీలకు వింతగా తోచింది. కాని ఏమీ
+తేలలేదు.
+
+"లేరు. ఇంతక్రితమే బజారుకెళ్ళేరు. భోజనం అవీ పూర్తి చేసుకుని ఏ తొమ్మిదింటికో చేరుకుంటారు. ఇంటిదగ్గిర కనిపెట్టుకొని వుండే
+వాళ్ళెవ్వరూ లేరు కదా. తోచినప్పుడు రావడం-పోవడం...." అంటూ సుపర్ణ అడిగినవీ, అడగనివీ అన్నింటికీ సమాధానం
+ఇచ్చింది.
+
+"తల్లి?"
+
+"కూతురు కొత్తకాపరం సరిదిద్దడానికి వెళ్ళేరు కదా. ప్రస్తుతం కూతురూ, అల్లుడూతో కొండకెళ్ళేరుట. వస్తారు, ఎప్పుడో."
+
+సుపర్ణ నవ్వింది.
+
+"తెలుగునాట దైవభక్తి డేంజరుగా మారుతూంది."
+
+"పెళ్ళికాక ముందునుంచే ప్రభావతి శనివారాలుంటూంది."
+
+"అదేముందిలే. ఈవేళ హాస్టల్సులో ఆడపిల్లలందరికీ అదో ఫేషనయిపోయింది. లావు తగ్గించేందుకనీ, వెంకటేశ్వరుణ్ణి మంచి
+చేసుకొనేందుకనీ ఉమ్మడిగా ఉపవాసాలు చేసేస్తుంటారు," అంది సుపర్ణ. సుశీల నవ్వింది.
+
+"ఎదటివూరునపట్టి రాంలింగయ్యో రామభద్రయ్యో అయినట్లు--"
+
+"అదేంకాదు, సిగ్గా ఏమిటి? ఎవరో ఒకరూ, ఇద్దరూ అల్లా చేస్తేనది. అందరూ అదే పడవలో వున్నప్పుడు ఎవరికోసం ఆ
+భయం?"
+
+"నువ్వూ చేస్తున్నావా?"--అంది ఆశ్చర్యంగా సుశీల. సుపర్ణ చిన్నపుచ్చుకొంది.
+
+"యూనివర్సిటీ హాస్టలుకెళ్ళేక నలుగురినీ చూసి నేనూ ప్రారంభించా. అంతకు పూర్వం రామారావుది ఇన్‌ఫ్లుయన్సు. ఆ పద్యం
+ఆ రోజుల నాటిదే."
+
+"మీ భాగ్యలక్ష్మికి లావు భయం, దేవుడి భయం కూడా లేవు." అని మెచ్చుకుంది, సుశీల.
+
+సుపర్ణ ఒక్క నిముషం తటపటాయించి, ఎత్తుకుంది.
+
+"మాట వచ్చింది కనక చెప్తాను. నీకు చేతనైతే దానికి నచ్చచెప్పడానికి ప్రయత్నించు. మళ్ళీ ఎక్కడా అనకు."
+
+అదేదో కుటుంబ విషయం అయివుంటుందని గ్రహించి సుశీల సందేహించింది.
+
+"రహస్యమైతే చెప్పకు."
+
+"అది ఇక్కడినుంచి వచ్చి గదిలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంది."
+
+సుశీల ఆశ్చర్యపడింది.
+
+"ఎందుకు? ఏం జరిగింది? వెళ్ళేటప్పడు మామూలుగానే వుందే."
+
+కొద్దిసేపటి క్రితమే రామారావు వచ్చి భాగ్యలక్ష్మితో నీళ్ళు ఎందుకు పంపించేరని అడిగిన మాట గుర్తు వచ్చింది.
+అతడేమన్నా....తన తప్పును కమ్ముకోనేందుకు ముందుకాళ్ళ బంధంలా ఆ మాట అనలేదుగదా అనిపించింది.
+
+"అదే అడిగేసరికి భళ్ళున ఏడ్చేసింది."
+
+"ఎందుకంటుంది?"
+
+"రామారావు మీద దానికి....వెర్రి మమకారం."
+
+సుశీల వులిక్కిపడింది. తన అంచనా తప్పన్నమాట.
+
+"అదేమిటే....ఆయనకి పెళ్ళి స్థిరపడింది కాదటే...."
+
+సుపర్ణ ఏమీ అనలేదు.
+
+"మీది పొరపాటేమోనే....అతనంటే దానికేమాత్రం గౌరవం లేదు."
+
+"నీకు తెలియదు, అదో పెద్దకథ."
+
+సుపర్ణ ఆ కథనంతనూ చెప్పలేదు. కాని, అసలు విషయం చెప్పింది.
+
+"మా అమ్మా, నాయనమ్మా అంటే అతనికి పరమ అసహ్యం. వాళ్ళకి అతనంటేనూ అంతే. భాగ్యలక్ష్మి ఆశ విఫలం కావడానికి మూలం
+అదే. దానికి అతడు తప్ప మరెవ్వరూ ఆనరు. ఆ విషయం తెలియబరిచే పధ్ధతినది ఎరగదు. ఫలితంగా దాని పరిస్థితి
+తెలియకుండానే అతడు చెయ్యి జారిపోయేడు."
+
+"చిత్రమేనే."
+
+"నే నెరుగుదును."
+
+"ఎరిగినదానివి సర్దుబాటు చెయ్యడానికి నువ్వెందుకు ప్రయత్నించేవు కావు? ఈ పరిస్థితినింతదాకా ఎందుకు రానిచ్చేవు?" సుపర్ణ
+ఒక్క నిముషం ఆలోచించింది.
+
+"దాని స్థితి నాకు అర్ధం అయ్యేసరికి రామారావుకు సలహా ఇవ్వగల స్థితి లేకుండా పోయింది."
+
+"మీ నాన్నగారికి...."
+
+"ఆయనకి తెలియదు. తెలిసినా ఏమీ చెయ్యగలిగి వుండేవారు కాదు."
+
+"నువ్వేదో దాస్తున్నావు. రామారావుకి యీ సంబంధం కుదర్చడంలో మీ నాన్నగారి పాత్ర చాలా వుంది. నాకు తెలుసు. కూతురు ఆలోచన
+తెలిసివుంటే ఆయన ఎందుకల్లా చేస్తారు?"
+
+సుపర్ణ దానికేమీ సమాధానం ఇవ్వలేదు.
+
+"అతనికా పెళ్ళేదో జరిగిపోతే బాగుండిపోను. ఇంకెల్లాగూ లాభం లేదని అదే సర్దుకొనేది."
+
+"ఒక్కటి చెప్పు. భాగ్యలక్ష్మి మనస్సు తన మీద వున్నదని రామారావుకి తెలుసా?"
+
+"చెప్పలేను. చెప్పలేను."
+
+"తెలిసి మాత్రం ఏం లాభం? ఆయనకు ఇష్టం వుండాలి కద!"
+
+"ఆ మాట దానికి నచ్చచెప్ప గలిగితే ఇంకేముంది? నీకేమన్నా సాధ్యమేమో ప్రయత్నించు."
+
+
+
+
+పధ్నాలుగో ప్రకరణం
+
+
+సుపర్ణ నెమ్మదిగా మేడమీదికెళ్ళి తండ్రి గదిలోకి తొంగి చూసింది. చుట్టపొగల మధ్య, చీకట్లో, కిటికీ దగ్గర, నిర్వికల్ప
+సమాధిలో వున్నాడాయన. ఒక్క నిముషం తటపటాయించింది. కానీ, ఏదో నిర్ణయానికి వచ్చినట్లు గదిలో అడుగు పెట్టింది.
+
+"ఇంత ఉక్కలో, ఈ పొగలో ఎల్లా కూర్చున్నారు? ఫాన్ అయినా వేసుకున్నారు కాదు." అంటూ ఆమె స్విచ్ వేసింది. వెలుతురు
+వెల్లువలో కళ్ళు చికిలిస్తూ సత్యనారాయణ నవ్వేడు. సమాధిలోంచి లేస్తూ "ఔను సుమా!"
+
+"ఏమిటి చదువుతున్నారు?"--అంటూ సుపర్ణ కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుంది.
+
+"ఈవేళ మీ అల్లుడుగారు ఉత్తరం రాసేరు."
+
+"నాకూ వ్రాసేరు. అదే ఆలోచిస్తున్నా."
+
+"అమ్మ వాయిదా వేస్తూంది...."
+
+"ఏమంటుంది?"
+
+"ఎదురుగా దసరాలు పెట్టుకుని ఇప్పుడు ప్రయాణమేమిటంటుంది."
+
+"ఇప్పుడెక్కడ దసరాలు. ఇంకా జూలై కూడా వెళ్ళలేదు."--అన్నాడు సత్యనారాయణ ఆశ్చర్యంగా.
+
+"ఔను."
+
+"నువ్వేమనుకుంటున్నావు?"
+
+"ఆయనకి కోపం వస్తుంది."
+
+"ఆయనకి కోపం వస్తుందని బాధా? మొగుణ్ణి వదిలి వుండటం బాధా?" అంటూ, పెత్తల్లి కాంతమ్మ తుఫానులా గదిలో ప్రవేశించింది.
+
+"మగడిదగ్గరకెళ్ళడం అపరాధమన్నట్లు మాట్లాడతారేమండి?"
+
+"దసరాల పేరు చెప్పి ఇప్పటినుంచీ మఠం వెయ్యమంటావేమిటి? ఆనాటికి మళ్ళీ రావచ్చు"--అంది సుపర్ణ ఖండితంగా.
+
+"అదే బాగుంటుందని నా అభిప్రాయం"
+
+కాంతమ్మకు మరిది మీద మహా కోపం వచ్చింది. "సంసారం అంటూ చేసేవు గనక పిల్లలు పుట్టేరు. అంతకి తప్ప నీకు ప్రేమా, పేగూ
+అంటూ వున్నాయా? వుంటే నువ్వే దానిచేత ప్రయాణం కట్టిస్తావా?" అంటూ వచ్చినంత దూకుడుగానూ వెళ్ళిపోయింది, కాంతమ్మ.
+
+"వాళ్ళగొడవే వాళ్ళది. ఏమీ అర్థమయి చావదు"--అని విసుక్కున్నాడు, సత్యనారాయణ.
+
+"మీరు కూడా అమ్మతో చెప్పండి."
+
+వదినగారి మాట విన్నాక భార్య ధోరణి ఎలా వుంటుందో సత్యనారాయణ వూహించగలడు. ఆయన వ్యాపారానికి మూలధనం వాళ్ళ ఇద్దరి
+ఆస్తీ. ప్రతి విషయంలోనూ, వారామాట మరిచిపోకుండా చూస్తుంటారు. వాళ్ళని ఏమాత్రం కాదన్నా అరికాలి కింద మంటలు పెట్టేస్తారు.
+తెలుసును. కాని, కూతురుకు సాయం ఇవ్వాలి. ఆలోచించేడు.
+
+"నేను వెడతాను." అంది, సుపర్ణ.
+
+"నిలబడవలసింది నువ్వు."
+
+ఆ మాటలో ఇదివరలో అతిముఖ్యమైన మరో విషయంలో నిలబడలేకపోయావన్న అర్ధం ధ్వనించి సుపర్ణ గమ్మునై పోయింది.
+సత్యనారాయణ మాట మార్చేడు.
+
+"పాప మాట వినబడదేం?"
+
+"పడుకుంది."
+
+"ఇప్పుడా? ఎటూ కాని వేళ."
+
+"అల్లా సుశీలని చూసి వద్దామని వెళ్ళివచ్చేసరికి పడకేసేసింది."
+
+"రామం వున్నాడా?"
+
+"లేడు. ఏ హోటలులోనో భోంచేసి, ఏ పదింటికో ఇల్లు చేరుతాడట."
+
+"వాళ్ళమ్మ లేదు కాబోలు."
+
+"ఉహు."
+
+ఒక నిముషం ఊరుకుని సుపర్ణే ప్రారంభించింది.
+
+"ఎం తకాలం ఈలా అవస్థలు పడతాడు? సంబంధం కుదిరి అన్నీ నిశ్చయమయ్యాక కూడా ఈ నాన్పుడు ఎందుకు? ఆ పెళ్ళేదో
+చేసుకోమనండి."
+
+ఆమె ఆ ప్రసక్తి తేవడం సత్యనారాయణకు ఆశ్చర్యం అనిపించింది. సుపర్ణ ఒక దశలో రామారావును పెళ్ళి చేసుకోవలసింది. అది
+ఆమె పట్టుదలే కూడా. ఆ రోజుల్లో రామారావు తమ యింట్లోనే వుండి, కాలేజీలో చదువుకుంటున్నాడు. యిద్దరిదీ ఒకే తరగతి, ఒకే
+వయస్సు. వాళ్ళు పెళ్ళి చేసుకుంటామనడం తనకు ఇష్టమే. డబ్బులేక తన యింట వుండి చదువుకొంటున్నా సత్యనారాయణకు రామారావు
+మీద వెర్రి మమకారం వుంది. కుర్రవాడు. తెలివి గలవాడు. మంచితనం వుంది. చూపరి. ఆరోగ్యవంతుడు. అవన్నీ చూసే, స్కూల్
+ఫైనల్ తో చదువు మానెయ్యకుండా తీసుకొచ్చి యింట పెట్టుకున్నాడు. పైకి చదివించేడు. అతడు తనకు అల్లుడు కావడం అప్రతిష్ఠగా
+తోచలేదు, సత్యనారాయణకి.
+
+కాని భార్య మంగమ్మ, వదిన కాంతమ్మ, వారితోపాటు తన తల్లి పిచ్చమ్మ కూడా ఆ సంబంధాన్ని మెచ్చలేదు. రగడ
+ప్రారంభమయింది. చివరకు ఆ యిల్లు వదిలేసి, చదువు పూర్తికాగానే రామారావు వుద్యోగం వెతుక్కున్నాడు. ఎం. ఏ. చదవడానికి
+సాయం యిస్తానన్నా నిరాకరించేడు. సుపర్ణ తల్లినీ వాళ్ళనీ ఏమార్చడం కోసం పోయి యూనివర్సిటీలో చేరింది. అది పూర్తి చేసుకు
+వచ్చి రామారావును పెళ్ళి చేసుకుందామనే ఆమె వుద్దేశ్యం.
+
+కాని, రెండేళ్ళయేసరికి ఆమెకు యింకా ఆ ఆసక్తి మిగలలేదు. అక్కడే బి. యల్. చదువుతున్న యువకుడు పరిచయం అయ్యేడు.
+అతడు ఐ. పి. యస్.కు సెలక్టు కావడం చేత యింట్లో వాళ్ళకి అభ్యంతరం కాలేదు. పెళ్ళయిపోయింది. అటు తర్వాత ఆమె ఏదో
+తప్పు చేసినట్లు రామారావును తప్పించుకు తిరుగుతూంది.
+
+ఆమెయే ఈవేళ రామారావు పెళ్ళి ప్రసక్తి తేవడం ఆశ్చర్యమనిపించింది.
+
+"ఇప్పుడా మాట ఎందుకొచ్చింది?"
+
+ఏమని చెప్పాలో సుపర్ణకి అర్ధం కాలేదు. చెల్లెలి మాట చెప్పడమా? కాని ప్రయోజనం ఏమిటి, గొడవ తప్ప? వద్దనుకుంది.
+యింక ఏదో ఒకటి చెప్పాలి.
+
+"అతని వుద్యోగం పోయిందట."
+
+"రిట్రెంచిమెంటా?"
+
+సుపర్ణ తల తిప్పింది.
+
+"బాగా పని చేస్తాడనీ, పిల్లలు అతని యెడ అభిమానంగా వుంటారనీ నాలుగు రోజుల క్రితమే కాలేజీ కమిటీ ప్రెసిడెంటు అన్నారే."
+
+"మన దేశంలో సమర్ధతా, మంచితనం ఉద్యోగార్హతలు కావు నాన్నగారూ!"
+
+"నీకీమాట ఎవరు చెప్పేరు?"
+
+"సుశీల."
+
+"నిజమే అయివుంటుంది." అన్నాడు సాలోచనగా...."అభిమానపడి పై చదువు మానుకున్నాడు. లేకపోతే....సరిలే. ఈ ముండా కాలేజీ
+వుద్యోగం లేకపోతే బతకలేడట. నోట్లో అక్షరమ్ముక్క వున్నవాడు. ఇది కాకపోతే మరొకటి."
+
+సుపర్ణ ఏమీ అనలేదు. సత్యనారాయణకి అప్పుడు గుర్తుకు వచ్చింది.
+
+"లంఖణాల్లో మనుగుడుపులన్నట్లు వుద్యోగం పోయి అతడుంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోమనడం ఏమిటి?"
+
+"ఆ అభ్యంతరం అందరికీ చెల్లవచ్చు. కాని అతని విషయం వేరు."
+
+"ఏమిటో."
+
+"ఈ బి.ఏ.తో అతనికి వుద్యోగం దొరకడం మాటలు కాదు. ఏదో దొరికినా ఆ వచ్చే డబ్బులతో, పెరుగుతున్న ధరలతో అతని
+కడుపు నిండదు."
+
+"చెప్తే విన్నాడు కాదు...."
+
+"పోనీండి. అతనికి కొన్ని అభిమానాలున్నాయి."
+
+కూతురు చెప్పదలచుకొన్నదేదో స్పష్టంగా చెప్పడం లేదనిపించింది.
+
+"చేతిలో నాలుగు రాళ్ళుంటే పోయి చదువుకోమందాం. తక్కువైతే ఇద్దాం. అంతేగాని ఇప్పుడే పెళ్ళి తగులాటం పెట్టుకోమనడం ఏం సబబు?"
+
+"డబ్బు మీరిస్తారు. ఇదివరకే చెప్పేరు. కాని, మనిషికి పట్టుదలా, అభిమానమూ, వాటినేం చేస్తారు? ఈ స్థితిలో అతని
+చదువుకు పెళ్ళొక్కటే మార్గం."
+
+"అతడు కట్నం తీసుకోనంటాడు కద!"
+
+"అందుకే పెళ్ళి."
+
+సత్యనారాయణకు అందులో వున్న మెలిక అర్థం కాలేదు. సుపర్ణే వివరించింది.
+
+"అతనికి ప్రథానం అయిన అమ్మాయికి వాళ్ళ నాన్నగారు నాలుగెకరాలు యిచ్చేరన్నారు కాదూ?"
+
+"ఊ. ఇస్తానన్నాడు."
+
+"ఆమె కూడా మొన్న మార్చిలో బి. ఎస్. సి. అయింది. ఇద్దరూ వెళ్ళి యూనివర్సిటీలో చేరుతారు. కావాలని కోరుకున్న వాడు
+కదా. తండ్రి యిచ్చేదాంట్లో రెండెకరాలు అమ్మితే కనీసం యిరవై వేలు వస్తాయి. మొగుడూ, పెళ్ళాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి
+చేసుకోడమే కాదు. డాక్టరేట్ చేయాలనుకొన్నా కొంత దూరం ఈడుస్తుంది."
+
+కూతురు ఆలోచన బాగానే వున్నదనిపించింది.
+
+"కాని, ఒప్పుకుంటాడా?"
+
+"మీరు నచ్చచెప్పడంలో వుంటుంది. అభిమానం వుండడం మంచిదే. కాని, అది మూర్ఖత్వం కాకూడదు."
+
+సత్యనారాయణ సాలోచనగా తలవూపేడు.
+
+
+
+
+పదిహేనో ప్రకరణం
+
+
+అలారం గణగణలాడుతూంటే రామారావు వులికిపడి లేచేడు. నాలుగయింది. అనేక ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మనస్సుకి విశ్రాంతి
+లేదు. నిద్ర పోయినట్లే అనిపించడం లేదు. కాని తప్పదు. పాల సప్లయిదార్లు హోటలు వాళ్ళని లొంగదీయడం కోసం ఊళ్ళోవాళ్ళ
+మీద సమ్మె ప్రారంభించేరు. రోజూ నారాయణ తన ఇంటికి పంపే పాలతో తనకూ పంపుతున్నాడు. నిన్నటి నుంచి వాళ్ళ యింటికే పాలు
+లేవు. వారితో పాటే తనకూ లేవు. ఇంక తనతో పాటు వాళ్ళ కోసం కూడా గవర్నమెంటు పాలబూత్‌కు పోవాలి. ఆ క్యూలో
+గంటో, అరగంటో నిలబడవలసిందే. తప్పదు. లేచేడు.
+
+తీరా పాలబూత్‌కు వెళ్ళేసరికి అక్కడ విచిత్రమైన దృశ్యం కనబడి తెల్లబోయేడు. బూత్ ముందు మూడు నాలుగు గజాల దూరం
+వరకూ ఓటి డబ్బాలూ, సీసాలూ, చిన్న పెద్ద రాళ్ళూ వరసగా పేర్చివున్నాయి. పెద్దవాళ్ళంతా ఒక చోట చేరి కబుర్లు
+చెప్పుకొంటున్నారు. కుర్రవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి గొడవ చేస్తున్నారు. "ఇవన్నీ ఏమిటి?"
+
+అవన్నీ క్యూలో నిలబడవలసిన వాళ్ళ ప్రతినిధి స్వరూపాలని చెప్పి డాక్టరు చలపతిరావు పక్కున నవ్వేడు.
+
+"రాత్రి పదిగంటల వేళ కనకయ్యగారు వచ్చి, ఒక స్టీలు పాత్ర పెట్టి పొద్దిటి క్యూలో తన స్థానం నిరుకు
+చేసుకున్నాననుకున్నారు. కాని, తెల్లవారగట్ల వచ్చి చూసుకొనేసరికి గిన్నె లేదు. దానితో ఆయన స్థానమూ పోయింది. అప్పటినుంచీ
+వచ్చిన వాళ్ళంతా తమ కోసం, తమ మిత్రుల కోసం ఆ విధంగా స్థానాలు నిరుకు చేసుకుంటున్నారు."
+
+రామారావు నవ్వేడు. అయితే ఆ సమస్య అంత సులభం కాదు. ఆ సీసా ఎవరిది? ఈ రాయి ఎవరిది? తనదేనని ఒకడంటే
+కాదనడానికి సాక్ష్యం ఏమిటి?
+
+ఇదో కొత్త బెడద. డాక్టరుకూ, అక్కడే ఉన్న మరో పదిమందికి ఏమీ తోచలేదు. ఆ రాళ్ళన్నీ పాత్రలయి ముందుకు నడుస్తే
+చివరనుండే తమకు పాలు రావు.
+
+"అరలీటరు కన్న ఎక్కువ ఎవరికీ పొయ్యరనేసరికి ప్రతి మనిషీ నాలుగైదు గిన్నెలతో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళకి
+పట్టుకెళ్ళాలన్నారు. ఎవరికి కావలిస్తే వారే వస్తారనీ, రావాలనీ ఆ సహకారబుద్ధిని భగ్నం చేశాం. మళ్ళీ ఇప్పుడిదో
+బెడద." అన్నాడు డాక్టరు.
+
+"సరిపడేంత సరుకు వచ్చేవరకూ ఈ బెడదలు తప్పవు." అన్నాడు రామారావు.
+
+"అయ్యా! వూళ్ళల్లో పాలు లేకనా? ఎవరికి వాళ్ళే మింగుడుగాళ్ళుగా తయారయ్యారు. లంచాల కోసం పాలు కలెక్టు చేసేవాళ్ళు మీటరుకి
+రావడం లేదని రైతుల్ని ఏడిపిస్తూంటే వాళ్ళు పాలు పొయ్యడం మానేసేరు. లేకపోతే ఈ దరిద్రం ఏమిటండి?" అన్నాడు, కనకయ్య.
+
+పాల కలక్షన్ కేంద్రాలలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎంతోసేపు సాక్ష్యంమీద సాక్ష్యం విన్నా, ఇక్కడ వోటి సీసాల,
+డబ్బాల యజమానుల్ని గుర్తించడం ఎల్లాగో ఎవరికీ తేలలేదు.
+
+"ఇంకా పాలు రాలేదు కదా. అప్పుడే తేలుతుంది, చూద్దాం." అన్నాడు, డాక్టరు.
+
+మరో పదినిమిషాల్లోనే తేలిపోయింది.
+
+దూరంలో లారీ హెడ్‌లైట్లూ, మోతా వినిపించినట్లయింది. అంతవరకూ ఆడుకుంటున్న కుర్రాళ్ళంతా బర్రున వచ్చేసేరు.
+డబ్బాలూ, సీసాలూ గుర్తించడంలో పేచీ వచ్చింది. ఆ తోపులాటలో అన్నీ చెదిరిపోయాయి. కొన్ని వందలున్నాయనిపించిన రాళ్ళ స్థానంలో
+పదిహేను ఇరవయిమంది వున్నారు. వాళ్లంతా ఒకరినొకరు అత్తుకొని నిలబడ్డారు. తోసుకుంటున్నారు.
+
+"ఒరేయి కుర్రాళ్ళు. మీ గిన్నెలు ఎక్కడికీ పోవుగాని, అక్కడుంచి దూరంగా నిల్చోండి. వరసగా వెళ్ళి తెచ్చుకుందురుగాని."
+
+రామారావూ, మరో యిద్దరు ముగ్గురూ కలిగించుకుని, చెప్పి, బలవంతపెట్టి గిన్నెలు కింద పెట్టించడం మహాకష్టం అయింది. గిన్నెలు
+క్రింద పెట్టేరుగాని వాని పక్కన కాపలాగా తాము నిలబడవలసిందేనన్నారు. తమ గిన్నె స్థానం మారుతే?
+
+కాని, గిన్నెకు సరిపడిన చోటు మనిషికి చాలదు. తోసుకుంటారు. ఆ గలాభాలో గిన్నెలు తన్నేసుకుంటారు. మళ్ళీ వానిని యథాస్థానంలో
+వుంచాలి. కాని, దేని తరవాత ఏది?
+
+ఇప్పుడదే జరిగింది.
+
+"ఇది నా చోటు" అంటున్నాడు ఒకడు.
+
+"వీడు నా తరవాత వచ్చేడు" అంటాడు రెండోవాడు.
+
+తన్నుకుంటున్న ఇద్దర్నీ చెరోచేత్తో పట్టుకొని రామారావు గుంపులోంచి వారిని బయటకు తెచ్చేడు.
+
+"మీ గిన్నెలు ఏమీ అవవు. కూర్చోండి. బుద్ధిగా."
+
+కాని, వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాలేదు. గిజాయించుకొంటూంటే కోప్పడ్డాడు.
+
+"మీరు గొడవ మానకపోతే మీ గిన్నెలు చివర పెట్టేస్తాం." అని బెదిరించేడు, డాక్టరు.
+
+"ఎందుకు పెడతావేం?"
+
+ఆ ఏకవచన ప్రయోగానికి డాక్టరు కంగు తిన్నాడు.
+
+"రెండుచ్చుకోండి, మహా ఎగురుతున్నాడు"--అని రంగాచారి టీచరు సలహా యిచ్చేడు.
+
+ఆ గొడవా, గంద్రగోళం, గిజాయించుకోడం, ఎదిరించడం చూస్తూంటే రామారావుకు చిరచిరలాడుతూంది. ఒక్కటుచ్చుకోవాలనిపించింది. కాని,
+నిగ్రహించుకున్నాడు. శిక్షణ మంచిదా, చెడ్డదా అన్న సందేహం కాదు. అది తేలేదీ, చచ్చేదీ కాదు. పెద్దవాళ్ళు వచ్చిపడతారు.
+కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. అదీ భయం. అందుకు నిగ్రహం.
+
+అయితే ఇక వానిని పట్టుకోలేదు. వదిలేసేడు. వానితో రెండోవానినీ వదిలేసేడు.
+
+"తేల్చుకోండిరా, బాబూ! తేల్చుకోండి. మీ బాబులు ఇంట్లో ఏమన్నా మిగుల్చుకున్నారేమో హాస్పిటళ్ళకీ, డాక్టర్లకీ పోద్దురుగాని"
+
+"మీ బాబు ముల్లె దాచిపెట్టేవు--" అంటూ ఆ కుర్రాడు ఎదుర్కొనే సరికి అంతా తెల్లబోయేరు.
+
+"ఈ కాలం కుర్రాళ్ళని కదిలించి లాభం లేదు"--అన్నాడు, కనకారావు.
+
+"ఎవరి బుల్లోడేం?" అని ఆడాళ్ళలో చర్చ.
+
+వ్యవహారం ముదురుతున్నదని గ్రహించి మిగతా కుర్రవాళ్ళు గప్‌చిప్‌గా సర్దుకొన్నారు.
+
+తన ఎదుర్కోలుతో అంతా సద్దుమణిగినట్లుండడం ఆ కుర్రవానికి ధైర్యం ఇచ్చింది.
+
+"నా గిన్నె ఇక్కడ కాదు. నా సీసా ఇంకా చాలా ముందు పెట్టుకున్నాను"
+
+--అంటూ ముందుకు బయలుదేరేడు.
+
+డాక్టరు చలపతిరావు మండిపడుతున్నాడు. ఒక్క కేక పెట్టాడు. "ఆ"--
+
+ఆ కేకకు కుర్రవాడు నిలబడిపోయేడు.
+
+"వెళ్ళు చూస్తా. నువ్వూ, నీ గిన్నే కూడ ఈ చుట్టుపక్కలుండరు."
+
+కుర్రవాడు ఆ కంఠస్వరం విని హడలిపోయేడు. దిక్కులు చూసేడు. అంతక్రితం అందరూ నిశ్శబ్దంగా తన వీరత్వాన్ని
+మెచ్చుకున్నారనుకొన్నాడు. వాళ్ళు ఇప్పుడూ నిశ్శబ్దంగానే వున్నారు. ఒకరి ముఖంలోనూ మెచ్చుకోలు కనబడలేదు. అభిమానం వేసింది.
+నిలబడ్డపాటున ఏడ్చేసేడు.
+
+రామారావు వాని భుజంమీద చెయ్యివేసి సముదాయించబోయేడు.
+
+"ఏడుపెందుకు? నీ గిన్నె ఎవరూ తియ్యరులే. కూర్చో."
+
+ఆ ఓదార్పు విరుద్ధ ఫలితం ఇచ్చింది. వాడాతని చేయి విదిలించేసేడు.
+
+"నా గిన్నె తీసేస్తారు. నా కొడుకులు." అంటూ ఏడుస్తూనే పదడుగులు వేసేడు. అవసరమైనంత దూరంలో వున్నట్లు తోచేక బూతులు
+తిడుతూ పరుగు ప్రారంభించేడు.
+
+నలుగురూ నిర్ఘాంతపోయేరు. చెయ్యగలదేమీ లేక ఫక్కున నవ్వేరు.
+
+ఆ నవ్వులు ఆగక పూర్వమే ఆ కుర్రవాని తల్లీ తండ్రీ రంకెలూ, బొబ్బలూ పెడుతూ రంగం మీదికి వచ్చేరు.
+
+"మా వాడి గిన్నె తీసి పారేసిన నా కొడుకు ఎవరు?"
+
+"ఆళ్ళకి పిల్లల్లేరా? మావోణ్ణి కొట్టేడంట! ఆడింట పీనుగెళ్ళ!"
+
+ఈ జంట కవిత్వం చెవిని బడగానే వ్యవహారం ముదిరిందని అంతా గ్రహించేరు. రామారావు ఎదురెళ్ళి "తొందరపడకండ"ని ఆ జంటని
+సముదాయించ బోయేడు.
+
+"ఎవరయ్యా నువ్వూ. తొందరపడ్డామా? కుర్రాడినల్లా కొట్టేస్తే?"
+
+ఆ మనిషి గుర్రం మీద లేడని, మన లోకంలోనే వున్నాడని గ్రహించేక సమస్య కష్టం అనిపించలేదు.
+
+"మీ కుర్రాడు ఏం చెప్పేడేం?"
+
+తన సుపుత్రుడు చెప్పింది ఆద్యంతం అబద్ధమని తేలేక అతడు తెల్లబోయేడు.
+
+"ఏరా?"--అని కొడుకును నిలేసేడు.
+
+"మీరు కుర్రాడి మాట పట్టుకొని దెబ్బలాటకొచ్చేరు. కనుక్కోవలసిందే. కనుక్కుని మరీ హడావిడి చేస్తే బాగుండేది. అలా
+చెయ్యలేదు. మీ అలుసు చూసుకొనే మీవాడు అబద్ధాలు చెప్పగలిగేడు. ఇక్కడ మిగతా కుర్రాళ్ళతో పేచీ పడింది మీవాడు. విడతీస్తే
+నానా కూతలూ కూసిందీ మీ సుపుత్రుడు. అయినా తనని ఎవరో కొట్టేసేరని అమ్మనీ నాన్ననీ సాయం తెచ్చుకున్నాడు. మీరెప్పుడూ
+అతనికా సాయం ఇస్తూనే వున్నారన్న మాట. అందుకే అంత ధైర్యం"--అని రామారావు తండ్రిని నిలేసేడు.
+
+మిగిలినవాళ్ళు ఆడ, మగ కూడ తలోవేపునుంచీ అదే మాటలంటూంటే ఆ పెద్ద మనిషి బిక్కచచ్చిపోయేడు. సిగ్గనిపించింది. ఆ సిగ్గును
+కమ్ముకొనేందుకు కొడుకు మీద పడిపోయేడు.
+
+ఇప్పుడింకో సమస్య. ఆ కోపంతో కుర్రవాడిని చంపెయ్యకుండా నలుగురూ ఆపవలసి వచ్చింది. తండ్రి చేతుల్లోంచి కాపాడడానికి
+కుర్రవానిని తల్లి దగ్గరకు తీసుకుంది.
+
+"పాలు దొరక్క ఇక్కడికి పంపుతే ఈ గొడవలు...."
