diff options
| author | Roger Frank <rfrank@pglaf.org> | 2025-10-14 20:11:40 -0700 |
|---|---|---|
| committer | Roger Frank <rfrank@pglaf.org> | 2025-10-14 20:11:40 -0700 |
| commit | de584b730966cd9232a382490d10dd07937a7c9e (patch) | |
| tree | a53a0bd1115e9d8172877887bd5a21e9f74932c1 | |
| -rw-r--r-- | .gitattributes | 3 | ||||
| -rw-r--r-- | 39004-0.txt | 4163 | ||||
| -rw-r--r-- | 39004-0.zip | bin | 0 -> 95042 bytes | |||
| -rw-r--r-- | LICENSE.txt | 11 | ||||
| -rw-r--r-- | README.md | 2 |
5 files changed, 4179 insertions, 0 deletions
diff --git a/.gitattributes b/.gitattributes new file mode 100644 index 0000000..6833f05 --- /dev/null +++ b/.gitattributes @@ -0,0 +1,3 @@ +* text=auto +*.txt text +*.md text diff --git a/39004-0.txt b/39004-0.txt new file mode 100644 index 0000000..e9a3049 --- /dev/null +++ b/39004-0.txt @@ -0,0 +1,4163 @@ +The Project Gutenberg EBook of Subhalekha, by Rama Mohana Rao Mahidhara + +This eBook is for the use of anyone anywhere at no cost and with +almost no restrictions whatsoever. You may copy it, give it away or +re-use it under the terms of the Project Gutenberg License included +with this eBook or online at www.gutenberg.org + + +Title: Subhalekha + +Author: Rama Mohana Rao Mahidhara + +Release Date: February 28, 2012 [EBook #39004] + +Language: Telugu + +Character set encoding: UTF-8 + +*** START OF THIS PROJECT GUTENBERG EBOOK SUBHALEKHA *** + + + + +Produced by volunteers at Pustakam.net + + + + +శుభలేఖ + +మహీధర రామమోహనరావు + +విజేత పబ్లికేషన్స్ +40-9/4-5 కె. జె. గుప్తా మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీ +విజయవాడ-520010 + + + + +శుభలేఖ +మహీధర రామమోహనరావు + +ప్రతులు-1000 + +ప్రథమ ముద్రణ-1996 సెప్టెంబర్ + +కవర్ డిజైన్-బాలి + +వెల:రూ. 35-00/- + +ప్రతులకు: +విజేత పబ్లికేషన్స్ +40-9/4-5 కె. జె. గుప్తా మునిసిపల్ +ఎంప్లాయీస్ కాలనీ, విజయవాడ-10 + +ముద్రణ: +వంశీకృష్ణా ప్రింటర్స్ +విజయా టాకీస్ వెనుక, విజయవాడ-2. + + + + +జాతీయోద్యమం మన జాతిని స్వాతంత్ర్య సాధనకు ఉన్ముఖుల్ని చేయడం ఒక్కటే కాదు. నూరేళ్ళు పైగా సాగిన ఆ వుద్యమం దేశ +ప్రజల మనస్సులో బ్రిటిష్ ప్రభుత్వం మీదనే కాదు, అసలు ప్రభుత్వ వ్యవస్థకే శత్రుత్వం నింపింది. ఫలితంగా +స్వాత్రంత్యానంతరం దేశ పునర్నిర్మాణానికి గాక ప్రభుత్వాల్ని కూలదోయడమే ప్రజల, పార్టీ లక్ష్యం అయింది. కాంగ్రెసు, +కమ్యూనిస్టు, బి.జే.పి., బి.ఎస్‌పి, డి.ఎం.కే., తెలుగు దేశం ప్రతి ఒక్కరూ మిగిలిన వారితోనే కాదు. తమ +వారితో కూడా శత్రుత్వమే. అధికారంలోవున్న ప్రభుత్వాన్ని కూలదోయడం ఒక్కటే లక్ష్యం. అల్లకల్లోలం సృష్టించి పాలన సాగకుండా +చేసి పడతొయ్యడం కోసం రౌడీల్నీ, కిరాయి హంతకుల్నీ చేర్చి ప్రజా సామాన్యాన్ని హత్యలు పాలు చేయడానికి అందరూ సన్నద్దులే. + +ఈ ఘట్టంతో ప్రజాసేవారంగాల్నే అంటి పెట్టుకొని వుండి, అందరితో సత్సంబంధాల్ని సాగిస్తున్న వ్యక్తి సుబ్బరాజు, ఎం. వి. నా +దృష్టిలో మహనీయుడు. ఆయన నా మిత్రుడు కావడం గర్వకారణం. + +అందుకే ఈ సుమాంజలి. + +--మహీధర రామమోహనరావు + + + + +శుభలేఖ + + +శుభలేఖ పిడుగులా వచ్చి పడిందని రాస్తే కావ్య మీమాంసకులు కనుబొమలు విరుస్తారేమో కాని, చంద్రశేఖరశాస్త్రి చేతికి వచ్చిన +ఆ శుభలేఖ పిడుగులాగే అతని నెత్తినణిచింది. + +పాత ఊళ్ళో ఉన్నఆఫీసుకెళ్ళే సన్నాహంలో శాస్త్రి రిక్షా వానికోసం గుమ్మంలో నిలబడి ఉన్నాడు. + +ఆఫీసులో తాగేందుకు మరచెంబుతో మంచినీళ్ళు తెచ్చి గుమ్మంలో పెట్టింది సత్యవతమ్మ. + +వెళ్ళేటప్పుడు కేకెయ్యండీ. తలుపేసుకుంటాను" ఓ అడుగు లోపలికేసి నిలబడింది. + +"కాళ్ళు పీకేలా ఏం నిలబడతారు? ఆ మోడా లాక్కుని కూర్చోరాదా?" అంది. + +భార్య శ్రద్ధకు శాస్త్రి చిరునవ్వు నవ్వేడు. + +"ఈ నిలబడ్డందుకు ప్రతిగా సాయంకాలం వరకూ కుర్చీలోంచి లేవనులే." + +సత్యవతమ్మ లోనికెళ్ళింది. ఒక్క నిముషం నిలబడింది. భార్య సలహా పాటించడానికై శాస్త్రి కదలబోయేడు. + +"పోస్ట్!" + +మరు నిముషంలో గేట్ తోసుకుని ఒక చెయ్యి రెండు మూడు పత్రికలూ, రెండు మూడు ఉత్తరాలూ లోన బడేసి అదృశ్యమయింది. + +కూర్చోబోయిన వాడల్లా లేచి శాస్త్రి వాటిని తీసుకున్నాడు. వాటిలో ఓ కవరు కొట్టవచ్చినట్లు దృష్టినాకర్షించింది. +మిగిలినవాటన్నింటిని పక్కనపెట్టి ముందు దాన్నే విప్పేడు. + +మంచి ఆర్టు పేపరు మీద అందంగా, నిరాడంబరంగా ముద్రించిన వివాహాహ్వానం. కవరు అంచులకు రాసిన పసుపు మరకలను బట్టి +అనుకోవలసిందే గాని, ఆ పత్రికను చూస్తే అదో వివాహాహ్వానం అనిపించదు. దానిమీద శుభమస్తు, శ్రీరస్తు వంటివి లేవు. +సాంప్రదాయకంగా వేసే--"జానక్యా: కమలామలాంజలి పుటే" శ్లోకం కనబడదు. తిథి వార నక్షత్రాల ప్రసక్తేలేదు. పత్రికల్లో +వచ్చే వార్తలకయినా అంతకన్న మెరుగులుంటాయి. + +"మేం వివాహం చేసుకుంటున్నాం." + +శతం జీవ శరదో వర్ధమాన +ఇత్యాభినిగమో భవతి +శతమితి శతం దీర్ఘమాయు +ర్మురుత ఏ నావర్ధయన్తి +శత మేవ మేవ శతాత్మానం +భవతి శతమనన్తం +భవతి శత మైశ్వర్యం +భవతి శతమితి శతం +దీర్ఘమాయుః + +అంటూ పెద్ద అక్షరాలలో వున్న శీర్షిక పంక్తిని చూసి శాస్త్రి అప్రయత్నంగానే "శుభం భూయాత్" అనేసి నవ్వుకున్నాడు. + +నవ్వుకుంటూ, ఆ వివాహం చేసుకొంటున్నదెవరా యని దిగువనకు చూసేసరికి అంత పెద్ద అక్షరాలలోనే "మీ ఆశీస్సుల నాశిస్తున్నాం" +అన్న చివరి పంక్తి కనబడింది. + +"ఓస్, ఇంతే కద మహద్భాగ్యం దానిదేముంది? తప్పకుండా" అంటూ ఆశీర్వచన పనస నందుకున్నాడు. + +"శతం జీవ శరదో వర్ధమాన...." + +ఆఫీసుకి ప్రయాణమై గుమ్మంలో నిలబడ్డ భర్త అశీర్వచనాన్నెత్తుకోడం వినిపించి, సత్యవతమ్మ చేతిలో పని వదలి సావిట్లోకి +వచ్చింది. ఆమెని చూసి శాస్త్రి తన పనికి తానే నవ్వేడు. + +"ఎవరో పెళ్ళి చేసుకొంటున్నారట. వెడితే తాంబూలం ఇవ్వవలిసి వస్తుందనో యేమో, అక్కడి నుంచే ఆశీర్వదించండన్నారు. మనదేం +పోయిందని ఆశీర్వదిస్తున్నా" + +"ఇంతకీ ఆ పెళ్ళి చేసుకోబోయే వాళ్ళ పేర్లన్నా చూసేరా?" + +"నిజమే సుమీ" + +శాస్త్రి పత్రిక తీసి చదవడం ప్రారంభించేడు. + +"ఆగస్టు 15వ తేదీ." + +"రేపే నన్నమాట!" అంది సత్యవతి. + +"సాయంకాలం ఏడు గంటలకి." + +"వీళ్ళకి ఏడంకెమీద మోజుంది కాబోలు." + +"అడ్వొకేట్ శాస్త్రి ఆధ్వర్యాన...." + +"పురోహితుడి ప్రాముఖ్యం ఏమిటి చెప్మా, శుభలేఖలోకి ఎక్కించడానికి?" అంది సత్యవతి. + +"పంచెల చాపు ఎగ్గొట్టినా ఏడవకుండేందుకు ముందే తేనె నాకించడం కాబోలు." + +"ఇంతకీ...." + +"వస్తున్నా మరి ఇంక సంతకాలు చూడు." + +"అసదుల్లాఖాన్, ఫిలాసఫీ ఆనర్సు, విజయవాడ...." + +సత్యవతమ్మ ఆశ్చర్యం కనబరచింది. + +"అసదుల్లా! మీ శిష్యుడే, అందుకే మీకు పంపించేడు." + +శాస్త్రి ముఖం నుంచి నవ్వు హఠాత్తుగా మాయమయింది. తరువాతి పేరు చదువుతున్నవాడు చటుక్కున ఆగిపోయేడు. ముఖాన తెల్లదనం. +గుండెలు పట్టేసినట్లయింది. + +"అయ్యో!" + +అతని వాలకం, ఆక్రందన చూసి సత్యవతమ్మ కంగారుపడింది. చటుక్కున భుజం పట్టుకుని పక్కనున్న మోడాలో +కూర్చుండబెట్టబోయింది. + +"నడు, లోపలికి!" + +ఆ క్షీణస్వరం చేయి పట్టుకొని గాని నిలబడలేనంత బలహీనత చూసి ఆమె మరింత ఆందోళన పడింది. ఆ స్థితికి కారణం ఆ +శుభలేఖే అయి ఉంటుందని తోచలేదు. ఈ మధ్య వినిపించే మరణాలన్నిటికీ గుండె పోటే కారణమని వింటోందేమో ఆలోచన అటే పోయింది. + +పడక కుర్చీలో కూర్చోబెడుతూ ఆదుర్దాగా అడిగింది. + +"ఎలా ఉంది? డాక్టరు కోసం...." + +శాస్త్రి ఆమె చేయి పట్టుకొని వదలలేకున్నాడు. నెమ్మదిగా, అస్పష్టంగా "నువ్వు కూర్చో ముందు" అన్నాడు. + +ఆయన కళ్ళల్లో నీరు తిరుగుతున్నట్లనిపించి సత్యవతమ్మ మరింత కంగారు పడింది, బేజారెత్తిపోయింది. + +"వాళ్ళ ప్రసాదుని డాక్టరు కోసం పంపిస్తా ఒక్క నిముషం కదలకుండా పడుకోండి." + +సమాధానం కోసం ఆగకుండానే పక్క వాటా వారిని పిలిచింది. + +"ప్రసాదూ! ప్రసాదూ!" + +ఆమె ఆదుర్దా , పిలుపూ శాస్త్రికి నిజంగానే గుండె జబ్బు తెప్పించేలా ఉన్నాయి. పక్క వాటా వాళ్ళూ, వాళ్ళతో వీధిలోని వాళ్ళూ, +పేటలో వాళ్ళూ ఉరకలేస్తూ వస్తున్నట్లే అనిపించింది. హడలిపోయేడు. ఏం జరిగిందంటే ఏం చెప్తాడు? నలుగురూ శుభలేఖ చూస్తారు. +ఇంకేమన్నా ఉందా? + +అప్పుడే పక్క వాటాలోంచి కృష్ణవేణమ్మ పలుకుతూంది. నాలుగేళ్ళ పిల్ల ఏదో మంకుతనం చేస్తూంది కాబోలు కోప్పడుతూంది. + +"అబ్బ ఉండవే పాడు గోల! పిన్నిగారు పిలుస్తున్నారు. ఎందుకోచూడు" + +శాస్త్రి చటుక్కున భార్యనోరు మూసేడు. చేతిలోని శుభలేఖ కళ్ళముందు ఆడించేడు. + +"గోల చెయ్యకు కొంప మునిగిపోయింది!" + +కృష్ణవేణమ్మ కంఠం ఎత్తి పిలుస్తూంది. + +"ఏమిటి పిన్నిగారూ? పిలిచేరా?" + +అసలు విషయం అర్థం కాకపోయినా శుభలేఖలో మాట ఏదో మగడిని ఆందోళన పరచిందని సత్యవతి గ్రహించింది. గోల కాకూడదని +క్షణంలో సర్దుకొంది. + +"అబ్బే, ఏం లేదు. పిల్లది మహా గొడవ చేస్తూంది. భోజనాలయాయా? ప్రసాదు బడి కెళ్ళేడా?" + +"ఏదీ, ఇప్పుడే వాడిని పంపించి విస్తట్లో పెట్టుకున్నా, బాబయ్యగారింకా వెళ్ళినట్లులేదే!"