+
+అక్కడున్న వాళ్ళదే తప్పంటున్నట్లు అనిపించి రంగాచారి వప్పచెప్పేడు.
+
+"మీ పెంపకం సరిగ్గా వుంటే చిల్లర గొడవలు సర్దుకోవచ్చమ్మా!"
+
+"మేం వచ్చిందీ పాలకే."
+
+"మీవాడు చేసిందీ, తిట్టిందీ చాలనట్లు మీరూ, మీ ఆయనా మీ చిట్టినాయనకు సాయం వచ్చేరు"--నలుగురూ నాలుగు వేపులనుంచి అంటూంటే,
+ఆమె తెల్లబోయింది.
+
+"మేము దెబ్బలాటకు రాలేదండోయ్" అంటూ కుర్రవానినీడ్చుకుంటూ భర్త వెనకే వెళ్ళింది.
+
+
+
+
+పదహారో ప్రకరణం
+
+
+ఈ గంద్రగోళానికంతకూ మొదట వినిపించిన లారీ పాల లారీ కాదు. ఇసకో, ఇటికలో పట్టుకొని అది తన దారిన పోయింది. జనం
+మళ్ళీ సర్దుకున్నారు.
+
+ఈ గలభాతో రామారావుకి చిరాకనిపించింది. పొద్దుటే లేచి, తిట్లాటలూ, కొట్లాటలూనా? ఆ మాటకి వస్తే ఒక్క పొద్దుటే నేమిటి?
+రోజంతా తగువులు పెట్టుకోవలసే వస్తూంది. లేకుంటే విస్తట్లోకి అన్నం రాదు.
+
+"ప్రతి చిన్న వస్తువు కోసం తగువులాటే. అడిగిన ఖరీదు యిచ్చి ఎదుటివాళ్ళతోనో, పక్కవాళ్ళతోనో కయ్యమాడితే తప్ప
+పావులీటరు పాలు రావు. రాళ్ళు కలపని బియ్యం దొరకవు. ఛెస్. వెధవ బతుకు."
+
+డాక్టరు చలపతిరావు అంగీకరించేడు.
+
+"ఆనక వెళ్ళి పంచదార కార్డు కోసం రూపాయో, రెండో ముడుపు చెల్లించుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి."
+
+అక్కడ చేరిన వారెవరికీ ఇంకా ఆ గొడవ అందినట్లులేదు. నాలుగు దిక్కులనుంచి ప్రశ్నలు--పంచదార కార్డేమిటి? మార్పించుకోవడం
+ఏమిటి?
+
+డాక్టరు గంభీరంగా నలుగురి ముఖాలు చూసి ప్రారంభించేడు.
+
+"ఏముందీ. నిన్న సాయంకాలం పేషంట్లనెవరినో చూడ్డానికి బయలుదేరబోతూంటే మా గృహదేవత సడెన్‌గా "పంచదారండోయ్" అంది.
+సరే, తప్పుతుందా? తిరిగి వచ్చేటప్పుడు మార్కెటు దగ్గర ఆగి మా షావుకారుని అడిగా. కోటా వచ్చిందట. కాని, ఇవ్వవద్దని
+అధికారుల నుంచి తాఖీదు. ఇప్పుడున్న కార్డులన్నీ రద్దు చేశారట. కొత్తవి తెచ్చుకోవాలి--అన్నాడు. అదేమిటయ్యా అంటే అది
+అంతే నన్నాడు. పత్రికల్లో వెయ్యలేదే అన్నా. తొందరేమిటండి--బాబూ! వేస్తే కాస్త ఊపిరేనా తీసుకోకుండా తెల్లవారేసరికే వచ్చి
+కూర్చుంటారనుకొని వుంటారు. వేస్తారు ఎప్పటికో--అన్నాడు. ఇంతకీ అర్థాంతరంగా ఈ మార్పెందుకు కావలసి వచ్చిందో తెలుసా?"--అని
+నలుగురి ముఖాలూ పరీక్షగా చూసేడు.
+
+"కార్డుకో రూపాయో రెండో వడుక్కోవాలి అనిపించి వుంటుంది."--అన్నాడు రంగాచారి టీచరు.
+
+"అది లోపాయికారీ మాట. పైకి అల్లా చెప్పగలరా? రిక్షా లాగే వాళ్ళూ, అంట్లు తోముకు బతికేవాళ్ళూ సంపాదించుకొన్న పావుకిలో,
+అరకిలో కార్డులు అమ్ముకుంటున్నారుట. అసలు తినేవాళ్ళకి చాలడం లేదట. మనం నష్టపడుతున్నామనీ, మన కోసమే ఈ బాధ
+అంతా...." అన్నాడు, డాక్టరు.
+
+"బద్మాష్‌లు, రిక్షా వాడు టీ తాగడు! వాడికేం అక్కర్లేదు!"
+
+"వేగన్లకు వేగన్లు బ్లాక్‌మార్కెటు చేస్తూంటే అడిగే నాధుడు లేడు. పావుకిలో పంచదార పనిచేసుకు బతికే మనిషి
+అమ్ముకున్నదని నిఘా."
+
+"ఈదో సందులో మిల్లుల వాళ్ళూ, కోటాల వాళ్ళూ, తలా పిడికెడూ పంచుకొంటారు."
+
+ఆ ఊహలకు అంతులేదు. చర్చలకు అంతులేదు. ఎప్పటిలాగే ఇప్పుడూ పాపం ప్రజల సమస్యలు పట్టించుకోడంలేదని రాజకీయ పార్టీల
+మీదకు తిరిగింది.
+
+"ఇది వరలో యిటువంటి పనులకి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పూనుకునేవారు."--అన్నాడు డాక్టరు.
+
+అర్ధోక్తిలోనే అదేం లాభం లేదన్నాడు, రంగాచారి.
+
+"వాళ్ళలో ఎవరు తప్పు చేస్తున్నారో తమ పార్టీ ఏ పనీ చెయ్యకుండా చేతులు ముడుచుక్కూర్చోవలసి వస్తూందో తేల్చుకోవడానికే
+వాళ్ళకి ఎంత టైమూ చాలడంలేదు. ఈ సంగతేదో చూడండర్రా బాబూ అంటే వాళ్ళ పేచీలకు మూలం ఎక్కడుందో మనం వినవలసి
+వస్తూంది...."
+
+"మీరు చెప్పింది చూశారూ....డాక్టరుగారూ! అది బతికున్న రోజులనాటి మాట. జీవత్సు తాతపాదేషు...." అని నిట్టూర్పు
+విడిచేడు రంగాచారి.
+
+అందులో అసత్యం ఎంతో లేదనిపిస్తున్నా తన అభిమాన పార్టీ తిట్లు తినడం రామారావుకు ఒప్పిదం కాలేదు.
+
+"మనం కూడా కదిలితే తప్ప పార్టీలు ఎన్ని పనులకి కదులుతాయి? మనం చేసుకోవలసినవి ఎవరి భుజానికో ఎత్తి వాళ్ళు
+చెయ్యలేకపోయారనడం అందరం నేర్చుకున్నాం." అన్నాడు.
+
+
+
+
+పదిహేడో ప్రకరణం
+
+
+పెద్దవాళ్ళ సమస్యలకి ఏమాత్రం తగ్గవు పిల్లకారు సమస్యలు. వాళ్ళకేసి ఓ చెవి పడేసి వింటున్న రామారావు సంజ్ఞ చేయడంతో
+పెద్దవాళ్ళు తమ సంభాషణ నిలిపేరు.
+
+అందరూ ఒక్కమారు ఊరుకోడం చూసి, "ఏమిటది?"--అన్నాడు కనకయ్య.
+
+పక్కనే డ్రైనేజీ గొట్టాలమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పిల్లవాళ్ళవేపు తల ఎగరేసి, రామారావు మాట్లాడవద్దని సంజ్ఞ
+చేసేడు.
+
+"ఇంకేం లాభం లేదురా. ఈవేళ టి. సి. ల మీద సంతకం పెట్టితే గానీ మేం కదలం, మిమ్మల్ని కదలనియ్యం అని
+కూర్చోవలసిందే...." అంటున్నాడు ఓ కుర్రాడు.
+
+"టి. సి. లు కావలసిన వాళ్ళం వున్నదల్లా ముగ్గురం."
+
+"పెట్టనంటే ముగ్గురం ఏం చేస్తాం?"
+
+"నిన్న క్లాసులో వాళ్ళతో చెప్తే వాళ్ళంతా వొస్తామన్నా"రన్నాడు మొదటి కుర్రాడు.
+
+పత్రికలూ, ప్రభుత్వాలూ, నాయకులూ గగ్గోలుపెట్టి బుడి బుడి దీర్ఘాలు తీస్తున్న "ఘెరావో" బెజవాడలో ప్రత్యక్షం కాబోతూంది.
+
+ఏ కార్మికులదో, వుద్యోగులదో ఆలోచన కాదది. పది పన్నెండేళ్ళ పిల్లలు! పిలక పట్టుకోడానికి సిధ్ధమైతే తప్ప తెమలని
+సమస్యలే వాళ్ళవీ.
+
+"ఏం వొచ్చిందిరా గురునాథం!" అని అడిగేడు కనకయ్య.
+
+"వీళ్ళ నాన్నగారు ఎలక్ట్రిక్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారండి. ఈ మధ్యనే రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారు." అంటూ
+గురునాధం ఒక కుర్రవాడిని పరిచయం చేశాడు.
+
+"ఔనండి, వారం నుంచి టి. సి. కోసం అడుగుతున్నా యివ్వడం లేదండి. మళ్ళీ రాజమండ్రిలో సీటు లేకుండా పోతుందని కూడా
+చెప్పుకున్నానండి."
+
+"ఏమంటారు?"
+
+"కొత్త హెడ్మాస్టరు వచ్చి ఇస్తారంటారండి."
+
+"తానేమయ్యాడు?"
+
+"ఈయన్ని కృష్ణలంక కేశారట. ఇంకా వెళ్ళలేదు. కొత్తాయన రేపే వచ్చినా ఆయన మాత్రం ఇస్తారా? అన్నీ సర్దుకోవాలని
+ఆయన వాయిదా వేస్తారండి."
+
+"ఎల్లాగ? ఔను. అంతా ఒక బడిలో చదువుకున్నవాళ్ళేగా."
+
+ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేకపోయారు. రంగాచారి సూచన చేసేడు.
+
+"మీ నాన్నగారే వెడితే పని జరుగుతుందిరా."
+
+"ఆయన డ్యూటీలో జాయినయిపోయారండి. వూళ్ళోలేరు."
+
+"ఇంత చిన్న పనికి, పనిమాలా ఆయన రాజమండ్రి నుంచి రావాలా!" అని రంగాచారి ఉక్రోశం ప్రకటించేడు.
+
+తాను చేయవలసిన చిన్న పనిని ఎగకొట్టి ఒక సమస్యను సృష్టిస్తున్న హెడ్మాస్టరును నలుగురూ బూతులతో ఆశీర్వదించేరు.
+
+"కుర్రవాళ్ళలో అవిధేయత ప్రబలిపోయిందని ఆ గావుఏడ్పులేడ్చేది ముందు వీళ్ళే." అన్నాడు డాక్టరు.
+
+"ఏడ్చేరు." అనేసేడు, రామారావు బహు నిర్లక్ష్యంగా. ఆ కుర్రవాళ్ళని చూస్తే అతనికి ఎంతో ఆనందమనిపించింది.
+
+"మనకంటె కుర్రాళ్ళు తెలివిగా వున్నామనిపిస్తున్నారు. వాళ్ళకి ఈ ఘెరావో ఆలోచన ఎవరు చెప్పేరు? జీవితం! అవసరం! ఘెరావో
+అంటే ఇదేనని కూడా వాళ్ళెరగరు. వాళ్ళామాటే విని వుండరు. కాని, నీతీ నిజాయితీ లేనివాళ్ళని దారిలో పెట్టేందుకు...."
+
+మాటల సందడిలో దగ్గరకు వచ్చేవరకూ పాల లారీని ఎవ్వరూ గమనించనే లేదు. దాని హోరులో రామారావు మాటలు వినిపించలేదు. అంతా
+గొల్లున లేచేరు.
+
+"డాక్టరుగారూ! లేవండి. క్యూ చెదిరిపోకుండా కాస్త చూద్దాం." అని రామారావు ముందుకొచ్చాడు.
+
+"తప్పుతుందా? మళ్ళీ ఎవరో అమ్మ వచ్చి ఆశీర్వదించేదాకా...." అంటూ డాక్టరు లేచేడు.
+
+క్యూలో మొదటి స్థానం మిగుల్చుకొన్న కనకయ్య ముందుకెళ్ళాడు.
+
+పాలకాన్ లు లోపలికెళ్ళి పదినిమషాలయినా పంపిణీ ప్రారంభం కాలేదు. బడ్డీలో మాటలు వినిపిస్తున్నాయి. ఆడవాళ్ళూ, చిన్నవాళ్ళూ
+కిటికీకేసి ఎగబడుతున్నారు.
+
+విషయం తెలుసుకునేందుకు బూత్ లో కెళ్ళిన కనకయ్య తిరిగి రాలేదు.
+
+దాక్టరు వెళ్ళి వచ్చేడు.
+
+"పాల కాన్లలో పాలు తక్కువ వున్నాయి. కనీసం పది లీటర్లేనా తగ్గినట్లున్నాయి. ముదరా నే నెక్కడిచ్చుకోనని
+ఏడుస్తున్నాడు."
+
+"వాడివ్వడం ఎందుకు?"
+
+"ఇంకెవరిస్తారు? కాన్ లు ఒప్పచెప్పినట్లు సంతకం చేయించుకొని పోయుంటారు." అని రంగాచారి వూహ మీద వివరించేడు.
+
+"ఎల్లా తగ్గుతాయి?" అని మళ్ళీ రామారావు అమాయిక ప్రశ్న.
+
+"ఎల్లా తగ్గడం ఏమిటి స్వామీ! దార్లో ఆఫీసర్ల ఇళ్ళకి తలో రెండూ, మూడూ లీటర్లు పట్టి ఇచ్చేసుండవచ్చు. లేకపోతే
+డ్రైవరూ, లారీతో వచ్చే గుమాస్తా చెరో నాలుగు లీటర్లూ వొంచేసుకోవచ్చు. మన భారతదేశంలో ఎల్లా జరిగిందన్న ప్రశ్నకి అర్ధం
+లేదు." అంటూ డాక్టరు కనుబొమలు ముడేసేడు.
+
+కనకయ్య వచ్చేడు.
+
+"కాన్‌లు యిచ్చినట్లు వాళ్ళు సంతకం చేయించుకు పోయారు. కనక వాళ్ళకింకేం బాధ్యత లేదు. అడంగుని ఎన్ని పాలు
+కాన్‌లో నింపేరో రికార్డు వుంటుంది. పాలు తగ్గినట్లు సాక్ష్యం ఏమిటి? నువ్వే అమ్ముకుని డబ్బులు జేబులో
+వేసుకున్నా"వంటారు.
+
+అంతా దిగాలుపడి కూర్చున్నారు. యింకా పాలపంపకం ప్రారంభమే కాలేదు. ఇళ్ళవద్ద బోలెడు పనులు.
+
+"కొంచెం కొంచెం తగ్గించి పొయ్యమంటే"--అన్నది రంగాచారి సూచన.
+
+"ఖరీదు మామూలుగా తీసుకొనా?"--అని ఒకరు అభ్యంతరం చెప్పేరు.
+
+"అర లీటరు, పావు లీటరులో ఇంకా కొరవా?" అన్నది వేరొకరి అభ్యంతరం.
+
+రామారావు ఒక సూచన చేసేడు.
+
+"కాన్‌లలో పాలు కొలుద్దాం. ఎన్ని వున్నాయో లెక్క వ్రాసి అందరం సంతకాలు పెట్టి ఇద్దాం."
+
+"విచారణ తతంగానికి పనులు మానుకుని పరుగులెత్తుతుండాలి." అన్నాడు డాక్టరు. కాని అంతకు మించి ఆ క్షణంలో చెయ్యగలది
+లేదు.
+
+నలుగురూ ఆ మాట చెప్పి దిలాసా ఇవ్వడానికి బూత్ వేపు కదిలేరు.
+
+
+
+
+పద్ధెనమిదో ప్రకరణం
+
+
+మధ్యాహ్నం సత్యనారాయణ, రామారావు గదికి వెళ్ళేడు. కూతురు చెప్పిన ఆలోచన ఆయన మనస్సుని దొలుస్తూంది. కాని గదికి తాళం
+వుంది.
+
+"రామం వూళ్ళో వున్నాడా అమ్మా!" అంటూ సుశీలను పలకరించేడు.
+
+"రాండి, బాబయ్యగారూ!" అంటూ సుశీల మంచం మీదనే లేచి కూర్చుని అహ్వానించింది.
+
+"ఆయన ఇప్పుడే వీధిలోకి వెళ్ళేరనుకుంటా. ఇంతవరకూ రామలింగేశ్వరరావుగారనుకొంటా....ఆయన కొలీగు--ఇద్దరూ కబుర్లు
+చెప్పుకుంటూ ఇక్కడే వున్నారు."
+
+"ఆహా." అంటూ సత్యనారాయణ సావట్లో అడుగు పెట్టేడు.
+
+"నీ కాలుకి దెబ్బ తగిలిందంది సుపర్ణ. ఎల్లా వుంది?"
+
+"కూర్చోండి బాబూ! పెద్ద ప్రమాదం తప్పిపోయింది." అంటూ మహాలక్ష్మమ్మ లోగుమ్మంలోంచి సమాధానం ఇచ్చింది.
+
+"ఎదో ఆ ఏడుకొండలవాడి దయ. తల్లీ, పిల్లవాడూ పెద్ద దెబ్బలేం తగలకుండా బయటపడ్డారు."
+
+"అంతే లెండి. కాకపోతే మనదేముంది?" సత్యనారాయణ అమోదించేడు.
+
+"దేవుడు తప్ప మనకీ దేశంలో రక్షణ లేదనే నిర్ణయానికి మీరూ వచ్చేరేమిటి బాబయ్యగారూ!" అంటూ సుశీల నవ్వింది.
+
+సత్యనారాయణ తెల్లబోయేడు.
+
+"తప్పు, తప్పు." అంటూ మహాలక్ష్మమ్మ కూతురు అవిశ్వాసానికి తాను లెంపలు వేసుకుంది.
+
+"కూర్చోండి, బాబయ్యగారూ. ఈవేళ భాగ్యలక్ష్మి రాలేదు. ఏం చేస్తూంది."
+
+"నేనూ చూడలేదమ్మా! వాళ్ళ ప్రిన్సిపాల్‌ను కలుసుకోవాలంది. వెళ్ళిందేమో."
+
+సుశీల మాట మారుస్తూ రామారావు వుద్యోగం పోయిన వార్త చెప్పింది.
+
+"ఉన్న చిన్నపాటి వుద్యోగం కాస్తా పోయింది. చాల యిదైపోతున్నారు."
+
+"కాదు మరీ. చదువు తప్ప మరో ఆధారం లేదు. దానికిదీ గతి."
+
+అసలు చదవడమే దండగమారిపని అన్నట్లు అనిపించింది.
+
+"మరీ అన్యాయంగా వుంది మన వాళ్ళ ప్రభుత్వం. చదువుకొన్నవాళ్ళు దేశానికి పెద్ద ఆస్తి. దేశంలో ప్రతి ఒక్కళ్ళకీ చదువు
+వుంటే బాగుంటుందనుకొంటూ రెండోవేపున వున్నవాళ్ళని వుపయోగించుకోలేకపోవడం...."
+
+"గవర్నమెంటు మాత్రం ఏం చేస్తుంది?"
+
+""యావత్తైలం తావద్వ్యాఖ్యానం" చేతిలో వున్న డబ్బును ఖర్చు చేస్తుంది. దానికో పరిమితి వుంది కదా, చేసినంతవరకు ఎక్కువ
+లాభకరంగా వుండేలాగ చూసి చేస్తుంది."
+
+సుశీల అతని వాదాన్ని ఒప్పుకోలేదు.
+
+"ఉన్న డబ్బు అంటారు. డబ్బు వచ్చే వనరులన్నీ ఎవరెవరి చేతులకో వప్ప చెప్పెయ్యడం. అదిచాలదన్నట్లు జనం దాచుకున్న
+డబ్బు కాస్తా వాళ్ళని దోచేస్తున్న వాళ్ళకు వొప్పచెప్తున్నారు. ఇంకా మిగిలితే మనువర్తులు పంచిపెడుతున్నారు."
+
+"అంటే--బాంకులు స్వాధీనం చేసుకోవాలి. వర్తక వ్యాపారాలు చేత పట్టుకోవాలి. మహారాజులకిచ్చే భరణాలు ఆపెయ్యాలి." అంటూ
+అతివాద పార్టీలు దేశ ప్రభుత్వం చేయాలంటున్న పనులను ఎకసక్కెం చేస్తూ సత్యనారాయణ నవ్వేడు.
+
+"ఔను. ఏం చెయ్యకుండా మీ కంట్రాక్టర్లకి బిల్లులు ఎల్లా చెల్లుతాయనుకొన్నారు? ఈ ప్రాజెక్టులు పూర్తవడం ఎల్లాగ?
+ఇంజనీర్లనీ, పనివాళ్ళనీ తగ్గిస్తారు. అవి పూర్తి కావడానికి మరో నాలుగేళ్ళు పడుతుంది. వాటి ఖర్చు ఈవేళ పూర్తయితే
+అయేదాని కన్న రెట్టింపు తేలుతుంది. మీరు ఏం పొదుపు చేసినట్లు?"
+
+సత్యనారాయణ కాంగ్రెసువాది. కంట్రాక్టరు. నాగార్జునసాగరు కాలవల తవ్వకాలతో ఆయనకు కంట్రాక్టు వుంది. రమారమీ మూడు
+నాలుగు లక్షల రూపాయల బిల్లులు రావలసివున్నాయనీ, మనిషి ఆర్థిక ఇబ్బందులలో వున్నాడనీ నిన్ననే సుపర్ణ చెప్పింది.
+
+తన ప్రయోజనం నెరవేరాలన్నా ప్రభుత్వం తను సమర్థించబోయిన పధ్ధతికి భిన్నంగానే వ్యవహరించడం అవసరం. అది అర్థం
+అయినా సత్యనారాయణ ఒప్పుకోలేకపోయేడు.
+
+"వ్యవధి కావాలమ్మా! ఓర్పుండాలి. దేశం ఒక్కరోజులో సర్వసంపన్నం కాగలదంటావా? ఇదేం గారడీయా. కళ్ళముందు సాయిబాబాలా
+బూడిదరాసులు కుమ్మరించడానికి?"
+
+"కాదు. తెలుసు. వ్యవధి కావాలి. సరే. ఎంత? ఓర్పుండాలి. ఎందుకు? మీరు ఏం చెయ్యదలుచుకున్నారు?"
+
+"ఇందిరాగాంధీ చెప్తూంది, అంతక్రితం నెహ్రూ చెప్పేడు. సోషలిజం మా లక్ష్యమని. అందుకే ఈ పని అనీ...."
+
+"ఏది వుద్యోగాలు ఊడపీకడమా? ఇదిగో, బాబయ్యగారూ! గాడిదను చూపించి గుర్రం అనుకోమంటే అమాయకులూ, అజ్ఞానులూ కొంతకాలమేనా
+నమ్ముతారు. కాని ఆ గాడిద మీద కూర్చుని జెట్ విమానంలో ప్రయాణం చేస్తున్నామనుకోమంటే ఎల్లాగ? మీ ఇరవయ్యేళ్ళ సోషలిజం
+సాధన తర్వాత రామారావుగారి వంటి వాళ్ళని వీధిలో పారేస్తుంటే...అది."
+
+"ఏం చెప్తావమ్మా!" అని సత్యనారాయణ నవ్వేసేడు.
+
+"మీరే చెప్పండి. మీరు చెప్పే వోర్పుకి హద్దేమిటి?"
+
+"నిజమే అనుకో."
+
+"ఆయన వంటి స్థితిలోనే వున్న విద్యావంతులు నేటికి దేశంలో కొన్ని లక్షలున్నారు."
+
+"నువ్వెన్ని చెప్పు. కాని ఒక్కటి మరవవద్దు. మన దేశ జనాభా ఎంత? అందులో ఈ నిరుద్యోగుల సంఖ్య ఏపాటిదంటావు."
+
+ఆ లెక్క పధ్ధతికి సుశీల చిరునవ్వు నవ్వింది. వెంటనే సత్యనారాయణ సర్దుకున్నాడు.
+
+"ఒక ఖండమంత దేశం. పెద్ద ఎత్తున జరుగుతున్న పునర్నిర్మాణం. పెద్దవో, చిన్నవో వెనకబాట్లు రాకుండా వుంటాయా? ఆ
+తాత్కాలిక నష్టం, కష్టం చూపించి ఏమీ జరగలేదనడం...."
+
+సుశీల తన తప్పును గ్రహించింది. దేశ సమస్యల్ని వ్యక్తి పరిమితం చెయ్యబోతే వచ్చే ప్రమాదం అది. కాని ఆ వోటమిని ఆమె
+అంగీకరించలేదు. కొన్ని లక్షలమంది బతుకులయెడ కనబరచిన నిర్లక్ష్యాన్ని మాత్రమే గణనకు తీసుకొంది.
+
+"సోషలిజం సర్వత్రా ఏర్పడే అవకాశం వున్నప్పుడు, అందుకోసం ప్రపంచ జనాభాలో సగం మంది చచ్చిపోయినా మా బాగే నన్నాడట
+మావో. మీరయితే కొద్ది లక్షలమంది నిరుద్యోగం మాత్రంతో తృప్తి పడుతున్నారు. పెద్ద చూపూ, చిన్న చూపూ తప్ప తేడా
+ఏమీలేదు."
+
+మావోతో తనను పోలిక పెట్టడం గర్వకారణమనుకోవాలో, అపఖ్యాతి అనుకోవాలో సుశీల స్వరం పట్టి అర్ధం కాలేదు. నవ్వేసేడు.
+
+సుశీల తన ధోరణిలోనే మరో అడుగు ముందుకు వేసింది.
+
+"చచ్చిపోవలసిన జనాభా సగం మందిలో తానూ ఒకడు కావచ్చునని మావో అనుకొని వుంటాడా?"
+
+"ఎవరు మాత్రం అనుకొంటారు? నేనూ, పిల్లలూ బాగుంటే మొగుడు లోకంతోపాటూ--అనే సామెత ఊరకే పుట్టలేదు. ప్రతివారూ తాను
+బతకాలనీ, తాను సుఖపడాలనీ, తనవాళ్ళు బాగుండాలనే కోరుతారు...." అంటూ మహాలక్ష్మమ్మ ట్రేలో డ్రింకు గ్లాసులు పెట్టుకొని
+వచ్చింది.
+
+"మరి బాబయ్యగారు ఎందుకు వచ్చేరనుకొన్నావు. తన వాడి వుద్యోగం పోయిందని విన్నారు. ఆ లక్షల మందిలో ఈయనొకరని
+వూరుకోగలిగేరా? తీసుకోండి బాబయ్యగారూ."
+
+"ఈ ఎండలో వుడుకు కాఫీ ఇవ్వకుండా డ్రింకు ఇచ్చేరు. బాగుంది."
+
+"ఇవ్వాలనుకున్నా కష్టమే"
+
+"మీకూ పాలవాళ్ళ సమ్మె బాధేనా."
+
+"అది ప్రారంభమే మా యింట్లోనండోయ్."
+
+సత్యనారాయణ డ్రింక్ సిప్ చేస్తూ సాలోచనగా అన్నాడు.
+
+"ఎవరు బాధపడుతున్నారన్నా మనస్సుకి ఎల్లాగో వుంటుంది. తప్పదు. మన చేతిలో ఏం వుంది? ఏ ఒక్కడికన్నా సాయపడగలమా?
+వట్టి భ్రమ. సానుభూతి చూపుతాం. చిన్న సలహా యిస్తాం."
+
+"అది మాత్రం ఎంతలో వుంది?" అంది మహాలక్ష్మమ్మ వుదారంగా.
+
+సత్యనారాయణ లేచేడు.
+
+"అతడు రావడం ఆలస్యం కావచ్చు. వచ్చి వెళ్ళేనని చెప్పండి. తీరిక చేసుకుని ఓమారు కనిపించమన్నానని చెప్పండి."
+
+సత్యనారాయణ వెళ్ళిపోయేక మహాలక్ష్మమ్మ కూతురుని కోప్పడింది.
+
+"మనిషి యింటికి వస్తే చాలు మీ రాజకీయాలూ, రగడలూయేనా! ఏం మనుషులర్రా! ఇల్లా తయారవుతున్నారు."
+
+
+
+
+పంధొమ్మిదో ప్రకరణం
+
+
+"మామయ్య ఎందుకో రమ్మన్నారుట. ఇంట్లో వున్నారా?" అంటూ రామారావు హాలులో అడుగుపెట్టేడు.
+
+సోఫాలో కూర్చుని రేడియో వింటున్న భాగ్యలక్ష్మి ఆ పలకరింపు విని ఉలికిపడి తల ఎత్తింది.
+
+"నువ్వా" అంది, ఆశ్చర్యంతో, రేడియో కట్టేస్తూ.
+
+"అయివుంటుంది. నేనేనేమో." రామారావు ఎగతాళి చేస్తూ సోఫాలో కూర్చున్నాడు. భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
+
+"గుర్తు పట్టేవే."
+
+భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది.
+
+"గుర్తు పట్టలేనంతగా కళ్ళు మూసుకుపోలేదు--" అంటూ చర్రున లేచింది.
+
+"రక్షించేవులే. కూర్చో."--అని ఆమెను చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టేడు.
+
+"నన్ను గురించి మీ ప్రిన్సిపాల్ కు ఎన్నో అబధ్ధాలు చెప్పేవుట. ఎన్నో ఆరోపణలు చేసేవుట. ఏమవసరం వచ్చింది."
+
+అతని కంఠస్వరం విని భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
+
+"నేనా?"
+
+"ఎవరు రామం?"--అంటూ సుపర్ణ హాలులోకి వచ్చింది.
+
+రామారావు కంఠస్వరం వెంటనే మారింది. స్నిగ్ధంగా చూస్తూ--థేంక్స్--" అన్నాడు. సుపర్ణ వేపు తిరిగి "మామయ్య
+లేరా!"--అన్నాడు,
+
+"వస్తాడు కూర్చో."
+
+"ఎందుకీవిడగారు కోపంగా ఉన్నారు?"--అన్నాడు కన్నెగరేస్తూ.
+
+"నేనేం కోపంగా లేను."
+
+సుపర్ణ చిరునవ్వుతో మాట దాటించ ప్రయత్నించింది.
+
+"రిట్రెంచిమెంటు కత్తిరింపులో నువ్వూ పడ్డావుట కాదూ.’"
+
+ఆ మాటకు సమాధానంగా రామారావు భాగ్యలక్ష్మిని ఆట పట్టించేడు.
+
+"అయితే నీ కోపం కాలేజీ కమిటీ మీదనన్నమాట! బాగుంది. థాంక్స్."
+
+భాగ్యలక్ష్మి చర్రుమంది.
+
+"నీకుద్యోగం వుంటే నా కొరిగేదీలేదు. పోతే తరిగేదీలేదు."
+
+"ఓహో, అలాగునా. అంత నిర్మమత్వం ఉన్నదానివి నాకు వుద్యోగం ఇమ్మని ఆవిడతో ఎందుకు సిఫార్సు చేసేవు."
+
+అతని కళ్ళు నవ్వుతూంటే భాగ్యలక్ష్మి ఉడుక్కుంది.
+
+"నేనేం నీకోసం చెప్పలేదు. ఆ మధ్య లెక్కల టీచరు కావాలనుకున్నారు. తమరు ఖాళీ అయ్యేరు ఉన్నారు, చూసుకోండి--అన్నాను,
+అంతే."
+
+"అందుకే థాంక్సు అన్నాను, మరి కోపం చేస్తావేం."
+
+"నాకేం థేంక్సు చెప్పక్కర్లేదు," అంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
+
+"దానినల్లా రెచ్చగొడతావెందుకు?"--అని సుపర్ణ గదిమింది.
+
+"థేంక్సు చెప్తే కోప్పడుతూంది. చూడు, నేనేం చెయ్యను."--రామారావు అసహాయత నటిస్తూ నవ్వేడు.
+
+"నీకు నవ్వెల్లా వస్తూంది?"
+
+"నీతో ఎట్లా మాట్లాడగలుగుతున్నాను?" అంటూ ఆమె ముఖం వంక చూసేడు, సుపర్ణ గమ్మునైపోయింది.
+
+"దేనిమీదనూ పెద్ద మమకారం పెంచుకోకూడదు సుపర్ణా! బతకలేం. అంటీ ముట్టనట్లుంటే తప్ప మనశ్శాంతి సాధ్యం కాదు."
+
+"పెద్ద వేదాంతివయ్యేవు"--అంది సుపర్ణ చెల్లెలు వెళ్ళినవేపే చూస్తూ.
+
+"జీవితం! సుపర్ణా! జీవితం"--అన్నాడు, జీవితాన్నంతనూ వాడి వడపోసినంత గంభీరంగా.
+
+"మరిప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు"
+
+"నిజం చెప్పమంటావా? ఏమీ చెయ్యాలనిపించడం లేదు."
+
+"మరి?"
+
+"ఈ నాలుగేళ్ళ సంపాదనలో మిగిలించింది పదిపన్నెండు వందలుంది. అదయిపోయే లోపున ఏదో ఒకటి తోచక పోతుందా యని ధైర్యం!"