-అంది కృష్ణవేణమ్మ. + +"లేదు. తలనొప్పిగా ఉందని ఇంట్లొనే ఉండిపోయారు," + +రాబోయే ప్రశ్నక్కూడా సమాధానం చెప్పేసి, ఆమె మగని వేపు తిరిగింది. + +"తాతకీ, వాళ్ళకీ తెలియదంటారా?" + +ఆమె ఆలోచనలన్నీ తన మగనినినంత కంగారు పెడుతున్న దేమిటాయని సాగుతున్నాయి. + +పెళ్ళికొడుకు అసదుల్లా తన మగడు పని చేస్తున్న కంపెనీ యజమాని మనమడు. తన పెళ్ళి విషయం తాతగారికి చెప్పి ఉండడు. +లేకుంటే తమకి తెలిసి ఉండేది. అంటే తమ వాళ్ళెవరూ అంగీకరించలేని పెళ్ళి చేసుకొంటున్నాడు కాబోలు! ఆ వార్తవింటే ముసలాళ్ళు +చచ్చిపోతారు. వాళ్ళ ప్రాణాలన్నీ ఆ మనమడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నారు. కంపెనీ దెబ్బ తినేస్తుంది. తమ నోట్లో +మన్నడిపోతుంది.--ఆ పంథాలో సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. ఆ ఆలోచనను ధృవపరచుకొనేందుకే ఆ ప్రశ్న వేసింది. + +కాని శాస్త్రి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. + +"హఫీజ్ మహమ్మదుకు తెలుసుననే అంటావా?" + +"ఏమో, పాపం! మనమడి మీద ప్రాణాలెట్టుకున్నాడు. ఆయనకి తెలిసి, ఆయన ఇష్టం మీదనే ఈ పెళ్ళి జరుగుతూంటే మీకెవరికీ +తెలియకుండా ఉంటుందా?" + +ఎవరికి ఎంతవరకు తెలుసునో గాని, శుభలేఖలోని అసలు విషయం భార్యకు తెలియదని ఆమె ప్రశ్నను బట్టి శాస్త్రికి అర్థం +అయింది. తాను చూపిన శుభలేఖని ఆమె చదవలేదన్న మాట! వధువు పేరునామె చూడనేలేదు. + +"రెండో వారెవరో ఎరుగుదువా?" + +పెళ్ళికూతురనే మాటను కూడా శాస్త్రి ఉచ్చరించలేకపోయాడు. ఆ మాట తలచుకోగానే కంఠం డెక్కు పట్టింది. శుభలేఖ నామెచేతిలో +పెట్టి తల తిప్పుకున్నాడు. + +సత్యవతమ్మ గబగబా వెళ్ళి కళ్ళజోడు తెచ్చుకుంది. + +"అసదుల్లా ఖాన్ ఫిలాసఫీ ఆనర్సు, విజయవాడ. + +ఎం. ఉమాదేవి, విజయవాడ." + +మరొక సందర్భంలో అయితే ఆ పేరు చదివినా ఏమీ అనిపించి ఉండేది కాదు. కాని ఇప్పుడు వేరు. మగని అవస్థ చూశాక ఆమెకు +అనుమానం కలిగింది. + +"ఎవరీ ఉమ?" + +శాస్త్రి సమాధానం చెప్పలేకపోయాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తల తిప్పుకున్నాడు. సత్యవతి గ్రహించింది. + +"అయ్యో! అయ్యో!" + +"నిరుడా కుర్రాడు వచ్చి అడిగినప్పుడు పెళ్ళి చేసేసినా బాగుండిపోను! సగోత్రం అని అభ్యంతరం చెప్పేను. ఇప్పుడు మతం కూడా +కాదే!" + +శాస్త్రి చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు. + +సత్యవతమ్మ మంచి వ్యవహార జ్ణానం గల మనిషి. మగనికి ముందు ధైర్యం చెప్పాలి. + +"నా కిందులో ఏదో తిరకాసు కనిపిస్తూంది. మన ఉమ కాదీ అమ్మాయి యెవరో?" + +అతడా అనుమానం లేదన్నట్లు తల తిప్పేడు. "విజయవాడ అమ్మాయిట." + +"విజయవాడలో ఉమ అంటే మన అమ్మాయేనా, ఏంటి?" + +"ఇంటి పేరు 'ఎం' అని ఉంది." + +"'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే ఇంటి పేర్లు ఎన్ని లేవు?" + +"చదువు...." + +"అది మాత్రం...." + +"అంతే నంటావా?" + +"ఓ మారు జ్ఞాపకం చేసుకోండి. మీరు సగోత్రమని అభ్యంతరం చెప్పినప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఉమ కళ్ళనీళ్ళు +పెట్టుకుంది. అతనిమీద అంత ఆసక్తి చూపినది. ఇప్పుడు మరొకర్ని చేసుకోవడానికి సిద్ధమయిందంటే నమ్మలేను!" + +శాస్త్రి ఆనాటి ఘటనలన్నీ గుర్తు చేసుకున్నాడు. తానే ఈ పరిస్థితిని కల్పించుకున్నాననుకొంటూ కుమిలిపోయేడు. + + + + +2 + + +సరిగ్గా పది నెలలయింది. + +రెండో కొడుకు రామకృష్ణ అతనిని వెంటబెట్టుకు వచ్చేడు. వాళ్ళ వెనకనే రిక్షా దిగిన ఉమని చూసేక ఏదో అనుమానం కలిగింది. + +"ఇప్పుడొచ్చేవేమమ్మా? సెలవులేమన్నా ఉన్నాయా?" అన్నాడు శాస్త్రి. + +మొదట తటపటాయించినట్లనిపించినా వెంటనే సర్దుకొంది. "చిన్నన్నయ్య వచ్చాడు. బెజవాడ వెడుతున్నా వస్తావా, అన్నాడు. +రావాలనిపించింది వచ్చాను." + +తరవాత రామకృష్ణ చెప్పేడు. + +శాస్త్రి, భార్య కూడా అతనిని చూసి ఆనందపడ్డారు. పాతికేళ్ళవాడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎత్తరి. దానికి తగిన +పుష్టి, కన్ను, ముక్కు తీరుంది. ఆకర్షకంగా ఉన్నాడు. + +విషయం విన్నాక శాస్త్రి వేసిన మొట్టమొదటి మొదటి ప్రశ్న--"వారిదేశాఖ?" అని. + +రామకృష్ణ తెల్లబోయేడు. వర్ణాంతరం చేయడానికి తండ్రి ఒప్పుకోడు. కనుక, భాస్కరరావు బ్రాహ్మణ కులం వాడేనా అన్నదొక్కటే +తెలుసుకున్నాడు. శాఖల్ని గురించి తెలుసుకోవడం అవసరం అనుకోలేదు. తెలుసుకోలేదు. అయితే ఆ మాట ఒప్పుకోకుండా ఎదురు ప్రశ్న +వేసేడు. + +"ఏం శాఖల పట్టింపు కూడా పెట్టుకుంటారా?" + +శాస్త్రి విశాల హృదయం కనబరిచేడు. "ఆ పట్టింపులు పెద్దగా చూడనక్కరలేదనుకో. తెలుసుకోవడంలో తప్పులేదు కదా!" + +"నే నడగలేదు." + +"పోనీ గోత్రం ఏమిటనేనా తెలుసుకున్నావా?" అన్నాడాయన ఎకసక్కెంగా. + +రామకృష్ణ అదీ అవసరం అనుకోలేదు. కాని, ఏ వివరాలు తెలుసుకోకుండా పడుచువాళ్ళనే విధంగా సమ్ముఖపరచావని తప్పుపడుతూంటే +సహించలేకపోయేడు. + +"మన గోత్ర ఋషి భరద్వాజుడు కూడా వేగినేటి వాడేనా? ఆయనదీ మనింటి పేరేనా? మనకి పూర్వం ఎన్ని తరాల క్రితం వాడయి +ఉంటాడంటారు?" అన్నాడు రామకృష్ణ ఎకసక్కెంగా. + +చంద్రశేఖర శాస్త్రి ఆ సమస్యను ఆ రూపంలో ఎన్నడూ ఆలోచించలేదు. అందుచేత ఆయన వద్ద సమాధానాలు లేవు. + +"మనకి కొన్ని ఆచారాలు, అలవాట్లూ ఉన్నాయి. అవెందుకొచ్చేయి? అలాగే ఎందుకున్నాయనంటే చెప్పలేకపోవచ్చు కాని, తగినంత +కారణం లేనిదే వచ్చి ఉండవు...." + +"కారణం లేనిదే వచ్చాయని నేనూ అనడం లేదు. మంచి కారణమే ఉంది. గోత్రం అన్న శబ్దంలోనే ఉంది ఆ సూచన. + +"మనుష్యుడు పశుపాలకుడుగా పరిణితి పొందిన నాటి శబ్దం అది. పశుపాలకులుగా జీవిస్తున్న ఒక్కొక్క జట్టు తమ తమ నాయకుడి +పేరుతో చలామణీ అవుతూండి ఉండాలి. ఆ రోజుల్లొనే ఆ జట్టు వాళ్ళంతా సంఖ్యలు పెరిగి, నాలుగు మూలలకీ చెదిరిపోయినా, ఫలానా +దీక్షితులుగారి మనుమలని మమ్మల్నన్నట్లే, ఆ మొదటి నాయకుడీ పేరు మీదనో, తరవాత వచ్చినా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన +మరొకరి పేరు మీదనో చెలామణి అయ్యారు. ఆ విధంగా వారు ఏక గోత్రీకులయ్యేరు. ఒకే జట్టుగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిన +అంతర్వివాహ నిషేధం తరవాతా కొనసాగింది. బహుశా వేల ఏళ్ళే కాదు. వేల తరాలే గడిచిపోయేయి. ఆ జట్లు పాకేయి. ఇతరేతరుల +సంపర్కంలో ఆ రక్తం సమ్మిశ్రితం అయిపోయింది. + +"ఈ వేళ ఒకే గోత్రం వారు రక్త సంబంధీకులయి ఉంటారనేదానికి అర్థం లేదు. + +"నాన్నగారూ! మనుష్యుడు ఒక్కచోటనే ఉండిపోలేదు. ఎంతో దూరం వచ్చేసేడు. మన శాఖలు, మన తెలుగువాళ్ళలో కనిపించే ఇంటి +పేర్లు దానికి సాక్షిభూతాలు. చరిత్రకు కూడా అందని కాలంనాటి పునాదుల మీద ఈవేళ భవనాలు లేపబోకండి.." + +చంద్రశేఖర శాస్త్రి ఉస్సురని పోయాడు. నెమ్మదిగా అన్నాడు. "అయితే గోత్రం ఒకటేనన్నమాట." + +"నే నడగలేదు. నాకు తెలియదు. ఒకటేనని ఎందుకనుకోవాలి?" + +"తెల్సుకుందాం" అన్నాడాయన దృఢంగా. + +"ఒకటే అయితే?" + +"ఈ వివాహం కూడదు!" + +"ఇంతా విని...." + +"నీవి వట్టి ఊహలు గాక నిజమనేందుకు సాక్ష్యం ఏమిటి?" అంటూ ఒక్క మాటలో రామకృష్ణ వాదాన్ని పక్కకు తోసేశాడు. + +రామకృష్ణ ఒక్కనిముషం చురుక్కుమనేలా చూసేడు. "కొన్నేళ్ళ క్రితం నాగార్జున కొండకెళ్ళేం గుర్తుందా?" + +"అదెందుకొచ్చిందిప్పుడు?" అన్నాడు శాస్త్రి అనుమానంగా. మాటల్లో ఎక్కడో మెలిక వేసి తనను వాదంలో బోల్తాకొట్టిస్తాడని +రామకృష్ణయెడ ఆయనకు తగని భయం. + +"చెప్తున్నా, ఇక్ష్వాకు రాజు వీరబాహుదత్తుడు అశ్వమేధయాగం చేసిన గుర్తులూ యజ్ఞకుండాన్నీ చూసేరు గుర్తు ఉందా?" + +"ఔను" + +"ఆ రోజున క్యూరేటరు ఒక విషయం చెప్పారు. దానిమీద మీరాయనతో వాదం వేసుకున్నారు." + +"కావచ్చు." + +"వీరబాహుదత్తుడు ఇన్ని అడుగుల ఇన్ని అంగుళాల ఎత్తు మనిషి అన్నారాయన. అలా కచ్చితంగా చెప్పడానికి--ఆ +వీరబాహుదత్తుడు కనీసం 15-16 వందల ఏళ్ళ పూర్వపువాడు--ఆయన చూపిన ఉపపత్తి గుర్తుండి ఉంటుంది." + +"ఔను" + +"యజ్ఞశాల మెట్లలో ఒక దానికి రంధ్రం, తూము ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన ఆ లెక్క చెప్పేరు. అవబృథ స్నాన జలంలో +యజమాని మునిగి చనిపోకుండేందుకు ఆయన గొంతు ఎత్తులో ఆ తూమును అమర్చేరనీ, దానిగుండా అదనపు జలం దొర్లిపోయిందనీ అన్నారు. +ఆ అంచనా బట్టి వీరబాహుదత్తుడు ఇంత ఎత్తు మనిషి అయి ఉంటాడని ఆయన లెక్క" + +శాస్త్రి ఆనాటి దృశ్యాలనూ, మాటలనూ, చర్చలనూ జ్ఞాపకం చేసుకుంటూ చాలా సేపు కూర్చున్నాడు. కొడుకు ఉద్దేశ్యం అర్థం అయింది. +అవన్నీ నిజానికి ఊహలే, కాని సాక్ష్యాధారం మీద చేసిన ఊహలు. చరిత్రలో, ఆచారాలలో, సాహిత్యంలో, తవ్వకాలలో +కనిపిస్తున్న అవశేషాల మీద నిర్మించిన ఊహలు. ప్రత్యక్ష సాక్ష్యం కన్న బలమైన ఆధారాలున్న ఊహలు. + +అయితేనేం ఒప్పుకోడానికి మనస్సు అంగీకరించడం లేదు. + +"సృష్టిలో ప్రతిదానికీ ఓ ప్రయోజనం ఉంది. కుల విభజన కూడా...." + +"అయితే?"