+
+సుపర్ణ దిగ్భ్రమ చెందినట్లు చూచింది.
+
+"చాలా పెద్ద మొత్తమే!"
+
+"నా బతుక్కి అదేమంత చిన్న మొత్తం కాదు. కూర్చుని తింటే నాలుగైదు నెలలు నిరాఘాటంగా సాగిపోతుంది. తరవాత చూద్దాం."
+
+"నాలుగు అయిదు నెలలే మన జీవితావధి అన్నట్లు మాట్లాడుతున్నావు."
+
+"మనదేశపు సగటు ఆదాయం లెక్కన అది ఒక మనిషికి నాలుగైదేళ్ళ ఆదాయం తెలుసా? లేకపోతే నలుగురి సంవత్సరాదాయమన్నా
+అనవచ్చు."
+
+"ఈ కష్ట దినాలలో ఒక్కరు నలుగురి ఆదాయాన్ని జేబులో వేసుకోకూడదు. పాపం"--అంది సుపర్ణ ఎగతాళిగా.
+
+"అన్యాయమే. అందుకే సోషలిజం స్థాపనకు నాందిగా ప్రభుత్వం నాబోటిగాళ్ళని ఉద్యోగాల నుంచి స్వస్తి చెప్పింది."
+
+ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దం అయిపోయేరు. లోపలినుంచి మంగమ్మ వచ్చింది. కూతురు కబుర్లేసుకున్న వ్యక్తిని చూసేక ఒక్క
+క్షణం మొగం వివర్ణం అయింది. అంతలో సర్దుకుని ఆప్యాయంగా పలకరించింది.
+
+"ఎంతసేపయిందయ్యా వచ్చి? ఎక్కడా కనపడ్డమే మానేశావు." అంటూ తానో కుర్చీ లాక్కుని కూర్చుంది.
+
+"అదేమిటే సుపర్ణా! వచ్చిన పెద్దమనిషికి కాఫీయేనా ఇస్తావా. కబుర్లు చెప్పి పంపేస్తావా?"
+
+ఆమె ముఖ్యమైన అభ్యంతరం కాఫీ ఇవ్వకపోవడం కన్న, కూర్చోబెట్టి కబుర్లు చెప్పడమేనని ఇద్దరూ గ్రహించేరు. సుపర్ణ
+లేచింది.
+
+"నాన్నగారు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళేరు. నువ్వొస్తే ఉండమని చెప్పమన్నారు. వెళ్ళిపోకు."
+
+"అల్లాగేలే."
+
+సుపర్ణ వెళ్ళిపోయేక మంగమ్మ అడిగింది.
+
+"ఏం కథ?"
+
+"తెలియదు".
+
+మంగమ్మ ఆ మాట నమ్మలేదు కాని పైకి తేలలేదు. లోకాభి రామాయణం వాడేసింది. రెండు మూడు నిముషాల లోపల సుపర్ణ మగడు పెద్ద
+వుద్యోగస్థుడనీ, బాగా సంపాదిస్తున్నాడనీ అతని దృష్టికి తెచ్చింది.
+
+"ఆయన్ని నువ్వు చూడనే లేదనుకుంటా."
+
+"లేదు. పెళ్ళి నాటికి నేను వూళ్ళో లేను."
+
+"మనం ఆ పేరు చెప్తేనే హడలి చచ్చే సబినస్పెక్టర్లూ, సర్కిలినస్పెక్టర్లూ ఆయన ఎదట అగ్గగ్గలాడుతూ నిల్చుంటారు. ఆ
+భోగం చెప్పలేం. ఏమయినా అను. ఆడదానికి అదృష్టం ఉండాలి, అనుకో."
+
+మంగమ్మ ఆ ప్రసంగం ఎందుకు తెచ్చిందో రామారావు ఎరుగును. కాని ఆమె ఆశించినట్లు అతడు వుడుక్కోలేదు. ఆమె మాటలకు
+సంపూర్ణామోదం తెలిపేడు.
+
+"సందేహం ఏముంది?"
+
+"మా అత్తగారు అంటుండేవారు. జిల్లా కలెక్టరు పెళ్ళాం అవుతుందనే వారు. చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో గాని."
+
+"ఆమెకు గొప్ప వాక్శుద్ధి ఉంది."
+
+"నిజం చెప్పేవు."
+
+"ఓ మాటు నా భవిష్యత్తు గురించి చెప్పేరు. జ్ఞాపకం ఉందా?"
+
+"గుర్తు లేదోయ్, ఏమన్నారు?"
+
+"గొప్పగా చెప్పేరులే. 'కరతల బిక్షా, తరుతల వాసః’’' నీ బ్రతుకు అంతకన్న మించదురా--అన్నారు. నాకిప్పటికీ
+గుర్తు."
+
+రామారావు కంఠధ్వనిలో వెక్కిరింత గాని, కష్టం పెట్టుకున్నట్లుగాని సడి దొరక్కపోయినా మంగమ్మ కంగారుపడింది. అతని ముఖంలోనూ
+ఆ ఛాయలు కనబడలేదు. నమ్మలేకుండా వుంది. అత్తగారి తోడ్పాటు లేకపోతే రామారావుతో సుపర్ణ పెళ్ళి తప్పించడం సాధ్యమయ్యేది
+కాదని మంగమ్మ నమ్మకం. ఆ ఘట్టాలు జరిగి ఇంకా అయిదేళ్ళు కాలేదు. అవేమీ జరగనట్లూ, జరిగినా వానితో తనకేమీ
+సంబంధంలేనట్లూ రామారావు మాట్లాడడం నమ్మతగిందిగా తోచలేదు.
+
+"ఎప్పుడేనా కోపం మీద ఏదన్నా అన్నారేమోగాని, ఆమె మనస్సు చాలా మంచిదోయ్."
+
+అత్తగారు బ్రతికి ఉండగా ఆమె విషయంలో మంగమ్మ అంత సద్భావం కనబరచిన సాక్ష్యం లేదు. ఈ సదభిప్రాయానికి మూలం ఏమిటో
+రామారావు ఎరుగును. అందుచేత ఆశ్చర్యపడలేదు.
+
+"ఆమె మనస్సు మంచితనం నేనెరగనా. ఆ రోజుల్లో మీరు చెప్తుండే వారు అందుచేతనే, ఆ వాక్శుద్ధి...."
+
+ఆ రోజుల్లో అత్తగారిని గురించి తాను ఏం చెప్పేదో మంగమ్మ మరిచిపోలేదు. రామారావును హుషారు చెయ్యడం అవసరమనిపించింది.
+
+"శుభ్రంగా వుద్యోగం చేసుకొంటున్నావు. నెలకో మూడు నాలుగు వందలు తెచ్చుకుంటున్నావు. నీకు లోటేమిటయ్యా."
+
+రామారావు అట్టహాసంగా నవ్వేడు. అప్పుడే డ్రింక్సు తీసుకొని హాలులోకి వస్తున్న సుపర్ణ ఆ నవ్వు విని నిలబడిపోయింది.
+
+"నాకేదో లోపం అని కాదు. ఆవిడ వాక్శుద్ధికి ఉదాహరణ నేనేననడం మనస్సులో కష్టం పెట్టుకుని కాదు. ఏ గుమ్మంలో భిక్ష ఆ
+గుమ్మంలోనే వేసుకొంటావన్న మాటకి ఆధునిక పాఠమే మేస్టరీ. అసలు ఉద్యోగాలన్నీ ఇంచుమించు అంతే. ఏదో మీ అల్లుడిగారివంటివి
+చాలకొద్ది. ఈ ఉద్యోగాల వాళ్ళంతా అంతే. కరతల భిక్షా. తరుతల వాసః. ఏమంటావు సుపర్ణా! గొప్ప సత్యం."
+
+సుపర్ణ గ్రహించింది. అతని మనస్సులో చాలా ఆందోళన ఉంది. పైకి కనిపిస్తున్న ప్రశాంతి వట్టి నటన.
+
+"పోదూ. పాడు ఉద్యోగం. అదిపోతే ప్రపంచమే పోయినట్లు మాట్లాడతావు." అంటూ సుపర్ణ అతనిని గదిమింది.
+
+"మంచి గదులలోనే
+
+సంచరిస్తాయి మీ ఊహలు
+
+అన్నాడు శ్రీశ్రీ. నువ్వు అదృష్టవంతురాలివి సుపర్ణా."
+
+దాని తరువాతి చరణం గుర్తువచ్చి సుపర్ణ తెల్ల బోయింది.
+
+ఎంతో ఇబ్బందిగా తయారవుతున్న సంభాషణ సత్యనారాయణ రాకతో తేలిపోయింది.
+
+"ఎంతసేపయిందోయి వచ్చి?"
+
+"మీరు అల్లా వెళ్ళేరు, వచ్చేడు." అంది భాగ్యలక్ష్మి.
+
+ఆమె అక్కడకు వచ్చినట్లే గమనించి ఉండని రామారావు తిరిగి చూసేడు.
+
+"ఆ మాట చెప్పనేనాలేదేం?"
+
+"చెప్తే వెంటనే వెళ్ళిపోయివుండే వాడివా?"--అంది భాగ్యలక్ష్మి.
+
+"నన్ను ఆపాలనే చెప్పలేదన్నమాట."
+
+"ఈ యింట్లో నువ్వు పరాయివాడివా ఏమిటోయ్. నువ్వంటే అందరికీ ఇష్టమే."--అంది మంగమ్మ.
+
+రామారావు డ్రింకు తాగి గ్లాసు బల్లమీద పెడుతూంటే సుపర్ణ చటుక్కున అందుకుంది.
+
+సత్యనారాయణ లోపలికి దారి తీసేడు.
+
+"రా. పైకిపోదాం."
+
+
+
+
+ఇరవయ్యో ప్రకరణం
+
+
+ఒకే విమూఢస్థితిలో మేడ దిగి వచ్చేడు, రామారావు. తాను సత్యనారాయణ వద్ద అంగీకరించినది నీతిబద్ధమో, నీతిబాహ్యమో
+అతనికి అర్థం కావటం లేదు.
+
+కట్నం కోరరాదనేది తన నియమం. కాని, ఇదేమిటి? తనకు స్థిరపడిన కన్యకు తండ్రి రాసి ఇవ్వగల భూమిని అమ్మించి ఆ
+ధనంతో తన చదువు పూర్తి చేసుకొనాలని ఆలోచించడం ఆ నియమానికి అనుగుణమా?
+
+ఆ భూమి కోసం--ఆ కన్యమీది ఆసక్తితో మాత్రం కాదు--తాను ఇంతవరకూ వాయిదావేస్తూ వచ్చిన పెళ్ళికి తొందరపడడం నీతి
+బాహ్యమని మనస్సు ఎదురు తిరుగుతూంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆమె అనుకుంటుందనే కాదు. వాస్తవం అదే కదా! ఏదో
+ఉద్విగ్నస్థితిలో, ఎవరి మీదనో కసితో, ఎప్పటికేనా తప్పదుకదా యని, వివాహానికి ఆనాడు వొప్పుకొన్నాడు. కాని, ప్రదానం
+చేసుకోడం దశ దాటి ముందుకు అడుగు వెయ్యలేకపోయాడు. వధువు చదువు పూర్తికాకపోవడం. తన చెల్లెలి పెళ్ళి అవసరం కొంతకాలం
+అతనిని ఆదుకున్నాయి. ఆమె చదువు ఒక దశకు వచ్చింది; చెల్లెలు పెళ్ళి అయింది. కాని అతడు ఉత్సాహం చూపలేదు. వధువుకు
+ఉన్నత విద్యావసరం పేరున మరల వాయిదా కోరేడు. గతంలో తను ప్రేమించిన కన్య ఉన్నత విద్యకని వెళ్ళి తనను
+మరిచిపోయినట్లే ఈమె కూడా తప్పిపోతుందని ఆశ అతనిది. ఈ సంబంధం తప్పిపోవాలనే తాను కోరుతున్నాడు. అయితే ఆ మాట
+తప్పేననే అప్రతిష్ట చుట్టుకోకుండా బయటపడాలని తన ఆశ. కాలయాపనతో పనిలేకుండా తన ఆశ నెరవేరే అవకాశం ఇప్పుడుంది.
+సెంటు భూమి లేక, వున్న వుద్యోగం ఊడి, కాని సంపాదన లేని తనకు కూతురునిచ్చి పెళ్ళిచేసే ఉత్సాహం హనుమంతరావుకు ఉండదు.
+తెలిసో, తెలియకో, తన చెల్లెలు ప్రోత్సాహం వల్లనో తనను కోరుకొన్న జయప్రదకూ ఈ దశలో యిదివరకటి పట్టుదల
+ఉండదు--తాను బయట పడడానికి, ఈ వుద్యోగం పోవడం ఒక విధంగా సాయపడుతుందను కుంటూంటే--ఇప్పుడీ మెలిక. తనను పునరాలోచింప
+చేస్తున్న ఈ సంబంధం తన భవిష్యత్తుకి సోపానం కావచ్చు. కాని, ఇది తన నైతిక ధర్మదీక్షను గబ్బు పట్టించేస్తుందే! ఆ
+అమ్మాయి పట్టుదల అలాగే వుంటే తన సంసిద్ధత చూసి హనుమంతరావు పెళ్ళి చేయవచ్చు. కాని, భూమి అమ్మడం, దానితో
+చదువుకోవడం ప్రతిపాదన విని ఆ భూమిని కూతురుకు వ్రాయకపోవచ్చు. అప్పుడేమౌతుంది? తనదే కాదు. ఆ అమ్మాయి భవిష్యత్తూ
+చెడుతుంది కనక పెళ్ళికి ముందు ఆ భూమి రాసివ్వాలనేది ఒక షరతు కావాలి. తప్పదు. తానంత సుముఖంగాలేని అమ్మాయితో పెళ్ళి.
+తన నియమానికి భంగకరంగా కట్నం కోరడం వంటిదే ఆ షరతు. తనలోని ఈ లొసుగుకు అభిమానపడి ఆ అమ్మాయి తనమీద
+అపనమ్మకంతో భూమి అమ్మడానికి నిరాకరిస్తే? అసంభవం కాదు. మళ్ళీ పెళ్ళిముందే దానిని అమ్మి తీరాలని షరతు పెట్టాలి.
+అప్పుడు కూడా దానిని ఆమె పేరనే బ్యాంకులో పెట్టకూడదు. తనకూ అధికారం ఉండే లాగ యిద్దరి పేరనా పెట్టించాలి.
+
+సత్యనారాయణ ఎన్నోవిధాల నచ్చచెప్పినా రామారావుకి ఈ ఏర్పాట్లు ఒప్పందం కాలేదు. అయితే ఏదో మూల ఆశా కనిపించక పోలేదు.
+ఈనాటి దుర్భర స్థితి నుంచి బయటపడడానికి లేదా దుర్భర నైతిక పరిస్థితి నుంచి బయటపడాలంటేనూ ఈ ప్రయత్నమే
+తోడ్పడవచ్చుననిపించింది. కన్యా వధువుతో ఈ విషయం పూర్తిగా చర్చించనిదే ముందుకు అడుగు వెయ్యకుండేందుకు సత్యనారాయణ చేత
+ఒప్పించడం ఒక గొప్ప విజయం అనుకున్నాడు. ఈలోపున సత్యనారాయణ తన ప్రయత్నాలు చేస్తాడు.
+
+కాని, మెట్లు దిగుతూంటే మళ్ళీ సందేహం. తాను కూడదనుకున్న పనిని చర్చకు పెడతాననడం మాత్రం విజయమా? ఆ అమ్మాయిని
+కలుసుకోడం ఎల్లాగ? ఏదో ఎవరో బంధువులింట పెళ్ళికి ఆమె ముంగండ వెళ్ళిందని తన చెల్లెలు వ్రాసింది. ఎప్పుడు వస్తుంది?
+ఎల్లా కలుసుకోడం? ఎల్లా మాట్లాడడం?
+
+ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ హాలులోకి వచ్చేసరికి భాగ్యలక్ష్మి ఎదురయింది. ఆమెను చూడగనే తనను గురించి ప్రిన్సిపాలుకు
+అభ్యర్థించిన సమాచారం మనస్సుకు వచ్చింది. అంతక్రితమే ఆమె ఆలోచనలు తనకు తెలుసు. ఈ ఘటన ఆమె మీద ఆప్యాయతను
+పెంచింది. మొదట అది తెలిసేసరికే తాను మరొకరికి అతుక్కు పోయేడు. విడుదల అయ్యే అవకాశం వచ్చేసరికి మళ్ళీ ఈ మెలిక.
+దీనితో తాను మరీ అతుక్కుపోవడమో, నిరుద్యోగంతో వివాహార్హతనే కోల్పోవడమో! తన చిత్ర పరిస్థితి తోచగనే నవ్వొచ్చింది.
+నవ్వుతూనే ఆమెను అభినందించేడు.
+
+ఆ అభినందన భాగ్యలక్ష్మికి కోపం తెప్పించింది.
+
+"ఉద్యోగం పోయినా నీకు విరగబాటు తగ్గలేదు."
+
+"నీబోటిది సాయం ఉండగా...."
+
+"హు--సాయం"--భాగ్యలక్ష్మి ముక్కి, చర్రున లేచింది.
+
+రామారావు మరింత నవ్వేడు.
+
+"జీవితం ఓ చిత్ర విచిత్రాల కథ భాగ్యం!"
+
+ఆ సంబోధనకు ఆశ్చర్యంతో తిరగబడి చూసింది. "భాగ్యం." అన్నమాట ఆమె పెదవులుదాటి బయటకు రా నిరాకరించింది.
+
+
+
+
+ఇరవయ్యొకటో ప్రకరణం
+
+
+అప్పుడే హోటలునుంచి వచ్చి చదవడానికి పేపరు తీసుకున్నాడు. వీధిలో పిలుపు--"మేష్టారూ?"
+
+"ఇలా"--అంటూ రామారావు వెళ్ళి తలుపు తీసేడు. వీధి దీపం ఉన్నా క్రీనీడలో ఎవరో తెలియలేదు.
+
+"నేనండి, బలభద్రాన్ని."
+
+అయినా అర్థం కాలేదు. లోపలికి ఆహ్వానించేడు.
+
+దీపం వెలుతురులో గుర్తు తెలిసింది. తమ కాలేజీలోనే పి. యు. సి. పాస్ అయ్యాడు. మానేసేడు. తాను చేసుకోదలచిన అమ్మాయికి
+ఏదో బంధువు.
+
+"నువ్వుటోయ్! గుర్తు తెలియలేదు. బాగున్నావా?" అని కుశల ప్రశ్నలు వేసేడు.
+
+"ఇంట్లో అమ్మగారు లేరా"--అని ఎదురుప్రశ్న వేస్తూ, బలభద్రం సిగ్గుతో ఒక కవరు అందించేడు.
+
+"మీరు తప్పక దయచేయాలి."
+
+కవరు అంచులకున్న పసుపు మరక చూస్తూనే, రామారావు చిరునవ్వుతో "పెళ్ళా యేమిటోయ్!" అన్నాడు.
+
+బలభద్రం సిగ్గుపడ్డాడు. లోపలి శుభలేఖ చూసి రామారావు సంతోషం తెలిపేడు.
+
+"కంగ్రాట్యులేషన్స్. బాగుంది, పిల్ల పేరు విజయలక్ష్మా! ఏమన్నా చదువుకుందా?"
+
+"మెట్రిక్ చదువుతూందండి."
+
+ఇటీవల తెలుగు దేశంలో ఆడపిల్లలవాళ్ళూ--మగపిల్లల వాళ్ళూ రెండోవారు ఏం చదువుతున్నారని ప్రశ్నించడం మామూలు అయింది. దానితో
+జనం ట్యుటోరియల్ స్కూళ్ళకి ఎగబడడం మొదలెట్టేరు. ఏం చదువుతున్నావంటే మెట్రిక్ అనొచ్చు. అబద్ధం చెప్పేవనలేదు. దానికో
+ప్రవేశ పరీక్షంటూ లేదుగనక, ఇంగ్లీషు అక్షరాలు గుర్తుపట్టడం నేర్చుకుంటున్న వానిది కూడా తక్షణ గమ్యం మెట్రికే. ఏ
+అమెరికాకో ప్రయాణంకట్టి బెజవాడలో రైలెక్కిన వాడు కూడా "స్టేట్స్"కే వెడుతున్నానంటాడు.
+
+చదువు గురించి మరి రామారావు తరచలేదు.
+
+"కట్నం ఏమాత్రం ఏమిటి?"
+
+"ఏమీ లేదండి. ఆ పేరు చెప్తే వొప్పుకోనన్నాను."
+
+"చాలా మంచిపని చేసేవు. బాగుంది."
+
+అంత విశాల, దృఢాభిప్రాయం తెలిపిన ఆ కుర్రవానికి ఇంకా యిరవయ్యేళ్ళేనా వుండవు. తెనుగుదేశపు కుర్రకారులో అటువంటి ఉదాత్త
+భావాలు వ్యక్తమవుతున్నందుకు చాల ఉత్సాహం కలిగింది. అయితే తన చదువే ఇంకా ప్రారంభదశలో వుంది. అటువంటప్పుడు చదువు ఇంకా
+ప్రారంభమేనా కాని పిల్లని పెళ్లిచేసుకొంటున్నాడు. ఈ తొందరేమిటనిపించింది.
+
+"మీ నాన్నగారు బాగా సంపాదించారనుకుంటా, ఏం చేస్తుంటారు?"
+
+"వ్యవసాయమేనండి, అదీ ఎక్కువ కాదు. మాకున్నది మూడెకరాల చిల్లర. నలుగురైదుగురు పిల్లల్లో నేనే పెద్దవాణ్ణండి."
+
+అనేక ప్రశ్నలు వేసి రాబట్టిన ఈ సమాచారం విన్నాక, రామారావుకు మరింత ఆశ్చర్యం కలిగింది. వయసు వస్తున్న దశలో కను
+ముక్కు తీరు చూసి మిగతా ప్రపంచం మరిచివుంటాడనిపించింది.
+
+"అమ్మాయి నచ్చిందా?"
+
+బలభద్రం వెంటనే జేబులోంచి ఓ కవరు తీసి అందించేడు.
+
+"అమ్మాయి చక్కగా వుంది." అన్న మెచ్చుకోలుకు బలభద్రం ఉబ్బి తబ్బిబ్బయిపోయేడు.
+
+"అవునండి."
+
+"మీ మామగారు ఏం చేస్తుంటారు?"
+
+"పెద్దగా ఏం లేదండి."
+
+"ఆస్తి బాగా వుందనుకుంటా."
+
+"అదీ ఏం లేదండి. పది పన్నెండు ఎకరాలు వుంటుందేమో."
+
+"బావమరుదులు?"
+
+"ముగ్గురండి. ఇద్దరు కూతుళ్ళు."
+
+"వాళ్ళేమన్నా వుద్యోగాల్లో వున్నారా?"
+
+"పెళ్లికూతురే పిల్లలలో పెద్దది."
+
+పాతికేళ్ళుదాటినా పెళ్ళంటే తనకు అనిపిస్తున్న భయం వీనికెందుకనిపించడంలేదు. రామారావుకి ఆశ్చర్యంగా వుంది.
+
+"మా నాన్నగారికి నాచేత మెడిసిన్ చదివించాలని వుందండి. అందుకే ప్రీ – ప్రొఫెషనల్ కోర్స్ లో చేరేనండి."
+
+"మంచిదే. ఈ రోజుల్లో బి. ఏ. లూ, ఎం. ఏ .లూ కావడం కన్న, ఇంజనీర్లు కావడం కన్న మెడిసిన్ చదవడం మేలు.
+ప్రాక్టీసు పెట్టుకు బ్రతకొచ్చు. ఆయన ఆలోచన మంచిదే."
+
+"కాని, మేమంత సాగగలవాళ్ళం కామండి."
+
+"మరి."
+
+"మా కాబోయే మామగారి తండ్రిగారు రెండు మూడు డొనేషన్ కాలేజీలకు ఏజంటు. పేరు వినే వుంటారు. పట్టాభిరామయ్యగారని. ఆయన సీటు
+ఇప్పిస్తానన్నారు. డబ్బు కట్టనక్కర్లేదు. ఆయనే చూసుకొంటారు."
+
+"సీట్ దొరికితే చదువు అయిపోతుందా? మరో పాతిక వేలేనా అవదూ"
+
+"ఆ అమ్మాయి పెత్తల్లి వాళ్ళవద్ద పెరుగుతూంది. వాళ్ళు వున్న వాళ్ళు. అభిమాన పుత్రిక. కాకినాడ వాళ్ళది. చదువు
+చెప్పించడం తమరు చేస్తామన్నారండి."
+
+"గట్టి వాడివే."
+
+"లేకపోతే బి.ఏ. కన్న చదవలేను. వుద్యోగాలు దొరక్క బాధపడుతున్న ఈ రోజుల్లో బి.ఏ. మొహం ఎవరు చూస్తారు?"
+
+తానే స్వయంగా నిదర్శనం. రామారావు నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు.
+
+కాని, అనేక ఆలోచనలు.
+
+బలభద్రం ఏర్పాటు కట్నంగా భావించవచ్చునా! ఇప్పుడు తాను అదే స్థితికి రావడంతో ఆ విషయాన్ని తేల్చుకోడం అత్యవసరంగా
+కనిపించింది.
+
+యిప్పుడే కాదు. ఇంతకు పూర్వమూ యిటువంటి ఘట్టం వచ్చింది. సత్యనారాయణే చదివిస్తానన్నాడు. కాని, తానే ఒప్పుకోలేదు. పోయి
+ఉద్యోగంలో చేరేడు. డబ్బు కూడబెట్టి తానే చదువుకోవాలని ఆశ. నాలుగేళ్ళయింది. ఒక్క ఏడాది చదువుకు కావలసినది కూడా
+సమకూడ లేదు. ఇప్పుడా వుద్యోగం పోయింది. ఆ అమ్మాయీ చెయ్యిదాటి పోయింది. తన నియమ నిష్ఠ తన జీవితాన్నే దెబ్బ తీసింది.
+ఆ దృష్టితో చూస్తే, బలభద్రం చేస్తున్నది తెలివైన పనే అనిపించినా మంచిదనిపించడం లేదు.
+
+ఆ అమ్మాయి తండ్రి కాలేజీ సీటు యిప్పించలేకపోతే. ఆమె పెత్తల్లిగారి వాళ్ళు సాయం చెయ్యలేకపోతే? రెండు, మూడు కుటుంబాల మధ్య
+అగ్నిహోత్రమే కద. అంతకన్న కట్నం నిర్ణయించుకొని వసూలు చేయడం సుఖం కదా.
+
+ఆ ఆలోచన అనిపించేక తన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేడు. తన కాబోయే భార్యకు పరిస్థితులన్నీ చెప్పి, అన్ని
+ఏర్పాట్లూ అందరికీ అంగీకారమయి, స్పష్టం అయితేనే పెళ్ళికి సిద్ధం కావాలి. ఎక్కడా ఏ మాత్రం లొసుగు పనికిరాదు. ఆ
+నిర్ణయానికి వచ్చేక "బలభద్రం" అని పిలిచేడు.
+
+"అయ్య."
+
+"నిద్ర పోలేదా?"
+
+"కొత్త చోటు కాదాండి."
+
+"మీ జయప్రద ఎక్కడుంది?"
+
+"స్పష్టంగా తెలియదండి? వాళ్ళ వూరెడుతున్నా. తెలుసుకు రాయమంటారా? కాని, నా పెళ్ళికి వస్తుందండి. పెళ్లికూతురావిడ పింతల్లి
+కూతురే."
+
+"సరే వ్రాయి." అన్నాడు.
+
+మళ్ళీ ఆలోచనలు. ఎదటి పక్షం ఎక్కడ సందేహించినా తన పెళ్ళి నిలిచిపోతుంది. అది తనకు ఇష్టమే. కాని, జీవితంలో చాలా
+నష్టం.
+
+వాళ్ళు అంగీకరిస్తే తన యిష్టం ఏమంటుంది? ఎన్నడూ వూహించని స్థితి.
+
+మొత్తం మీద ఇష్టం--పెళ్ళి--చదువు--డబ్బు ఇవన్నీ ఒకదానికొకటి పొసగని అంశాలేనా? ఎవరికివారు, తమకు కావలసినవీ,
+చేతికి అందినవీ ఒక పోగులోంచి లాక్కుని, దానితో తృప్తిపడో, ఏడ్చో, కొట్లాడుతూనో కాలక్షేపం చెయ్యవలసిందేనా?
+
+అతనికి భయం కలిగింది.
+
+
+
+
+ఇరవై రెండో ప్రకరణం
+
+
+పంచదార కార్డు చేత బట్టుకొని అడిషనల్ తహసీల్దారు ఆఫీసు దగ్గరకెళ్ళేసరికి, ఆ జనాన్ని చూసి రామారావు గుండెలు
+అదిరిపోయాయి. కొన్ని వందలమంది గుంపులు, గుంపులుగా ఆఫీసు వరండాలలో, ఆవరణలో చెట్ల క్రింద వున్నారు. రోడ్డుమీద
+వచ్చేటప్పుడు తన పక్కన నడిచిన వాళ్ళేగాని, ఎదురు వచ్చిన వాళ్ళున్నారా, జ్ఞాపకం చేసుకొనేందుకు ప్రయత్నించేడు. ఎక్కువ
+మంది కనిపించలేదు....ఈ వేళ కాదు. వారం రోజులైనా తనకి కొత్త కార్డు పుడుతుందా? తిరిగి పోదామనిపించింది. మరో రూపాయి
+అవుతుంది గాని, తాను కొనే పంచదార మాత్రం ఎంతలే అనీ అనిపించింది. అయినా వెనకకు తిరగలేదు. ఓ ప్రయత్నం చేసి మరీ
+పోదామనుకున్నాడు.
+
+ఆవరణలో కెళ్ళేక వాకబు చేస్తూంటే ఎవరో పలకరించేరు.
+
+"మీరా మేస్టారూ. యిల్లా వచ్చేరు. పంచదార కార్డుకేనా?"
+
+ఆ యువకుడినెక్కడో చూశాననిపించింది. కాని, గుర్తు రాలేదు. అతని వేపు తెల్లబోయి చూస్తుంటే తానే చెప్పేడు.
+
+మరిచిపోయారన్నమాట. ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనలో కాల్పుల రోజున బజారులో మేడమీది నుంచి హాస్పిటలు చేర్పించినది నన్నేనండి."
+అంటూ నవ్వేడు.
+
+"గుర్తు వచ్చిందా?"
+
+రామారావు సంతోషంతో అతని చేయి పట్టుకుని గిజాయించేడు.
+
+"చాల సంతోషం. గాయాలు మానిపోయాయా?"
+
+"అవి అప్పుడే మానిపోయాయండి. కాని లంజ కొడుకులు కేసుల్లో పెట్టి తిప్పి చంపుతున్నారు."
+
+"ఔనుట. మీ అన్నగారోమాటు చెప్పేరు."
+
+"మీరెవరో నాకు చెప్పిందీ ఆయనే."
+
+"ఆ రోజున మిమ్మల్ని బలవంతంపెట్టి హాస్పిటలుకు చేర్చకపోతే ఈ కేసులుండేవి కాదు గదా. మరి మీకు కోపంగా లేదూ, నా మీద."
+
+"అప్పారావు గాని ఏమయినా అన్నాడేమిటండి." అంటూ అతడు పకపక నవ్వేడు.
+
+"ఆ మూడో అతని పేరు అప్పారావా! రెండు మూడు రోజుల క్రితం బజారులో హోటలు వద్ద చూశా."
+
+"ఏమన్నా అన్నాడేమిటండి. ఏమీ అనుకోకండి సర్! మనిషి మంచివాడు. కాని అదోరకం."
+
+"అర్ధం అయింది. మీరిల్లా మాట్లాడుతున్నారు గాని, ఆయన...."
+
+"పలకరిస్తే కరిచేసుంటాడు" అంటూ నవ్వేడు. "కాని తెలివి తక్కువదనం. మీరేం చేసేరు. మాకు ఏమవుతుందోనని కంగారుపడి
+హాస్పిటలుకు తీసుకెళ్ళారు. ముండా గవర్నమెంటుది అంతా లాలొచీ వ్యవహారం. ఆ నిరశన వ్రతంగాడు మాత్రం నిజాయితీవాడా. జనం
+యిచ్చినవే ముప్ఫయి, నలభై వేలు స్నేహితుల ద్వారా దాటించేడుట. పారిపోయేడు. వాడిని నమ్మి ముఫ్పై మంది ప్రాణాలిచ్చేరు. యిది
+వాస్తవం. మా కేసులు కొసరు. మధ్య తిట్లు మీరు తిన్నారు."
+
+యిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీసు వరండా ఎక్కేరు.
+
+"మీకెవరేనా తెలుసాండి."
+
+"నాతో చదువుకున్న అతడొకడుండాలి మరి. మీరిక్కడే వుండండి. చూసి వస్తా."
+
+రామారావు ఒక్క మారు వరండాలో చుట్టు తిరిగి వచ్చేడు. ఒక కిటికీ వద్ద తాను ఎరిగిన ముఖం కనిపించింది. కాని, పేరు గుర్తు
+రాలేదు. అతడు తల వంచుకొని తెగ రాసేస్తున్నాడు. పక్కన ట్రేలో రాయవలసిన కార్డుల బొత్తి, పెద్దది కనిపిస్తూంది. మరో
+రెండు కిటికీల వద్ద కూడా గుమాస్తాలు కనిపించేరు. వాళ్ళవద్దా కార్డుల బొత్తులున్నాయి. పని బహు తాపీగా జరుగుతూంది. లోపలి
+గదిలో తాశీల్దారు కాఫీ సేవిస్తూ ఫోనులో ఎవరితోనో మాట్లాడడం వినిపిస్తూంది.