--అన్నాడు కనుబొమలు కుంచించి రామకృష్ణ. + +"నువ్వు" "బ్రాహ్మణోస్యముఖమాశీత్"--అనే నిర్దేశాన్ని ఒప్పుకోనక్కర్లేదు. కుల విభజనకు దైవోద్దిష్టాన్ని అంగీకరించకు. +కాని, చరిత్రలో దానికున్న ప్రత్యేకతను కాదనలేవుగా. మీరు--మార్క్సిస్టులు--చెప్పినట్లే ఒప్పుకుందాం. అది సంఘంలో వచ్చిన +శ్రమ విభజన స్వరూపమేనని ముఖం, బాహువులు, పాదాలు మొదలైన సంకేతాల వల్లనే అర్థం అవుతూందంటావుగా. బాగుంది. ఒప్పుకుందాం. +మన దేశంలో కులం వృత్తి విభజనకు ప్రాతిపదిక కావడం, వృత్తులు కులాలలో స్థిరపడడం వలన చాలా నిశితమైన వృత్తి నైపుణ్యం +ఏర్పడిందంటావు. ఔనా?" + +"అది కూడా పూర్తిగా నిజం కాదు. కులం వర్ణం ఒకటి కాదు. వర్ణం ఆర్య తెగలది. అంతవరకది శ్రమ విభజన మూలకమే +అనుకోవచ్చు. కాని కులం అలా కాదే. దీనితో తెగల జీవితపు అవలక్షణాలు, మంచి లక్షణాలూ, పని విభజనా, +నమ్మిశ్రణమూ, తెగల ప్రత్యేకతా, సమ్మిశ్రణమూ అన్నీ గుదిపడ్డాయి. మన గోత్రాలూ, గోత్ర ఋషులూ వట్టి ఎరువు +సొమ్ములు!" + +శాస్త్రి నవ్వేడు. "కంభంపాటి సత్యనారాయణగారి పుస్తకం వప్పచెప్పేవురా !" + +రామకృష్ణ తల అడ్డంగా తిప్పేడు. + +"అంతే కాదు నాన్నగారూ! ఒకనాడు ఉన్నతస్థాయికి చేరిన మన నైపుణ్యం మచ్చుకి కూడా మిగలకపోవడానికి, ఉత్తములూ, +ఉన్నతులూ పేరుతో వట్టి పనికిమాలిన మోసగాళ్ళు తయారవడానికి కూడా ఈ కుల విభజనే మూలం అనొద్దూ మరి!" + +శాస్త్రి నవ్వేడు. + +"నాణానికి బొమ్మా, బొరుసూ రెండూ ఉంటాయి." + + + + +3 + + +"అదే నేను చెప్పేదీను." + +"మంచిది. అయితే చెడుగు ఉంది గనక మంచిని కూడా తోసేసుకుంటామా? ఆ చెడుగును తొలిగించే విధం ఆలోచించాలి. ఎలుకలు చూరులో చేరేయి +గనక ఇల్లు తగలబెట్టుకుంటామా?" + +"చూడండి, నాన్నగారూ, విషయం మనస్సుకి సూటిగా పట్టించడానికై సాహిత్యం అలంకారాన్ని తీసుకుంది. కాని, అది ఆ విషయాన్ని +అన్ని కోణాల నుంచీ చూడడానికి సాయపడదు. వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ "సముద్ర ఇవ గంభీరః" అన్నాడు. దీనికి నీటి +మూటలాంటివాడని అర్థం చెప్పలేదు." + +"అంటే ఏమంటావు?" + +"ఏమీ లేదు. చరిత్ర గతితో సమాజం దేశ కాలపరిస్థితుల్ని బట్టి ఒక నిర్మాణ రూపాన్ని తీసుకుంటుంది. ఆ చట్రంలో అభివృద్ధి +సాగినంత కాలం సాగుతుంది. అసాధ్యం అయినప్పుడు మార్పు తప్పదు. ఆ చట్రంలో ఇమడలేని స్థితి ఒకటి వస్తుంది. ఆ ఘట్టంలో +మార్పు తెచ్చుకోకపోతే చైనా పడుచుల కాళ్ళకు కట్టిన కట్ల లాగా ఎముకల్ని విరిచేస్తాయి. విరూపం చేస్తాయి. విపరీతమైన బాధ +కలిగిస్తాయి." + +"మళ్ళీ నువ్వో ఉపమానం తెస్తున్నావ్రా!...." + +"దాని ఉపయోగం పరిమితం." + +"పోనీ, ఆ చట్రాన్ని సడలించవచ్చు కదా!" + +"సడలించడం అనండి, మార్చడం అనండి, ఏదైనా సమాజం అవసరాన్ని బట్టే ఉంటుంది. మీ కోరిక ప్రకారం అడుగులు లెక్క వెయ్యడం +సరిపడదు." + +చంద్రశేఖరశాస్త్రి ఏమీ అనలేదు. సడలించడానికి తాను వొప్పుకున్నాడు. ఏమిటి సడలించడం అంటే? శాఖలేవైనా బ్రాహ్మణులంతా +ఒకటిగా పరిగణించాలా? కులాన్ని అంగీకరిస్తే శాఖల్ని ఎందుకు ఒప్పుకోకూడదు? లేకపోతే మతాన్ని బట్టి విభజన నంగీకరించాలా? + +ఏది మతం అంటే? దేవుణ్ణి గురించిన భావనకా ప్రాధాన్యం, లేక ఆచారాలకా? వీటి మధ్య గోత్రం స్థానం ఏమిటి?--అన్నీ +ప్రశ్నలే. ఎన్నో, ప్రశ్నలు. + +శాస్త్రి తన ఆలోచనల నుంచి తేరుకోక పూర్వమే రామకృష్ణ మరల అందుకున్నాడు. అయితే ఈ మారతడు ఎత్తుకొన్న కోణం వేరు. + +"ఆ కుర్రవాడు ఉమ అంటే ప్రాణం పెడుతున్నాడు." + +"ఉమ ఏమంటుంది?" + +"ఆమెకీ ఇష్టమే." + +"ఇష్టం వేరూ, ప్రేమాభిమానాలు వేరూను." + +"పెద్ద కూతురు ఇప్పుడు పెళ్ళి వద్దు, చదువుకుంటానంటూంటే తోసేసి, జమీందారీ సంబంధం వచ్చిందని పెళ్ళి చేసేసిన తండ్రి ఈ వేళ +రెండో కూతురు విషయంలో ఇష్టానికీ, ప్రేమాభిమానాలకీ అంతరం ఆలోచిస్తున్నాడు. + +"మీరే పరిశీలించండి. రెండు రోజులుంటారుగా." + +శాస్త్రి ఏమీ అనలేదు. రామకృష్ణే మళ్ళీ అందుకున్నాడు. "ఉమే కాదంటే ఈ సమస్య ఇంత వరకు రాకనేపోవును." + +"ఊఁ...." + +మళ్ళీ ఒక్క క్షణం ఇద్దరూ నిశ్వబ్దంగా ఉండిపోయారు. + +"మొదట ఆయన నా వద్దకు వచ్చాడు. ఉమకు ఆ ఆలోచనే లేదు." జరిగిన కథనంతా చెప్తే తండ్రి తన అభ్యంతరం ఎంత +బలహీనమో ఊహిస్తాడని రామకృష్ణ చెప్పబోయాడు. కాని శాస్త్రి దృష్టి అటు లేదు. + +"దీని వలన అపకారం జరిగితే....?" + +నిజంగా నమ్మకం ఉండే ఆ మాట అంటున్నారా అన్నట్లు రామకృష్ణ సారి చూశాడు. + +అది గమనించి శాస్త్రి తత్తరపడ్డాడు. + +"అవునోయ్--దేనికి, దేనికి ఎంత సంబంధం ఉంటుందో చెప్పలేము. ఈ మధ్య ఒక సోవియట్ శాస్త్రవేత్త వ్రాసిన వ్యాసం +చదివాను." + +తను కమ్యూనిస్టు గనక సోవియట్ శాస్త్రవేత్త వాక్యాన్ని తిరుగులేని సాక్ష్యంగా తీసుకుంటానని నమ్మకం కాబోలుననుకున్నాడు. +వెంటనే తిప్పికొట్టేడు. + +"మన గోత్ర వివాహాలు మంచిది కాదని వ్రాసేడా?" + +"ఒరేయ్! వెటకారం మాను! ఆయన మీ అందరికీ అతి ప్రియమైన స్టాటిస్టిక్స్‌తోనే తన అభిప్రాయం చెప్పాడు." + +"ఏమంటాడు?" + +"సూర్యుడిలో ప్రజ్వలనాలు బలంగా ఉన్న రోజున భూమి మీద కారు ప్రమాదాలు హెచ్చుగా ఉన్నాయన్నాడాయన." + +తండ్రి ప్రయత్నం చూసి రామకృష్ణకి నవ్వు వచ్చింది. కానీ ఆయనను హేళన చేసినట్లుంటుందని పళ్ళతోనే బిగపట్టుకున్నాడు. + +"దానికి ఎంత బలమైన సాక్ష్యం ఉందో నేనెరగను. కారణాలు ఏమిటన్నాడో నాకు తెలియదు. నాన్నగారూ! చూడండి. మనం అజ్ఞాతంగా +ఉండిపోయిన విషయాన్ని అడ్డం పెట్టుకుని, అర్థం లేదని తెలిసిన ఆచారాల విషయంలో మన చేతులు కట్టేసుక్కూర్చుందామనరాదు. +శాస్త్ర పరిశోధన సాగిన కొద్దీ మిగిలిపోయిన వాని సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అదే మనలోని వైరుధ్యం. దీనికి అంతం అంటూ +ఉండదు కనక, అసలు ఆలోచించే ప్రయత్నమే వద్దని కూర్చుంటామా?" + +శాస్త్రికి కోపం వచ్చింది. ఈ కొడుకు మొదటి నుంచీ తన తర్కవాద బలంతో తన్ను అడ్డుదారులు పట్టిస్తున్నాడనే బెదురు ఆయనకు +ఉంది. ఆరేళ్ళ క్రితం, ఉమ చదువు విషయంలో కూడా అతడిల్లాగానే తన మాట చెల్లించుకున్నాడు. తన నోరు కట్టేశాడు. ఆనాటి +ఘట్టం మనస్సులో మెదిలింది. + +ఉమ వైద్య శాస్త్రం చదువుతానంది. తాను మను ధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టేడు. ఆనాడు రామకృష్ణ తనను విదిలించేసిన +పద్దతిని శాస్త్రి తన జీవితంలోనే మరవలేడు. + +"ధర్మం! మన ధర్మానికి మనుష్యుడి యోగక్షేమాలతో ఏ మాత్రం పని లేదు. టాగూరు వ్రాసిన 'అచలాయతనం' మన ధర్మ +శ్రద్ధకో పేరడీ. మన ముంగండ చెరువులోని చేపల ప్రాణ రక్షణకు మనవాళ్ళిచ్చే పట్టుదల మన ధార్మికతకు పెద్ద +సాక్ష్యం" అంటూ ముఖం వికారంగా పెట్టాడు. అంతలో సర్దుకుని, తన అభిప్రాయాన్ని వివరించసాగాడు. + +"బాధతో ఉన్న మనిషికి ఉపశమనం కలిగించడమూ, ప్రాణదానం చెయ్యడమూ, వైద్య శాస్త్ర లక్ష్యం. కానీ మన దురదృష్టం. +మను ధర్మశాస్త్రం దానిని అపాంక్తేయ వృత్తిగా పేరు పెట్టింది. ఎందుకన్నదో ఊహించగలం. ఉపశమనం కలిగించడంలో తోటి మానవుణ్ణి +ముట్టుకోవాలి. వాని పుళ్ళు కడగాలి. పరిచర్య చెయ్యాలి. కుల భేదాలూ, స్పృశ్యతా స్పృశ్యతలూ పునాదిగా కట్టిన మన సమాజ +భవనం అటువంటి ధర్మచ్యుతిని తట్టుకుని నిలబడగలదా? అందుచేత ఆ పని మనకు తగదు. అదీ మన ధర్మం." అంటూ +వెలవరించుకున్నాడు. + +"ఈ మాట నా దగ్గరంటే అన్నారు. కానీ మరెక్కడా అనబోకండి. నవ్వి పోతారు" అంటూ హితబోధ చేశాడు. + +ఆ మాట విన్నాక శాస్త్రి మరి ధర్మ శాస్త్రాల ప్రసక్తి మానేశాడు. లౌకికవాదంతోనే కొడుకు వాదాలను