+
+ప్రతి ఆఫీసులో కనిపించే వాతావరణమే. చేసేవాడు చేస్తుంటాడు. సాచేసేవాడు సాచేస్తూంటాడు. కనుక్కొనే నాధుడుండడు.
+
+రామారావు వెనక్కి వచ్చి—"మా మిత్రుడున్నాడు. వ్యవహారం తెలుసుకు వస్తాను. మీ కార్డు ఎవరిదగ్గర కెళ్ళిందో చూసొస్తా.
+వుండండి. అన్నట్లు—మీ పేరేమిటి?"
+
+"శ్యామలరావు"
+
+లోపలికి వెడితే ఎల్లాగోలా యామారి పని చేయించుకోవచ్చుననిపించి, రామారావు గుమ్మంవేపు వెళ్ళేడు.
+
+అతనిలాగే మరికొందరు అక్కడ చేరి వున్నారు. కాని బంట్రోతు వారిని పోనివ్వడం లేదు. అంతమంది తన్ను చూసి జంకుతూ నిలబడి
+పోతూండడం, తిరిగి పోతూండడం చూస్తుంటే ఆ బంట్రోతుకి దర్పం పెరిగిపోతూంది. తనను అడుగుతున్నవారిని కసురుకుంటున్నాడు.
+
+"పోండయ్యా బాబు! నన్ను సంపితే నేనేం సేసేది? ఎల్లి కూకోండి. దొరవారు నన్ను తిడుతుండారు, ఆ గోలేంటని! నేనే పిలిసి
+కార్డులిత్తున్నా గంద."
+
+తన వాగ్దానానికి సాక్ష్యంగా బంట్రోతు నాలుగు పేర్లు పిలిచేడు.
+
+"పునుగు చలమయ్య."
+
+"గంటా ఘటోత్కచుడూ."
+
+"బాగోతుల మాణిక్యమ్మ."
+
+"అవిటి లచుమన్నా."
+
+బాబ్బాబు--అంటూ నాలుగుపేర్ల వాళ్ళూ పరుగెత్తి వచ్చేరు.
+
+"ఏమయ్యోవ్! అయినకాడికి రూపాయీ పుచ్చుకొని ఎనకటల్లే అరకిలోయే వేయించావేం." అని మాణిక్యమ్మ పేచీ పెట్టుకుంది.
+
+"అసలిచ్చేరనుకోక మళ్ళీ గునుస్తావేం." అని బంట్రోతు గదిమేడు. ఆమె ఇంకా అరుస్తూనే వుంటే, అసలు రహస్యం బయట
+పెట్టేడు.
+
+"చూడండయ్యా! ఈవిడేమో పావలాకి, అర్థకీ అమ్ముకుంటుంది. ఇసుమంటోళ్ళ మూలంగానే కావలసినోళ్ళకి దొరకకుండా పోతాంది."
+
+ఆమె పేరు వినగానే రామారావుకు తన మిత్రుని పేరు గుర్తుకు వచ్చింది. "మాణిక్యాలరావు." ఆ పేరు నుపయోగించుకొని లోపల
+చొరబడ్డాడు. బంట్రోతు వెనకనుంచి కేకేసేడు.
+
+"మూడో నెంబరు టేబులండి."
+
+"తెలుసునయ్యా దేవుడా!"
+
+లోపలికెళ్ళేక తనదొక్కడిదే ప్రజ్ఞ కాదనీ, తనకన్నా ముందో అయిదారుగురు ఆ టేబులు అగల బగల తచ్చాడుతున్నారనీ
+గ్రహించేడు. అంటే తన మిత్రుడు అంత ఆశ్రిత సులభుడు కాదన్నమాట. ఆ మాట తోచినప్పుడు సంతోషమే కలిగింది.
+
+"నమస్తే."
+
+మాణిక్యాలరావు తల ఎత్తేడు.
+
+"మీరా!"
+
+ఎరిగిన ముఖం కనబడగానే మాణిక్యాలరావు తన బాధ చెప్పుకున్నాడు.
+
+"చచ్చిపోతున్నానండి. వ్రాసినకొద్దీ కట్ట పెరిగిపోతూంది."
+
+"ఇంత హఠాత్తుగా ఈ మార్చడం ఆలోచన ఎందుకొచ్చింది?"
+
+"మార్చాలనుకొన్నారనుకోండి. వార్డు తరవాత వార్డు ఏడిస్తే ఎంత బావుండేది? లేదా వార్డుకో గుమస్తా నిచ్చినా బాగుండును."
+
+"వాళ్ళకా అంత బుద్ధి. అయ్యో." అన్నాడు, రామారావు.
+
+"మేం చెప్పేం. ముప్ఫయి, నలభయి వేల కార్డులు రాయాలంటే నెల రోజులు కూడా చాలదన్నాం."
+
+"అయినా కాదన్నారేం!"
+
+"కాదంటే, అదో అందం. ఓ నెల పంచదార అందకపోతే చచ్చిపోరులే--అన్నాడు ఆఫీసరు."
+
+"అమ్మ బద్మాషు."
+
+ఆ తిట్టుతో మాణిక్యాలరావుకు తెలివి వచ్చినట్లయింది. తాను తొందరపడి ఆఫీసు రహస్యాలు బయట పెట్టేశానని కంగారు పడ్డాడు.
+చటుక్కున తల వంచి రాతకి తలబడ్డాడు.
+
+రామారావు ఆలోచించేడు.
+
+జనం పొద్దుటినుంచీ ఎండలో మాడిపోతున్నారు. తనకీ కార్డు కావాలి. మళ్ళీ రాత్రి ఊరుకు పోతే ఏమవుతుందో. పోనీ, కొందరు కార్డులు
+రాయడానికి సాయపడితే పని త్వరగా జరుగుతుందనిపించింది.
+
+"కొన్ని కార్డులు నే వ్రాయనా?"
+
+"మీకెందుకండీ బెడద. మీ కార్డు వీటిలో వుందా?"
+
+"లేదు. కానీ, ఏం వ్రాయలేనా?"
+
+"బ్రహ్మ విద్యా ఏమిటి?"
+
+"మరింకనేం. మరో నలుగురిని లాక్కొస్తా. పని త్వరగా జరుగుతుంది."
+
+"తాసిల్దారు ఒప్పుకోడు." అన్నాడు మాణిక్యాలరావు, తనకభ్యంతరం లేదని సూచిస్తూ.
+
+తాసిల్దారు ఒప్పుకోడన్న మాటకు రామారావులో పట్టుదల పెరిగింది. వెనకటి రోజున కుర్రాళ్ళు గురునాధం మేష్టరును ఘెరావో
+చెయ్యాలనుకోడం గుర్తు వచ్చింది.
+
+"సాయం చేస్తామంటున్నాం గాని, మరొకటి కాదు కదా. అయినా...."
+
+"అడిగి చూడండి."
+
+అంతలో మరో ఆలోచన తోచింది. తీరాచేసి తాసిల్దారు సరేనంటే వ్రాసేందుకు ఎవరన్నా వస్తారో రారో....అనిపించింది.
+
+అదేదో తేల్చుకొనేందుకు వరండాలోకి వెళ్ళేడు. ఆ సలహా విని శ్యామలరావు సిద్ధపడ్డాడు.
+
+"నేను వస్తా"
+
+"మరో నలుగురుంటే...."
+
+ఇద్దరూ జనం గుంపుల మధ్య తమ ప్రతిపాదన పడేశారు.
+
+"బాబ్బాబు. అల్లాంటిదేదో చెయ్యండి నాయనా. మళ్ళీ పనిమాలా రేపు రావాలంటే చచ్చిపోతాం."
+
+నాలుగువేపుల నుంచీ జనం తమ ప్రతిపాదనను సమర్ధించేరు. కాని వ్రాతగాళ్ళు కావాలనేసరికి గొణుగుడు ప్రారంభమయింది.
+
+"నాయాళ్ళు కలం పెడితే పని జరుగుద్ది గాని, ఊసులాడుతుంటే అవిద్దా?"
+
+"కార్డుకి రూపాయి ఆడు తీసుకోడం, మనం వ్రాయడమూనా?"
+
+"వీళ్ళ వీపులు విమానం మోత మోగిస్తాననక, వాళ్ళకి సాయం చేస్తానంటావే."
+
+అనేక వ్యాఖ్యలు, విసుళ్ళు. కాని, క్రమంగా పదిమంది దొరికేరు.
+
+బంట్రోతు వారిని అడ్డగించబోయేడు. కాని, రామారావు సమాధానం విని, జనంలో రేగుతున్న కోపతాపాలు చూసేక వదిలేసేడు.
+
+"గొడవ సేయకండి. అయ్యగారు కోపం సేత్తారు. నెమ్మది. సద్దు సేయొద్దు."
+
+
+
+
+ఇరవైమూడో ప్రకరణం
+
+
+కాని, తన పనిలో వేరొకరు చెయ్యి పెట్టడాన్ని తాసిల్దారు మొదటే ఒప్పుకోలేదు. బంట్రోతును కేకేసేడు.
+
+"వీళ్ళందర్నీ ఎందుకు వదిలేవు?"
+
+"చిత్తం. చిత్తం. రాండయ్యా బాబు, రాండి." ఒకళ్ళనో ఇద్దర్నో మాత్రం తీసుకొని బంట్రోతు బయటకు నడిచేడు. రామారావు
+కదలతలుచుకోలేదు. అంతవరకూ నిల్చున్నవాడు పక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
+
+"మీరు వెళ్లిపోండి. నెమ్మదిగా చెప్తున్నా, వినండి." అన్నాడు ఆఫీసరు.
+
+"మేమూ నెమ్మదిగానే అడుగుతున్నాం. మీ పని జరగడం లేదు...."
+
+"ఎల్లా జరిగించాలో మాకు తెలుసు."
+
+"సందేహం ఏముందీ. అందుకే మేం సాయం చేస్తామనడం."
+
+తాసిల్దారుకు మహా కోపం వచ్చింది.
+
+"ఐసే. ప్లీజ్ గెటవుట్!"
+
+రామారావు బిగిసేడు. అతని తోడివాళ్ళు దగ్గరకు జరిగేరు.
+
+"మేం వెళ్ళడానికి రాలేదు సర్! వెళ్ళం. పంచదార కార్డులందరికీ ముట్టందే కదలం. కార్డుకి రూపాయి వసూలు చేయడం ఏమిటో అదీ
+తేలుస్తాం."
+
+అడిషనల్ తాసిల్దారు ఇల్లాంటి చాతుర్మాస్యలు చాలా చూసేడు. బెదిరింపులేగాని, చివరకి ఒక్కడూ నిలబడడు. అందుచేత నిర్భయంగా
+తానే ఎదుర్కొన్నాడు.
+
+"పోలీసుల్ని పిలిపించవలసి వుంటుంది."
+
+"ఆ అందం చూద్దాం. పిలవండి. ఆ డ్రాయర్లలో చేరిన రూపాయల దొంతరలూ, ఇంతవరకు ఇచ్చిన కార్డులూ అన్ని సంగతులూ బయట
+పడడం మంచిదే."
+
+తాసిల్దారు ఒక్క క్షణం ఆలోచించేడు. ఏదో తోచింది. ఫోన్ మీద చెయ్యి వేసేడు.
+
+ఆ క్షణంలో రామారావూ ఆలోచించేడు. ఆఫీసర్లూ, ఆఫీసర్లూ అన్నీ సర్దేసుకొంటారు. వెంటనే ఫోన్ నెత్తకుండా తాసిల్దారు చెయ్యి
+నదిమి పెట్టేడు.
+
+"తొందరపడొద్దు. నువ్వు పోలీసుకి ఫోన్ చేస్తావు. నేను వీధిలో వున్న జనానికి నీ వ్యవహారం చెప్తా. నీ పోలీసువాళ్ళు సర్దుకు
+వచ్చేసరికి అరగంటేనా పడుతుంది. ఈ లోపున నిన్ను, నీ ఆఫీసుని, నీ రికార్డుల్ని ఒక్క డబ్బాడు కిరసనాయిలు పోసి
+అగ్గిపుల్ల గీసేస్తారు. ఏం సరదాగా వుందా?"
+
+రామారావు కుర్చీలోంచి లేస్తూ, రిసీవరును ఒడుపుగా ఒక్క గుంజు గుంజేడు. తాసిల్దారు తెల్లబోయేడు. కొద్దినెలలు క్రితమే ఉక్కు
+ఫ్యాక్టరీ ఆందోళన సందర్భంగా నగరంలో జరిగిన భీభత్సాన్ని అతను మరిచిపోలేదు. సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
+పోలీసు స్టేషను అంటించేసేరు. హోటళ్ళు తగలపెట్టేరు....ఒకరు చెప్పనక్కర్లేకుండా జనం వీధుల్లోకి వచ్చేసేరు. ఇక్కడ
+అల్లాకూడాకాదు. పొద్దుటి నుంచి జనం ఎండలో మాడుతూ, మండిపడుతున్నారు. వుసిస్తే రామారావు చెప్పినంతపనీ చేసేస్తారు. అతని
+వాలకం చూస్తే అందుకు సిద్ధమై వచ్చేడనిపించింది. అంతవరకూ చూపిన నిబ్బరం సడిలింది. మోకాళ్ళలో వణుకు పుట్టింది.
+
+సాకెట్ పట్టు వదిలి చేతిలోకి వచ్చిన రిసీవర్‌ను క్రేడిల్ మీద పెట్టేసేడు, రామారావు.
+
+"అట్టే పేచీ పెట్టుకోకండి. జనం విసిగిపోయి వున్నారు. మీరు కోరే పోలీసు సాయం మీ శవ పంచాయితీకి పనికొస్తుంది. వాళ్ళు
+మిమ్మల్ని కాపాడలేరు. మేము మీకు సాయం రావలసిన పనేం లేదు. జీతాలు మీరూ తీసుకుంటున్నది. అది చాలక ఒక కోటా వదిలి
+పెట్టేందుకు మిల్లువాళ్ళతో లాలూచీ అయి, ఈ కార్డుల తతంగం పెట్టేరు. అక్కడికీ ఆశ తీరలేదు. కార్డుకు రూపాయి వసూలు
+చేస్తున్నారు. అదీ చాలనట్లు జనాన్ని ఎండలో నిలబెట్టి హింస పెడుతున్నారు. మీరు చేస్తున్న పనికి ఏం చేసినా పాపం కాదు.
+"సహేంద్ర తక్షకాయస్వాహా" అనేసి, అల్లాంటి మరో పది సర్పయాగాలు జరిగేందుకు దారి చూపిస్తే, నీబోటిగాళ్ళకి కాస్త ఒళ్ళు
+తెలిసొస్తుందేమో, కాని మేమా పని చెయ్యడం లేదు. పైగా సాయం చేస్తామంటున్నాం. మీ కోసం కాదు. ఆ జనం కోసం. మీ ప్రాణానికి
+అడ్డు పడుతున్నాం."
+
+"మీరు చెయ్యలేరు. తప్పులు రాస్తే." అంతవరకూ లోపలే మంటనణుచుకొంటున్న శ్యామలరావు గంయ్ మన్నాడు.
+
+"నీ బోటి విద్వాంసులు దేశంలో లేక గొడ్డుపోలేదు."
+
+"ఎల్లా రాయాలో చెప్పండి." అన్నాడు రామారావు.
+
+"మీకు చెప్పేకన్న మేం రాస్తే సరిపోదా?"
+
+"మాకేం అభ్యంతరం లేదు. ఈ కార్డులన్నీ అయ్యేవరకు మేం కదలం. మీరెవ్వరూ ఈ హాలునుంచి బయటికి పోడానికి ఒప్పుకోము."
+
+
+
+
+ఇరవైనాలుగో ప్రకరణం
+
+
+నాలుగైదు నెలల క్రితం అయితే సత్యనారాయణ ప్రతిపాదనకు హనుమంతరావు ఎగిరి గంతేసి వుండేవాడు. నిజానికి అతడే ఓమారు ఆ
+ప్రతిపాదన చేశాడు. అదీ మధ్యవర్తి ద్వారా కాదు, స్వయంగా.
+
+"కట్నం డబ్బు సగం పిల్ల పేర పెడతా. సగం నీకిస్తా. వుద్యోగం మానెయ్యి. పోయి ఎం. ఏ. చదువుకో."
+
+రామారావు వొప్పుకోలేదు. మామగారి డబ్బుతో చదవుకోడం అతనికి నచ్చలేదు.
+
+ఆ నిరాకరణకు విసువే కలిగింది. కాని హనుమంతరావు తొందరపడలేదు. కూతురు జయప్రద అతనే కావాలంటూంది.
+
+రెందోవేపున సంతోషమే కలిగింది. నీతీ నిజాయితీ కలవాడు అల్లుడుగా దొరకడం, సులభం కాదనిపిస్తున్న రోజుల్లో ఆ మాట.
+
+తన కంటె ఎవరేనా ఎక్కువిస్తానంటే అటు జారిపోతాడేమో. కట్నం చాలక, అడగలేక వేస్తున్న అడ్డం కాదు గదా
+అనిపించకపోలేదు. కాని తానే కాదనుకున్నాడు. అమాయకత్వం, ప్రపంచ జ్ఞానం లేకపోవడం కారణం అయివుంటుందని సర్దుకున్నాడు. కాని
+ప్రపంచం చూసి గడుసుబారితే? ఈ నియమాలు నిలుస్తాయా? వెంటనే పెళ్ళి చేసేసి అల్లుడిలోని నిజాయితీని భద్రపరచాలనుకొన్నాడు.
+
+కాని రామారావు ఒప్పుకోలేదు.
+
+నెలలు గడిచాయి.
+
+కూతురు పెళ్ళి చేసెయ్యాలని ఆనాడు పడ్డంత తొందర ఈవేళ హనుమంతరావులో లేదు. రిట్రెంచిమెంట్లనీ, ఉద్యోగాల నుంచి
+తీసేస్తున్నారని వార్తలు చెవిన పడుతున్నాయి. ఈ ఊడూడు గోచీ వుద్యోగం గాడికి, వుద్యోగం తప్ప మరో ఆధారం లేనివానికి
+పిల్లనివ్వడం మంచిదా అనిపించక పోలేదు. తొందర పడకూడదనీ అనిపించింది.
+
+"ఇదిగో సత్యనారాయణా! ఇదివరలో తెలియక అతనిని తొందర పెట్టేననుకో. అప్పుడు ఆ తొందర చూపినా అర్ధం వుంది. కాని,
+ఇప్పుడు? ఉద్యోగం పోయి అల్లాడుతున్న దశలో వెళ్ళి మా పిల్లని పెళ్ళి చేసుకోడం మాట ఏం చేసేవని అడగనా? సామ్యం చెప్పిన
+తరవాయిగా వుంటుంది కదూ."
+
+"ఆ మధ్య నువ్వు చెప్పమన్నావని, నాలుగు రోజుల క్రితం కనిపిస్తే చెప్పేను. చెల్లెలు పెళ్ళి అయిపోయింది. ఈ
+అమావాస్యదాటితే గోదావరి పుష్కరాలు. వచ్చే యేడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళు చేయకూడదు కదా. ఈ మాటే చెప్తే
+మెత్తపడ్డాడనిపించింది."
+
+హనుమంతరావు రెండేళ్ళ ఆటంకాన్ని మాత్రమే చెవిని వేసుకున్నాడు.
+
+"రెండేళ్ళు ఎంతసేపులో తిరిగి వస్తాయి. మా పిల్లదాని వయస్సు ఏం మించింది. పంధొమ్మిది వెళ్ళి ఇరవయ్యే కదా. మరో రెండేళ్ళు
+ఆపినా ఈ రోజుల్లో పరవాలేదు. అదో వయస్సా? ఈ లోపున అతడేదో మంచి వుద్యోగం చూసుకో గలుగుతాడు."
+
+అర్ధం అయింది. హనుమంతరావు వెనకంజ వేసేడు. పైగా ముక్తాయింపుగా మరోమాట అనేసేడు.
+
+"నాదిగా ఓమాట చెప్పు. ఈ రెండేళ్ళూ పోయి చదువుకోమను. ఇంక డబ్బుదా! మొత్తం అంతా నే పెట్టలేకపోయినా, అప్పుడూ అప్పుడూ
+వందో రెండు వందలో కావాలంటే ఏ తలో తాకట్టు పెట్టి సర్దుతాను."
+
+అల్లుడుగా కట్నం పుచ్చుకో నిరాకరించినవాడు పైవాడుగా చదువుకు డబ్బు అడుగుతాడనే భయం లేకపోవడంచేతనే హనుమంతరావు అంత
+ధారాళంగా అనేసేడు.
+
+"అతడు కావాలననే అక్కర్లేదు. పుచ్చుకోననడని తోస్తే చాలు చదువు ఖర్చు అంతా నేనే పెడతాను. కాని ఒప్పుకోడు కదా.
+స్కూల్ ఫైనల్ అయ్యాక నేనే బెజవాడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొన్నా. బసా, భోజనం వరకు ఎల్లాగో సర్దుకొన్నాడు. అంతే.
+ఎక్కడెక్కడో ట్యూషన్లు చెప్పుకొని జీతం, బట్టలూ గడుపుకొన్నాడు. బి. య్యే. అయ్యేక అదీ లేదు. పోయి వుద్యోగంలో చేరేడు.
+
+హనుమంతరావు చాలా ఉదారంగా ఆ అభిమానాన్ని మెచ్చుకొన్నాడు.
+
+"ఈనాడు అటువంటి నీతి నియమాలూ, దీక్షా కుర్రవాళ్ళల్లో కనబడడంలేదు. అందుకే అతనంటే నాకిష్టం. అల్లాంటి వుత్తమాదర్శాలను
+మలిన పరచకూడదు. స్వశక్తిమీద ఆధారపడడం చాల మంచిది. చాల పవిత్రం. దానిని పంకిలం చెయ్యకూడదు. ఈ ఇబ్బందులనుంచి
+బయటపడి రమ్మను. రాగలడులే. నాకా నమ్మకం వుంది.
+
+
+
+
+ఇరవైఅయిదో ప్రకరణం
+
+
+నాలుగు రోజులుగా భాగ్యలక్ష్మి తమ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఆ రోజున సుపర్ణ తన చెల్లెలు ఆశలూ, నిరాశలూ గురించి
+చెప్పేవరకూ సుశీలకు ఆ మాట తోచనేలేదు. కాని, ఇప్పుడు ఆలోచిస్తూంటే భాగ్యలక్ష్మి ఎప్పుడు వచ్చినా రామారావు ఇంట్లో వుండే
+వేళప్పుడే ననిపిస్తూంది. మళ్ళీ అతనిని పలకరించేది కాదు. వీలు చిక్కితే, మాటవస్తే వెక్కిరించడమో, వెటకారం చెయ్యడమో
+తప్ప ఎప్పుడూ సజావుగా మాట్లాడేది కాదు. అదేమి ప్రణయమో అర్ధంగాక పోయినా సుశీలకు ఆమె యెడ జాలి మాత్రం కలిగింది.
+నిరుపయోగకరమైన ఆ మనస్తత్వం రాను రాను స్థిరపడిపోయి ఆమె జీవితాన్నే భగ్నం చేస్తుందన్న జాలి. వీలయితే ఆమెను
+హెచ్చరించి దారిన పెట్టాలన్న ఆదుర్దా, ఈ నాలుగు రోజుల నుంచీ ఆమె కోసం ఎదురు చూస్తూనే వుంది. చివరకు పిల్లగానిచేత కూడా
+కబురు పెట్టింది. వస్తున్నానందేగాని రాలేదు.
+
+సాయంకాలం వచ్చింది. వస్తూనే ఆమె అందించిన కబురేమిటో సుశీలకు అంతు పట్టలేదు.
+
+"హనుమంతరావుగారు తన కూతురు నిచ్చేదిలేదు పొమ్మన్నాట్ట. ఆ సంబంధం జరగదు." అన్నది, భాగ్యలక్ష్మి.
+
+"ఎవరా హనుమంతరావు? ఏమాకథ" అంది, నిశ్వాత్ముని నరసింహమూర్తిగారి బొమ్మల పంచతంత్రం పాత్ర బాణీలో.
+
+అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భాగ్యలక్ష్మి అడ్డుప్రశ్న వేసింది.
+
+"రామారావింకా వూరినుంచి రాలేదా?"
+
+"నేనొకటడుగుతే నువ్వొకటి చెప్తావేం....ఈ వేళ వస్తానన్నారా?"
+
+"రాలేదా అంటే వస్తానని చెప్పినట్లు అర్ధమా? గడుస్తనం పోతున్నావు."--భాగ్యలక్ష్మి అదిలింపును సుశీల చిరునవ్వుతో
+దాటేసింది.
+
+"ఎవరా హనుమంతరావు?"
+
+భాగ్యలక్ష్మి మళ్ళీ తన మొదటి ధోరణికి మళ్ళింది.
+
+"హనుమంతరావు అనే ఆడపిల్లతండ్రి ఒకాయన వున్నాడీ కృష్ణాజిల్లాలో."
+
+"ఏవంగుణ విశేషణ విశిష్టులైన ఏతన్నామధేయులు ఈ జిల్లాలో ఒకరేం ఖర్మ, ఊరికో అరడజను మందున్నారు."
+
+"వుండనీ, మనకి కావలసింది ఈయన ఒక్కడే."
+
+"సరే, వున్నాడు."
+
+"అతడు తన ‘కన్యాం కనక సంపన్నాం" రామారావనే కాలేజీ ట్యూటరుకు ఇవ్వడానికి...."
+
+విషయం అర్థం అవుతూందనిపించింది, సుశీలకి.
+
+"ఆయనిప్పుడు ట్యూటరు కాదు."
+
+"అందుకే ఆయన తాను మామను కాదలచుకోలేదన్నాడుట."
+
+"ఎవరితో, ఎప్పుడు."
+
+"నాన్నగారి దగ్గర...."
+
+సుశీలకా సమాచారం నమ్మతగినదిగా తోచలేదు, నవ్వింది.
+
+"ఇప్పుడామాట ఎందుకొచ్చింది? ఈయనే ఇప్పుడా తలపులో లేడుకదా."
+
+"ఇప్పుడియనగారు సిద్ధంగానే వున్నాడు. నువ్వు చెప్పేది ఒకనాటి మాట."
+
+ఆ చెప్పడంలో సంతోషం, ఉత్సాహమే గాని సానుభూతిలేదు. కసీ కనబడ్డంలేదు. తనకు దారి నిరాటంకం అయిందన్న ఆలోచనా? అదే
+అయితే ఈ ధోరణితో ఆమె విజయం పొందలేదు. చెప్పాలి. నేర్పాలి,-- అనుకొంది, సుశీల.
+
+"రామారావుకు ఏమాత్రం అపకారం జరిగినా మేలేనన్నట్లు ఆ మాటేమిటి?"
+
+భాగ్యలక్ష్మి తెల్లబోయింది. అంతలో సర్దుకొని, తనని సమర్థించుకొంటూ "అతని కంతే జరగాలి," అంది.
+
+"అబ్బో. అతనికెంత నీలుగు? ఎంత గర్వం? తానే అందగాడినని, తన్నుచూసి ఆడపిల్లలంతా మూర్ఛ పోతారని...."
+
+ఆ ఆరోపణలకు సుశీల విస్తుపోయింది. తన మాటలకు ఆ ముఖంలో విశ్వాసం కనబడకపోవడంతో భాగ్యలక్ష్మి ముక్తాయింపుగా
+వినిపించింది.
+
+"అతని సంగతి నీకేం తెలుసు. నన్నడుగు చెప్తా, నా పదోఏట నుంచి చూస్తున్నా."
+
+"నిజంగా నమ్మకం వుండే అంటున్నావా?"
+
+రామారావు అందవికారంగా ఉండడేగాని అందగాడు కాదు. వయస్సులో వున్నాడు. ఆరోగ్యవంతుడు. నిరాడంబరంగా ఉన్నా నీటుగా ఉంటాడు. అదే
+చూడముచ్చటగా వున్నాడనిపించే లక్షణాలు. మంచి తెలివిగలవాడవును. ఆ పరిజ్ఞానం ఆయనకుంది. ఆ రెండూ వున్న వాళ్ళలో
+సాధారణంగా కనిపించే అహంభావమూ వుంది. కాని, ఎవ్వరినీ మాట తూలడు. ఆడవాళ్ళవద్ద ప్రతి యువకుడూ కనబరిచే ఆత్మ
+ప్రకటనాసక్తివుంది. కాని వాళ్ళ వెంటబడతాడనుకోలేం. మర్యాద దాటడు.
+
+కాని భాగ్యలక్ష్మి సుశీలకున్న సదభిప్రాయాన్ని నిరాకరించింది.
+
+"నీకేం తెలుసు? మా యింట్లో నాలుగైదేళ్ళున్నాడు. నాకు తెలుసు."
+
+"కాని, మీ అక్క అభిప్రాయం వేరు. దానికి ఆయన మీద...."
+
+"దానికి అతని మీద మంచి అభిప్రాయం ఉండకేం. ఏం లేకపోతే, మేలుకొన్న పది పదహారు గంటలూ అతని వొడిలో దూరిందా?"
+
+సుశీలకు కోపం వచ్చింది.
+
+"ఒళ్లెరిగే మాట్లాడుతున్నావా? నోటికేంవస్తే అది అనెయ్యడమేనా?"
+
+భాగ్యలక్ష్మి భయపడింది. ఉడుకుబోతుతనమూ కలిగింది. చర్రున లేచింది. కాని సుశీల పోనియ్యలేదు. చెయ్యి పట్టుకు లాగి
+పక్కన కూర్చోబెట్టుకుంది. గడ్డంపట్టుకుని, వంచుకున్న తలను పైకెత్తింది. కళ్ళల్లోకి చూస్తూ తల అడ్డంగా తిప్పింది.
+
+"నీ మనస్సు చెప్పడానికి మార్గం ఇదనుకున్నావా?"
+
+"నాకెవరిమీదా మనస్సూ లేదు. మనస్సు తెలియచెప్పవలసిన పనీ లేదు."
+
+మాట అనేసేక గాని గుర్తు రాలేదు. తన విషయం సుశీలకు ఎంత తెలుసో ఏమోగాని తాను బయట పడిపోయింది. అభిమానపడి గమ్మున
+లేచింది. సుశీల మళ్ళీ చేయి పట్టుకుంది.
+
+"వదులు."
+
+"కూర్చో. నీతో మాట చెప్పాలి."
+
+"ఏమీ చెప్పనక్కర్లేదు. అతణ్ణిచూస్తే ఒక్కొక్కమాటు పీక పిసికెయ్యాలనిపిస్తుంది. నీకేం తెలుసు. వట్టి దొంగవేషం. ఏమీ
+ఎరగనట్లుంటాడు. మోసగాడు. వట్టిమోసం."--అంటూ భాగ్యలక్ష్మి ఏడ్చేసింది.
+
+ఆమె ఆవేశం, ఆ వేగం చూసి సుశీల జాలిపడింది. వీపు నిమురుతూ తొందరపడవద్దని సముదాయించింది.
+
+"నీ అభిప్రాయం ఆయనెరుగునా?"
+
+ఆ సానుభూతికి భాగ్యలక్ష్మి పెంకెతనం, పెడసరితనం అన్నీ ఎగిరి పోయేయి. తాను అతి నిగూఢంగా దాచుకుంటున్న అంతరాంతరాల
+ఆశల్ని బయటపెట్టేస్తున్నానన్న ఆలోచనకూడా ‘లేకుండా’ తెలుసునన్నట్లు తల తిప్పింది.
+
+ఆమె కిష్టం వుంది. ఆయన కామె మీద మనస్సు లేదు – అనే అభిప్రాయానికి వచ్చి చిన్నప్పుడు హైస్కూలులో తెలుగు మేష్టారు
+చదువుతూండిన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొంది. "యాం చింతయామి సతతం మయి సావిరక్తా, సాప్యన్యమిచ్ఛతి...." ఇల్లాంటి ఘట్టాలు
+నిత్య జీవితంలో ఎదురవుతూండేవే. వానికి సమాధానం ఏం ఉంది? లేదు గనకనే భాగ్యలక్ష్మి ధూర్తపధ్ధతిలో ఎదుర్కొంటూంది. దాని
+వలన అనుకొన్న ఫలితాలు రావు సరికదా, వ్యతిరేక ఫలితాలనిస్తూందని నాలుగు రోజుల నాటి రామారావు మాటలు చూపుతున్నాయి.
+
+"చదువుంది. రూపం వుంది. పరిచయంవుంది. అన్నింటికీ మించి ఆయనే కావాలంటున్నావు. ఈ స్థితి ఎందుకొచ్చింది?"
+
+గతం తలుచుకొని భాగ్యలక్ష్మి ఏడ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో అణచిపెట్టుకొన్న ఆవేదన ఒక్కమారు కట్టలు తెంచుకుంది.
+
+"అతనికి బోలెడు మంది. కాని, నాకాతడొక్కడే. అతడే కావాలనే కోరికను నేనెప్పుడూ అణచుకోలేకపోయేను. అలాగ విస్పష్టంగా
+చెప్పనూ లేకపోయేను. ఆ రోజుల్లో అక్కా అతనూ కలిసివుండేవారు. ఇంట్లోవున్నా కాలేజీకెళ్ళినా జంట విడేవారు కారు. అది చూస్తే
+వాళ్ళిద్దరి గొంతులూ పిసికెయ్యాలనిపించేది. అది మరొకర్ని పెళ్లి చేసుకొంటూందన్నప్పుడు అతని మొహం చూడాలి. వెంటనే దాని తల
+పగల కొట్టాలనిపించింది."
+
+"ఓ యింట్లో వుండడం, కలిసి కాలేజీ కెళ్ళడం, రావడం, స్నేహంగా వుండడం – వీటికి నువ్వెంత విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావో
+తెలుసా?"
+
+జాలి పడుతున్నట్లు భాగ్యలక్ష్మి ఆమె వంక చూసింది.
+
+"ఇష్టంగా వుండడం వేరు. పెళ్లి చేసుకోడం వేరు."
+
+"ఉహూ." అని సాగదీసుకొంది, భాగ్యలక్ష్మి.
+
+"ఆయన మీద ఆ మమకారమే వుంటే పెళ్లి చేసుకోడానికి దానికి అడ్డేముంది?"
+
+"మా అమ్మ, పెద్దమ్మ, నాయనమ్మ అంతా ససేమిరా అన్నారు."
+
+"అయితే మాత్రం?"
+
+"ఐ. పి. యస్. వాడిని చూసే సరికి అదీ ఐసయిపోయింది."
+
+సుశీల నమ్మలేదు.
+
+"ఆయన్ని ప్రేమించి పెళ్ళిచేసుకొందని విన్నాను."
+
+"ఎవ్వడూ లేనప్పుడు రామారావు పనికొచ్చేడు. అల్లాగని మరెవ్వరినీ ప్రేమించ కూడదేమిటి?"--అంది భాగ్యలక్ష్మి కసిగా.
+
+సుశీల వెంటనే ఏమీ అనలేదు.
+
+"నువ్వే మీ అక్క స్థితిలో వుంటే ఏం చేసే దానివి?"
+
+"అంటే"
+
+"మరొకరిని పెళ్ళాడనంటావా?"
+
+భాగ్యలక్ష్మి ఆలోచనలో పడింది.
+
+"నేనతని మీద ఆశ వదులుకోలేకుండా వున్నాను. పెళ్ళి అయిపోయివుంటే ఏమి చేసే దానివంటావేమో. ఒక్కొక్కప్పుడు భయంకరమైన
+ఆలోచనలు కలుగుతుంటాయి."
+
+"అందరూ ఒక్కలా వుండరు నిజమే. కాని మగవాడు తనకు చనువైన ఆడుదాన్ని అంత సులభంగా మరిచి పోలేడు. కాని, ఆడది అల్లా
+కాదు. ఒక్క గంటలో గతాన్ని పక్కకు నెట్టెయ్యగలదు. ఎప్పుడేనా ఈ విషయం ఆలోచించేవా?"
+
+"చూసేను కాదా!"
+
+"మరి నువ్వు కావాలనుకొన్న మగవాణ్ణి నీవేపు తెచ్చుకోడానికి నువ్వు అనుసరిస్తున్న ఈ పద్ధతేమిటి?"
+
+భాగ్యలక్ష్మి చుర్రుమనేలా చూసింది.
+
+"అతని పక్కలో చేరమనా?"
+
+సుశీల తల తిప్పింది.
+
+"నీకు అభ్యంతరం ఏపాటిదుందో నాకు తెలియదు. అయితే నా వుద్దేశ్యం అది కాదు."
+
+"నా నియమాలు నాకున్నాయి."
+
+"అవసరమే. కాని, నా ప్రశ్న నియమం, నిగ్రహం గురించి కాదు. ఆయనతో నువ్వు వ్యవహిరిస్తున్న తీరు గురించి నే
+చెప్తున్నా. చీటికీ, మాటికీ ఆయనని సూటి పోటీ మాటలంటున్నావు, కజ్జా పెట్టుకుంటున్నావు, మొన్నటికి మొన్న నీళ్ళు పట్టుకెళ్ళి
+ఇచ్చి వచ్చేవు. ఏమన్నావో తెలియదు. కాని, ఆయన చాల బాధ పడ్డట్లనిపించింది. ఏదో ఆని వుంటావు. అదేం పధ్ధతి?"
+
+భాగ్యలక్ష్మి ఒక్క నిముషం వూరుకొంది.
+
+"కోపం తెచ్చుకోకు. అతడు ఎవరితోనన్నా మాట్లాడితే, ఎవరినన్నా ముట్టుకొంటే...."
+
+సుశీలకు అర్థం అయింది. ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసుకు చూసింది. భాగ్యలక్ష్మి అపరాధం చేసినట్లు తల వంచుకుంది.
+
+"నా మెదడులో శూలాలు గుచ్చినంత బాధ. అతడొక్కడి విషయంలోనే నన్ను నేను నిభాయించుకోలేను."
+
+సుశీల ఆమె తల మీద చెయ్యి వేసి జాలిగా నిమిరింది.
+
+"పిచ్చిదానా!"
+
+"ఇటువంటి బాధ నా కొక్కర్తికేనా. అందరికీ వుంటుందా? జీవితం మీద విరక్తి కలుగుతుంటుంది. నేనెందుకీ వుద్యోగం చేస్తున్నానో
+తెలుసా? ముఖ్యంగా అతని మాటకోసం. అమ్మ పెద్దమ్మ తిట్టేరు. నాన్న వద్దన్నారు. పోయి ఎం.ఎస్‌సి.,
+చదువుకోమన్నారు. నేనే ఒప్పుకోలేదు. అతనికి దగ్గరగా వుండడం కోసం. అతను ఆడది వుద్యోగం చేసుకోవాలంటాడు. ఆ మాట కోసం.
+అతనది గుర్తించాలని నా ఆశ. కాని ఎదురు వెక్కిరించేడు. కాని నేను మానలేదు. మానను. కోపం మాత్రం వచ్చింది. గయ్
+మంటున్నాను."
+
+"గయ్ మంటావు సరే. కాని దాని ఫలితం ఎల్లావుంటుందో ఎప్పుడేనా ఆలోచించేవా? గయ్ మనే ఆడదాన్ని చూస్తే మగాడికి తన మగతనం
+గుర్తుండదు."
+
+ఆ మాట అర్థం ఏమిటాయని భాగ్యలక్ష్మి సుశీల ముఖంలోకి గుచ్చి చూసింది.
+
+"ఆడదాని దగ్గరకు వచ్చేసరికి మగవాడు చాల ఇన్ఫీరియారిటీ ఫీలవుతాడు. ఒక్కమాట, ఒక్కచూపు, ఒక ఆదరంతో ఆడది
+మగవాణ్ని కుంగదియ్యగలదు. కుంగి పోయినవాణ్ని ఉద్ధరించనూగలదు. దూరం తరిమెయ్యగలదు."
+
+"నేనల్లా చేసేనంటావు."
+
+"అది నువ్వాలోచించుకో. ఏది ముందో, ఏది వెనకో తెలియదు. చెఖోవ్ కథ 'కిస్' చదివేవా? దాంట్లో రియా బోవిష్ పాత్ర
+గుర్తుందా? రావి శాస్త్రిగారి అల్ప జీవిలో సుబ్బయ్య? ఆడది మగవాడిలో ఎటువంటి ఉత్తేజం కలిగించ గలదో అవి
+చెప్తాయి...."
+
+ఈ సాహిత్య చర్చ తన కెల్లా నప్పుతుందో ఆలోచిస్తూంది భాగ్యలక్ష్మి.
+
+"నీ జెలసీకి అర్థం వుందా?"
+
+"లేదంటావు...."
+
+"వుందా? ఎప్పుడన్నా ఆయన...."
+
+భాగ్యలక్ష్మి చర్రుమంది.
+
+"ముట్టుకుంటే చంపేస్తాను."
+
+సుశీల నవ్వింది.
+
+"మరి పేచీయే లేదు. నీ ఏడుపెందుకు?"
+
+"అర్థం లేనిదే....కానీ...."
+
+మాట పూర్తిచేయకుండానే భాగ్యలక్ష్మి లేచింది.
+
+
+
+
+ఇరవైయారో ప్రకరణం
+
+
+కాస్త పెద్దదిగా వున్న వూళ్ళో నల్లా తెలుగు దేశం అంతటా తల ఎత్తిన కమిటీ కాలేజీలూ, హైస్కూళ్ళలో ఎక్కడన్నా కాస్త
+జాగా దొరక్కపోతుందాయని బయలుదేరిన రామారావు వారం నాటికి నరసాపురం రేవులో తేలేడు. మొట్టమొదటి రేవు నావలో గోదావరి డెల్టాలో
+అడుగు పెట్టాలని తెల్లవారగట్ల నాలుగున్నరకే రేవులోకి వచ్చేడు. రాత్రి పడుకున్న చోట దోమలు. ఉక్క. వానిని మించి
+ఆలోచనలు. రాత్రి తెల్లవారూ నిద్రే లేదు. అలసటగా వుంది. కాని బయలు దేరేడు.
+
+రేవులో ఒక పక్కగా వున్న పాకలో మసి బారిన లాంతరు ముందు కూర్చుని రేవు చీట్లు అమ్ముతున్నారు. రేవు దగ్గర లైట్లు లేవు.
+చీకటి పాకవేపుగా నాలుగడుగులు వేసే సరికి పెద్ద కంకరబండ కొట్టుకొని తూలిపోయేడు. కాలిన జోడు ఉండడంచేత కాలివేళ్ళకు
+తగలలేదు. తూలి చేతిలోని సూట్ కేసు మీద ఆనుకోవడంచేత మొగం పగలలేదు. రాతికి కొట్టుకొని మోకాలి మేడక కొట్టుకుపోయింది.
+ప్ర్రాణం జిలార్చుకుపోయింది.
+
+కంకర రాళ్ళు రేవులో పరిచేరు. ఏటి గట్టు రివిట్ చేసేరు. మిగిలిపోయిన రాళ్ళన్నీ గట్టుమీద చెల్లా చెదురుగా పడేసి
+వున్నాయి. పట్టణంలో రోడ్ల మీది లైట్ల వెలుతురులోంచి వచ్చిన కళ్ళకి అక్కడి చీకటి మరింత దట్టం. ఏమీ కనబడదు.
+
+ప్రయాణీకులెవ్వరో తూలిపడిన చప్పుడు విని పాక దగ్గరలో వున్న రేవు పడవ కళాసీ జాగ్రత్త చెప్పేడు.
+
+"జాగ్రత్త బాబూ! రాళ్ళు."
+
+దెబ్బ తగిలిం తర్వాత చేసిన ఆ హెచ్చరికకి రామారావు ఒళ్ళు రగిలి పోయింది. మోకాలు పట్టుకొని ఆ రాయిమీదనే కూర్చుండిపోయాడు.
+
+"ఓ లైటు ఇక్కడ తగలేస్తే మా కాళ్ళు విరగవు. మీ దరిద్రం పెరగదు."
+
+పడవ ఆసామీ ఆ మాటకు కోపం తెచ్చుకోలేదు.
+
+"మీ దొక్క రోజు పని. మాది రోజూ, రోజంతా పని. లైటుంటే మాకూ బాగే బాబూ!"
+
+అదీ నిజమే. దెబ్బ తగిలిన బాధలో ఎవరినో తిట్టెయ్యాలనిపించింది. పొరుగూరు. పళ్ళు కొరుక్కుని వూరుకున్నాడు.
+
+"బాగా తగిలిందేటండి." అంటూ కళాసీ దగ్గరకు వస్తూ పరామర్శించేడు.
+
+"కాలు విరగలేదు...." అంటూ రామారావు రాయిని పట్టుకొని లేచేడు.
+
+"పెట్టె ఇల్లా ఇవ్వండి. పడవలో పెడతా. నెమ్మదిగా వెళ్ళి టిక్కెట్టు తెచ్చుకోండి. దారిలో దుంగలున్నాయి."
+
+"రక్షించేవు." అన్నాడు వెక్కిరింతగా "ఇల్లా ఎందరికి చెప్తావు. ఆ రాళ్ళూ, దుంగలూ తీసేస్తే మాకూ, నీకూ కూడ క్షేమమే
+కదా."
+
+అతడేం సమాధానం ఇవ్వలేదు.
+
+రామారావు కుంటుకుంటూ వెళ్ళి టిక్కట్టు తీసుకున్నాడు. తీసుకుంటూ తన మనస్సులోని అక్కసు వెళ్ళగక్కేడు.
+
+"ఇంత డబ్బు వసూలు చేస్తున్నారు. రేవులో రెండు లైట్లు ఎందుకు వెయ్యరు?"
+
+గుమాస్తా ఏదో గొణిగేడు. మాట తెలియలేదు. మోకాలు సలుపుతూంటే రామారావు చుర్రుమన్నాడు.
+
+"గొణుగుతావేం. మాట సరిగ్గా చెప్పు."
+
+గుమాస్తా ఇల్లాంటి వాళ్ళ నెందర్నో చూసేడు. ఎందరో అతడినదే ప్రశ్న వేసేవుంటారు. అనేక మందికి చెప్పగా చెప్పగా అతనికి
+రాజాలాంటి సమాధానం ఒకటి దొరికింది. దానికి ఎక్కడా తిరుగులేదు.
+
+"ఇంట్లో పెళ్ళాన్ననుకున్నావా, కోప్పడుతున్నావు. నన్నడుగుతావేం. పోయి కంట్రాక్టరు నడుగు."
+
+అంత బాధలోనూ రామారావుకు నవ్వొచ్చింది.
+
+"నీలాంటి పెళ్ళాం ఇంట్లో వుంటే జీవితంలో ఆడదాని వాంఛే కాదు. అసలు జీవితం మీదనే వాంఛ పోతుంది. ఆ కంట్రాక్టరుకూ అదే అనిపించి
+వుంటుంది. నిన్నిక్కడికి తోలేడు."
+
+తిరుగులేదనుకున్న తనమాటకి సమాధానం వచ్చేసరికి గుమాస్తా తెల్లబోయేడు.
+
+"ప్రతివాడికీ గుమాస్తాగాడే లోకువ."
+
+తన అసలు ప్రశ్నకు సమాధానం రానేలేదు. వస్తే మాత్రం తానేం చెయ్యగలడు? ఏమీలేదని రామారావుకు తెలుసు. కంట్రాక్టరు
+ఒక్కడేనా? ఈ రేవు పాట ఈవేళే కొత్తగా ప్రారంభం కాలేదు. పట్టణంలోకి కర్రెంటు వచ్చికూడా చాలాయేళ్ళయింది. కంట్రాక్టర్లు
+మారేరు. గవర్నమెంట్లూ మారేయి. మునిసిపాలిటీ ఎన్నో పాతకూసాలు విడిచింది. ప్రతి ఒక్కరికీ రేవు పాట సంగతే పట్టింది.
+ప్రయాణీకుల సమస్య ఎవరికీ పట్టలేదు. కనీసం రేవులో లైట్లు కూడా లేవు. ఆ మాట ఎవరికీ తోచలేదనలేరు. చాల మంది
+గుర్తుచేసి వుంటారు. కాని దాని ఖర్చు ఎవరు భరించాలో తేలి వుండదు. మునిసిపాల్టీయా? కంట్రాక్టరా? పబ్లిక్‌వర్క్స్
+డిపార్ట్‌మెంటా?
+
+పాక వద్ద గుమాస్తా కంఠం విన్నాక గట్టుకింద రేవులోంచి కళాసీ కంఠం వినిపించింది.
+
+"పడవ తోసేస్తున్నాం, రాండి, బాబూ."
+
+తన ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చెయ్యకుండానే రామారావు కుంటుకుంటూ రేవులోకి నడిచేడు. పాకలో గుమాస్తా సాధింపు
+వినిపిస్తోంది.
+
+"ఈ మగాడొచ్చాడిన్నాళ్ళకి. కంట్రాక్టరేడిట కంట్రాక్టరు."
+
+పడవలో కూర్చున్నాక కళాసీ చెప్పిన మాటల్ని పట్టి ఒకటి అర్థం అయింది. రేవు కేవు వసూలు చేసే హక్కు ఎవరిదో తెలుస్తూనే
+వుంది. కాని లైట్లు వేయవలసిన బాధ్యత యింకా ఎవరిదో తేలలేదు.
+
+"మీరడిగింది పాకలో గుమాస్తా గారిని. ఆ గుడ్డి దీపం ముందు కూర్చుని చీట్లుకోయడం ఆయనకి మాత్రం సరదా యేటండి."
+
+కాలికి తగిలిన దెబ్బ చిమచిమ లాడుతూంటే మనస్సు సమాధాన పడలేకుండా వుంది. ప్రజలలో వున్న పిరికితనం,
+సివిక్‌సెన్సు లేకపోవడం చూసుకొని అడ్డమైన గాడిద కొడుకులూ జనాన్నీ, దేశాన్నీ పీల్చేస్తున్నారన్నాడు.
+
+"మనకంటే కోడీ, మేకా నయం. గొంతు కోస్తూంటే అరుస్తాయి. పారిపోవడానికి గిజాయించుకుంటాయి. మనం అదీ చెయ్యం." అన్నాడు.
+
+"అసలు రేవు పాడినోడు రేవు సాయలకి రాగా నేనెన్నడూ సూడలేదండి. వచ్చేదల్లా ఆరు పంపే గుమాస్తా. ఆయనకి తోడుగా
+రౌడీసుగాళ్ళని ఏర్పాటు చేస్తారు. మీ అదురుట్టం బాగుంది. ఆ నంజకొడుకక్కడ నేడు. నేకుంటే పెద్ద గొడవయిపోయేది."
+
+
+
+
+ఇరవైయేడో ప్రకరణం
+
+
+పడవ దిగి బస్సు వద్దకు నడుస్తూంటే చటుక్కున గుర్తు వచ్చింది. రేపే బలరామ్ పెళ్ళి. ఇక్కడే సెంట్రల్ డెల్టాలో వూరు.
+పేరు జ్ఞాపకం వుంది. ముంగండ. కమ్యూనిస్టు సాహిత్యం ద్వారా పరిచితమైన వూరు. కాని, పెళ్ళివారి పేరు గుర్తు లేదు. శుభలేఖ
+చూసినప్పుడు వెళ్ళ గలుగుతానని గట్టిగా అనుకోలేదు. ఉద్యోగాన్వేషణలో ఏమూల వుండేదీ నిశ్చయం లేదు. ఆ రోజుకి గ్రీటింగ్స్
+పంపి వూరుకుందామనుకున్నాడు.
+
+కాని, ఈవేళ ఆ వూరికి దగ్గరలోకి వచ్చామనుకున్నప్పుడు తాను జయప్రదతో మాట్లాడడం అవసరమనుకొన్నది కూడా గుర్తు
+వచ్చింది. వూళ్ళంబడి వెంటబడి చెప్పడం మర్యాదా అనిపించక పోలేదు. కాని, ఈపాటికి సత్యనారాయణ హనుమంతరావు గారితో మాట్లాడి
+వుంటాడు. గతంలో హనుమంతరావే అటువంటి ఆలోచన తెచ్చి వుండడం చేత ఇప్పుడాయన అంగీకరించక పోవడం వుండదని రామారావు
+అభిప్రాయం.
+
+కాని, అసలు విషయం ఆమె ఆస్తి మీదనే తానీ మేడలన్నీ కట్టాలి. ఆ మాట ఆమెకు తానే చెప్పాలి. తండ్రి చెప్పి
+ఒప్పించడానికి ముందు అందులోవున్న అసలు మెలిక చెప్పేసి, ఆమె అన్నీ యెరిగి ఒప్పుకోవడమో, ఒప్పుకోక పోవడమో
+తేల్చుకొనేలాచెయ్యాలి. కనక ముంగండలో ఆగాలనే నిర్ణయానికి వచ్చేసేడు.
+
+కండక్టరునడిగేడు.
+
+"ముంగండ ఎక్కడ?"
+
+"మన బస్సు ఆ వూరు మీదుగానే వెడుతుంది. మీరెక్కడికి వెళ్ళాలి."
+
+"ఆ వూరే వెళ్ళాలి."
+
+"ఎక్కండి."
+
+అంతలో అనుమానం. పెళ్ళివారిపేరూ, ఇంటిపేరూ తెలియకుండా ఎవరింటికని వెళ్ళడం. వూరు చిన్నదైతే ఫర్వాలేదు.
+
+"ఊరు పెద్దదేనా?"
+
+"నూరిళ్ళుంటాయి."
+
+అయితే ఫర్వాలేదు. పట్టుకోవచ్చు. ఒకవేళ పట్టుకోలేకపోతే పలాయన మార్గం వుంటుందా? మళ్ళీ ప్రశ్న.
+
+"దీని తరువాత ఆ వూరు మీదుగా వెళ్ళే బస్సు ఎన్నిగంటలకి?"
+
+కండక్టరు చిరాకు పడ్డాడు.
+
+"నాకు తెలియదు."
+
+తోడి ప్రయాణీకుడొకడు చెప్పేడు.
+
+"ఆవూరు మీదుగా అమలాపురం పోయే బస్సులు గంటకీ అరగంటకీ చాలానే వున్నాయి."
+
+"ఇహనేం. ఇల్లు దొరక్కపోతే, కలుసుకోవలసిన మనిషి రాకపోతే తరవాతి బస్సు ఎక్కేద్దాం." అనుకున్నాడు.
+
+కొబ్బరి తోటల మధ్యనుంచి, పంట కాలవలు దాటుకుంటూ బస్సు పోతూంది. తోటల మధ్యనే యిళ్ళు. ఇళ్ళ గుమ్మాలలో కాలవలు.
+కాలవలమీద కొబ్బరి బొందలు రెండూ మూడూ చేర్చివేసిన వంతెనలు. ఏటిగట్టు దారిపొడుగునా దృశ్యాలు మనో రంజకంగా వున్నాయి. రోడ్డు
+ప్రక్కనే చెట్లకింద పచ్చగా ముగ్గిన అరటి గెలలూ ఇన్ని సోడాలూ పెట్టుకొని చిన్నచిన్న పందిరి దుకాణాలూ, టీ కొట్లూ.
+
+వంటచేలు, చెరుకు తోటలు, మళ్ళీ కొబ్బరి తోటలు--ఇంత పుష్కలంగా పండుతున్న దేశంలో దరిద్రం, తిండిలేక మాడడం. బీదరికం,
+చదువు సంధ్యలు లేకపోవడం. చదువుకొని, పదిమందికి చెప్పడానికి తయారయిన తాను చదువు చెప్పించుకొనే వాళ్ళని వెతుక్కుంటూ రోడ్లు
+పట్టి తిరగవలసి రావడం.
+
+కాలవ అంచునే ప్రయాణం చేస్తూ బస్సు చెట్ల నీడ పొదలలో మిలమిల లాడుతున్న చిన్న చిన్న పల్లెలు దాటింది. వంతెనలు,
+లాకులు, సీమచింత తోపులు దాటింది. ఎదురుగా గోదావరి. దానిమీద అక్విడక్టు కట్టి నీరు పారిస్తున్నారు. అక్విడక్టు మీద
+కాలవ పక్కనే విశాలమైన మోటారు రోడ్డు. కాలవలో పడవలు, రోడ్డుమీద కార్లు. రిక్షాలు, మనుష్యులు. ఆ ఉదయకాలపు
+నులివెచ్చని సూర్యకిరణాల బంగారు పూతలో ప్రకృతి బహు రమ్యంగా వుంది.
+
+"ఈ వూరు నేమంటారు?"
+
+"ఈ గోదావరి పాయమీద కట్టిన అక్విడక్టుకి ఆ కొసన, ఈ కొసన వున్న వూళ్ళని గన్నవరమే అంటారు. ఈ దిగువ వూరికి
+డొక్కా శీతమ్మగారి ద్వారా జిల్లాలుదాటి పేరుంది."
+
+ఆమె దాతృత్వం కథలు విన్న రామారావు ఆమె వుండిన యిల్లేనా కనిపిస్తుందేమో నన్నట్లు తల బయటకుపెట్టి చూడసాగేడు.
+
+"తల బయటకు పెట్టకండి."--అని హెచ్చరించి కండక్టరు 'రైట్' అన్నాడు.
+
+బస్సు మళ్ళీ కదిలింది.
+
+
+
+
+ఇరవైయెనిమిదో ప్రకరణం
+
+
+బస్సు ముంగండ వద్ద ఆగింది. రోడ్డు పొడుగునా దుకాణాలు. పాకలూ, పందిళ్ళలో నైతేనేం కాఫీ దుకాణాలు. పళ్ళకొట్లు, సైకిలు
+షాపులు, రెండో మూడో బట్టలకొట్లు, మందుల షాపులు. చిల్లర కొట్లు--ఆ సందడి చూసి రామారావు సందేహిస్తున్నాడు. ఇది చిన్న
+వూరేమిటని అతని అనుమానం.
+
+"ఇదే ముంగండ. దిగుతామన్నారు?"
+
+తోడివాని హెచ్చరిక వినగానే రామారావు సూట్‌కేసు అందుకొని దిగేసేడు.
+
+బస్సు నిష్క్రమించేక ఒక్క నిమషం నిలబడి ఇంకేమిటి చెయ్యడం అన్నట్లు ఆలోచించేడు. ఎదురుగా హోటలులోని రేడియోలోంచి ఎవరో
+గాయకుడు తేలు కుట్టినట్లు అరుపుల సంగీతం వినిపిస్తున్నాడు. ఆ బాధ వినగలమా అని సందేహిస్తూనే, సాహసంచేసి పాకలో
+ప్రవేశించేడు.
+
+సెర్వరు కాఫీ తెచ్చేలోపున పక్కనున్న ఆసామితో పరిచయం చేసుకున్నాడు. కప్పు క్రిందపెట్టే వేళకి కావలసిన సమాచారం
+సంపాదించేడు.--ఆ రోజున ఆ వూళ్ళో మూడు నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.
+
+"మగ పెళ్ళి వారు కృష్ణాజిల్లానుంచి వస్తున్నారు"
+
+"పట్టాభిరామయ్యగారింటి కన్నమాట"
+
+"వారిల్లు...."
+
+"చూపిస్తారా" అని రామారావు అడగలేక పోయేడు. ఆయన కూడ పని మానుకువచ్చి చూపించడానికి సిద్ధంగాలేడు.
+
+"చూడండి. ఈ పక్కనే ఉన్న వీధి. దీనిని రాజవీధి అంటారు. తిన్నగా వెళ్ళండి. కొంత దూరం వెళ్ళేక కుడియెడమలకి అడ్డవీధి
+కనబడుతుంది. ఎడమ చేతికి తిరిగి కొద్ది దూరం నడుస్తే పెద్ద చెరువు. పావంచాల రేవు. దానికివతలే దగ్గర్లో పెళ్ళిపందిరి,
+హడావిడి తెలుస్తూనే ఉంటుంది"
+
+ముంగండ చెరువు మాట వినిపించేక రామారావు తన పని మరిచిపోయేడు.
+
+"హరిజనులని నీళ్ళు ముట్టుకో నివ్వరంటారు, ఆ చెరువులోనేనా?"
+
+ఆ ప్రశ్న ఆయనకి కొత్తగా గాని, అవమానంగాగాని తోచలేదు. నిజానికి కంఠంలో గర్వం ఛాయగా వినిపించింది కూడాను.
+
+"ఆ."
+
+"ఇప్పటికీ."
+
+"ఒకప్పుడు మా వూరు చదువులకి ప్రసిద్ధి. ప్రస్తుతం వానితో పాటు మా భుజకీర్తులలో రెండోది ఇప్పుడు మీరు చెప్పిందేనండి."
+అన్నారు వేరెవరో.
+
+మొదటి ఆయనకు కోపం వచ్చింది.
+
+"మీ కమ్యూనిస్టులు వచ్చేక మడీ, ఆచారం, పెద్దవాళ్ళంటే మర్యాదా అన్నీ తగలపెట్టేరుగా. చూడు. మాదిగ రత్తిగాడి కొడుకు
+సైకిలు మీద ఎంత దర్జాగా పోతున్నాడో వూళ్ళోకి."
+
+తానక్కడి ఆచారాలు, అలవాట్ల మంచిచెడ్డల చర్చకు రాలేదని రామారావుకి గుర్తొచ్చింది. మెల్లిగా మాట తప్పించడానికి
+ప్రయత్నించేడు.
+
+"పెళ్ళికూతురు తండ్రిగారి పేరు ఏమిటన్నారు?"
+
+"పట్టాభిరామయ్య గారు."
+
+అంతలో రోడ్డు మీద సైకిలు వేసుకు వెడుతున్న ఒకరిని చప్పట్లు కొట్టి పిలిచేడు.
+
+"ఆయన పెళ్ళికూతురు పింతండ్రి."
+
+ఇద్దరూ రోడ్డు మీదికి వచ్చేరు.
+
+"శీతారాముడూ. పెళ్ళిపనుల హడావిడిలో వున్నట్లున్నావు. చూడు, వీరు మీ ఇంటికే వస్తున్నారు."
+
+శీతారామయ్య ఎంతో వినయంగా నమస్కరించి, చాల ఆప్యాయంగా ఆహ్వానించేడు.
+
+"ఇప్పుడే బస్సులో దిగేరా. దయచేయండి. ఇంటికి వెడదాం."
+
+సూట్ కేస్ సైకిల్ కేరియరు మీద పెట్టించి. క్లిప్పు బిగించేడు.
+
+"పడదులెండి. ఇల్లాంటి చిల్లర సామానులు ఇంటికి చేరెయ్యడానికే ఈ గార్ధభ రాజం."
+
+రామారావు నవ్వేడు. పక్క పక్కనే నడుస్తున్నారిద్దరూ.
+
+"మగపెళ్ళివారు వచ్చేరాండి."
+
+"సాయంకాలానికి వస్తారు. ఉదయ ఘడియల్లో కదా పెళ్ళి."
+
+మగపెళ్ళివారు రానిదే వారి తరఫు మనిషిగా తాను అప్పుడే పెళ్ళికి రావడం అసందర్భంగా కనిపించింది. కాని, అంతలో తాను వచ్చింది
+ఆడపెళ్ళివారింటి మనిషి కోసం అనుకొని సర్దుకున్నాడు. అయినా సందేహం. జయప్రదను వెతుక్కుంటూ వచ్చేనంటే ఏమనుకుంటారో. తనకు
+ఆహ్వానం పెళ్ళికొడుకు నుంచి గాని పెళ్ళికూతురు వారికి తన పేరు కూడా తెలియదు. నిలబడ్డాడు.
+
+"నాకు అమలాపురంలో పనుంది. అది పూర్తిచేసుకొని పెళ్ళివారు వచ్చే వేళకి వచ్చేస్తా."
+
+సీతారామయ్య ఒప్పుకోలేదు.
+
+"రాండి. స్నానం, భోజనం చేసి వెడుదురుగాని. ప్రతి గంటకీ ఏదో బస్సు ఉంటుంది. లేకుంటే ఏ రిక్షాయో చేసుకు వెళ్ళొచ్చు."
+
+తప్పనిసరిగా రామారావు నడుస్తున్నాడు. అనేక ప్రశ్నలూ, కథోపకథనాలూ మధ్య అసలు ప్రశ్న జార్చేడు.
+
+"జయప్రద మీ పినతల్లి కూతురనుకుంటాను. వచ్చిందనుకుంటాను."
+
+"ఔను. ఆమెనేం ఎరుగుదురు?"
+
+"మా చెల్లెలికి క్లాస్ మేటు. స్నేహితురాలు. మా యింటికి తరుచు వస్తుంటుంది. బాగా ఎరుగుదును."
+
+"అయితే మరింకేం. మీకు సందేహం ఏమిటి?"
+
+పెళ్ళి ఇల్లు చేరగానే సీతారామయ్య అరుగుమీద కుర్చీ వేసి రామారావును కూర్చుండబెట్టేడు.
+
+"జయప్రదను ఒక్కమారు...."
+
+"పిలుస్తా. ఏ పనిలో వుందో. పెళ్ళి యిల్లు కద."
+
+"అందుకే నేనిక్కడ ఉండడం మీకు అదనపు పని, రెండోది అమలాపురంలో నా పనీ నిలిచిపోతుంది. జయప్రదతో చెప్పేసి వెడితే నే
+వేళకి రాగలిగినా, రాలేకపోయినా ఆమె నా హాజరు చెప్పేస్తుంది."
+
+"మళ్ళీ అదేమిటి? వుండండి. ఆమె ఏం చేస్తుందో చూసి, చెప్పి వస్తా."
+
+"ప్లీజ్."
+
+శీతారామయ్య లోపలికి వెళ్ళేసరికి తన అక్క రమణమ్మతో జయప్రద మాట్లాడుతూంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.
+
+"జయా! బెజవాడలో రామారావుగారట. ఎవరే?"
+
+"అదేమిటోయ్! ఆ మహా పట్టణంలో ఆ పేరు గలవారు కనీసం వెయ్యిమందికి తక్కువుండరు. అందులో నేనే పదిమంది వరకూ ఎరిగి
+ఉంటా. ఏం. వారింటిపేరు."
+
+"తెలియదు."
+
+"ఫో. డి. ఎల్. ఓ. (డెడ్ లెటర్ ఆఫీసు)కి రవాణా చెయ్యి. "
+
+"నిన్ను ఎరుగుదురుట. వచ్చేరు. నీతో చెప్పమన్నారు."
+
+"ఎందుకుట? అంది జయప్రద అనుమానిస్తూ.--"రావే, అక్కా చూద్దాం."
+
+"ఆయన బస్సు దిగి మన ఇల్లు వాకబు చేస్తూంటే తీసుకోచ్చేను. నీ పేరు చెప్పేరు. ఓ మారు పిలవమన్నారు."
+
+"ఆయన వొస్తారా?"
+
+"చూడరాదా పోయి." అంది రమణమ్మ
+
+"మనిషి ఎల్లా ఉంటారు?"
+
+"పాతికేళ్లుంటాయి. పొడగరి. కాలు కుంటుతున్నారు."
+
+స్త్రీలు ఇద్దరూ ముందు సావిట్లోకి వచ్చి కిటికీలోంచి చూసేరు.