ప్రత్యాఖ్యానం +చెయ్యదలచేడు. + +"డాక్టరుకు కుటుంబ జీవితంతో సుఖం ఉండదు. ఒక్కక్షణం సంతోషంగా మగడితో కూర్చుని కబుర్లు చెప్పుకోడానికుండదు. అర్థరాత్రీ, +అపరాత్రీ ఉండదు. ఏదో, ఎవరికో ప్రాణంమీదికొచ్చిందంటారు. ఏం చేస్తున్నా ఎక్కడి దక్కడ వదలి పరుగెత్తవలసిందే! +పిల్లల్ని చూసుకోడానికుండదు. మగణ్ణి పలకరించడానికుండదు. ఛెస్.... కానైతే అది మంచి వృత్తే, డబ్బు బాగా వస్తుంది. +పేరూ, ప్రతిష్ఠా ఉంటాయి. కాని సుఖం ఉండదు--వద్దు." + +ఈ మారు రామకృష్ణ నవ్వాడు. + +"ఏం ఎందుకు నవ్వుతావు?" + +"ఏం చెయ్యమంటారు? వనజని ఎట్లాగైనా బతికించండని ఆ రెండు రోజులు ఎంత మంది డాక్టర్లకు సంసారం సుఖం లేకుండా చేశామో గుర్తు +తెచ్చుకోండి. పాపం వాళ్ళెవళ్ళూ అందుకు బాధపడలేదు. తమ సంసార సుఖం చెడగొడుతున్నామని విసుక్కోలేదు. వాళ్ళు, ఇప్పుడు మీలాగే +వాళ్ళూ ఆలోచిస్తూండి ఉంటే...." + +వనజ రామకృష్ణ భార్య. మొదటి కాన్పులోనే ప్రసవించలేక చనిపోయింది. అది జరిగి అప్పటికింకా రెండేళ్ళు కూడా గడవలేదేమో. +అందరి మనస్సుల్లో ఆ గాయం పచ్చి ఇంకా ఆరలేదు. శాస్త్రి కళ్ళు తుడుచుకుని వెనక్కి తగ్గాడు. గట్టిగా కాదనలేకపోయాడు. + +ఉమ వెళ్ళి మెడిసిన్‌లో చేరిపోయింది. + +ఇప్పుడేనా తాను గట్టిగా నిలబడకపోతే తన చేత ఆ ధార్మిక కృత్యాలకు తల ఒగ్గిస్తాడే కుమారరత్నం అనుకున్నాడు. కాని, +ఏ మాటా అనే లోపునే మెట్ల మీద గొంతులు వినిపించేయి. + +"అరుగో వాళ్ళిద్దరూ వస్తున్నారు. మీరే మాట్లాడండి." అంటూ రామకృష్ణ లేచాడు. + +"ఇద్దరూ కలిసి వస్తున్నారంటే?" + +"వాళ్ళొక నిర్ణయానికి వచ్చేరని, అది మీతో చెప్పడానికి వస్తున్నారనీను." + +"చెప్పడానికా?" అన్నాడు శాస్త్రి ఆలోచనగా. + +"అనుమతి కోరడానికి కాదు. నిర్ణయం తెలియపరచడానికి వస్తున్నారన్నమాట!" తనలో తను అనుకుంటున్నట్లన్నాడు. + +"చెప్పడమో, అనుమతి తీసుకోవడమో ఆ మాటను సార్థకం చేసుకోవలసింది మీరు." + +"ఉహూఁ...." అన్నాడు శాస్త్రి. + +"నేను వెడుతున్నా" + +శాస్త్రి తల పంకించేడు....రామకృష్ణ గుమ్మంలోకి వచ్చేడు. + +ఎదుట ఉమ! + + + + +4 + + +తండ్రితో చెప్పడానికి వ్యవధి చిక్కని విషయాలను రామకృష్ణ తల్లివద్ద కూర్చుని సావకాశంగా వివరించేడు. ఉమా, భాస్కరరావుల +పరిచయ కథ విని సత్యవతమ్మ పకపకా నవ్వింది. + +* * * * * + +సాయంకాలం సముద్రం ఒడ్డున కూర్చుని ఉమ ఇసుకతో ఆడుకుంటోంది. హఠాత్తుగా పార్వతీశం పిలుపుతో ఉలికిపడింది. + +"విత్ యువర్ పర్మిషన్. మేమూ కూర్చుంటాము." అంటూ పార్వతీశం ఆమె ఎదుట చతికిలబడ్డాడు. + +"రా భాస్కరం" అంటూ తన పక్కనే మిత్రుడికి చోటు చూపించాడు. + +"వారి ఏకాంతానికి మనం భంగం కలిగుస్తున్నామేమో" అంటూ భాస్కరం సందేహించాడు. + +ఉమ చేతులనున్న ఇసుక దులుపుకుని సర్దుకుని కూర్చుంది. + +"సముద్రం ఒడ్డున, జనం మధ్య, ఇసకలో కూర్చున్న దానికి ఏకాంతం ఏమిటి? అట్టే టెక్కులు పోక, రా" అంటూ పార్వతీశం +మిత్రుని చేయి పట్టుకున్నాడు. + +"ఇతడు నా స్నేహితుడు భాస్కరం. మొన్ననే...." అని పరిచయం ప్రారంభించాడు. + +"ఇంక ఆపులే....మీరు తనకు పినతల్లి అని చెప్పేడు. మెడిసిన్ చదువుకున్నారని చెప్పేడు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా +సంతోషంగా ఉంది" అన్నాడు. + +ఉమ ఏదో గొణిగింది. + +"ఏదీ మీ పరిచర వానర సమూహం? ఒక్కరూ కనబడరు!" అని పార్వతీశం తన ఆసక్తిని వెలిబుచ్చేడు. + +"నీల సినిమా కెళ్ళింది" అంది చిరునవ్వుతో ఉమ. మళ్ళీ కొత్తమనిషి ముందు అతని రహస్యం బయటపెడుతున్నానేమోనని సంకోచించింది. + +"మాలతి షాపింగ్ అంది. మిగతా అంతా తలోపని మీదా పోయారు. ఏం తోచలేదు. వచ్చి కూర్చున్నా" + +కొత్తమనిషి ఉండడం వలన సంభాషణ సాగడంలేదు. మాటలు సాగించే భారం అంతా పార్వతీశం మీదనే పడింది. + +"తాతయ్య ఉత్తరం వ్రాసేరు" + +"చదువు అవకాశం దొరికినప్పుడు ఆయన వదులుకున్నారట. ఆ కథ అంతా పది పదిహేను పేజీల వుత్తరం...." + +"ఏమనుకున్నావో కూడా చెప్పు...." అని భాస్కరరావు ప్రోత్సహించేడు. + +ఇంటి వ్యవహారాలతోనూ, ఇంటి పరిస్థితులతోనూ బాగా పరిచయం వున్న మిత్రుడేనన్నమాట....అనుకుంది ఉమ. + +"మీరేమోయ్, చెప్తారు! శ్రీశ్రీ చెప్పినట్లు వడ్డించిన విస్తరి మీ జీవితం." + +ఉమ ఎరుగును కనక మాట మార్చడానికి ప్రయత్నించింది. + +"అక్క బాగుందా," + +"ఆఁ....ఓమారు రావాలనుకుంటుంది" + +ఉమ నవ్వింది. "నన్ను రావద్దన్నదన్నమాట!" + +పార్వతీశం ఊరుకున్నాడు. సంభాషణ మళ్ళీ తప్పుదారినపడింది. ఉమ మళ్ళీ మొదటికే వచ్చింది. + +"ప్రస్తుత ప్రపంచంలో ఓ మాదిరిగానన్నా బతికెయ్యాలంటే మనసు సున్నితత్వాన్ని కాస్తంత చంపుకోవాలిరా బాబూ!" + +"అదేనండి వీడితో వచ్చిన గోల! ఎంత చెప్పినా అంతేనండి" అంటూ భాస్కరరావు మాట కలిపేరు. + +"అబ్బ....వదలండోయ్! సరదాకి సముద్రం వొడ్డుకి వచ్చినా ఇదే గొడవా? పోయి త్వరగా ఆ ఉద్యోగంలో చేరుదూ. మనసు +సున్నితత్వాన్నేమిటి? అసలు మనుష్యత్వాన్నే చంపుకోవచ్చు" + +సంభాషణతో మలుపు కోసం చూస్తున్న ఉమ చటుక్కున అందుకుంది. + +"మీరేం చేస్తున్నారు?" + +"ఏం చెయ్యడంలేదు. మొన్ననే సెలక్షన్స్ వచ్చేయి" అన్నాడు భాస్కరం. దేనికో ఆ సెలక్షన్ అనుకుంది ఉమ. ఆమె ప్రశ్న +రూపొందక పూర్వమే పార్వతీశం ఆ లోటు భర్తీ చేశాడు. + +"ఐ.పి.ఎస్. కు సెలెక్ట్ అయ్యేడు" + +"బాగుంది. కంగ్రాచ్యులేషన్స్" + +ఉమ మాట పద్ధతికి భాస్కరం ఉలిక్కిపడ్డాడు. + +"మీకా శాఖ మీద సద్భావం లేనట్లుందే!" + +"ఉద్యోగం చేయడం జరిగితే నేనది ఎన్నుకోను సుమండి" అంది ఉమ. + +"నేనూ అదే అన్నాను. ఫస్ట్‌క్లాస్, రేంక్‌తో ఎం.ఎస్‌సి. అయ్యేవు. ఏ రీసెర్చికో పోరా +అంటే...." + +"అదేం మాటలే! ఇందులో మాత్రం రీసెర్చికి అవకాశం లేకపోయిందటా! లాఠీచార్జీలతో, ఫైరింగ్స్‌తో, థర్డ్‌డిగ్రీ +మెథడ్స్ ప్రయోగించడంతో బోలెడు సైంటిఫిక్ డెవలప్‌మెంటుకి ఛాన్సుంది" అంటూ ఉమ నవ్వింది. ఆ మాటలకి భాస్కరం ముఖం +రంగు మారిందని గమనించి వెంటనే క్షమాపణ చెప్పుకుంది. + +"క్షమించండి హాస్యానికన్నాను." + +"ఫర్వాలేదు. మీ స్పందన ఈనాడు దేశంలో జరుగుతున్న దుర్మార్గాలకు ఫలితం." + +"మీ రెందులో ఎం.ఎస్‌సి. ?" + +"న్యూక్లియర్ ఫిజిక్స్" + +ఇక సంభాషణ సాగడం కష్టం కాలేదు. చదువులు, కాంపిటేషన్ ఫీజులు, సమ్మెలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, దేశంలో అభివృద్ధి, +బోలెడు సమస్యలు పడుచు వాళ్ళు నలుగురు చేరితే దొర్లి వచ్చే కబుర్లతో ముగ్గురికీ కాలమే తెలియలేదు. ఆఖరున సెలవు +తీసుకునేవేళకి మొదటి సంకోచాలూ కవ్వింపులూ మరచిపోయేరు. + +ఆ విధంగా వారి పరిచయం ప్రారంభమయింది. + + + + +5 + + +హఠాత్తుగా రాజమండ్రిలో ఉన్న చిన్నన్న రామకృష్ణ నుంచి ఉత్తరం వచ్చింది. + +"భాస్కరరావు అనే అతన్ని గురించి ఏమన్నా తెలుసా? ఆయనకు నువ్వు తెలుసట. అందుకు రాస్తున్నా, ఎటువంటివాడు? ఏం +చదివేడు? ఏం చేస్తున్నాడు? వెంటనే వ్రాయి" అనేది ఆ ఉత్తరం సారాంశం. + +ఏం రాస్తుంది తాను? ప్రత్యేకంగా ఏమీ కనబడలేదు. కనుక తన పరిచయం అయిన నాటినుంచి ఆనాటి వరకూ జరిగిన సంఘటనలను +వివరిస్తూ సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. + +"భాస్కరంగారితో మొదటిమాటు సముద్రం ఒడ్డున కలిసిందే పరిచయం. తరువాత పార్వతీశంతోనూ, విడిగానూ పది పన్నెండుమార్లు +కనిపించారు. ఓమారు అన్న కొడుక్కు అక్షరాభ్యాసం అనీ, నేనోమారు వారి ఇంటి వీధిలో కనిపించాను గనకా తమ ఇంటికి +తీసుకెళ్ళేరు. అన్నగారికి, వదినగారికీ, తల్లిగారికీ పరిచయం చేశారు. మొదటిమారు అన్నగారితోనూ రెండవమారు తల్లిగారితోనూ +చర్చలు ఘాటుగానే జరిగాయి. + +వాళ్ళ అన్నగారు నెహ్రూ దేశాన్ని ధ్వంసం చేశాడన్నాడు. ఆయన అభ్యంతరాలు సోషలిజం కావాలన్నాడనీ కాదు, ప్రణాళికల +నభిమానించాడనీ కాదు. ముస్లిముల్ని దేశంలో ఉండనిచ్చినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చేసినట్లు చేయనందుకు మత సామరస్యం పేరుతో +దేశాన్ని ముస్లిములకూ, క్రైస్తవులకూ అప్పచెప్పేశాడని ఆయన అభిప్రాయం. + +ఆయన వాదం బహు చిత్రంగా కనిపించింది. కుటుంబ నియంత్రణను ముస్లిములు పాటించరు. క్రైస్తవులూను. మతరీత్యా వాళ్ళ +కభ్యంతరాలు. మతాల జోలికి పోవద్దని మన నిర్ణయం. సంజయ్ గాంధీ సాగించిన 'పాండవ వంశ నాశ గాథ’లో కూడా నష్టపడినది +హిందూ కుటుంబాలేనని ఆయన అభిప్రాయం. మన జనాభా క్షీణిస్తుంది. సాపేక్షంగా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చివరికి హిందూ దేశంలో +హిందువులు అల్ప సంఖ్యాకులవుతారని ఆయన వాదం. ఆఖరున మీ మీద కూడా ఓ విసురు విసిరాడు. సోవియట్‌లో ముస్లిము +రాష్ట్రాల జనాభా పెరిగిపోతుండడమూ, రష్యను జనాభా తరగిపోతూండడమూ చూసి రష్యను కమ్యూనిస్టు నాయకులు కల్లోలపడుతున్నారనీ, +వారిని చూసైనా మన కమ్యూనిస్టులు బుద్దితెచ్చుకోవడం లేదన్నారు. తన వాదానికి బలంగా న్యూయార్క్ నుంచి వస్తున్న 'ప్రాబ్లమ్స్ +ఆఫ్ కమ్యూనిజం' పత్రికలు చూపారు." + +ఉమ చాలాసేపు ఆ ధోరణిని భరించలేకపోయింది. + +"మా నాన్నగారు ఒక ముస్లిము కంపెనీలో ఆఫీస్ మేనేజర్. ఆ విధంగా మాకు వారి కుటుంబంతో చాలా దగ్గర. ఆయన, ఆయన కుటుంబం +చాలా మంచి వాళ్ళు. ఆయన మనుమడు ఈ యూనివర్సిటీలోనే ఎం.