+
+జయప్రద ఆశ్చర్యపడింది. "ఆయనే" అంటూ గబగబ గుమ్మం వేపు నడిచింది. "మా మేస్టా"రంది శీతారామయ్య కోసం.
+
+"ఎంతసేపయింది వచ్చి? ఎక్కడినుంచి వస్తున్నారు? రామారావుగారంటే ఎవరా అనిపించింది. మీరిక్కడికి...."
+
+రామారావు కుర్చీలోంచి లేచేడు.
+
+"నేనూ అనుకోలేదు. మొన్న, నిన్న నర్సాపురంలో వున్నా. ఈవేళ అమలాపురం వెడుతూంటే జ్ఞాపకం వచ్చింది. బలరామ్ పెళ్ళి
+ముంగండలో ఈ వేళనే కదా అని. కాని బయలుదేరేటప్పుడు అనుకోలేదేమో శుభలేఖ చూసుకోలేదు; కాని ముంగండ పేరు గుర్తుంది. దారిలో
+వుంది వచ్చాం. సంతోషిస్తాడు. కనిపించి పోదామని దిగా. తీరా చేస్తే ఎవరింటికెళ్ళాలో తెలియదు. అప్పుడు నీ పేరు
+గుర్తువచ్చింది."
+
+అనాహుతంగా. హఠాత్తుగా, ఇక్కడ కొచ్చేడేమిటనుకొంటుందేమోనన్నట్లు రామారావు మాటలు దొర్లించేస్తున్నాడు.
+
+రమణమ్మ తమ్మునితో వాళ్ళ బాంధవ్యం చెప్పింది.
+
+"జయ మగడు"
+
+"అక్కా! వీరే రామారావుగారు. ఇందాకా నా క్లాస్ మేట్ అన్నానే ఆమె అన్నగారు. మా మేస్టారు." అని జయప్రద పరిచయం
+చేసింది.
+
+క్షణంలో ఇంట్లోకి ఉప్పందింది. అతిథి మాత్రుడుగా వచ్చినవాడు ఇంటల్లుడంతవాడు. ఆయనను కూర్చోబెట్టిన కుర్చీ సావిట్లోకి
+మారింది. ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు. ఇద్దర్నీ పక్క పక్కన చూసి ఈడూజోడూ కుదిరిందని మెచ్చుకున్నారు. పెళ్ళి
+అడ్డు తీరకపోయినా భార్య కాగల పడుచుకోసం అతడు వెతుక్కుంటూ రావడం, ఇద్దరూ అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూండడం
+కొత్తగా వున్నా, అందరికీ ముచ్చటగా వుంది.
+
+పెళ్ళికూతురు తండ్రి చిన్న అబద్ధం ఆడేసి రామారావు అనాహుతంగా వచ్చేనేయని చిన్నపుచ్చుకోనక్కర్లేకుండా ప్రయత్నించేడు.
+
+"మీకు శుభలేఖ పోస్టు చేసేను. అందే వుంటుంది."
+
+అది అబద్ధమని రామారావుకూ తెలుసు. అక్కడి వారెవ్వరికీ తన పేరన్నా తెలియదు. కాని ఆ ప్రయత్నం ఎందుకో గ్రహించి తానూ
+అబద్ధాన్ని బలపరచడానికి ప్రయత్నించేడు.
+
+"కాలేజీ ఎడ్రసుకి వ్రాసి వుంటారు."
+
+దారి దొరికిందనిపించి వెంకటరామయ్య "ఔనౌను" అన్నాడు.
+
+"మీ ఇంటి ఎడ్రసు సరిగ్గా తెలియదు. వచ్చి పిలవడానికి గాని, ఎడ్రసు తెలుసుకొని వ్రాసేందుకుగాని వ్యవధి లేదు. కాలేజీకి
+వ్రాసి పడేయించేను."
+
+"నేనప్పుడే వారం రోజులవుతూందండి బెజవాడ వదిలి."
+
+"మరిహనేం. మా లేఖ అందినా రెండు మూడు రోజుల క్రితమే అంది వుంటుంది....పోనీలేండి. దేవుడు చెయ్యట్టుకు తీసుకొచ్చినట్లు
+వచ్చేరు. చాల సంతోషం. మగపెళ్ళి వారి తరఫు కాదు మీరు. మా తరఫునే వుండిపోవాలి." అన్నాడాయన.
+
+"జయా వారి సంగతేదో నువ్వే చూసుకోవాలి." అని హాస్యమాడేడు.
+
+"రమణా! వారికి కాఫీ, టిఫిన్ సంగతి చూడండి," అని పురమాయించేడు.
+
+"శీతారామ్! మేష్టారింటి వీధిగది వాడుకోవచ్చునన్నారు. వీరికి బస అక్కడియ్యి." అని ఆదేశించేడు.
+
+వెంకటరామయ్య సెలవు తీసుకొని తన పనిమీద వెళ్ళిపోయేడు. ఆయన భార్యవచ్చి, పలకరించి, కుశలప్రశ్నలు వేసింది. తాను
+మరో మారు జరగవలసిన మర్యాదలన్నింటినీ పురమాయించింది.
+
+"సిగ్గుపడకేం బాబూ! మీరూ మా పిల్లల వంటివారే. ఇల్లు కొత్తయినా మా జయ ఉంది."
+
+తమ వివాహం జరగకపోయినా జరిగిపోయినట్లే అందరూ వ్యవహరిస్తున్నారు. తాను వచ్చింది ఒకందుకు. అందులో తమ పెళ్ళి జరక్కుండా
+నిలిచిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాని, జరుగుతున్నది వేరు. బయటపడి సర్దుకొనేదెట్లో తెలియడం లేదు. అతనిమాట
+వినిపించుకొనేవారు లేరు. తిని వచ్చేనన్నా మరోమారు టిఫిన్ తినక తప్పలేదు. కాఫీ తాగక తప్పలేదు. నడి వేసవిలా వున్నా
+వేడినీళ్ళు పోసుకోక తప్పలేదు. అమలాపురం మరునాటికి వాయిదా వెయ్యక తప్పలేదు. తనకిచ్చిన గదిలో బట్టలు మార్చుకొనడం
+పూర్తి చేసేసరికి చాకలిని వెంటబెట్టుకొని జయప్రద వచ్చింది.
+
+"ఉతికే బట్టలు చాకలికి వెయ్యండి."
+
+ఆమెకు సరాసరి సమాధానం ఇవ్వక రామారావు అంగలార్చేడు.
+
+"నేరకపోయి వచ్చేననిపిస్తూంది, జయా...."
+
+జయప్రద నవ్వింది.
+
+"రోమియో పాత్ర ఏ రూపంలోనూ మంచిది కాదు. గుర్తుంచుకోండి."
+
+"ఆ పాత్ర విప్పెయ్యడానికే నీతో మాట్లాడాలని వచ్చేను."
+
+"ఏమిటా అర్జంటు!"
+
+"అర్జంటు. చాలా అర్జంటే."
+
+"ఆ హడావిడిలోనే కాలు విరుచుకొన్నారంటే అదేదో చాలా అర్జంటు మాటే అయివుంటుంది. ముందు బట్టలు చాకలికి వెయ్యండి. తరవాత
+డాక్టరు వద్దకు నడవండి."
+
+"ఇదంత పెద్ద దెబ్బ కాదు. దీనికి డాక్టరు పనేం లేదు."
+
+"అది చెప్పవలసింది మీరు కాదు, డాక్టరు."
+
+"ఈ పల్లెటూళ్ళో డాక్టరెక్కడ దొరుకుతాడుగాని, మధ్యాహ్నం అమలాపురం వెళ్ళినప్పుడు డాక్టరు సర్టిఫికెట్ సంపాదించి నీకు పోస్టు
+చేస్తా."
+
+"మరి అర్జంటు మాటేమవుతుంది."
+
+"డాక్టరు సర్టిఫై చేస్తేగాని మాట వినిపించుకోవేమిటి కర్మ."
+
+జయప్రద నవ్వింది.
+
+"ఇక్కడా డాక్టర్లున్నారు. నేను తీసుకువెడతాగా."
+
+"తప్పదంటావు."
+
+"ఇంటికొచ్చిన అతిథి కుంటుతూంటే మా పిన్నీ వాళ్ళూ ఏమంటారండీ."
+
+"అదొకటా."
+
+
+
+
+ఇరవై తొమ్మిదో ప్రకరణం
+
+
+మందు కోసం మరెక్కడికో వెళ్ళవలసిన పనిలేదన్నాక రామారావు తృప్తి పడ్డాడు.
+
+"మేస్టారి కొడుకు డాక్టరు. ఆయన వుద్యోగం కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే వున్నారు." అంది జయప్రద.
+
+"నాకు సహపాఠేనన్నమాట."
+
+జయప్రద ఆ సమయాన ఇంట్లోనే ఉన్న డాక్టరుకు రామారావును పరిచయం చేసింది. అదోదెబ్బ కాదన్న మాట తీసుకొని వెళ్ళిపోయింది.
+
+ఇంచుమించు ఒకే దశలో ఉన్న ఆ యువకులిద్దరూ త్వరలోనే స్నేహితులయిపోయారు. చదువుకున్న పడుచును పెళ్ళాడబోతున్నందుకు
+రామారావును డాక్టరు వేణుగోపాలరావు అభినందించేడు.
+
+"మీరు అదృష్టవంతులు మేస్టారూ! ఈ కరువు రోజులూ, పల్లెటూరి పెత్తందారుల అధికారాలూ సాగుతుండగా ఎంత కష్టపడ్డా, ఒక్క
+రెక్క మీద సంసారం నడిచే దారి కనబడ్డంలేదు. రెండోవారు కూడా కాస్త తోడుండాలి."
+
+"మాబోటిగాళ్ళ విషయంలో మీరు చెప్పింది నిజమే. కాని, నిత్య పంట వాళ్ళుకదా, డాక్టర్లు! మీకూనా?"
+
+"మీకూనా! ఏం ప్రశ్న వేశారు, మేస్టారూ! నన్ను చూడండి. కట్నం తీసుకుని కాని మెడిసిన్ గట్టెక్కించలేకపోయా. ఆ కట్నం
+కోసం, చదువు మొహం ఎరగని, కేవల భారత నారీమణిని చేసుకొన్నా. నేనేదో కొండ తవ్వి గాదెల కెత్తుతానని ఆమె భ్రమ.
+నోట్లో వేలెట్టుకుని చూస్తూంది. ఇద్దరం పోగడి హైస్కూలు మేస్టరీతో నాలుగురాళ్ళు తెస్తున్న మా నాన్నగారి చెరో భుజం మీద
+కూర్చున్నాం."
+
+ఆత్మగ్లానితో వేణుగోపాలరావు కంఠం రుద్ధమయింది. ఆ వ్యధకు రామారావు వద్ద ఓదార్పు మాటకూడా లేకపోయింది. ఒక్క క్షణం ఆగి
+వేణుగోపాలరావు తన కథ సాగించేడు.
+
+"హౌస్ సర్జెన్ పూర్తి చేసేసరికి చైనా యుద్ధం వచ్చింది. సైన్యాలలోకి భర్తీ అయ్యే డాక్టర్లకి ప్రత్యేక
+సౌకర్యాలిస్తామన్నారు. వెంటనే వుద్యోగం, యుద్ధంలో సర్వీసు చేసినంతకాలం అన్నేళ్ళూ డబుల్ ఇంక్రిమెంట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్
+కోర్స్ లో సీట్ రిజర్వేషన్లు, ఎన్ని వాగ్దానాలు? నేను సర్వీసునుంచి రిలీవ్ అయి ఏడాది దాటింది. ప్రమోషన్ల మాట
+దేవుడెరుగు, అసలు అప్పాయింట్ మెంటే లేదు. ముంగండ హైద్రాబాదుల మధ్య తిరిగేందుకు ఎక్కడి డబ్బూ చాలడం లేదు." అన్నాడు,
+నిరుత్సాహంగా.
+
+"వుద్యోగం కోసం గవర్నమెంటుని ప్రాధేయపడాలా, డాక్టరు గారూ," అన్నాడు పరీక్ష పేసయి బయటపడడం తడువుగా బెజవాడ
+వీధుల్లో వెలుస్తున్న క్లినిక్ లను తలుచుకొని, రామారావు.
+
+వేణుగోపాలరావు నవ్వేడు. ఆ నవ్వులో ఆనందం కాదు కనబడుతున్నది, ఆవేశం.
+
+"మనదేశం ఈవేళ ఉన్న పరిస్థితిలో పెట్టుబడి లేకుండా ఏ వృత్తీ ప్రారంభం చేయలేము. మీరు తప్పుపట్టుకోకపొతే ఒక్కటడుగుతా.
+మీకు వుద్యోగం లేదు. ట్యుటోరియల్ స్కూలు ప్రారంభించి మీ జీవితం గడుపుకోగలరా?"
+
+క్రితంరోజునే నరసాపురంలో లక్ష్మీనరసింహంగారితో జరిగిన చర్చ గుర్తొచ్చింది. కనీసం పదిహేనువేలు చేతబట్టుకోకపోతే నెలకో
+నాలుగువందలు తెచ్చుకోడం, పోటీలు సర్దుకోడం సాధ్యంకాదని ఆయన లెక్క చూపించేరు.
+
+అవి గుర్తు తెచ్చుకొన్నాక డాక్టర్ల ప్రాథమిక ఖర్చులు వగైరాలు గుర్తు వచ్చేయి. ఇంక వాదన అనవసరం. అంగీకరించేడు.
+
+"నిజమేలెండి."
+
+"మీరేమనుకుంటున్నారో తెలీదు. మీకింకా ఏమాశలున్నాయో అర్ధం కాదు. ఇంకా ఈ సంఘం మనని బతకనియ్యదు. దీనికి శస్త్రచికిత్స
+జరగాలి. మేమంతా దేశాన్ని వుద్ధరించగలమని శత్రువును ఎదుర్కోవాలని చైనా యుద్ధంలోకి వెళ్ళేం. దానికి ఆనాడు సి. పి. ఐ.
+లో నడిచిన వాదప్రతివాదాలు కూడా కొంత కారణమే లెండి. నాకు మార్క్సిస్టుల వాదమే కరక్టు అనిపిస్తూంది. చెప్పొద్దూ."
+
+"ఎందుచేత?"
+
+"చైనా వాళ్ళొస్తే ఏమయీది? ఈ భటాచోర్ లందర్నీ తుడిచి పెట్టేసేవాళ్ళు. దేశంలో వామరం వొదిలిపోయీది. అప్పుడు అందరికీ తిండీ,
+బట్టా అందించగల ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకొనేవాళ్ళం."
+
+కలలలో తేలిపోతూ డాక్టరు చెయ్యి దాటిపోయిన అవకాశాన్ని తలుచుకొని అనుతాపం తెలుపుతూంటే రామారావు దిగ్భ్రమ చెందేడు.
+
+"మనల్ని అందర్నీ వుద్ధరించే భారం తమమీద వుందనుకొనే తెల్లవాళ్ళు మన దేశాన్ని రెండువందలేళ్ళు పీక్కుతిన్నారు, డాక్టరు
+గారూ!"
+
+"చైనా అల్లా చెయ్యదు. కమ్యూనిస్టులలో వాళ్ళు తప్ప పుట్టేరు. వాళ్ళకి సామ్రాజ్య కాంక్ష లేదు."
+
+"మీ విశ్వాసాన్ని భగ్నం చేయను. కాని కమ్యూనిజం, స్వాతంత్ర్యం వంటివి ఎగుమతి చేయగల వస్తువులు కావు అంటారు
+మరిచిపోకండి."
+
+"సాయం చెయ్యడం దండయాత్ర చెయ్యడం కాదు."
+
+"లే ఆక్రమణ మనకి సహాయం కోసమే నన్నమాట."
+
+"సందేహం ఏముంది? మన దేశంలో జనం విప్లవానికి తయారుగానే వున్నారు. గువేరాలాంటి కార్యవాదో, మావోవంటి ప్రవక్తో పుట్టి ముందుకు
+వస్తే తప్ప జనంలోని మత్తు వదలదు. నిర్మాణం అంటూ కూర్చోండి. పుణ్యకాలం వెళ్ళిపోతుంది. పార్టీలంటూ భజన చెయ్యండి. వాళ్ళు
+మీ నెత్తిన చెయ్యి పెట్టేస్తారు....అని మనకి ఓ వూపు ఇవ్వాలనే వాళ్ళు ఆ మంచు కొండల్లోకి వచ్చేరుగాని...."
+
+రామారావు నోరు తెరుచుక్కూర్చుండిపోయేడు. డాక్టరు వుత్సాహంగా చెప్పుకు పోతున్నాడు.
+
+"మీరు రివెల్యూషన్ ఇన్ ది చదివేరా? చాల గొప్ప పుస్తకం. లెనిన్ కాలం నాటికీ నేటికీ ప్రపంచం చాలా మారిపోయింది. ఆయన
+రివెల్యూషన్ గురించి చెప్పిన మాటలు అమెరికను సామ్రాజ్యవాదమూ, ఆటంబాంబూ వచ్చిన ఈనాటికి కాలదోషం పట్టిపోయాయి."
+
+"మీ మాటలు వింటూంటే అసలు కమ్యూనిజమే ‘ఔటాఫ్ డేట్’ కాలేదు గదా అనిపిస్తూంది, డాక్టరుగారూ!"
+
+ఆ కంఠస్వరంలోని హేళనను గాక, ఆ వాక్యార్ధాన్ని మాత్రమే డాక్టరు అందుకున్నాడు.
+
+"మీరూ అన్నారూ ఆ మాట! నలుగురూ చంపేస్తారని గాని, నాకూ ఆ అనుమానం లేకపోలేదు సార్!"
+
+ఈ మారు ఎగతాళి వదలి రామారావు ఆసక్తితోనే అడిగేడు.
+
+"ఎందుచేత నంటారు?"
+
+"లేకపోతే కమ్యూనిజానికి పుట్టినిల్లు, పెట్టనికోట అని చెప్పుకొనే సోవియటు యూనియను భిలాయ్ మొదలైన పరిశ్రమలనిచ్చి
+భారతదేశం లోని బూర్జువా ప్రభుత్వానికి ప్రాణం పోస్తుందా?"
+
+"ఒకటి."
+
+"బూర్జువా భారతదేశం, నియంతృత్వపు పాకిస్తానూ కొట్టుకుంటూంటే అడ్డుపడి తాష్కెంటు సంధి కుదిర్చింది. యుద్ధం కొనసాగి రెండూ
+బలహీనపడితే రెండు దేశాలలో విప్లవం వచ్చేది. ఆ అవకాశాన్ని చైనా గుర్తించింది. సోవియటు భగ్నం చేసింది."
+
+"రెండు"
+
+"మన దేశంలో ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్న ప్రభుత్వంతో భాయీ భాయీ కలుపుతూంది. నిజమైన కమ్యూనిస్టు దేశం చైనాతో పేచీ
+పెట్టుకొని దానికి సహాయం మానేసింది."
+
+"మూడు. చాలు. మీరు తిరుగులేని వుదాహరణలు మూడిచ్చేరు కాని."
+
+"మూడేమిటి ముప్ఫయి చెప్తా. కమ్యూనిజానికి సోవియట్ చేస్తున్న ద్రోహం వుందే సార్! మీకు వినగల ఓపిక వుంటే...."
+
+అటువంటి వోపిక లేదని రామారావే ఒప్పేసుకున్నాడు. కాని వాదం మానలేదు.
+
+"అయితే, అసలు విషయం ఒకటుంది కదా. సామ్రాజ్యవాదాన్ని నాశనం చెయ్యవలసిందే. కాని, ఆ దేశాల్లో ప్రజలున్నారు.
+సామ్రాజ్యవాదుల వద్ద అణుబాంబులున్నాయి, సోషలిస్టు దేశాలకీ ఉన్నాయి. వీళ్ళ దేశాల్లోనూ ప్రజలున్నారు. ఇప్పుడు ప్రజల
+విషయం, ఆలోచించడం అంటూ ఒకటుంటుందా? లేక ఆటం బాంబుల్ని సద్వినియోగం చెయ్యడం వరకేనా మన పూచీ...."
+
+"ఆటంబాంబు వట్టి కాగితం పులి."--అని డాక్టరు చప్పరించేసేడు.
+
+"మావో మంత్రం తాయెత్తులా పని చేస్తుందని మీకు నమ్మకమేమో, నాకు లేదు సుమండి. కాని, ప్రాణి అజేయం. దానిని నిర్మూలించలేరు.
+అనుమానం ఎందుకు. రేడియో ధార్మిక శక్తిని నిగ్రహించి ప్రాణి మళ్ళీ పెరుగుతుంది. అయితే అది మానవ రూపిగా వుండలేదు. దానికి
+ఆకలి దప్పులు, ఎండవానలు వుండకపోతాయేమో, కాని కలిమి లేముల బెడద వుండకపోవచ్చుననుకుంటా."
+
+రామారావు తన్ను ఎగతాళి పట్టిస్తున్నాడనిపించి డాక్టరు తగ్గేడు.
+
+"ఇవన్నీ వాదనలతో తేలేవి కావు. నేను ఏడాది నుంచి వాదించేను. మీరు నాలుగైదేళ్ళ నుంచి నోరెట్టుకు వాదిస్తున్నారు. ఫలితం
+ఏమిటి? ఇద్దరం బతకడం ఎల్లాగని తిరుగుతూనే వున్నాం. లాభం లేదు, సర్! లాభం లేదు. తుపాకీ ఒక్కటే దీనికి మందు. దేశ
+భక్తి! వట్టి హంబగ్!"
+
+
+
+
+ముప్ఫయ్యో ప్రకరణం
+
+
+సాయంకాలం అయింది. చల్లబడింది. పెళ్ళివారి యిల్లు హడావిడిగా వుంది. చీకటి పడే వేళకి రాగల పెళ్ళివారి కోసం, తెల్లవారే
+ముందు జరగగల పెళ్ళికోసం అవసరమైన దానికన్న ఎక్కువే హడావిడి పడుతున్నారు. రావలసిన బంధువులింకా రాలేదేమని కంగారు
+పడుతున్నారు.
+
+జయప్రద నెమ్మదిగా పెదతల్లి కూతురు పక్క చేరింది. ఆమెను చూడగానే రమణమ్మకు రామారావు మాట జ్ఞాపకం వచ్చింది.
+
+"మరచేపోయేను జయా! ఆయన సంగతి ఎవరన్నా చూస్తున్నారో, లేదో, కాస్త నువ్వేనా శ్రద్ధ తీసుకో! అప్రతిష్ఠ కూడాను.
+కాస్త కాఫీ, ఫలహారం పట్టుకెళ్ళి ఇచ్చిరా."
+
+"తరవాయిలన్నీ పూర్తయాయి. నువ్వేమీ కంగారుపడకు" అని జయప్రద దిలాసా ఇచ్చింది.
+
+రమణమ్మ కళ్ళలో కొంటెతనం పొటమరించింది.
+
+"ఆయన సంగతేదో నీమీదే వదిలేస్తున్నా. ఎరగని చోటూ, కొత్త మనుష్యులూ, కాలు ఎల్లా వుంది."
+
+"ఏం లేదు. వేణుగోపాలరావు గారు ఏదో రాసేరు! తగ్గింది."
+
+జయప్రద ఏదో చెప్పదలచి తటపటాయిస్తున్నదని రమణమ్మ గ్రహించింది.
+
+"ఏమిటి విశేషం?"
+
+"విశేషం ఏమీ లేదు. అల్లా గన్నారం అక్వీడక్టు మీదికి వెళ్ళొస్తాం."
+
+పెళ్ళి కావలసిన జంట. అల్లా విహారాలు జరపడం ఎంతవరకు వుచితమో – రమణమ్మ ఒక్క నిముషం తటపటాయించింది. మళ్ళీ
+అంతలోనే సర్దుకొంది.
+
+"చీకటి పడకుండానే వచ్చెయ్యండి. పెళ్ళివారు వస్తారు. కాస్త నువ్వేనా చేతికి ఆసరా వుండకపోతే ఎల్లాగ?"
+
+మర్యాదల నతిక్రమించ వద్దన్నమాటనే మరొకలా చెప్పిందని జయప్రద గ్రహించింది.
+
+"సరే"
+
+
+
+
+ముప్ఫయ్యొకటో ప్రకరణం
+
+
+పెద్ద చెరువును ఆనుకొనివున్న విశాలమైన బయలులో హైస్కూలు భవనాలున్నాయి. వాని ముందు గచ్చు చేసిన ఎత్తయిన అరుగు వుంది.
+
+"ఇక్కడ కూర్చుందాం. ఇప్పుడు అక్విడక్టు చూడటానికంటూ వెడితే వేళకి తిరిగిరాలేం." అంటూ జయప్రద శుభ్రంగా వున్న ఆ
+ప్రదేశానికి దారి తీసింది.
+
+రామారావు జేబురుమాలు తీసి అరుగు మీద కొంతమేర దులిపేడు. దానిని ఆమె కోసం పరిచేడు. ఆమెకు ఎదురుగా కొద్ది దూరంలో తాను
+కూర్చున్నాడు.
+
+"మీరు రావడం చాల మంచిపని చేసేరు. మా అక్క, పెద్ది అంతా చాలా సంతోషపడ్డారు.
+
+"అసలు వచ్చే స్థితి లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవలసి వచ్చింది. దానిని వాయిదా వెయ్యడం సాధ్యం కాలేదు.
+వచ్చేసేను."
+
+పెళ్లి తరవాయి కాక పూర్వమే తన వరుడు తన సలహా కావాలంటూ వూళ్ళవెంట వచ్చేడు. ఆమె మనస్సు మహోన్నత
+శిఖరాలనెక్కింది. చిరునవ్వుతో --
+
+"ఏమిటా విషయం."--అంది.
+
+"నా వుద్యోగం పోయింది."
+
+"అయ్యో."
+
+"ఎక్కడేనా ఏ చిన్న వుద్యోగమేనా దొరక్కపోతుందాయని తిరుగుతూ ఇక్కడికొచ్చేను."
+
+ఉత్సాహమంతా చప్పబడిపోయి జయప్రద సన్నగా అడిగింది.
+
+"ఎక్కడేనా...."
+
+రామారావు తల తిప్పేడు.
+
+"ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా, బి.ఏ. ఈ వేళ ఎవరికీ అక్కర్లేదు."
+
+సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుతుండవలసిన వయస్సులో వారిద్దరూ ప్రపంచం అంతా విరిగి మీద పడిపోయినట్లు బరువుగా,
+నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుండి పోయేరు.
+
+"ఆ రోజున నిష్కారణం చదువు మానుకొని వుద్యోగంలో చేరేనే అనిపిస్తూంది."
+
+"పోనీ ఇప్పుడైతే ఏమయింది? మీరూ యునివర్సిటీలో చేరండి."
+
+"నాకూ ఆ ఆలోచనే కలిగిందనుకో. కానీ...."
+
+"ఇంక కానీ వద్దు. ఏమీ వద్దు. నాన్న నన్నూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కి వెళ్ళమంటున్నారు."
+
+"తప్పకుండా వెళ్ళు. చదువు. నువ్వు సందేహించనక్కర్లేదు."
+
+"మీరు చదివితే నేనూ చదువుతా. ఇంతవరకు చదవ వద్దనుకున్నా."
+
+"ఆ ఆలోచన ఎందుకొచ్చింది. చదివించే వాళ్ళుండగా, ఆ అవకాశం వదులుకోడం!"
+
+"ఏ బి.యిడి., యో చేద్దామనుకున్నా."
+
+"పాడు బి.యిడి. గతి లేని నాబోటి గాళ్ళకది."
+
+"సరే. మీరు చెప్పినట్లే. అయితే ఒక షరతు. మీరు చేరితే."
+
+"నువ్వు చెప్పేది బాగానే వుంది. నేను చేరే మార్గం వుండాలి కదా. ఆ ఆశతోనే ఇన్నాళ్ళూ...."
+
+"ఔననుకోండి."
+
+"ఆ వుద్యోగం పోవడంతో పై చదువు ఆశా పోయింది."
+
+"వున్నా జరగదుకదా."
+
+"అదీ నిజమే."
+
+"అందుచేత వుద్యోగం పోవడం ఒక విధంగా మంచిది."
+
+"డబ్బున్నప్పుడంతే. కాని...."
+
+సంభాషణ ఎంతసేపూ సుళ్ళు తిరుగుతూంది. తన మనస్సులోని మాట చెప్పలేకుండా వున్నాడు. అతని ఆలోచనలు జయప్రద కర్ధమయ్యే
+స్థితి లేదు. కొద్దిసేపు ఆలోచించేడు.
+
+"నాకు వచ్చిన గోల్డు మెడల్సు అన్నం పెట్టలేవు."
+
+అది కొత్త మాట కాదు. జయప్రద ఏమీ అనలేదు.
+
+"నాకా ఆస్తేమీ లేదు."
+
+ఆ విషయం ఆమెకు తెలుసు.
+
+"ఇంకిప్పుడు నీ ఆసరాతో నా కాళ్ళ బురద వదుల్చుకోడం ఓ దారి."
+
+జయప్రదకు అదేమిటో అర్ధం కాలేదు. "చెప్పండి."
+
+రామారావు చెప్పలేకపోయేడు. సత్యనారాయణ యిచ్చిన సలహాను ఆమె ముందర వొప్పుకోడానికి సిగ్గుగా వుంది. ఈ వారం రోజులూ చేసిన
+వుద్యోగ ప్రయత్నాలు మరోదారి లేదనిపిస్తున్నాయి. సిగ్గయినా బయట పడక తప్పదు.
+
+"నేను, నువ్వు కూడ యూనివర్సిటీలో చేరుదాం."
+
+అతని ఆలోచన ఏమిటో తెలియకపోయినా అతని నిర్ణయం ఆమెకు ఇష్టమే.
+
+"అదే నే చెప్పేదీ...."
+
+"కాని...."
+
+ఆ తటపటాయింపేమిటో అర్ధం గాక అతని ముఖంలోకి చూసింది.
+
+"డబ్బేది?....కట్నం వద్దన్నా. కుటుంబం ఏర్పాటుకికూడా పైవారి సాయం తీసుకోనన్నా. ఇప్పుడదంతా వట్టి బూకరింపేననిపిస్తూంది.
+నువ్వు బాగా ఆలోచించుకో. మీ వాళ్ళతో కూడ ఆలోచించు. నాకు వెంటనే సమాధానం ఇవ్వనక్కర్లేదు."
+
+"చెప్పండి. మీరు చెప్పే విషయం గురించి ఎవ్వరితో ఆలోచించనక్కర్లేదు!"
+
+ఆ మాటకు నవ్వు వచ్చినా రామారావు తేల్చేసేడు.
+
+"హడావిడి పడకు. తాపీగా ఆలోచించుకొని మరీ చెప్పు. నా పథకం ఇది...."
+
+అతడు తన ఆలోచనలు వివరించేడు. శ్రద్ధగా వింది. ఆ పథకంలో కీలకాంశం తమ వివాహం జరగడం అనేంత వరకే ఆమెకు అర్ధం
+అయింది. ఆమెకది యిష్టమే.
+
+"బాగానే వుంది."
+
+కాని, తన పధకం నీతి బద్ధం కాదనే సందేహం రామారావు మనస్సును కెక్కరిస్తూంది.
+
+"తొందరపడకు. మాములుగా డిమాండు చేసి పుచ్చుకొనే కట్నం కూడా ఆడపిల్ల సొత్తుగానే వుంటుంది. ముందే అన్యధా నిర్ణయం జరుగుతే
+తప్ప. ఇక్కడ నాకేమీ అక్కర్లేదంటూనే, మీ నాన్నగారు నీకిచ్చే భూమిని అమ్మేసి చదువుకోవాలనుకొంటున్నా."
+
+"దానిలో నా ఖర్చు కూడా కలిసే వుంటూంది కదా."
+
+"నిజం చెప్పాలంటే భార్యకి అన్నం పెట్టలేని వాడికి పెళ్లి అనవసరం. కాని నేను పెళ్ళికి సిద్ధపడుతున్నా. అంతేకాదు. సామెత
+చెప్పినట్లు నేను పొట్టుతెస్తా, నువ్వు పప్పులు పట్టుకురా. రెండూ కలిపి వూదుకు తిందామంటున్నా. బాగుంది కాదూ!"
+
+"మీరు అల్లా అనుకోడం మంచిది కాదేమో. పరిస్థితుల్ని పట్టి సర్దుకొంటాంగాని, సూత్రాలు పట్టుక్కూర్చుంటే పనులు జరుగుతాయా."
+
+"ఆ సర్దుకొందామన్న ఆలోచన ఫలితమే నా ప్రతిపాదన. పరిస్థితులంటూ యదార్ధాన్ని విస్మరించరాదు. భార్య పోషణ భారం
+ఎత్తుకోలేనివాడు పెళ్ళి పేరెత్త కూడదు. అది ప్రపంచ న్యాయం."
+
+ఇంత సంకోచం, ఇంత వ్యధ. పెళ్ళి చేసుకోడం ఏం సుఖం అనిపించింది.
+
+"అయితే ఓ పని చేద్దాం. చదువు పూర్తి అయ్యే వరకూ ఇప్పటి లాగే వుండొచ్చు." అంది.
+
+భూమి అమ్మడం, దానితో బతకడం సమస్య వచ్చింది కనక వెనక తీస్తూందనుకొన్నాడు.
+
+"అదే ఆలోచించ మనేది."
+
+"మీ ఆలోచనలను మీరు సిద్ధం చేసుకోండి. ఇంత సంకోచం, తటపటాయింపు."
+
+రామారావు తల వొంచుకున్నాడు.
+
+"ఈ ఆలోచన నిదివరకే మీ నాన్నగారు సూచించేరు. డబ్బిస్తాను. పోయి చదువుకోమన్నారు. కాదన్నాను. మా సత్యనారాయణ మామ
+అదే విషయాన్ని కొంచెం సవిరించి మీ నాన్నకు చెప్తానన్నాడు. మార్పల్లా నీ డబ్బుతో చదువుకోవడం. పెళ్ళి కాకుండా నీ డబ్బు
+వాడుకొనే హక్కు నాకు ఎక్కడుంది? అందుకోసం పెళ్ళి. నువ్వు పెళ్ళి చేసుకొనేది నీ మీద బతకవలసినవాడిని. అందుకే తొందర
+పడవద్దనడం. ఆలోచించమనడం. నీకు చెప్పాలనుకున్నదిదే. నా అభిప్రాయం నేనే చెప్పి నీ ఆలోచనకు వ్యవధి నివ్వాలని."
+
+ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. జయప్రదే అంది.
+
+"ఆలోచించవలసినది నాకేం కనబడదు."
+
+"కాని, మీ నాన్నగారు, అమ్మగారు...."
+
+"బహుశా ఏమీ అనకపోవచ్చు. ఆయన ఇస్తానన్న భూమి మాటల్లోనే వుంది. అందుచేత ఏం చేసినా ఆయనతో సంప్రదించవలసే
+వుంటుంది."
+
+"ఔను. సందేహం ఏం వుంది?"
+
+"పైగా భూమి అమ్మితేగాని చదువులకి డబ్బు సమకూడదు. అమ్మడానికి ఆయన సహాయం అవసరం."
+
+"ఆ విషయంలో నాకేమీ సందేహం లేదు. ఈ పాటికి మా మామయ్య మీ నాన్నగారితో మాట్లాడే వుంటాడు. అసలు పార్టీకి చెప్పకుండా
+వ్యవహారం దూరానే ఫైసలు చేయిస్తానేమోనని కంగారుపడి వచ్చేను, నీతో మాట్లాడడానికి."
+
+"థేంక్సు."
+
+ఒక్క నిముషం వూరుకొని రామారావు మళ్ళీ ప్రారంభించేడు.
+
+"భూమి అమ్మేలోపున మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టనక్కర్లేదు. నా వద్ద పది పన్నెండు వందలుంది. దానితో నడుపుతూందాం."
+
+అతని అమాయికత్వానికి జయప్రద నవ్వింది.
+
+"ఏం. ఎందుకు?"
+
+"భూములు అమ్మడానికి పెడితే, కుదిరిందా, బేరం ఆ రోజే కుదరవచ్చు. లేదా నెలలు, ఏళ్లు కూడ గడుస్తాయి."
+
+రామారావు తెల్ల బోయేడు.
+
+"అవసరానికి అమ్ముతున్నామని తోస్తే అయినకాడికి అడుగుతారు. తీరా కాలేజీలో చేరాక ఒకటి రెండు నెలలలో
+అమ్ముడవకపోతే...."
+
+తనవద్దనున్న డబ్బు ఒకటి రెండు నెలలకు మించి చాలదంటున్నట్లు అర్ధం చేసుకున్నాడు.
+
+"నిజమే."
+
+"అంతే కాదు."
+
+"చెప్పు."
+
+జయప్రద చెప్పలేక తల వంచుకొంది.
+
+"ఊ."
+
+"అన్నిటికీ ముందు నాన్న ఈ వేళ పెళ్ళి తలపెట్టగల స్థితిలో లేరు."
+
+"ఎందుకనుకున్నావు."
+
+"కంట్రాక్టుల బిల్లులు రెండు మూడు లక్షల వరకూ రాలేదని కంగారు పడుతున్నారు."
+
+ఓ నిమషం ఆలోచించి రామారావు మార్గాంతరం చూపించేడు.
+
+"మీ వాళ్ళు ఒప్పుకుంటే, నీకు ఇష్టం అయితే రిజిస్ట్రారు ఆఫీసుకు వెడదాం."
+
+"వాళ్ళు ఒప్పుకోరు."
+
+"నీకు తెలుసా?"
+
+"పెళ్ళి ఎల్లా చెయ్యాలి, ఎంత ఖర్చు చెయ్యాలి--అనే దాని మీద ఇంట్లో చర్చలు జరగడం నాకు తెలుసు."
+
+ఇద్దరూ మరల ఆలోచనలో పడ్డారు.
+
+"నేనొకటి చెప్పనా?" అంది జయప్రద.
+
+"చెప్పు."
+
+"నాకిష్టమే. మనమే సాహసిద్దాం."
+
+"అంటే?"
+
+ఒక్క నిమషం తటపటాయించి చెప్పేసింది.
+
+"రిజిస్ట్రారాఫీసుకి మనమే వెడదాం."
+
+"మీ వాళ్ళకి కోపం వస్తుంది."
+
+"దానితో, ఖర్చుకి డబ్బు లేదని పెళ్ళి వాయిదా వేసే అవసరం వుండదు కదా."
+
+అలా చెయ్యడంలో ఎన్ని బాధలున్నాయో ఆమెకు తెలిసినట్లు లేదనుకున్నాడు.
+
+"మేము పెళ్ళి చేస్తామంటూంటే, మాకు చెప్పకుండా ఎందుకు చేసుకున్నారని కక్ష కడితే?"
+
+"కట్టి ఏం చేస్తారేం?" అంది జయప్రద నిర్లక్ష్యంగా.
+
+"నీ వయస్సెంతో ఎరుగుదువా?"
+
+"ఇరవై."
+
+"నువ్వు మైనరువనీ, నిన్ను మోసగించేననీ కోర్టు దాకా వెళ్ళకపోవచ్చునేమో కాని, జయా! నిజానికి అది నిన్ను మోసపుచ్చినట్లే
+అవుతుంది. ఉద్యోగం లేని ఈనాటి పరిస్థితిలో నీ మెడకు గుదిబండలా తగిలించి నీకూ, నీ భవిష్యత్తుకూ అపకారం చెయ్యడమే
+అవుతుంది."
+
+జయప్రద ఆశ్చర్యంతో అతని ముఖం చూస్తూ కూర్చుండి పోయింది.
+
+"నీ చదువు చెడుతుంది."
+
+"ఈ స్థితిలో నా చదువంత ముఖ్యం కాదు."
+
+రామారావుకది నచ్చలేదు. తల తిప్పేడు.
+
+"ఒద్దు. నీక్కూడా ఈ బాధలెందుకు?"
+
+"మీ చదువుకూ, భవిష్యత్తుకు అదొక్కటే మార్గం."
+
+"మీ నాన్న కక్ష కడితే అది మార్గమే కాదు."
+
+అర్థం అయి జయప్రద తెల్లబోయింది.
+
+"ఆస్తి కోసం నువ్వు నాకు హాస్టేజీవన్నమాట. వద్దు వదిలెయ్యి."
+
+జయప్రదకు కష్టమనిపించింది. ఆస్తితో వస్తే పెళ్ళి చేసుకొంటాడు. లేకపోతే లేదు--అన్నమాట. అదేదో స్పష్టం చేసుకోదలచింది.
+
+"ఆయనకుగాని, మరొకరికిగాని కోపం వస్తే రానివ్వండి. ఆస్తి ఇవ్వరు. అంతేనా? మనమిద్దరం ఏదో పని చేసుకుని
+బతకలేకపోతామా?"
+
+"మనమిద్దరం కలిసి చెయ్యగలది మీ నాన్నగారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం, వద్దు. నాకది ఇష్టం లేదు. నువ్వు పెద్దగా
+ఆలోచించకు. కడుపు నిండని చోట ప్రేమలూ, ఆప్యాయతలూ నిలబడవు. నిన్నూ, నీ అభిమానాన్నీ తక్కువ చేస్తున్నానుకోకు.
+మనుష్యుని సాధారణ స్థితి అంతే. ఆ ఆలోచన వదిలెయ్యి. మా మామయ్య వెళ్ళి మీ నాన్నగారిని అడిగి వుంటారు కదా.
+ఏమనుకున్నారో తెలుస్తుంది. అల్లా కాదు. ఇప్పుడేమిటన్నారా, పోయి చదువుకో. అప్పటికి...."
+
+జయప్రదకు కోపం, దుఃఖం వచ్చింది. "అంటే...." ఆమె పెదవులు వణికేయి. "నాలుగెకరాల భూమి ఇచ్చి చేస్తే పెళ్ళి.
+లేకపోతే వద్దు. అనేనా మీ అభిప్రాయం?"
+
+రామారావు తెల్లబోయేడు.
+
+"నా వుద్దేశం అది కాకపోయినా, ఆ అర్ధం వచ్చే అవకాశం వుంది" అన్నాడు.
+
+"సరి. ఇంక చెప్పనక్కర్లేదు."
+
+ఇద్దరూ లేచేరు. ఇద్దరి మనస్సులలో ఒకే మాట మెదిలింది.
+
+"ముందే తేలిపోవడం మంచిదే అయింది."
+
+కాని ఆ మాటలో తేలిన విషయాలు మాత్రం వేరు.
+
+
+
+
+ముప్ఫయి రెండో ప్రకరణం
+
+
+రిక్షా దిగుతూనే హనుమంతరావు వేసిన మొదటి ప్రశ్న కూతుర్ని గురించి.
+
+"జయ ఏదీ. కనబడదు."
+
+"అల్లా షికారు కెళ్ళేరు, కాబోయే దంపతులు," అంది రమణమ్మ చిరునవ్వుతో.
+
+హనుమంతరావు తెల్లబోయి భార్య ముఖం వంక చూసేడు.
+
+"కాబోయే దంపతులేమిటి? ఎవరు?" అంది నరసమ్మ చిర చిర లాడుతూ.
+
+"అతడిక్కడికి ఎప్పుడొచ్చేడు?" అన్నాడు హనుమంతరావు. ఎందుకొచ్చేడనబోయిన వాడే, సర్దుకొన్నాడు.
+
+"పొద్దుట."
+
+"ఎంతసేపయింది వెళ్ళి?"
+
+"ఎటుకేసి వేళ్ళే" రన్నది తరువాతి ప్రశ్న.
+
+ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లున్న ఆ దంపతుల కంఠ స్వరాలు విని, ఆ ప్రశ్నలు చూసి రమణమ్మ తాను పొరపాటు చెయ్యలేదు
+గదా యనుకొంది.
+
+"త్వరగానే రమ్మన్నా. వస్తూంటారు. అల్లా గన్నారం అక్విడక్టు మీదికి పోయి వస్తామన్నారు."
+
+హనుమంతరావు ఏమీ అనలేదు. అనలేడు కూడా. ఈ కాబోయే అల్లుని మంచితనం గురించీ, తన కూతరు అదృష్టం గురించీ నిన్నటి వరకూ
+బంధువులందరి వద్దా పదే పదే ప్రశంసించిన వాడే. ఈవేళ ఏమనగలడు? అతని అయిష్టం ఏమిటో రమణమ్మకి అర్ధం కాలేదు.
+ఆమె ప్రశ్న కిచ్చిన సమాధానం చిత్రంగా అనిపించింది.
+
+"ప్రదానం జరిగిందనుకో. అది పెళ్ళి జరిగినట్లు లెక్కా."
+
+"ఆ అబ్బాయి...."
+
+"ఇంతవరకు పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చేడు. చూశా, మరి లాభం లేదు. దాని పరీక్షలయ్యాయి. ఇంక ఆపడం లేదు. అర్ధం లేదు.
+వేరే సంబంధాలు చూస్తున్నా."
+
+రమణమ్మ ఆశ్చర్యపడింది.
+
+"మీరా దృష్టిలో వున్నట్లు వారిద్దరికీ కూడా తెలియదనుకుంటా."
+
+నాలుగైదెకరాల సుక్షేత్ర ఖండ్రికతో వస్తున్న గ్రాడ్యుయేట్ పిల్ల చెయ్యి జారిపోతుందేమోనన్న భయం పట్టుకొన్నవాడు ఆ సంగతి
+తెలియనిస్తాడా?" అన్నాడు, హనుమంతరావు కసీ, హేళనా మేళవించి.
+
+రమణమ్మ ఆశ్చర్యంగా చూసింది.
+
+"ఆయనగారికి వుద్యోగం పోయింది, తెలుసా?"--అన్నాడు హనుమంతరావు.
+
+"ఎప్పుడు?"
+
+"ఈ మధ్యనే."
+
+"పాపం."
+
+"పాపం ఎందుకు? ఎన్నికల్లో కాంగ్రెసుకి వ్యతిరేకంగా పంచె ఎగ్గట్టి పరవళ్ళు తొక్కినప్పుడు ఎరగడా?"
+
+రమణమ్మ ఏమీ అనలేదు. హనుమంతరావే సాగించేడు.
+
+"ఇప్పుడు తినడానికి మెతుకు లేదు. కనక వెంటనే పెళ్ళి చేసుకుని నా మెడ మీద సవారీ చెయ్యాలని చూస్తున్నాడు....నేను
+మొయ్యడానికి ఒప్పుకొంటే."
+
+జయప్రద మాటల్ని విన్నాకా, ప్రత్యక్షంగా మనిషిని చూసేకా రమణమ్మకు రామారావు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.
+హనుమంతరావు మాటలు దానిని తొలగించలేకపోయాయి.
+
+"జయప్రద ఎరుగునా, బాబాయ్."
+
+"దానికేం తెలుస్తుందే, చిన్నపిల్ల" అంది పక్కనేవున్న నరసమ్మ.
+
+"అదేమిటి పిన్నీ. ఇరవయ్యేళ్ళ పిల్ల. చదువు సంధ్యలున్నది. దానికి తెలియదంటావేమిటి?"
+
+"ఏళ్ళు రావచ్చు. మనం ఆగమన్నా రోజులు ఆగవు కనక. తెలివుంటే చదువూ వస్తుంది. ప్రపంచ ఙ్ఞానం అన్నది బజారులో దొరికే
+వస్తువేనా కాదే." అన్నాడు, హనుమంతరావు.
+
+ఒక్క నిముషం ఆగి మళ్ళీ అన్నాడు.
+
+"తాను పెళ్ళికి సిధ్ధంగా వున్నట్లు కబురు చేసేడు. ఏమిటా, ఇల్లా కళ కుదిరిందని కదలేసే సరికి అసలు సంగతి
+బయటపడింది."
+
+"పిల్ల పేరన పెట్టే భూమిని అమ్మేసి దానితో మళ్ళీ చదువు వెలిగిస్తాడట. అదీ సంబడం." అంది చిరాకుగా నరసమ్మ.
+
+"ఇది వరకే ఇతగాడితో లాభం లేదని, ఇతర సంబంధాలు ఆలోచిస్తున్నా. ఇప్పుడీ కొత్త ఎత్తు తెలిశాక, మరో
+అమాయకప్పక్షిని పట్టుకోరా బాబూ, అని చెప్పేశా."
+
+"నీ ఆలోచన ఆయన దాకా వచ్చివుంటే ఇల్లా ఎందుకొస్తాడు?"
+
+"కాకపోతే ఎందుకొచ్చేడంటావు?"
+
+రమణమ్మ ఈ దురభిప్రాయాన్ని సవరించే అవకాశం ఇంకా వున్నదనుకొంది.
+
+"కానీ బాబాయ్. నువ్వే చదివించినట్లవుతుంది, తప్పేమిటి?"
+
+ఆమె మనస్సులో తన మేనకోడలికి చేస్తున్న సంబంధం మెదులుతూంది. కాని, హనుమంతరావు ఒప్పుకోలేదు.
+
+"కట్నం, గిట్నం తీసుకోనని బోడి గొప్పలెందుకు?"
+
+"ఏవో పిచ్చి భ్రమలుంటాయి, కుర్రవాళ్ళకి. వాటిని మనం నిలతియ్యాలా? వున్నదంతా వూడ్చి పెట్టి, దొరికినచోటనల్లా తెచ్చి
+చదువుకొని సంపాదించుకొనే వాళ్ళ కోసం పరిగెత్తాలనుకోమూ? కట్నం వద్దన్నాడు గనక నువ్వు ఇవ్వగల సాయం సున్న చుట్టాలా?"
+
+"ఏమిటంతల్లా వాదిస్తున్నావు,"
+
+"నువ్వు తొందరపడుతున్నావేమోనని. జయ మనస్సు తెలుసుకోనిదే ఏ నిర్ణయం చెయ్యకు బాబాయ్."
+
+హనుమంతరావు ఆమె అఙ్ఞానానికి జాలిపడ్డాడు.
+
+"నాలుగెకరాల భూమీ, పాతిక ముప్ఫయివేల బంగారంతో పిల్లనిస్తూ మన సాయం వుంటే గాని పొయ్యిలో పిల్లి లేవని సంబంధం
+ప్రారబ్ధమా! ఇది కాస్తా కరిగించేసి చదువుతే మాత్రం బయట పడతాడనే నమ్మకం ఏమిటి?"
+
+
+
+
+ముప్ఫయిమూడో ప్రకరణం
+
+
+చల్లగాలికి తిరిగివచ్చిన జయప్రద వేళ్ళేటప్పటి వుత్సాహంతో తిరిగి రాలేదని రమణమ్మ గ్రహించింది. పినతండ్రి, పినతల్లి
+ఆలోచనలు ఆమె దాకా అందేయా అనిపించింది.
+
+"ఏం అల్లా వున్నావు?"
+
+"ఎల్లా వున్నాను. బాగానే వున్నానే."
+
+అంతలో ఇంట్లోంచి తల్లి గొంతుక వినబడ్డంచేత మారు ప్రశ్నకు అవకాశం లేకుండా తప్పించుకొంది.
+
+"ఇంతసేపు ఎక్కడి కెళ్ళేవే?"--అని అడుగుతుందామె.
+
+"వెళ్ళు. మీ అమ్మ పిలుస్తూంది. దొడ్లోకి పోయి, మొహం కడుక్కుని మరీ కనిపించు."
+
+అదేమిటన్నట్లు జయప్రద అక్కగారి మొహం చూసింది.
+
+"వీళ్ళెప్పుడొచ్చారు."
+
+"మీరు అల్లా వెళ్ళేరు. వాళ్ళూ వచ్చేరు."
+
+"ఉహూ."
+
+"మీ అమ్మకి కనిపించిరా, పనుంది."
+
+జయప్రద తల వూపింది.
+
+"చీకట్లో, పొరుగూళ్ళో రోడ్ల వెంట షికార్లేమిటే--" అని నరసమ్మ కోప్పడింది.
+
+"రోడ్లంబడి తిరగలేదమ్మా. హైస్కూల్ గ్రౌండ్సులో కాస్సేపు కూర్చుని వచ్చేం."
+
+"అల్లాగే కూర్చుని వస్తూండు. పెళ్ళి కావలసిన దానివి." అంటూ నరసమ్మ రుసరుసలాడింది.
+
+"ఊ. వదిలెయ్యే....ఇల్లా రామ్మా" అని తండ్రి పిలుస్తూంటే అటు వెళ్ళింది.
+
+"అతడిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేడో తెలుసా?"
+
+జయప్రద వూరుకుంది.
+
+"రెండు మూడేళ్ళయి పెళ్ళి మాట అనుకున్నా గంట దూరంలో వున్న మన వూరెప్పుడూ రాలేదు. కాని, పిలుపూ గిలుపూ లేకుండా రెండు
+జిల్లాల అవతల ఎవరింట్లోనో పెళ్ళవుతూంటే ఎందుకు వచ్చినట్లు?"
+
+"చెప్పేరు."
+
+"చెప్తాడు. నా దగ్గిర ఆటలు సాగలేదు. నిన్ను లాయమారుదామనుకుని వచ్చేడు."
+
+జయప్రద ఏమీ అనలేదు.
+
+"నిన్ను పట్టుకుని వూరేగితే నలుగురూ జంట కుదిరిందని పేరెట్టేస్తారు. బంధుకూటం యావత్తూ తధాస్తంటారు. అప్పుడే మీ రమణక్క
+బోల్తా పడింది. కాదనేందుకు వీలు లేకుండా కట్టుదిట్టం చేసుకొనేందుకు వేసిన ఎత్తు."
+
+ఆ మాటలలో జయప్రదకు బేసబబు కనిపించలేదు. చెప్పిన పధ్ధతి తేడా అంతే. కాని రమణమ్మ ఆ ఆలోచన తప్పు సుమా అంటూంటే
+తెల్లబోయింది.
+
+భోజనానంతరం అన్ని పనులు తెముల్చుకొని, రమణమ్మ జయప్రదను చిక్కించుకుంది. రామారావుతో సంభాషణనంతనూ తెలుసుకుంది.
+
+"దురుద్దేశంతో నిన్ను చేత చిక్కించుకొని, మీ నాన్నని నొక్కదలచుకొన్నవాడైతే నీ సూచనను వెంటనే ఒప్పేసుకొనేవాడు. రిజిస్ట్రార్
+ఆఫీసు ఏర్పాట్లు గప్ చిప్ గా జరిగించేసేవాడు."
+
+కాని, జయప్రద మనస్సులో గట్టి అనుమానం పాదుకొంది.
+
+"ఆయనకు కావలిసింది ఆస్తి. మనిషి కాదు. మనుష్యుల స్వభావాలు బయటపడడానికి ఇటువంటి ఘట్టాలే సాయపడతాయి. స్వభావం
+తెలిసింది. చాలు."
+
+"ఏమ్మాటే అది. చేతిలోంచి కానీ ఖర్చు చేయనక్కర్లేకుండా అతడే మనని కూడా భుజాన వేసుకుంటే అందరం అభినందిస్తాం. అతని
+ఆదర్శాలకి మీ నాన్నలాగే జోహారులర్పిస్తాం. ఓహో, ఆహా అంటాం. కాని...."
+
+"ఏమిటా కాని...." అని జయప్రద రొక్కించింది.
+
+"కాకపోతే ఏమిటే. నిజం చెప్తే నిష్ఠూరమేగాని, నిన్నీ పళాన పెళ్ళి చేసుకోడం అతనికి అదనం బరువు. ఆ బరువు
+తగ్గించడానికి నువ్వు చేసే సాయం ఏమిటే?"
+
+"పెళ్ళి అనేది మనిషి కోసమా, డబ్బుకోసమా"
+
+"తర్కానికి మంచి విషయమే. కాని, అన్ని సందర్భాలలోనూ ఈ తర్కం సరిపడదు. కడుపు నిండని చోట ప్రేమా, ఆప్యాయతా
+నిలబడవన్నాడన్నావు. చాలా తెలివైన మాట."
+
+జయప్రద ఒక నిముషం ఆగింది.
+
+"నేనూ వుద్యోగం చేస్తానన్నాను."
+
+"ఇదివరకే వున్న అతని వుద్యోగం సౌరభ్యం అల్లా వుంది. ఇంక నీది తరవాయి. పోనీ ఒకవేళ ఇద్దరికీ వుద్యోగాలు వుంటాయనే
+అనుకున్నా మూడేసి నెలలక్కూడా జీతాలందని ఈ గవర్నమెంటులో మీరేం తింటారు?"
+
+"అయితే ఈ చదువులెందుకేం? భూమీ, నగలూ అమ్ముకొని...." అంది జయప్రద ఏడుపు మొహంతో.
+
+"ఏభయ్యేళ్ళ క్రితం లోయర్ సెకండరీ పెద్ద చదువు. నలభయ్యేళ్ళ క్రితం స్కూల్ ఫైనలు. ముప్ఫయ్యేళ్ళ క్రితం బి.ఏ. ఈ
+వేళ పోస్టుగ్రాడ్యుయేషన్ కూడా కాదు. ఫారిన్ డిగ్రీ. ఈ పోటీలో కూర్చోడానికి లేదని మావారు పై చదువుకంటూ ఇంగ్లండు
+పరుగెత్తేరు. పరిశ్రమలు పెరగని దేశంలో డిగ్రీలు పెంచుకుంటూ పోడం తప్ప పోటీలో నిలబడే దారి లేదన్నారు. ఇంగ్లాండు చూసి
+రావడానికి తయారు చేసిన సిధ్ధాంతం అనుకున్నా. కాని, రామారావు స్థితి చూసేక నిజమే అనిపిస్తూంది."
+
+జయప్రద ఆలోచనలో పడింది. రమణమ్మ మాట మార్చింది.
+
+"ఇది మీరు ప్రేమించుకొని, చేసుకొన్న నిర్ణయం అనుకొంటాను."
+
+ప్రేమించుకోడం అన్న మాటకు జయప్రద మనస్సు ఒప్పలేదు.
+
+"ఇద్దరికీ ఇష్టం అయింది."
+
+రమణమ్మ చెల్లెలు వంక నిరసనగా చూసింది.
+
+"ఇష్టం అంటే వేరే పిల్లా! రోగిష్టి కాకుండా వుండి, సుమారుగా పర్వాలేదులే అనుకునేటట్లుంటే మొగుడూ పెళ్ళాలాట ఆడుకొనేందుకు
+ఇష్టంగానే వుంటుంది. కానీ, ప్రేమ వేరు...."
+
+"నాకేం తెలియదు." అని జయప్రద విసురుకుంది.
+
+"తెలియదని నాకూ అర్ధం అయింది. వరదిట్టం వుంది. ఏ మాత్రమో చదువుంది. సంపాదించుకొంటున్నాడు. అన్నింటికీ ముఖ్యం పెద్ద
+బాధ్యతలుండవు. అంచేత నీకిష్టంగానే వుంటుంది. కట్నం ఇవ్వక్కర్లేదు. ప్రదానంలో పంచెల చాపు కూడా వద్దన్నాడు. అది మీ
+నాన్నకు నచ్చింది."
+
+"మా నాన్న ఆయన్ని ఎరగనే ఎరగడు. కట్నం ఇస్తాననే అన్నాడు. లోపం చేయాలనుకోలేదు...."
+
+"అంటే నువ్వే ఏరికోరి తెచ్చుకున్న వరుణ్ణి అర్ధంలేని అనుమానాలతో చెండనాడుకొంటున్నావన్నమాట."
+
+"లేనిపోని మెలిక వేస్తున్నది నేను కాదు."
+
+"నువ్వే చెప్పినట్లు విని పెళ్ళికి సిధ్ధపడి వుంటే ఏమయ్యేది? కోపం కొద్దీ మీ నాన్న ఆస్తి ఇవ్వడు. చదువుకి సాయం
+చెయ్యడు. ఆయనకా వుద్యోగం లేదు. ఏం తింటారు? ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఆయన ఎరుగును. నిన్ను
+కూడా బురదలో దింపడం ఇష్టం లేదన్నమాట నిజమే. ఆయన చాల తెలివిగలవాడు...."
+
+"నీవన్నీ....ఔనుగాని, పోయి చదువుకో, చదువు ముగిసేక నీకింకా ఈ దృష్టి వుంటే అప్పుడాలోచిద్దాం. ఇప్పుడు మీ నాన్న మాట
+వినుకోమని ఎందుకంటారు?"
+
+"అదన్నమాట అపరాధం." రమణమ్మ జాలిపడుతున్నట్లు చూసింది. "రెండేళ్ళకి నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. తాను?
+ఇంతకంటె పెరగకపోవచ్చు. నీ దృష్టి మారవచ్చు. డబ్బులో తక్కువ. చదువులో తక్కువ. వీడు మొగుడేమిటనిపించడం సహజం.
+నిన్ను బంధించి వుంచడం అన్యాయం అనుకున్నాడని దాని అర్ధం...."
+
+"ఇదంతా నీ వూహ. అంతే." అంది, జయప్రద దృఢంగా. రమణమ్మ కాదనలేదు.
+
+"నీ మనస్సు నిరుకు చేసుకొన్నావు. మంచిదయింది. తరవాత బాధ పడనక్కరలేకుండా."
+
+
+
+
+ముప్ఫయినాలుగో ప్రకరణం
+
+
+పక్కవాటా తలుపు తీసిన చప్పుడయి, సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుశీలా, భాగ్యలక్ష్మీ వులికి పడ్డారు.
+
+"చూడు ఎవరో." అంటూ లేచి, సుశీల అరుగుమీది లైటు వేసింది.
+
+"రామం వస్తాడా?" అంటూ భాగ్యలక్ష్మి తలుపు తీసింది.
+
+వీధిలో లైటు వెలగగానే లోపలివాళ్ళ ఆదుర్దా అర్థమయింది, రామారావు.
+
+"నేనేనండి" అన్నాడు.
+
+సుశీలా, భాగ్యలక్ష్మీ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళు అరుగు మీదికి వచ్చేసరికే అతడు గదిలోంచి కుశలప్రశ్నలు వేస్తున్నాడు.
+
+"అంతా బాగున్నారా?"
+
+"ఇప్పుడెందుకొచ్చేవు?"
+
+సుశీల ప్రశ్నకు రామారావు వెనుతిరిగి చూసేడు. ఆ ప్రశ్న అతని కర్ధం కాలేదు. తప్పుగా వినిపించినట్లు తోచింది.
+
+"రావడం అయితే జనతాలోనే వచ్చేను. ఎప్పటిలాగే అది ఒక జీవితకాలం లేటు. మళ్ళీ ఎక్కడ వెళ్ళగలమని వస్తూ, వస్తూ
+ఆత్మారాముణ్ణి శాంతపరచే వచ్చేను."
+
+"హోటల్లో భోజనం చేసి వస్తున్నావా?" భాగ్యలక్ష్మి మాటలో వ్యక్తం అవుతున్న భయాన్నిగాని, ఆశ్చర్యాన్నిగాని అతడు
+గుర్తించలేదు.
+
+"మనకోసం వంటలు వండించి, పళ్ళేలు కూడా పరిచి వుంచేరు. బాబూ! ఆకలేస్తూండి వుంటుంది. మళ్ళీ ప్రాణం కడబట్టగలదు. దయచేసి
+నాలుగు మెతుకులు కొరికి వెళ్ళండి--అంటూ దారికాచి, మైకుల్లో ఆహ్వానిస్తూంటే తోసేసుకు రమ్మంటావా? మంచిదానివి కదూ, సిధ్ధాన్నం
+కాలదన్నుకు వస్తే మళ్ళీ అన్నం పుడుతుందా?"
+
+అతడు మామూలుగానే మాట్లాడేస్తున్నాడు. కాని, మనస్సులోని ఉద్విగ్నతను మాటల ప్రవాహం మాటున కప్పిపుచ్చుకుంటున్నట్లు
+కనబడింది. ఎందుకా ఉద్విగ్నత? విషయం ఎరిగి మొండితనం, నిర్లక్ష్యం చూపుతున్నాడా? సుశీల మెదడులో ఎన్నో ఆలోచనలు.
+
+"ఈ వారం పదిరోజుల్లో పోలీస్ సి.ఐ. ప్రతిరోజూ మీరు వచ్చేరాయని మనుష్యుల్ని పంపుతూనే వున్నాడు."
+
+"మనం ఇంకా వుద్యోగం వెలిగిస్తున్నామన్న భ్రమలో వున్నాడేమో మహానుభావుడు. మనం ఇప్పుడు స్వేచ్ఛా జీవులం అని చెప్పక
+పోయేరా. ఈమారు మరొకర్ని వెతుక్కున్నేమో పాపం."
+
+"ఆయన ఎరుగును"--అంది భాగ్యలక్ష్మి.
+
+"మన సిఫార్సులు వినే అభాజనుడున్నాడని భ్రమపడుతూండి వుంటాడు, అయితే."
+
+అతని బేఫర్వా ధోరణి చూస్తే తమది వట్టి అనుమానమేమోనని ఇద్దరికీ ఒక్క క్షణం అనిపించింది.
+
+"ఆయనకు మీతో పనేమిటి?"
+
+"ఆయనకా? ఓ సుపుత్రుడున్నాడు. నాన్నగారి వుద్యోగం ధర్మమాయని వాడు వట్టి వెధవాయిలా తయారయాడు. స్కూలు ఫైనలులో
+మూడుమాట్లు డింకీలు కొట్టేక మూడువేలు తనవి కావనుకున్నాడు. వాడు గట్టెక్కేడు. వాళ్ళ నాన్నకి, అంటే సి.ఐ. గారికి
+దేశప్రజల ఆరోగ్యం గురించీ, వంతెనలు, రోడ్లు మొదలైనవి దేశంలో వృధ్ధి పొందడంలేదే అనీ తపన పట్టుకొంది. ఇప్పుడా
+సుపుత్రుడికి మెడిసిన్‌లోనో, ఇంజనీరింగ్‌లోనో సీటు కావాలని నా సలహాలు అడిగేడు. అది గాకుంటే ఆ
+పెద్దమనిషికి మనలాంటి దిగంబర సన్యాసితో పనే లేదు."
+
+"ఏమీ కాదు."--అంది సుశీల.
+
+"నీ మీద వారంటు వుందిట తెలుసా?" అంది భాగ్యలక్ష్మి.
+
+రామారావు తెల్లబోయేడు. ఆమె ముఖం వంక చూసేడు. సుశీలను చూసేడు. నమ్మకం కుదరలేదు, నవ్వేడు.
+
+"ఎవరండీ, మనల్ని అరెస్టు చేయ్యాలనుకునే మూర్ఖుడు. ఎందుకోసం? మన ప్రభుత్వం ఎంత పనికిమాలినదైనా, అంత తుగ్లక్
+ప్రభుత్వం అనుకోను. నన్ను అరెస్టు చెయ్యడం తప్ప వాళ్ళకి మరో...."
+
+"నిజమే...." సుశీల ఎంత దృఢంగా చెప్పినా అతని కది విశ్వసనీయం అనిపించలేదు.
+
+"పోనీలెద్దురూ, ఉద్యోగం ఎల్లాగూ లేకుండా చేశాం కదా. కొన్ని రోజులు మన ఖర్చుల మీద అన్నం, బస చూపిద్దామనుకున్నారేమో,
+పాపం. వాళ్ళ సత్సంకల్పాన్ని మనం ఎందుకు వద్దనాలి."