ఏ. ఫిలాసఫీ చదువుతున్నాడు. చాలా యోగ్యుడు." + +అలాగే ఆమె తనకు తెలిసిన మతస్థుల గురించి వర్ణించింది. + +"వాళ్ళందరూ భారతీయులు కారంటారా?" అని నిలదీసింది. + +"మత ద్వేషాల సమస్య వచ్చేసరికి శైవం, వీర శైవం, జైనం, బౌద్ధం మొదలైన మతాల గురించి చెప్పాను. నోరి నరసింహశాస్త్రి +గారు రాసిన నారాయణభట్టు నుదహరించి మత ద్వేషాలు, హత్యాకాండ సాగించడానికి విదేశీయ మతాలే కానక్కర్లేదన్నాను. + +"మరో రోజున అసదుల్లాని వారికి పరిచయం చేశాను. ఆ రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ సెంటర్ కెళ్తే అసదుల్లా కనిపించాడు. +అప్పుడే మీ భాస్కరరావు, ఆయన అన్నగారు అక్కడికి వచ్చారు. వెనకటి చర్చలు గుర్తు వచ్చాయి. పరిచయం చేశాను. చాలా +మర్యాదగానే వ్యవహరించారు ఇద్దరూ. + +"అసదుల్లా మాట మర్యాదా, వ్యవహరించిన తీరూ కన్న అతని ఆకారం నా కళ్ళకు నచ్చింది. మంచి పర్సనాలిటీ!" అన్నారు +భాస్కరరావుగారు--మరో రోజున తానుగా ఆయన ప్రసక్తి తెచ్చి. అతనిదీ ఏడాది ఎం.ఏ. అయిపోతుంది కదూ! తరువాత అద్వైతం +తీసుకుని డాక్టరేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పాను. + +"భాస్కరరావు గారు విస్తుపోయారు. "ఛా!" అని ఇంత దీర్ఘం తీశారు. + +"ఆయన కుటుంబంతో నాకు కలిగిన ప్రథమ పరిచయం కథ ఇది. రెండో పరిచయం కూడా ఇలాగే నడిచింది. అయితే ఈమారు +భాస్కరరావుగారి తల్లి గారిది పూర్వపక్షం. నా చేతినున్న ఉంగరంలో వేంకటేశ్వరుడి చిత్రం ఉండటం ఎంత అవసరమో, అంత చిన్న +చిన్న విషయాలతోనైనా దైవభక్తిని చూపక యువతరం 'దేవుడూ నై--దయ్యమూ నై' గాళ్ళుగా ఎలా తయారవుతున్నారో ఏకబిగిన +వాయించారు. + +"నాకు ఒళ్ళు రగిలింది. కాని బయట పడకుండా అమాయకంగా అడిగినట్లు అడిగాను--"బస్సు టిక్కెట్లు మడతబెట్టి దోపడానికీ +ఉంగరం బాగా పనికొస్తుందండీ! వేంకటేశ్వరుడి బొమ్మ ఉన్నదైతే అసలు టిక్కెట్టే కొనక్కర్లేదంటారా?" అన్నాను. + +"ఇక చూడు, ఆమె రంకె లేసింది. ఓ! తెయ్యి మని పోయింది. ఆయాసం వచ్చి దగ్గుతూంటే మరొకటంటించాను. + +"నా ఆలోచన నేం కాదండీ! ఆర్. ఎస్. సుదర్శనంగారు 'కళ్యాణవేదిక ' అనే కథ రాశారు. అందులో గృహిణి వేంకటేశ్వరుడి +నిలువెత్తు పటం వెనుక గూట్లో దొంగ డబ్బు దాచినట్లు రాశారు. అందులో దేవుడు ఈ దొంగసొత్తు కాపాడలేకపోయాడనే ఆయన రాశారు. +అయితే చిన్న బస్సు టిక్కెట్టు డబ్బులే కదా! ఆ చిన్న సాయం ...." + +"ఆవిడ మినహా ఇంట్లోవాళ్ళంతా ఎంజాయ్ చేశారు మా సరస సల్లాపాన్ని" + +"అన్నట్లు--భాస్కరరావుగారికి ఐ.పి.ఎస్.కి సెలక్షన్ వచ్చిందని చెప్పానా! లేదు కదూ! వారం రోజులక్రితం ఆయన +హఠాత్తుగా మా హాస్టలుకు వచ్చారు. తనకు ఫారిన్ సర్వీసెస్ ఆప్షన్ కూడా ఉన్నదనీ, దానికి ప్రిఫరెన్స్ +ఇద్దామనుకుంటున్నానని చెప్పి, ఏమంటావన్నారు. దానికి కారణం ఉందిలే. మా మొదటి సముద్రపు ఒడ్డు పరిచయం రోజున పోలీసు +ఆఫీసరైతే సైంటిఫిక్‌గా లాఠీఛార్జి చేయించవచ్చునని ఎగతాళి చేశాను. బహుశా కష్టపెట్టుకొని ఉంటారు. + +"ఆయనకు నేనేం చెప్పను? మన ప్రవృత్తుల్ని బట్టి మన వృత్తిని ఎన్నుకుంటాము. దాన్నే అభిరుచి అనేస్తాము. ఎవరి అభిరుచి +వారిది. మర్యాదకు అడిగారు. మర్యాదగానే ఆ మాట చెప్పాను. ఆయనకది తృప్తి కలిగించినట్లు లేదు. + +"ఇది ఆయనను గురించి నేనెరిగినదీ, నేను చెప్పగలదీను. నువ్వెందుకడిగావో తెలియదు. నీకు కావలసిన సమాచారమేమిటో +నేనెరుగను. కనుక నాకు తెలిసినదంతా రాశాను. పొల్లు ఊదేసుకుని నీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే ఏరుకో!" + +ఉమ అన్నకు సమాధానం ఇచ్చాక, ఇప్పుడింక ఆలోచన ప్రారంభించింది. కాని, ఎంత ఆలోచించినా ఆమెకు అసలు విషయం తెలియలేదు. + +'బహుశా ఏదో పెళ్ళి సంబంధం గురించి అయి ఉంటుంది' అనుకుంది. "అన్నయ్యకీ మధ్య పెళ్ళిళ్ళ పేరయ్య వేషం వేసే సరదా +ఎక్కువయింది" అనుకుని నవ్వుకుంది. + +మరునాడు పార్వతీశం చెప్తేగాని ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. + + + + +6 + + +పార్వతీశాన్ని చూడగానే ఉమ వేసిన మొదటి ప్రశ్న అతని రాజమండ్రి ప్రయాణం గురించి. అతడు ఎదురు ప్రశ్న వేశాడు. + +"ఎవరు చెప్పారు?" + +"చిన్నమామయ్య రాశాడు." + +"ఏమంటాడు?" + +"నీ ఫ్రెండ్ పెళ్ళి సంబంధం కోసం వచ్చావన్నాడు. ఎవరేమిటా అమ్మాయి?" అంటూ తన ఊహలను నిజంలాగా బుకాయించింది. + +"మామయ్యకి తెలిసిన అమ్మాయిలే! మేము మామయ్య నడుగుతే నీకెందుకు రాశాట్ట?" + +"క్రాస్ చెకింగ్" + +"మరి నువ్వేమన్నావు?" + +"ఏమంటాను, మీ స్నేహితుడి సంగతి నాకేం తెలుసునని రాస్తాను. నాలుగైదుమాట్లు సముద్రం ఒడ్డునా, బజార్లోనూ కలుసుకోవడం, హలో +అంటే హలో అనుకోవడం తప్ప నాకాయన్ని గురించి ఏమీ తెలియదని రాశాను." + +"మహ దొడ్డపని చేశావు. అసలు నిన్ననవలసిన పనేమిటి? మా వాడి బుద్ధి అలా ఏడిసింది. వెళ్ళి వెళ్ళి మామయ్య +మధ్యవర్తిత్వం అడగడం అందుకు చెప్పాలి." + +"బహుశా ఆ అమ్మాయీ వాళ్ళు మామయ్యకి బాగా తెలుసునేమో!" + +బాగా తెలిసిన అమ్మాయే నని పార్వతీశం ఒప్పుకున్నాడు. + +"ఆ అమ్మాయికి ఈయనగారు తెలుసునా?" + +"ఆహా!" + +"మరి మామయ్య మధ్యవర్తిత్వం ఎవరితో--తల్లిదండ్రులతోనా?" + +"కొంచెం ఇంచుమించుగా...." + +ఉమకి అర్థం కాలేదు. + +"నీ ధోరణి చూస్తే ఇదేదో అర్థాంగీకారంలా ఉందే. సరాసరి ఆ అమ్మాయితో మాట్లాడక ఈ ఇంచుమించు రాయబారాలేమిటి, నీ తలకాయ?" + +"మట్లాడాడే బాబూ!" + +"మరి?" + +"మనవాడి 'లవ్ సిగ్నల్స్' నామె 'రిసీవ్' చేసుకోవడం లేదే." + +ఉమ నవ్వింది. "పోనీ, మీ నీలకి పురమాయించకపోయావూ! ఎక్కడో ఉన్న మామయ్యనడిగితే ఏం చేస్తాడు?" + +"నీలకి ఆవిడ దగ్గర మహా భయం." + +"అంటే మీరంతా ఎరిగున్న ఆవిడే నన్నమాట!" + +"బాగా తెలిసినావిడ." + +"బాగుంటుందా?" + +"గ్రే మేటరు మరీ బొత్తిగా తక్కువ." + +ఉమ పకపక నవ్వింది. + +"నీ శల్య సారధ్యం బొత్తిగా పనిచేసినట్లు కనిపించదు." + +లేదని పార్వతీశం ఒప్పుకుంటూనే ప్రశ్నించాడు--"వాడికేం తక్కువే. ఆస్తుంది, చదువుంది, ఉద్యోగం ఉన్నట్లే. మహాతల్లివి నీ +మూలంగా సందిగ్ధంలో పడ్డాడు గాని, ఆరోగ్యం వుంది, ఆకారం ఉంది. ఏమిటి లోటు చెప్పవేం?" + +ఉమ ఆలోచించింది. + +"ఆమె ఉద్దేశం ఏమిటో మరి?" + +"నువ్వు చెప్పు." + +"ఏ విషయం? + +"మళ్ళీ మొదటి కొచ్చిందయ్యా! మామయ్య అడిగిన ప్రశ్న అతన్ని గురించి ఏం చెప్తావు?" + +"మామయ్య చూశాడు. మీరిద్దరూ ఆయన దగ్గర రెండు రోజులున్నారు. అతని కంటె...." + +"మామయ్య ఎందు కడిగాడో ఊహించలేవా? అతను మగాడు. ఆడదాని దృష్టిలోంచి భాస్కరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాయన గారి +ప్రశ్న. ఆడవాళ్ళలో కూడా వాళ్ళ వివాహపు హోదానిబట్టి దృష్టి కోణాలు మారుతాయి. పెళ్ళయిన వాళ్ళయితే అగతగిలిన +బ్రహ్మచారి గాళ్ళకి జంటని వెతకటమే ఆలోచన. పెళ్ళి స్థిరపడి ఇంకా పెళ్ళి కాని ఆడది తన వరుడితో తైపారు వేసి +కొలవడం మొదలెడుతుంది. అది ఎటైనా దారి తీయవచ్చు. పెళ్ళి కాని వాళ్ళ చూపూ, అంచనా మరొక విధంగా ఉంటుంది. చీటికీ, మాటికీ +డైలెక్టిక్స్ అంటుంటాడు కదా ఆయనగారు!" + +"అలా అయినా నే చెప్పేది నా అభిప్రాయం అవుతుంది గానీ...." + +పార్వతీశం విసుక్కున్నాడు."