+
+అతనిని కంగారు పెట్టకుండా అసలు విషయం చెప్పాలన్న వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. అతడు వారి మాటలు చెవి చొరనివ్వడంలేదు.
+అక్కడే అరుగుమీది గదిలో అతన్ని నిలబెట్టి వుంచడం న్యాయంగా తోచలేదు.
+
+"నడవండి లోపలికి."
+
+ముగ్గురూ లోపలి గదిలోకి నడిచేరు.
+
+"మీ హడావిడి నాకు అర్ధం కావడంలేదు. చెప్పండి. నా మీద వారంటు ఏమిటో."
+
+"పిల్లలు ఒక్కళ్ళున్నారు, తలుపులు తీసి వున్నాయి, చూసొస్తా. భాగ్యలక్ష్మీ, నువ్వు చెప్తూండు, వస్తా."
+
+సుశీల తన వాటావేపు హడావిడిగా వెళ్ళింది.
+
+"నారాయణగారిని అరెస్టు చేశారు. తెలుసా?"
+
+"తెలియదు. పాలవాళ్ళ సమ్మెలోనా?"
+
+"ఔను. హోటలువాళ్ళ పాల వేన్ తగలపెట్టి, డ్రైవరు బుర్ర పగలకొట్టేరని ఆయన మీద కేసు పెడుతున్నారు."
+
+"అన్నంతపనీ చేశారన్నమాట."
+
+"అదెంతవరకు నిజమో, నిజమే అయితే ఆ పని చేసిందెవరో," అంది భాగ్యలక్ష్మి.
+
+"అయితే ఆ పనికి నేను సలహాదారుణ్ణా, సహాయకుణ్ణా? నా పాత్ర ఏమిటి?" అన్నాడు, రామారావు హాస్యం ఎగతాళీ జతకలుపుతూ.
+
+అతనికి తన స్థితి ఏమీ గ్రహింపు లేదని భాగ్యలక్ష్మి అర్ధంచేసుకొంది.
+
+"అడిషనల్ తాసీల్దారు చెంపలు వాయగొట్టేసినందుకుట."
+
+చటుక్కున పంచదార కార్డుల కోసం వెళ్ళిన నాటి ఘట్టాలు గుర్తు వచ్చేయి. ఆ రాత్రే తాను ప్రయాణం అయి వెళ్ళిపోయేడు. తన
+గొడవల్లో తిరుగుతూ ఆ మాటే మరిచిపోయేడు.
+
+"ఆంతవరకు రాలేదులే," అన్నాడు పరధ్యానంగా, 'ఏం? ఎవరు చెప్పేరు?"
+
+"ఎవరు చెప్పడం ఏమిటి? ఊరంతా చెప్పుకుంటూంటే."
+
+రామారావు ఆ మాటకు పకపక నవ్వేడు. భాగ్యలక్ష్మి గదిమింది.
+
+"ఏమిటా నవ్వు? నువ్వు వచ్చినట్లు వూరంతా తెలియాలేమిటి?"
+
+"అదొకటా. నేనిప్పుడు 'అండర్ గ్రౌండ్' కావాలేమిటి ఖర్మ."
+
+భాగ్యలక్ష్మి నిస్పృహ కనబరచింది. "నవ్వకోయ్ బాబూ!"
+
+"ఇంత గొప్ప జోక్ చెప్పి నవ్వవద్దంటే ఎల్లా భాగ్యం! అడిషనల్ తహశీల్దారు చెంపలు వాయగొట్టడం న్యాయమేనన్న సహృదయత
+ప్రజలలో వుందన్నమాట. ఔనుగాని, నారాయణ గారు ఎవరి బుర్రో పగలేశారన్న వార్త కూడా అటువంటి సద్భావ ఫలితమే
+కాదుకద?"
+
+"అది చూసిన వాళ్ళు లేరు. కాని నువ్వు పంచదార కార్డు కోసం వెళ్ళడం, తాశీల్దారును కొట్టడం, ఫోన్ తెంపెయ్యడం, ఆఫీసు
+తగలపెట్టి అందర్ని చంపేస్తానని బెదిరించడం, వూరంతా గుబ్బుగా చెప్పుకుంటూంది."
+
+"అబ్బో, నా వీరకృత్యాల గాధ ఇంత వుందన్నమాటే మరచిపోయాను సుమా." అని మరల నవ్వు ప్రారంభించేడు.
+
+"ఇల్లాంటి కథలు కల్పించుకోగల ఇమేజినేషన్ ప్రజల్లో బ్రహ్మాండంగా వుంది. ఆ రోజున తాశీల్దారు పనికి సాయం చేశాగాని అడ్డం
+పెట్టలేదు. మిగిలిన కథలా, ఓస్!"
+
+"అబధ్ధం అయితేనేం, చూసినట్లు కథల్లా చెప్పుకుంటూంటే."
+
+"పోలీసాడు ఎందుకో వస్తే మీరీ భ్రమలు పెంచుకున్నారనుకుంటా."
+
+"కాదు రామం. నిజమే. నీ మీద వారంటుందన్నాడట ఎస్.ఐ. నాన్న చెప్పేడు."
+
+రామారావు ఆశ్చర్యంతో ఆమె మఖం వంక చూసేడు. వారంటు వార్త కన్న ఆమె 'రామం’ అని ఆప్యాయంగా పిలవడం అతనికి
+ఆశ్చర్యంగా వుంది. ఆ పిలుపు ఆమె నోట వచ్చి రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్ళూ ఆమె తనతో 'కంయ్' మంటుందేగాని సౌమ్యంగా
+మాట్లాడడం లేదు. దానికి కారణంగా తాను అనుకొంటున్నది వట్టి భ్రమ యేమోననిపించిన సమయాలు కూడా వున్నాయి. జయప్రదతో తనకు
+సంబంధం తెగిపోయిన వార్త ఆమె దాకా వచ్చిందా అప్పుడే--అనిపించింది.
+
+"థేంక్స్. కూర్చో, స్నానం చేసి వస్తా."
+
+భాగ్యలక్ష్మి చటుక్కున అతని భుజం పట్టుకుంది.
+
+"వెళ్ళిపో. నేను చెప్తున్నది నిజమే. తాశీల్దారుకోసం పోలీసాళ్ళు నీమీద కారాలు నూరుతున్నారు. "
+
+"తాశీల్దారుకు నూరే ఓపిక లేదా."
+
+"నిజం, రామం."
+
+"మీ నాన్న చెప్పేరా?"
+
+ఆమె తల తిప్పింది.
+
+"జనానికి కార్డులిప్పించినందుకే?"
+
+మళ్ళీ తల తిప్పింది.
+
+"ఉహూ"--అతడాలోచనలో పడ్డాడు.
+
+"నువ్వు తప్పించుకు తిరుగుతున్నావని పోలీసులు అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకొచ్చేవు?"
+
+తాను ఓ.వి. (ఔటాఫ్ వ్యూ) అన్నమాట వింటే మళ్ళీ నవ్వొచ్చింది.
+
+"ఎందుకేమిటి? నేనెందుకు యు.జి. కావాలి. అయి చేసేదేమిటి?"
+
+భాగ్యలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. కమ్యూనిస్టులు పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతారని ఆమె వింది. దానినే యు.జి.
+కావడం అంటారని తెలుసు. అండర్‌గ్రౌండ్ కమ్యూనిస్టుల అద్భుత సాహస గాథలు ఆమె ఎన్నో వింది. అన్నీ నమ్మింది
+కూడా. రామారావు కమ్యూనిస్టని అందరూ అంటారు. నగరంలో ప్రచారం అవుతున్న సాహస గాధలు విన్నాక అతడు
+అండర్‌గ్రౌండ్ కావడం తధ్యమేననుకొంది. ఆమె గర్వపడింది. అటువంటిదిప్పుడు ఇంటికి వచ్చేసేడు, పోలీసులకి ఎందుకు
+కనుమరుగు కావాలంటున్నాడు. అతనిని పట్టుకొని జైలులో పడేసి హింసలు పెడతారని ఆమె భయం.
+
+ఏం చెప్పలేక పోయింది. తల తిప్పుకుంది. ఆమె ఏడుస్తూందని గ్రహించేడు.
+
+"ఎందుకు ఏడుస్తావు?"
+
+భాగ్యలక్ష్మి మాట్లాడలేదు. తల తనవేపు తిప్పుకోబోయేడు, అతని ప్రయత్నం సాగకుండా ఆమె అతనికి జేరబడిపోయి, భుజం మీద
+తల దాచుకుంది. చేయగలది లేక రామారావామెను పొదివి పట్టుకున్నాడు. ఆమె కన్నీళ్ళు చొక్కాలోంచి ఇంకి ఒంటికి వెచ్చగా తగులుతూంటే
+జాలి వేసింది. వీపు నిమిరేడు, జాకెట్ హుక్కులు చేతికి తగులుతున్నాయి. ఆమె మరింత కరుచుకుపోతూంది. ఏడుస్తూనే ఒక చేయి అతని
+నడుము చుట్టూ వేసింది.
+
+"నువ్వు వెళ్ళిపో, దొరక్కు."
+
+రామారావు ఆమెను ముద్దు పెట్టుకొన్నాడు. చెక్కిళ్ళు నిమిరి చిరునవ్వుతో ఎగతాళి చేసేడు.
+
+"నేను దొరికితేనేం, భాగ్యం,"
+
+ఆ ప్రశ్న "నీకేం" అన్నట్లు వినిపించి భాగ్యలక్ష్మి వొణికింది, గద్గద కంఠంతో.
+
+"ఎక్స్‌క్యూజ్‌ మీ" అంది.
+
+"ఏమీ ఫర్వాలేదోయ్."
+
+అతను కౌగలించుకుని ముద్దు పెట్టుకొంటూంటే నాలుగురోజులనాడు తన ముందర చేసిన ప్రతిజ్ఞ భాగ్యలక్ష్మికి గుర్తేలేదని అటు
+వస్తున్న సుశీల గ్రహించి వెనక్కి తప్పుకుంది. నవ్వుకుంది.
+
+
+
+
+ముప్ఫయ్యయిదో ప్రకరణం
+
+
+స్నానం చేసి బట్టలు మార్చుకు వచ్చి భాగ్యలక్ష్మి పక్కనే మంచం మీద కూర్చుని రామారావు ఆమె అభ్యర్ధనను పెక్కు కోణాల
+నించి నిరాకరించేడు.
+
+"నేనెందుకు అండర్ గ్రౌండ్ కావాలి?"
+
+"అయి ఏం చెయ్యాలి?"
+
+"యు.జి. కావడం ఫేషనా?"
+
+"సులభమా?"
+
+"అవసరమా?"
+
+"ప్రజలకేమన్నా సాయం చేస్తే, చేస్తూంటే మనకి రక్షణ ఇస్తారు కాని, నాకెందుకు ఇస్తారు? ఇవ్వాలి?"
+
+"ఏ పనీ చెయ్యకుండా, పోలీసాళ్ళు నన్ను పట్టుకుంటామంటున్నారు నన్ను కాస్త దాచండంటే దాస్తారా? అదంత సులభమనుకున్నావా?"
+
+"వట్టినే కూర్చుంటే తిండి ఎల్లాగ? వీధిలోకెళ్ళను. నాకింత అన్నం మీరే పెట్టాలంటే అర్ధం ఏమిటి?"
+
+అతనిలో సహజంగా వున్న మొండి పట్టుదలే ఈ నిరాకరణకు కారణం అనుకుంటున్న భాగ్యలక్ష్మి అతనిననేక కోణాలనుంచి
+ఒప్పించడానికి ప్రయత్నించింది.
+
+"మీ పార్టీ మీకు సాయపడదా? ఇల్లాంటప్పుడు వాళ్ళు నిన్ను నీ మానాన వదిలేయవలసిందేనా?"
+
+రామారావు నవ్వేడు.
+
+"నేను పార్టీ సభ్యుడిని కాను."
+
+"అడిషనల్ తాసీల్దారును రెండేసేవంటే అతని మీద కోపమా నీకు, జనం...."
+
+రామారావు నవ్వేడు.
+
+"నేనెవరినీ కొట్టలేదు మొర్రో అంటే నువ్వే నమ్మడంలేదే. ఇంక కోర్టుని నమ్మించడం ఎల్లాగ?"
+
+భాగ్యలక్ష్మి వూరుకొంది.
+
+"చూడు భాగ్యలక్ష్మీ! ప్రజలలో పనిచేస్తున్న వాడూ, అతడు బయట వుండకపోతే పనులు చెడతాయన్న వాడూ యు.జి. కావడం
+అవసరం. ఒకప్పుడు అటువంటి వాళ్ళు కూడా రహస్యంగా వుండడంకన్న అరెస్టు కావడం వల్లనే పని ఎక్కువ జరుగుతుంది. ఇంక నా
+మాట అంటావూ, నన్ను అరెస్టే చేస్తే...."
+
+"ఇంకా సందేహమే?"
+
+"రహస్యంగా వుండి నేను చేసేది లేదు. కేసు పెట్టనీ. ఈ గాడిద కొడుకులు ఆఫీసుల్లో పంది కొక్కుల్లా చేరి ఎల్లా
+దోచుకుంటున్నారో, జనాన్ని ఎల్లా హింస పెడుతున్నారో, వాళ్ళకి పోలీసులూ, ప్రభుత్వమూ ఎల్లా సాయపడుతున్నారో కడిగేస్తా.
+దిక్కుమాలిన ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు దేశాన్ని అగ్నిగుండం చేసి పెడుతున్నారు. తమకు తగులుతూందని దొంగ
+ఏడుపులేడుస్తున్నారు. ఈ దొంగ ఏడుపులు మాని జనం సంగతి పట్టించుకోకపోతే నిజంగానే ఏడవవలసి వస్తుందని వాళ్ళకి తెలియాలి."
+
+ముందు గదిలో బూట్ల చప్పుడు విని ఇద్దరూ లేచి అటు వచ్చే సరికి వెనక వసారాలో పోలీసువాడు ఎవరినో అటకాయిస్తున్నాడు.
+
+"ఉండవమ్మా. లోపల పళ్ళ గంప ఏం లేదు."
+
+"లే. నే వెళ్ళాలి." సుశీల గొంతుక.
+
+ఎదురుగా వచ్చిన పోలీసాఫిసరును రామారావు,
+
+"ఎవరు కావాలి?"
+
+"మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా."
+
+"ఎందుకో అడగవచ్చునా?"
+
+దానికి సమాధానం ఇవ్వకుండా సబినస్పెక్టరు ఎదురు ప్రశ్న వేశాడు.
+
+"ఆమె ఎవరు? ఇక్కడెందుకుంది?"
+
+సబినస్పెక్టరు ఆలోచనా ధోరణి అర్ధం అయిందనుకున్నాడు. తనను అరెస్టు చేయడమేకాదు. సాధ్యమైతే అవమానించడం కూడా వుద్దేశం
+అన్నమాట. చటుక్కున అనేసేడు.
+
+"నా భార్య."
+
+భాగ్యలక్ష్మి వులికి పడింది. ఇనస్పెక్టరు ముఖాన విషపు నవ్వు ఒక్కక్షణం కనబడింది.
+
+"మీరు అవివాహితులనుకుంటాను."
+
+"మీ దయవలన కొద్దిరోజుల క్రితమే ఆ ఆశ్రమం వదిలాను. మీరు మాత్రం ఎప్పటిలాగే తప్పుడు సమాచారంతో దేశ రక్షణ
+సాగిస్తున్నారు."
+
+"ఉహూ. నడవండి. మా సమాచారం తప్పుడుదేమో అనుభవం మీద తెలుసుకొందురుగాని...."
+
+"అదే అనుకొంటున్నాం." అన్నాడు రామారావు. "భాగ్యం గుడ్ బై. వుద్యోగం సద్యోగం లేని రోజుల్లో కాస్త జైలు ఎక్స్పీరియెన్సు
+సంపాదించడం ఎందుకేనా మంచిది.....ఛెస్ ఏడుపెందుకు? ఎస్. ఐ. ఏమనుకుంటారు. మన్ని ఏడిపించగలిగేమనుకోరూ. కళ్ళు తుడుచుకో.
+గుడ్ గరల్. సుశీలగారూ? మరి సెలవా? నారాయణగారిని చూస్తా లెండి. చెప్తా. అంతా బాగున్నారని."
+
+ఇనస్పెక్టరు వెనక్కి తిరిగి పోలీసుకు సైగ చేశాడు.
+
+"....కె.డి.గాళ్ళ కన్న తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఇది తరవాయిలన్నీ...."
+
+"సందేహం ఎందుకు? యథా రాజా తధా ప్రజా--అన్నమాట. తక్తు మీద వున్నది పరమ లుచ్ఛాలయితే, దేశంలో పరమ హంసలవుతారా,
+ఇన్ స్పెక్టరుగారూ! భ్రమ. కేవలం భ్రమ."
+
+--అంటూ రామారావు ముందుకు అడుగేసేడు.
+
+
+
+
+
+End of the Project Gutenberg EBook of Agnigundam, by Rama Mohana Rao Mahidhara
+
+*** END OF THIS PROJECT GUTENBERG EBOOK AGNIGUNDAM ***
+
+***** This file should be named 39561-0.txt or 39561-0.zip *****
+This and all associated files of various formats will be found in:
+ http://www.gutenberg.org/3/9/5/6/39561/
+
+Produced by Volunteers at Pustakam.net
+
+Updated editions will replace the previous one--the old editions
+will be renamed.
+
+Creating the works from public domain print editions means that no
+one owns a United States copyright in these works, so the Foundation
+(and you!) can copy and distribute it in the United States without
+permission and without paying copyright royalties. Special rules,
+set forth in the General Terms of Use part of this license, apply to
+copying and distributing Project Gutenberg-tm electronic works to
+protect the PROJECT GUTENBERG-tm concept and trademark. Project
+Gutenberg is a registered trademark, and may not be used if you
+charge for the eBooks, unless you receive specific permission. If you
+do not charge anything for copies of this eBook, complying with the
+rules is very easy. You may use this eBook for nearly any purpose
+such as creation of derivative works, reports, performances and
+research. They may be modified and printed and given away--you may do
+practically ANYTHING with public domain eBooks. Redistribution is
+subject to the trademark license, especially commercial
+redistribution.
+
+
+
+*** START: FULL LICENSE ***
+
+THE FULL PROJECT GUTENBERG LICENSE
+PLEASE READ THIS BEFORE YOU DISTRIBUTE OR USE THIS WORK
+
+To protect the Project Gutenberg-tm mission of promoting the free
+distribution of electronic works, by using or distributing this work
+(or any other work associated in any way with the phrase "Project
+Gutenberg"), you agree to comply with all the terms of the Full Project
+Gutenberg-tm License available with this file or online at
+ www.gutenberg.org/license.
+
+
+Section 1. General Terms of Use and Redistributing Project Gutenberg-tm
+electronic works
+
+1.A. By reading or using any part of this Project Gutenberg-tm
+electronic work, you indicate that you have read, understand, agree to
+and accept all the terms of this license and intellectual property
+(trademark/copyright) agreement. If you do not agree to abide by all
+the terms of this agreement, you must cease using and return or destroy
+all copies of Project Gutenberg-tm electronic works in your possession.
+If you paid a fee for obtaining a copy of or access to a Project
+Gutenberg-tm electronic work and you do not agree to be bound by the
+terms of this agreement, you may obtain a refund from the person or
+entity to whom you paid the fee as set forth in paragraph 1.E.8.
+
+1.B. "Project Gutenberg" is a registered trademark. It may only be
+used on or associated in any way with an electronic work by people who
+agree to be bound by the terms of this agreement. There are a few
+things that you can do with most Project Gutenberg-tm electronic works
+even without complying with the full terms of this agreement. See
+paragraph 1.C below. There are a lot of things you can do with Project
+Gutenberg-tm electronic works if you follow the terms of this agreement
+and help preserve free future access to Project Gutenberg-tm electronic
+works. See paragraph 1.E below.
+
+1.C. The Project Gutenberg Literary Archive Foundation ("the Foundation"
+or PGLAF), owns a compilation copyright in the collection of Project
+Gutenberg-tm electronic works. Nearly all the individual works in the
+collection are in the public domain in the United States. If an
+individual work is in the public domain in the United States and you are
+located in the United States, we do not claim a right to prevent you from
+copying, distributing, performing, displaying or creating derivative
+works based on the work as long as all references to Project Gutenberg
+are removed. Of course, we hope that you will support the Project
+Gutenberg-tm mission of promoting free access to electronic works by
+freely sharing Project Gutenberg-tm works in compliance with the terms of
+this agreement for keeping the Project Gutenberg-tm name associated with
+the work. You can easily comply with the terms of this agreement by
+keeping this work in the same format with its attached full Project
+Gutenberg-tm License when you share it without charge with others.
+
+1.D. The copyright laws of the place where you are located also govern
+what you can do with this work. Copyright laws in most countries are in
+a constant state of change. If you are outside the United States, check
+the laws of your country in addition to the terms of this agreement
+before downloading, copying, displaying, performing, distributing or
+creating derivative works based on this work or any other Project
+Gutenberg-tm work. The Foundation makes no representations concerning
+the copyright status of any work in any country outside the United
+States.
+
+1.E. Unless you have removed all references to Project Gutenberg:
+
+1.E.1. The following sentence, with active links to, or other immediate
+access to, the full Project Gutenberg-tm License must appear prominently
+whenever any copy of a Project Gutenberg-tm work (any work on which the
+phrase "Project Gutenberg" appears, or with which the phrase "Project
+Gutenberg" is associated) is accessed, displayed, performed, viewed,
+copied or distributed:
+
+This eBook is for the use of anyone anywhere at no cost and with
+almost no restrictions whatsoever. You may copy it, give it away or
+re-use it under the terms of the Project Gutenberg License included
+with this eBook or online at www.gutenberg.org
+
+1.E.2. If an individual Project Gutenberg-tm electronic work is derived
+from the public domain (does not contain a notice indicating that it is
+posted with permission of the copyright holder), the work can be copied
+and distributed to anyone in the United States without paying any fees
+or charges. If you are redistributing or providing access to a work
+with the phrase "Project Gutenberg" associated with or appearing on the
+work, you must comply either with the requirements of paragraphs 1.E.1
+through 1.E.7 or obtain permission for the use of the work and the
+Project Gutenberg-tm trademark as set forth in paragraphs 1.E.8 or
+1.E.9.
+
+1.E.3. If an individual Project Gutenberg-tm electronic work is posted
+with the permission of the copyright holder, your use and distribution
+must comply with both paragraphs 1.E.1 through 1.E.7 and any additional
+terms imposed by the copyright holder. Additional terms will be linked
+to the Project Gutenberg-tm License for all works posted with the
+permission of the copyright holder found at the beginning of this work.
+
+1.E.4. Do not unlink or detach or remove the full Project Gutenberg-tm
+License terms from this work, or any files containing a part of this
+work or any other work associated with Project Gutenberg-tm.
+
+1.E.5. Do not copy, display, perform, distribute or redistribute this
+electronic work, or any part of this electronic work, without
+prominently displaying the sentence set forth in paragraph 1.E.1 with
+active links or immediate access to the full terms of the Project
+Gutenberg-tm License.
+
+1.E.6. You may convert to and distribute this work in any binary,
+compressed, marked up, nonproprietary or proprietary form, including any
+word processing or hypertext form. However, if you provide access to or
+distribute copies of a Project Gutenberg-tm work in a format other than
+"Plain Vanilla ASCII" or other format used in the official version
+posted on the official Project Gutenberg-tm web site (www.gutenberg.org),
+you must, at no additional cost, fee or expense to the user, provide a
+copy, a means of exporting a copy, or a means of obtaining a copy upon
+request, of the work in its original "Plain Vanilla ASCII" or other
+form. Any alternate format must include the full Project Gutenberg-tm
+License as specified in paragraph 1.E.1.
+
+1.E.7. Do not charge a fee for access to, viewing, displaying,
+performing, copying or distributing any Project Gutenberg-tm works
+unless you comply with paragraph 1.E.8 or 1.E.9.
+
+1.E.8. You may charge a reasonable fee for copies of or providing
+access to or distributing Project Gutenberg-tm electronic works provided
+that
+
+- You pay a royalty fee of 20% of the gross profits you derive from
+ the use of Project Gutenberg-tm works calculated using the method
+ you already use to calculate your applicable taxes. The fee is
+ owed to the owner of the Project Gutenberg-tm trademark, but he
+ has agreed to donate royalties under this paragraph to the
+ Project Gutenberg Literary Archive Foundation. Royalty payments
+ must be paid within 60 days following each date on which you
+ prepare (or are legally required to prepare) your periodic tax
+ returns. Royalty payments should be clearly marked as such and
+ sent to the Project Gutenberg Literary Archive Foundation at the
+ address specified in Section 4, "Information about donations to
+ the Project Gutenberg Literary Archive Foundation."
+
+- You provide a full refund of any money paid by a user who notifies
+ you in writing (or by e-mail) within 30 days of receipt that s/he
+ does not agree to the terms of the full Project Gutenberg-tm
+ License. You must require such a user to return or
+ destroy all copies of the works possessed in a physical medium
+ and discontinue all use of and all access to other copies of
+ Project Gutenberg-tm works.
+
+- You provide, in accordance with paragraph 1.F.3, a full refund of any
+ money paid for a work or a replacement copy, if a defect in the
+ electronic work is discovered and reported to you within 90 days
+ of receipt of the work.
+
+- You comply with all other terms of this agreement for free
+ distribution of Project Gutenberg-tm works.
+
+1.E.9. If you wish to charge a fee or distribute a Project Gutenberg-tm
+electronic work or group of works on different terms than are set
+forth in this agreement, you must obtain permission in writing from
+both the Project Gutenberg Literary Archive Foundation and Michael
+Hart, the owner of the Project Gutenberg-tm trademark. Contact the
+Foundation as set forth in Section 3 below.
+
+1.F.
+
+1.F.1. Project Gutenberg volunteers and employees expend considerable
+effort to identify, do copyright research on, transcribe and proofread
+public domain works in creating the Project Gutenberg-tm
+collection. Despite these efforts, Project Gutenberg-tm electronic
+works, and the medium on which they may be stored, may contain
+"Defects," such as, but not limited to, incomplete, inaccurate or
+corrupt data, transcription errors, a copyright or other intellectual
+property infringement, a defective or damaged disk or other medium, a
+computer virus, or computer codes that damage or cannot be read by
+your equipment.
+
+1.F.2. LIMITED WARRANTY, DISCLAIMER OF DAMAGES - Except for the "Right
+of Replacement or Refund" described in paragraph 1.F.3, the Project
+Gutenberg Literary Archive Foundation, the owner of the Project
+Gutenberg-tm trademark, and any other party distributing a Project
+Gutenberg-tm electronic work under this agreement, disclaim all
+liability to you for damages, costs and expenses, including legal
+fees. YOU AGREE THAT YOU HAVE NO REMEDIES FOR NEGLIGENCE, STRICT
+LIABILITY, BREACH OF WARRANTY OR BREACH OF CONTRACT EXCEPT THOSE
+PROVIDED IN PARAGRAPH 1.F.3. YOU AGREE THAT THE FOUNDATION, THE
+TRADEMARK OWNER, AND ANY DISTRIBUTOR UNDER THIS AGREEMENT WILL NOT BE
+LIABLE TO YOU FOR ACTUAL, DIRECT, INDIRECT, CONSEQUENTIAL, PUNITIVE OR
+INCIDENTAL DAMAGES EVEN IF YOU GIVE NOTICE OF THE POSSIBILITY OF SUCH
+DAMAGE.
+
+1.F.3. LIMITED RIGHT OF REPLACEMENT OR REFUND - If you discover a
+defect in this electronic work within 90 days of receiving it, you can
+receive a refund of the money (if any) you paid for it by sending a
+written explanation to the person you received the work from. If you
+received the work on a physical medium, you must return the medium with
+your written explanation. The person or entity that provided you with
+the defective work may elect to provide a replacement copy in lieu of a
+refund. If you received the work electronically, the person or entity
+providing it to you may choose to give you a second opportunity to
+receive the work electronically in lieu of a refund. If the second copy
+is also defective, you may demand a refund in writing without further
+opportunities to fix the problem.
+
+1.F.4. Except for the limited right of replacement or refund set forth
+in paragraph 1.F.3, this work is provided to you 'AS-IS', WITH NO OTHER
+WARRANTIES OF ANY KIND, EXPRESS OR IMPLIED, INCLUDING BUT NOT LIMITED TO
+WARRANTIES OF MERCHANTABILITY OR FITNESS FOR ANY PURPOSE.
+
+1.F.5. Some states do not allow disclaimers of certain implied
+warranties or the exclusion or limitation of certain types of damages.
+If any disclaimer or limitation set forth in this agreement violates the
+law of the state applicable to this agreement, the agreement shall be
+interpreted to make the maximum disclaimer or limitation permitted by
+the applicable state law. The invalidity or unenforceability of any
+provision of this agreement shall not void the remaining provisions.
+
+1.F.6. INDEMNITY - You agree to indemnify and hold the Foundation, the
+trademark owner, any agent or employee of the Foundation, anyone
+providing copies of Project Gutenberg-tm electronic works in accordance
+with this agreement, and any volunteers associated with the production,
+promotion and distribution of Project Gutenberg-tm electronic works,
+harmless from all liability, costs and expenses, including legal fees,
+that arise directly or indirectly from any of the following which you do
+or cause to occur: (a) distribution of this or any Project Gutenberg-tm
+work, (b) alteration, modification, or additions or deletions to any
+Project Gutenberg-tm work, and (c) any Defect you cause.
+
+
+Section 2. Information about the Mission of Project Gutenberg-tm
+
+Project Gutenberg-tm is synonymous with the free distribution of
+electronic works in formats readable by the widest variety of computers
+including obsolete, old, middle-aged and new computers. It exists
+because of the efforts of hundreds of volunteers and donations from
+people in all walks of life.
+
+Volunteers and financial support to provide volunteers with the
+assistance they need are critical to reaching Project Gutenberg-tm's
+goals and ensuring that the Project Gutenberg-tm collection will
+remain freely available for generations to come. In 2001, the Project
+Gutenberg Literary Archive Foundation was created to provide a secure
+and permanent future for Project Gutenberg-tm and future generations.
+To learn more about the Project Gutenberg Literary Archive Foundation
+and how your efforts and donations can help, see Sections 3 and 4
+and the Foundation information page at www.gutenberg.org
+
+
+Section 3. Information about the Project Gutenberg Literary Archive
+Foundation
+
+The Project Gutenberg Literary Archive Foundation is a non profit
+501(c)(3) educational corporation organized under the laws of the
+state of Mississippi and granted tax exempt status by the Internal
+Revenue Service. The Foundation's EIN or federal tax identification
+number is 64-6221541. Contributions to the Project Gutenberg
+Literary Archive Foundation are tax deductible to the full extent
+permitted by U.S. federal laws and your state's laws.
+
+The Foundation's principal office is located at 4557 Melan Dr. S.
+Fairbanks, AK, 99712., but its volunteers and employees are scattered
+throughout numerous locations. Its business office is located at 809
+North 1500 West, Salt Lake City, UT 84116, (801) 596-1887. Email
+contact links and up to date contact information can be found at the
+Foundation's web site and official page at www.gutenberg.org/contact
+
+For additional contact information:
+ Dr. Gregory B. Newby
+ Chief Executive and Director
+ gbnewby@pglaf.org
+
+Section 4. Information about Donations to the Project Gutenberg
+Literary Archive Foundation
+
+Project Gutenberg-tm depends upon and cannot survive without wide
+spread public support and donations to carry out its mission of
+increasing the number of public domain and licensed works that can be
+freely distributed in machine readable form accessible by the widest
+array of equipment including outdated equipment. Many small donations
+($1 to $5,000) are particularly important to maintaining tax exempt
+status with the IRS.
+
+The Foundation is committed to complying with the laws regulating
+charities and charitable donations in all 50 states of the United
+States. Compliance requirements are not uniform and it takes a
+considerable effort, much paperwork and many fees to meet and keep up
+with these requirements. We do not solicit donations in locations
+where we have not received written confirmation of compliance. To
+SEND DONATIONS or determine the status of compliance for any
+particular state visit www.gutenberg.org/donate
+
+While we cannot and do not solicit contributions from states where we
+have not met the solicitation requirements, we know of no prohibition
+against accepting unsolicited donations from donors in such states who
+approach us with offers to donate.
+
+International donations are gratefully accepted, but we cannot make
+any statements concerning tax treatment of donations received from
+outside the United States. U.S. laws alone swamp our small staff.
+
+Please check the Project Gutenberg Web pages for current donation
+methods and addresses. Donations are accepted in a number of other
+ways including checks, online payments and credit card donations.
+To donate, please visit: www.gutenberg.org/donate
+
+
+Section 5. General Information About Project Gutenberg-tm electronic
+works.
+
+Professor Michael S. Hart was the originator of the Project Gutenberg-tm
+concept of a library of electronic works that could be freely shared
+with anyone. For forty years, he produced and distributed Project
+Gutenberg-tm eBooks with only a loose network of volunteer support.
+
+Project Gutenberg-tm eBooks are often created from several printed
+editions, all of which are confirmed as Public Domain in the U.S.
+unless a copyright notice is included. Thus, we do not necessarily
+keep eBooks in compliance with any particular paper edition.
+
+Most people start at our Web site which has the main PG search facility:
+
+ www.gutenberg.org
+
+This Web site includes information about Project Gutenberg-tm,
+including how to make donations to the Project Gutenberg Literary
+Archive Foundation, how to help produce our new eBooks, and how to
+subscribe to our email newsletter to hear about new eBooks.
+