ఇప్పుడు కావలసింది నీ అభిప్రాయమే పెద్దమ్మా!" + +ఉమ ఆశ్చర్యంగా అడిగింది- "నా అభిప్రాయం కోసం విశాఖపట్టణం నుంచి రాజమండ్రికి అన్నయ్య దగ్గర కెళ్ళారా?" + +"అంతే మరి!" + +"అయితే గ్రే మాటరు లేనిది నాకు కాదురా, అబ్బాయి!" + +"చంపావు, ఫో! ఇప్పుడయినా చెప్పు!" + +"ఒరేయ్, పార్వతీశం! ఈ మెయిల్ రాయబారాలు, మొయిలు రాయబారాలు అంటే నాకసహ్యం. మీ స్నేహితుడు అన్నయ్య నుంచి సమాధానం +కోరాడు. ఆయనే ఇస్తాడు. చెక్కెయ్. ఇలాంటి అనవసరపు పెద్దరికాలు నెత్తినేసుకోకు. అది అకాల వార్ధక్య లక్షణం. +ఏమంటావు?" + +పార్వతీశం నిష్క్రమించాక నిజంగానే ఉమ ఆలోచనలో పడింది. తన అన్నగారితో, తల్లితో పెడసరంగా వ్యవహరించినా భాస్కరరావు +తనకు దూరం ఎందుకు పోలేదో అర్థమయ్యాక ఇప్పుడు తమ పరిచయ ఘట్టాలు ఒక్కొక్కటే నెమరుకు రాసాగాయి. + + + + +7 + + +చెల్లెలి ఉత్తరం చూసి రామకృష్ణ ఫక్కున నవ్వాడు. వెంటనే ఓ కాగితం తీసుకొని నాలుగు వాక్యాలు రాసి, వెంటనే పోస్టు చేశాడు. + +"సారీ! మీరొక కాండిడేట్‌గా ఉండవచ్చుననే ఆలోచన కూడా మా ఉమకున్నట్లు లేదు. ఆమె ఉత్తరాన్నిబట్టి నేను అర్థం +చేసుకున్నదిది. మీకున్న పరిచయం కలిగించలేని ఆలోచనను నేను కలిగించాలనుకోవడం ఉపయోగకరం కాని, ఉచితం కాని +అనుకోవడంలేదు. + +సెలవు!" + +పది రోజుల క్రితం పార్వతీశాన్ని వెంట తీసుకుని భాస్కరరావు రాజమండ్రి వచ్చాడు. ఇద్దరూ అతని బస కొచ్చారు. ఆ సమయంలో +తన మిత్రుడు డాక్టరు వెంకటస్వామి, ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు, ముగ్గురు లెక్చరర్లూ తెలుగుదేశంలో కన్నెపిల్లల వివాహ +సమస్యల మీద తీవ్ర చర్చ సాగిస్తున్నారు. కట్నాలు, ప్రేమలు, కులాలు, వయస్సులు, ఉద్యోగాలు--ఎన్నో సమస్యల మీద +వాగ్వివాదాలు నడుస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆ సమస్య ఎదో ఒకటి సెల వేసినట్టు అతడున్న రెండు రోజులూ +ఉబికివస్తూనే ఉన్నాయి. చాలా సరదాగానే గడిచాయి ఆ రెండు రోజులూ. + +ఆ రోజున ఈ చర్చలు ప్రారంభం కావడానికి మూలం డాక్టరు వెంకటస్వామి తెచ్చిన ఉత్తరం. ఆయన కొడుకు మాస్కో యూనివర్సిటీలో +చదువుకుంటున్నాడు. ఆయనగారు రాసిన తన అనుభవ గాథ ఆ చర్చను రెచ్చగొట్టింది. + +అతడు ఒక నవల కోసం యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాడు. + +లైబ్రేరియన్‌కి ఏభైయ్యేళ్ళుంటాయి. బాగా చదువుకుంది. విషయ పరిజ్ఞానం ఉన్నది కూడా. "డాక్టర్ జివాగో" +కావాలన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది, నవ్వింది. + +"మా వాళ్ళు ఇన్ని నవలలు రాస్తున్నారు. మా దేశంలో ప్రచురింపబడి ఉండని ఆ నవల మీదకే దృష్టి ఎందుకుపోయింది" అని +అడిగారామె. + +అక్కడున్న ప్రేక్షకులలో ఒకరు వెంటనే వ్యాఖ్యానించారు. + +"అవును And quiet flows the Don ఉంది. గోర్కీ రచనలున్నాయి. క్లాసిక్స్ కావాలంటే టాల్‌స్టాయ్, +గోగోవ్, పుష్కిన్, తుర్జనేవ్ ఎంతమంది లేరు? ఏదీ అడగక సోవియట్ ప్రభుత్వం నిరాకరించిన...." + +వెంటనే మరొకరు అందుకున్నారు--"నోబుల్ కమిటీ మెచ్చుకున్నదది." + +"అందుచేతనే అడిగాడంటావా?" అన్నాడు రామకృష్ణ. + +"మావాడే చెప్పాడు వినరాదా! ఏమిటాతొందర!" అంటూ గదిమి డాక్టరు స్వామి ఉత్తరం మళ్ళీ తీసుకున్నాడు. + +"బహుశా ప్రభుత్వాలూ, వాళ్ళ ద్వేషాభిమానాలూ మీద మా దేశంలో అనుమానాలు జీర్ణించిపోయాయి--అందుకనేమో" నన్నాను. + +ఆమె నవ్వింది. "మా ప్రభుత్వాన్ని మా దేశంలో తలెత్తుతూండే అవాంఛనీయ ధోరణుల్నీ విమర్శించే నవలలు బోలెడున్నాయి. వర్ధమాన +దేశాల యువకులు వాటిని చదవడం వాళ్ళ దేశాల భవిష్య కల్పనకు ఉపయోగకరంగా వుంటుంది. మా వ్యవస్థను నిందించేది మీ +దేశాల్లోనే చూసుకుందురుగాని.... ఏమంటారు?" అందామె. + +"మంచి తెలివైనది. బాగా చెప్పింది." అన్నాడు రామకృష్ణ. + +"యూరీ గెర్మన్ రాసిన ట్రయాలజీ 'ఎటర్నల్ బేటిల్' చదవమంటూ ఆమె సలహా ఇచ్చారు. కానీ అది ఆ క్షణంలో అందుబాటులో +లేదు. + +రిజిస్టరు చూసి 'బ-462' గదిలో అమ్మాయి పట్టుకెళ్ళిందని చెప్పింది. వెళ్ళి పరిచయం చేసుకోండి--మంచి చురుకైన అమ్మాయి. +చక్కని చిన్నది!" అంది. + +"ఆ వర్ణన విన్నాక సిగ్గేసింది వెళ్ళడానికి. అందంగా, చురుగ్గా ఉంటుందని తెలిసి పరుగెత్తాననుకొంటారని నా సంకోచం. మరో వారం +పోయాక లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆమే కనిపించారు. జ్ఞాపకం వుంచుకుని మళ్ళీ అడిగారు. + +"వెళ్ళావా, నేను చెప్పింది నిజమేనా? బాగుంటుంది కదూ! మీరు స్నేహితులయ్యారా? బాగా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి" అంది. + +నేను నవ్వాను. + +"ఎందుకు నవ్వుతా" వందామె. + +"మా దేశంలో పెళ్ళాం కాని స్నేహితురాలుంటే తప్పు పడతారు." + +ఆమె ఆశ్చర్యపడ్డారు. "స్నేహం చేయడానికీ, పెళ్ళికి ముడి పెడితే ఎలాగ?" అని ఆమె ప్రశ్న. + +"ఆమెకర్థం అయ్యేలా చెప్పలేకపోయాను" అంటూ ఆ ఉత్తరం ముగిసింది. + +"మన ఆర్ష సంప్రదాయాలు అర్థం కావడం కష్టం" అన్నాడు భాస్కరరావు. + +"ఇనప కచ్చడాలు కట్టుకున్న ముని ముచ్చులం కదా!" అని రామకృష్ణ హాస్యం చేశాడు. + +తరువాత అర్థమయింది--అతని రాకలో నవ్యతతోపాటు ఆర్ష సంప్రదాయ పాలనాభిమానం కూడా గట్టిగా ఉన్నదని. + +ఆ సాయంకాలం పార్వతీశం బజారులో పనులు చూసుకు వస్తానని వెళ్ళినప్పుడు, భాస్కరరావు తాము వచ్చిన పని చెప్పారు. "మీ +ఉమను పెళ్ళి చేసుకోవాలని నా కోరిక." + +రామకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. + +వాళ్ళిద్దరూ వచ్చిన క్షణం నుంచి అనేక సందర్భాలలో ఉమ ప్రసక్తి వచ్చింది. ఆమెతో భాస్కరరావుకు మంచి పరిచయం, స్నేహం +ఉందని అర్థమయింది కాని.... + +"ఆమె ఏమంటుంది?" + +"ఆమెను అడిగే ముందు పెద్దవాళ్ళనడగటం న్యాయం అనుకున్నా." + +అటువంటి న్యాయ బుద్ధే పిల్లదానికి తెలియకుండా పెళ్ళిళ్ళు కుదిర్చే సంప్రదాయాన్ని తెచ్చింది--అనుకున్నాడు రామకృష్ణ. పైకి +మాత్రం "మీ న్యాయబుద్ధి మెచ్చుకోతగిందే. కాని, ఇక్కడ పెళ్ళి చేసుకోవలసినది వయసు వచ్చిన విద్యావంతురాలు. మీకు +స్నేహమూ, పరిచయమూ ఉన్నదే, ఆమెతో మాట్లాడి నిర్ణయానికి వచ్చి ఉంటే బాగుండేది." అన్నాడు. + +"మొదటనే ఆమెకు నా మీద దురభిప్రాయం ఏర్పడిందని నా భయం. అటు తరువాత మా కుటుంబ సభ్యులతో కలిగిన పరిచయాలు కూడా +వ్యతిరేక భావాన్నే కలిగించి ఉంటాయని నా అనుమానం." + +"దురభిప్రాయం కలిగే ఘటన...." + +"ఏం లేదు. నేను పోలీసు డిపార్టుమెంట్‌కు ఎంపికయ్యాను. ఆమెకది అభ్యంతరం." + +"ఆమెకు అటువంటి అభ్యంతరం ఉంటే నేను చేయగలిగేదేముంది?" + +"ఫారిన్ సర్వీసెస్‌కి నాకు ఆప్షన్ వుంది." + +తన చెల్లెలికి అభ్యంతరాలు వుంటే అవేమిటో అర్థమయిందని రామకృష్ణ భావించాడు. + +"అవన్నీ అప్రధానాలు. ఏ ఉద్యోగం చేసుకోవాలి, ఏం చేయాలి అనేవి తర్వాత గాని ఆలోచనకి రావు. పడుచువాళ్ళిద్దరికీ +ఒకరిమీద ఒకరికి ఆపేక్షలుంటే ఇటువంటివి సర్దుకుంటాయి. ఇప్పుడు మీరనడంలేదూ? అలాగే. అసలు సంగతి వేరు, మీ విషయంలో +ఆమె అభిప్రాయం ఏమిటి?" + +భాస్కరరావు చెప్పలేకపోయాడు. + +"కనిపిస్తే బాగానే మాట్లాడుతుంది. ఈ మధ్య కనబడ్డంలేదే అంటుంది. యోగక్షేమాలు తెలుసుకుంటుంది. అందుచేత వ్యతిరేకత లేదనే నా +అభిప్రాయం." + +"పెళ్ళికి చూసుకోవలసింది వ్యతిరేకత లేకపోవడాన్ని కాదు, అనుకూలత ఉందా, లేదా అని గాని...." + +"అది తెలుసుకోవడం నాకు చేతకాదు" భాస్కరరావు ఒప్పుకున్నాడు. "అందుకే మీ సహాయం కోరుతున్నా" నన్నాడు. + +"వ్యతిరేకత ఉంటే...." + +భాస్కరరావు అటువంటి పర్యవసానాన్ని ఊహించడం లేదని అతని ముఖంలోనే అర్థమయింది. + +"అంత గాఢంగా కోరుతున్నవాడు...." + +ఆడపిల్లను పెళ్ళికి ఒప్పించడానికి మగవాడి కోరిక చాలుతుందా అనిపించి కూడా రామకృష్ణ "సరే" నన్నాడు. + +వెంటనే చెల్లెలికి జాబు రాశాడు. ఆమె సమాధానమూ ఇచ్చింది. అందులో ఎక్కడా....భాస్కరరావును గురించి అడిగితే అతని +అన్నను, తల్లిని, వదినను గురించి రాసింది. అతని యెడల ప్రత్యేక దృష్టిని తోపించే ఘటన ఒకటీ లేదు. పైగా, అసదుల్లా +ఆకారం గురించి మెచ్చుకున్నాడన్న ప్రసక్తి బుద్ధిపూర్వకంగా రాసినదే అయితే అది భాస్కరం ఆలోచనా ధోరణి గురించిన వ్యతిరేక +వ్యాఖ్యానంగా తీసుకోవలసి వుంటుంది కూడా. + +భాస్కరరావు విషయమై జాలే కలిగింది. + +మరుక్షణంలో ఆలోచన మారింది. తాను అసలు విషయం సరాసరి కదల్చక పోవడం చేత ఆమె కూడా అలాగే రాయలేదు కదా అనిపించింది. + +చదువుకొన్న అమ్మాయిలకు వరులు దొరకడం గగనమైపోతున్న రోజులు, దొరికినా భరించలేని కట్నాల గోడలు పెరిగిపోతున్నాయి. తమ +సామాజికాచారాలు, అలవాట్లూ యువతీ యువకులు తమకుగా పరిచయాలు పెంచుకోడానికీ, పెళ్ళిళ్ళు కుదుర్చుకోడానికీ ఆటంకంగా వున్నాయి. +ఫలితంగా పాతికేళ్ళు వచ్చిన విద్యావంతురాండ్రకి కూడా తల్లిదండ్రులే వరుల్ని వెతకవలసి వస్తూంది. ఆ విషయమే చెపుతూ తన +మిత్రులు చెంచయ్యగారన్నారంటూ విన్నమాట గుర్తొచ్చి రామకృష్ణ నవ్వుకున్నాడు. + +"పెంచాను, చదువు చెప్పించాను. ఇప్పుడో కుర్రాణ్ణి నేను ప్రేమించి, దానికి పెళ్ళి చేయాలంటే ఏం చావను?" అన్నాడుటాయన. + +నిజమే. మన సంప్రదాయాలకు తోడు మన సాహిత్యకారులొకళ్ళు తోడయ్యారు. స్వతంత్రంగా వ్యవహరించబోతే ఆడపిల్లకు సమాజంలో +రక్షణ లేదు సుమా అని ఒకటే బెదురు పోస్తున్నారు. కాలూ, చెయ్యీ కదలని ముసిలాడికీ, గోచీ పెట్టుకోలేని నాదాన్ బచ్చాగాడికీ +కూడా సెక్సు తృష్ణే-- పాతికేళ్ళ పడుచుకూడా ప్రతిఘటించలేదన్నంతగా. + +ఈ పరిస్థితుల్లో తనంత తానుగా వచ్చిన ఈ యువకుడి అభిప్రాయాన్ని అంత నిర్లక్ష్యంగా చూడడం ఉచితం కాదేమో! కనీసం +స్పష్టంగా తెలుసుకోవటం మంచిది కదా--అనిపించింది. వెంటనే బెజవాడ తండ్రికీ, విశాఖపట్నంలోని చెల్లెలికీ కూడా రాయడానికి కలం +తీశాడు. + +ప్రారంభించిన ఉత్తరం నాలుగు వాక్యాలు కూడా రాయక మునుపే రాత ఆగిపోయింది. భాస్కరరావు వివరాలేమిటంటే తన వద్ద ఒక్క +సమాచారం లేదు. తల్లిదండ్రుల పేర్లు తెలియవు. తండ్రి పోయాడని మాత్రం తెలుసు. వాళ్ళ ఇంటి పేరు 'సి' అన్నాడు. అంటే ఏదో +చెప్పాడు. గుర్తులేదు. బ్రాహ్మణుల్లో వాళ్ళ శాఖ ఏమిటి? ఇంటి పేరు తెలిస్తే చాలా సందర్భాల్లో శాఖ ఏమిటో పట్టుకోవచ్చు. +ఇంతకీ అతడు బ్రాహ్మణుడేనా? వాళ్ళ గోత్రం ఏమిటి? + +ప్రస్తుతం దానికి ప్రాముఖ్యం లేకపోయినా సగోత్ర వివాహాన్ని తన తండ్రి ఏ మాత్రం అంగీకరించడు. + +వాళ్ళ కుటుంబం ఎటువంటిది? అనువంశికంగా ఉండే మొండి జబ్బులూ, అవకరాలూ లేవు కదా. సంప్రదాయం ఎటువంటిది? + +తండ్రి తెలుసుకోగోరే సవా లక్ష ప్రశ్నలలో ఒక్కదానిక్కూడా తన వద్ద సమాధానం లేదే. ఏం రాస్తాడు? + +కలం కింద పెట్టేసి, వెంటనే కాలేజీకి సెలవు పంపించి, రైలుకి పరుగెత్తాడు. + + + + +8 + + +రైలు దిగుతూనే రామకృష్ణ తన కార్యక్రమం ఎక్కడ ప్రారంభించాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తరువాత ఏం చేసినా ముందు +చెల్లెల్ని చూడాలి అనుకున్నాడు. అప్పటికి ఉమ ఆస్పత్రిలో ఉందేమో. కనుక పార్వతీశాన్ని కలుసుకుని పరిణామాలు తెలుసుకుని +తయారుకావడం మంచిది అనుకున్నాడు. వెంటనే సామాను హోటల్లో పడేసి, అక్కగారింటికి బయలుదేరాడు. + +అక్కడికి వెళ్ళేసరికి అన్నింటినీ మింగేసే పెద్ద సమస్య ఎదురై కూర్చుంది. + +వెళ్ళేసరికి అక్క మగడు ఇంట్లోనే ఉన్నాడు. కానీ రెండు కుటుంబాల మధ్య గల పొరపొరల ఫలితంగా ఆయన ఒక్క గురగురతో +మాత్రమే మరిదికి స్వాగతం ఇచ్చాడు. + +"అక్కయ్య ఇంట్లో ఉందా, బావగారూ! అంతా క్షేమమేనా?" + +"ఇంకా అంతవరకూ రాలేదు మీ దయవల్ల. రండి, కూర్చోండి!" + +అక్క మగని స్వభావం ఎరిగిన రామకృష్ణ పట్టించుకోదలచుకోలేదు. పేరు పేరు వరసన ఇంట్లో వారందరి యోగక్షేమాలూ +ప్రశ్నించాడు. పిల్లల చదువులు తెలుసుకున్నాడు. తల్లి ఆరోగ్యం వాకబు చేశాడు, ఏక పద సమాధానాలైతే నేం విసుక్కోకుండా +సంభాషణ సాగిస్తుంటే అక్క తాయారు వచ్చింది. చెల్లెలు చదువుకుంటూ స్వతంత్ర జీవనానికి ప్రాతిపదిక వేసుకుంటున్నందుకు బ్రహ్మానందం +కనబరిచింది. + +"అయినా పెళ్ళంటూ తప్పదు కదా!" అన్నాడు రామకృష్ణ తన రాక విషయం చెప్పడానికి పునాదిగా. + +"పెళ్ళీ, పిల్లలూ--మే మంతా అనుభవిస్తున్నాం చాలు. అదైనా సుఖపడుతుంది--చదువుకోనీయండి!" అంది తాయారు--విసుగు తోపిస్తూ. + +ఎప్పుడొచ్చిందో ఎవరూ గమనించి ఉండని ఛాయమ్మ కోడలి వెక్కసపుదనాన్ని సహించలేకపోయింది. టప్పున అనేసింది--"ఏ తురకాడినో, +దూదేకులాడినో పెళ్ళాడెయ్యనూ వచ్చు, ఒక్క చదువేం కర్మ?" + +"ఏమిటొ మీ వెర్రి గాని, అత్తయ్యగారూ! మన ఛాందస కుటుంబాలలో కన్న ఏ దూదేకుల వాడితో సంసారమైనా సుఖంగా ఉండదంటారా?" +అన్నాడు, రామకృష్ణ నోరారా బంధుత్వం కలుపుతూ. + +ఆ కుటుంబ చరిత్ర ఎరిగిన తాయారు మరింత ఈసడింపుగా అనేసింది--"పెళ్ళి చేసుకోవడం అనుకున్నప్పుడు నచ్చడమే గాని, మిగతావి +పట్టించుకోకపోయినా బాధ లేదు. పెళ్ళి చేసుకున్నవాడుండగానే స్వంత కులం వాడితోనే ఊరేగినా తప్పుగాని!" + +"ఏడిశావు! ఇంట్లోకి తగలడు!" అన్నాడు లక్ష్మణ శాస్త్రి. భార్య ఎత్తిపొడుపు అతని కళ్ళలో రక్తిమ తెచ్చింది. + +వెనకటల్లే తాయారు తడిసిన పిల్లిలా ఇంట్లోకి జారుకోకపోవడమే కాదు, సమాధానమివ్వడం కూడా చూశాక రామకృష్ణకు ఆశ్చర్యమే +కలిగింది. + +"తప్పేం అన్నాను? జరుగుతున్న లోకవృత్తం చెప్పాను గాని...." + +"ఏమిటే ఆ లోకవృత్తం?" అంటూ ఛాయమ్మ గర్జించింది. + +లక్ష్మణ శాస్త్రి చెయ్యి బల్ల మీదున్న రూళ్ళ కర్ర మీదికి వెడుతోంది. తన కళ్ళ ముందు బావగారు తన అక్కమీద చెయ్యి +చేసుకుంటే దాన్ని విరగొట్టేస్తానని తండ్రి ముందు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటున్నాడు. వాతావరణం బహు ఉద్రిక్త స్థితికి +చేరింది. కాని టక్కున చల్లబడిపోయింది. రామకృష్ణకు అర్థం కాలేదు. + +తాయారు ఏమీ ఎరగనట్లే కూర్చుంది. ఎప్పుడు వచ్చాడో పార్వతీశం బహు తాపీగా మేనమామను పలకరిస్తున్నాడు. + +"ఎప్పుడొచ్చావు, మామయ్యా! పిన్నిని చూశావా? తీసుకురాకపోయావా?" + +"మనిద్దరం కలిసే వెడదామని ఇలాగే వచ్చానురా!" అన్నాడు రామకృష్ణ. + +"చాలా కాలమైంది చూసి, ఓ మారు నేనూ వస్తాను!" అంది తాయారు. + +"అలాగేనమ్మా!" అన్నాడు పార్వతీశం. + +ఛాయమ్మ ఊరుకోలేకపోయింది. "పోనీ నువ్వూచేరు. ఆ సరదా తీరుతుంది. అక్కా చెల్లెలూ...." + +తాయారు ఊరుకోలేదు. "డబ్బుకోసం మిమ్మల్నడగాలని గాని...." + +"మీ నాన్నగారివ్వరేమిటి?" అన్నాడు లక్ష్మణశాస్త్రి వెక్కిరింతగా. + +"మీకే అప్రతిష్ట అని చూస్తున్నాను గాని, అగ్రహారీకులుమని చెప్పుకుంటారు--ఆ మాత్రం ఇవ్వలేరా అన్నారంటే ఎవరికా +చిన్నతనం?" అంది తాయారు. + +"నీకు చదవాలనుంటే నా వాటా ఉందమ్మా! డబ్బుదేముంది?" అన్నాడు పార్వతీశం నిర్లక్ష్యంగా. + +"నీకూ ఓ వాటా, నీదీ ఓ బతుకూ!" అన్నాడు లక్ష్మణ శాస్త్రి. + +రామకృష్ణకు ఆ మాటలన్నీ అర్థమవుతున్నాయి. కాని పరిస్థితులే అర్థం కావడంలేదు. ఆ కుటుంబంలో వచ్చిన పరిణామాలను మొన్న +వచ్చినప్పుడు కూడా మేనల్లుడు చెప్పనే లేదు. నివ్వెరపోయి చూస్తున్నాడు. + +"బాగుందమ్మా వరస! బాగుంది!" అంటూ ఛాయమ్మ గొణుక్కుంది. + +పార్వతీశం చిరునవ్వుతో టేబులు దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. పక్కనే వున్న రూళ్ళ కర్రను దొర్లిస్తూ అతని చేతులు +ఆడుకుంటున్నాయి. ఆ మరుక్షణంలోనే లక్ష్మణశాస్త్రి కుర్చీలోనుంచి లేచాడు. ముసలమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మగడు ఖాళీ చేసిన +కుర్చీలో తాయారు సర్దుకుని ప్రశ్నిస్తోంది. + +"నాన్నగారు ఎలా వున్నారు? అమ్మ...." + + + + +9 + + +ఆ కుటుంబ పరిణామాల కథ విన్నాక మేనల్లుణ్ని అభినందించకుండా వుండలేకపోయాడు రామకృష్ణ. కాని, పార్వతీశం ఒక్క నిట్టూర్పు +విడిచాడు. + +"పెద్దపులి వేషం వేయడం సులభం కాదు, మామయ్యా!" + +రామకృష్ణ ఇందాకటి ఘటనను తలచుకొని నవ్వాడు. "మంచి పాగా వేశావన్నమాటే. మీ నాయనమ్మ...." + +"నటనగా ప్రారంభించినదే ఈవేళ అది నా స్వభావం అయిపోతోంది, మమయ్యా! దౌర్జన్యాన్ని ఎదురించడానికి మనిషి దుర్జనుడు +కావలసి రావడం చాలా దురదృష్టకరం...." + +ఈ మారు రామకృష్ణ నవ్వలేకపోయాడు. తాయారు అనుక్షణం హడలిపోతూ అణిగి పడి ఉండనక్కర్లేకుండా తల ఎత్తుకు తిరగ +గలగడానికి తోడ్పడాలంటే మేనల్లుడు మానవత్వాన్నే కోల్పోవలసి వస్తోందని బాధపడ్డాడు. కోపిష్టివాడనీ, తండ్రినీ, నాయనమ్మనూ +కూడా చావగొడతాడని అప్రతిష్ట పాలవడం చిన్న విషయమేం కాదు. + +"అప్రతిష్ట సమస్య కాదు. మామయ్యా! నిజంగానే చావగొట్ట గలుగుతున్నాననేదే నా బాధ. ఆరు నెలల క్రితం ఒకరోజున +అమ్మను పెట్టిన హింస చూడలేక కర్ర తీశాను. ముసలమ్మ వీపు తట్లు తేలింది. నాన్న రెండు రోజులు నిలబడలేక పోయాడు. ఎలా +కొట్టగలిగానో నాకే తెలియదు. అమ్మే వెళ్ళి వాళ్ళకి చాకిరిచేసింది. సినిమాలూ, తెలుగు కథల్లోలాగా వాళ్ళ మనసులు మారిపోయి +ఒక్క దెబ్బకి మంచి వాళ్ళయిపోయి ఉంటారనుకుంటున్నావా? నీకలాంటి భ్రమలేం వద్దు. నాకు వాళ్ళ మొహం చూడాలనిపించలేదు. చూడలేదు. +ఆ హద్దులు తొలగిపోయిన తర్వాత ఎవరిమీదా, అమ్మమీద సరేసరి, కోపం చూపనక్కరలేదు. వాళ్ళ కంఠ ధ్వని గట్టిగా +వినిపిస్తేచాలు చెయ్యి కర్రమీద కెడుతుంది." + +చాలా సాధువనీ, తల్లిపోలిక--వీడెలా బ్రతుకుతాడోననీ తలచిన మేనల్లుడేనా? రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. + +"మళ్ళీ అతి చెయ్యకూడదు. అసలు కర్ర తీయడం కూడా మంచిది కాదు. ఊరికే కళ్ళతో...." + +"మీరంతా అలాగే అంటారని నాకు తెలుసు. కళ్ళతోనో, కాళ్ళతోనో బెదిరించి ఉండవలసింది మీరు. అంతా వదిలేశారు. ఇరవై--ఇరవై +అయిదేళ్ళు. ఒక రోజూ, రెండురోజులూ కాదు." + +"నిజమే"నని రామకృష్ణ ఒప్పుకున్నాడు. + +"కాని దూరాన ఉన్న మేము చేయగలిగిందేం లేదు. అసలు మనిషిని గ్రహించడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోతే దగ్గరనే +ఉన్నా చేయగలిగేదేమీ ఉండదు. మేక, గొర్రె, కోడి గలగల అరచి గోలైనా చేస్తాయి. చంపుతుంటే మీ అమ్మ తల విదిలించుకునేందుకు +కూడా ప్రయత్నించదు. ఇక మిగిలింది, ఈవలికి తెచ్చేయడం. ఒప్పుకోదు. ఇక మేం చేయవలసిందేమిటి?" + +పార్వతీశం ఒప్పుకున్నాడు. + +"భారత మహిళ అంటే సక్కుబాయిలా ఉండాలని ఎవరు నేర్పారో కాని, అమ్మ మాటలు ఎప్పుడూ నువ్వు విననట్లుంది." + +"చెప్పగా విన్నాను." + +"ప్రపంచంలో ఆడాళ్ళంతా చెడిపోయిన వాళ్ళేనన్నట్లు మాట్లాడుతుంది. మామయ్యా! ఈ ఛాందస కుటుంబాల్లో ఎందుకు పుట్టామురా భగవంతుడా +అనిపిస్తూంటుంది. మానవత్వం పోగొట్టుకోవడం తప్ప మరో దారి లేదూ?" + +ఇద్దరూ ఒక్క నిముషం ఊరుకున్నారు. పార్వతీశమే మళ్ళీ ప్రారంభించాడు. + +"ఇంతకీ ఇంట్లో ఉండి నేను మనిషిగా మిగలను. ఆస్తి పంచి నా వాటా నాకిచ్చేయమన్నాను." + +తన అక్కగారికి ఇప్పుడున్న రక్షణ కూడా మిగలదనీ, ఆమె బాధలు మరింత పెరుగుతాయనీ రామకృష్ణ భయం. కాని, పైకేమీ +అనలేకపోయాడు. + +"పంచుకొని?" + +"బయటకు పోతాను." + +"మళ్ళీ వాళ్ళు...." + +"అమ్మను నాతో వచ్చేయమంటున్నా." + +"రాదు!" + +"ఆమె ప్రారబ్దం!" + +రామకృష్ణ ఆ మాటను హర్షించలేకపోయాడు. "అది మంచిది కాదేమో!" + +కోరగా చూస్తూ పార్వతీశం హేళన చేశాడు. "మీరంతా తమాషా మనుషులు, మామయ్యా! ప్రతి పనికీ ఏదో వంకర పేరు పెడితే గాని మీ +రాజకీయాత్మకి తృప్తి ఉండదు అనవేం. నాది పలాయన వాదం అంటావు. అంతేనా?" + +తన మనస్సులోని పదాన్నే పార్వతీశం చెప్పడంతో రామకృష్ణ సిగ్గు పడ్డాడు. + +"అబ్బే" + +"పోనీలే...." + +"మీ నాన్న ఒప్పుకున్నాడా?" + +"నన్ను వదుల్చుకోవడం ఈవేళ ఆయనకి చాలా అవసరం." + +"పోయి ఏం చేద్దామని?" + +"ఏదో ఉద్యోగం, ఏదో పని...." + +"ఇప్పటినుంచీ?" + +"బతకాలి కదా?" + +"...." + +"అమ్మ వస్తానని సిద్ధపడితే?" + +"...." + +"ఆయన ఆస్తి పంచడానికి మెలిక వేస్తే?" + +"...." + +"ఆమె, నేనూ ఎవరి మీదా వచ్చి పడదలచుకోలేదు." + +రామకృష్ణ ఏ మాటా అనేలోపున పార్వతీశం తన ముందు ప్రయత్నాన్ని బయటపెట్టాడు. + +"ఇక్కడే వుండి అమానుషంగా తయారుకావడం నాకిష్టం కాదు. చదువు పోనీ, ఆస్తి ఇవ్వకపోనీ, అమ్మ రాకనేపోనీ--కనీసం +మానవుడుగా మిగలడానికి ప్రయత్నిస్తాను. అది మాత్రం నిశ్చయం." + +"అంతేలే. ఒకరి కోసం మనం మనుషులం కావాలి గాని, ఎవరి కోసమూ పశువులం కాకూడదు." + + + + +10 + + +పార్వతీశాన్ని వెంటబెట్టుకుని రామకృష్ణ హోటలుకి తిరిగి వచ్చేసరికి గుమ్మంలోనే భాస్కరరావు కనిపించాడు. వారిని చూడగానే అతని +ముఖం వికసించింది. అనుకోకుండా రామకృష్ణ రావడం శుభసూచకమనిపించింది. ఉమ తన ప్రయత్నాలకు అనుకూలత కనబరచి +ఉండాలనిపించింది. + +ముగ్గురూ గదిలో సుఖాసీనంగా కాఫీలకు ఆర్డరిచ్చారు. + +"నాకు ట్రైనింగ్‌కి పిలుపు వచ్చింది. ఆ సందర్భంగా మిత్రులు నలుగురికీ చిన్న టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మీ +చెల్లెలుగారు కూడా మాట యిచ్చారు. సరకులు ఆర్డరివ్వడానికే వచ్చాను. మరి మీరు కూడా...." + +రామకృష్ణ అభినందనలు తెలిపాడు. అతని కుటుంబంతో పరిచయం చేసుకోడానికి అంతటి అవకాశం కలుగుతున్నందుకు సంతోషం ప్రకటించాడు. + +భాస్కరరావు "థాంక్స్" తెలిపాడు. + +మరుక్షణంలో టీ పార్టీ హోటలులోనే అని విని రామకృష్ణ తన ఆలోచనను వ్యక్తం చేశాడు. + +"మీ అన్నగారున్నారా, ఊళ్ళో?" + +భాస్కరరావు ఉన్నారంటూ తల తిప్పాడు. "ఆనక టీ పార్టీలో వారిని పరిచయం చేసుకోగలుగుతా" నంటూ రామకృష్ణ అర్థ స్వగతంగా +అన్నాడు. + +"ఆయన రారు." + +తాను అంత స్పష్టంగా చెప్పినా, అన్న టీ పార్టీకి రాడంటాడే గాని, ఇంటికి రమ్మనడేమని రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. +భాస్కరరావు కొంచెంసేపు తటపటాయించాడు. చివరకేమి నిశ్చయించుకున్నాడో అనేశాడు - + +"మా అన్న పట్టణంలో పేరు పడ్డ రౌడీలలో ఒకడు. అతని పేరు చెబితే ఏ జట్కావాడన్నా అదే చెప్తాడు. అతను రాజకీయాల +కన్నా ఆ రౌడీయిజానికే ప్రసిద్ది." + +రామకృష్ణ విస్తుపోయాడు. అంత నిశ్శంకంగా చెప్తున్నందుకు మెచ్చుకోలే కలిగింది. + +"దాని అర్థం...." ఒక్కక్షణం ఆగాడు. "మీ ప్రతిపాదన వాళ్ళకిష్టం లేదనే కదా!" + +భాస్కరరావు తల వూపాడు. + +"అయినా మీరు రాజమండ్రి వచ్చినప్పటి ఆలోచనలోనే ఉన్నారనుకోవాలా?" + +"ఆ కుటుంబ సంబంధాలు మీకు అయిష్టం గాకపోతే...." + +"అంటే?" + +"ఎలా చెప్పమంటారు?" + +రామకృష్ణ ఒక్క నిముషం ఆలోచించాడు. + +"ఉమను మీ ఇంటికి తీసుకెళ్ళారట ఏ ఉద్దేశంతో?" + +"నేను ప్రవేశించవలసిందిగా కోరే కుటుంబం ఎటువంటిదో నోటితో చెప్పడం ఇష్టం లేక." + +"వారి జీవిత పద్ధతులూ, ఆలోచనలూ మీకు నచ్చలేదూ?" + +"ఔను." + +"మిమ్మల్ని ఆ కుటుంబంలోని వాడినిగా గాక, కేవలం మిమ్మల్నిగానే చూడమంటారు." + +తన అభిప్రాయాన్ని ఎట్టకేలకు గ్రహించారు చాలునన్నట్లు భాస్కరరావు ఒక పెద్ద ఊర్పు తీసుకున్నాడు. "సరిగ్గా అంతే!" + + రాజమండ్రి నుంచి వచ్చాక ఉమతో మాట్లాడాడా? ఆమె అభిప్రాయం తెలుసుకున్నాడా? ఏమంది? ఎన్నో ప్రశ్నలు నాలుక చివర వరకు +వచ్చాయి. కొద్ది గంటలలో ఆమె వస్తూనే ఉంది. ఆమెనే అడగవచ్చులే అని ఊరుకున్నాడు. మళ్ళీ ప్రశ్నించాడు. + +"ఉమను ఎందుకు చూపించాననుకున్నారు వాళ్ళు?" + +"గ్రహించారు." + +"మరి....?" + +"ఆమె వాళ్ళకు నచ్చదని నాకు తెలుసు" + +"అర్థ మవుతోంది" అనుకున్నాడు రామకృష్ణ + +"వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారన్న మాట!" + +"ఐ.పి.ఎస్.కి సెలక్ట్ అయ్యాను కదా! చాలా సంబంధాలు వచ్చాయి. వాటిల్లో ఒకదాని విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు." + +"ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు గాని, మీకు నచ్చకపోవడానికి కారణం?" + +"ప్రత్యేకించి ఏం లేదు. అయిదారు నెలల క్రితం వరకూ ఆ ఆలోచన లేదు. ఇప్పుడు ఒక దృష్టి పడింది గనుక అటు ఆలోచన +సాగడంలేదు." + +రామకృష్ణ తల పంకించాడు. ఒక్కొక్క చిన్న విషయాన్ని బయటకు తీయడానికి అన్నేసి ప్రశ్నలు వేయడం చికాకుగా ఉంది. తన +కుటుంబ విషయాలను పైకి చెప్పుకోవడానికి భాస్కరరావు ఇబ్బంది పడుతున్నాడు. + +"నా నోటితో చెప్పడం నాకే మర్యాద కాదు. నా పరిస్థితులు పార్వతీశానికి తెలుసు. అతనినడగండి. అవి సంతృప్తి కలిగించకపోతే +...." + +రామకృష్ణ చిరునవ్వు నవ్వాడు. + +ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా కూర్చున్నారు. ఏం తోచిందో భాస్కరరావు అసలు విషయానికి వచ్చాడు. + +"మా వాళ్ళు చూపించిన కుటుంబంతో సంబంధం పెట్టుకోవడం నాకు సుతరామూ ఇష్టంలేదు." + +రామకృష్ణ ఏమీ అనలేదు. మళ్ళీ భాస్కరరావే ఎత్తుకున్నాడు. + +"నేను కోరినట్లే ఆ అమ్మాయిని కూడా ఆమెను గానే ఎందుకు చూడరాదని మీరు ప్రశ్నిస్తారేమో!" + +మంచి మాట అన్నావన్నట్లు రామకృష్ణ తల విసిరాడు. + +"ఆమె అభిప్రాయాలు నాకేమీ తెలియవు. తన పుట్టింటి సంపాదనకూ నా ఉద్యోగాన్ని బిగించి ఉండడమే ఆమె ఉద్దేశం కావచ్చు. నాకు +తెలియదు. ఆమె తండ్రి జిల్లాలోనే పెద్ద భూస్వామి, చిన్న ఇండస్ట్రియలిస్టూ, మా అన్న స్నేహితుడు." + +"నీ ఉద్యోగానికంత ఉపయోగం ఉండొచ్చునని ఎప్పుడు గ్రహించావూ?" + +భాస్కరరావు సిగ్గు పడ్డాడు. + +" చాలామంది పడుచు వాళ్ళ మాదిరిగా నాకూ ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.ల మీద వెర్రి మోజు ఉంది. అందుకే +ఎం.ఎస్‌సి.లో రేంక్ తెచ్చుకున్నా డాక్టరేట్‌కు పోవాలనిపించలేదు." + +"మరి ఇప్పుడు?" + +"మీ చెల్లెల్ని కలుసుకున్న మొట్టమొదటి రోజునే ప్రజలు నా ఉద్యోగానికెటువంటి విలువ ఇస్తున్నారో అర్థం అయింది. అప్పటి +నుంచీ ఆలోచిస్తున్నాను." + +రామకృష్ణ తృప్తిపడ్డట్లు చిరునవ్వు నవ్వాడు. + + + + +11 + + +జరిగిన ఘటనలన్నీ ఒకదాని పక్కనొకటి సరిగ్గా సర్దుకొంటుంటే ఉమ ఆశ్చర్యం ప్రకటించింది. + +"నాకిదేమీ తట్టనే లేదు." అంది అన్నగారితో. + +"నీ కళ్ళు ఎక్కడున్నాయి? బుర్ర ఎక్కడుంది?" అన్నాడు రామకృష్ణ వెక్కిరింతగా. + +ఇద్దరూ ఒక్క నిముషం ఊరుకున్నారు. రామకృష్ణే కదిలించాడు. + +"ఏమంటావు?" + +"నేనతన్ని గురించి ఆ దృష్టితో ఎన్నడూ అలోచించలేదు." + +"కొంపతవ్వి సోదరుడిలా చూశానంటావేమిటి?" + +"ఛ!" + +ఆ కృత్రిమ బంధుత్వ ప్రకటన పుస్తకాలలో చదివినా, సినిమాలలో విన్నా అన్నాచెల్లెలిద్దరికి పరమసహ్యం. దాన్ని గురించి +వారనేక పర్యాయాలు అపహాస్యం చేశారు. + +"ప్రపంచాన్నంతనీ కత్తెయ్యనా, బద్దెయ్యనా అన్న పద్ధతిలో విడదీస్తూంటే వినడానిక్కూడా అసహ్యం. కాని వాళ్ళంతా నా +శత్రువులే అన్నాడట ఓ బుద్ధిమంతుడు. అలాగే ఉంటుంది--నా మగడు కాని వాళ్ళంతా సోదరులే అనడం" అంటూంటుంది ఉమ. + +ఆ వాక్యాన్నే కాస్త మెలివేస్తాడు రామకృష్ణ--"సోదరుడు కాని వాడల్లా మొగుడే అన్నట్లే" అని సవివరించాడు ఓమారు. + +ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఆ వాక్యోప వాక్యాలు గుర్తు వచ్చి ఇద్దరూ విరగబడి నవ్వుతుంటారు. + +ఇప్పుడూ అదే జరిగింది. + +"అనడం లేదులే. బంధుత్వం చీటీ తగిలించవలసి ఉంటుందనుకోలేదు. అంతే!" అంది ఉమ. + +"తగిలించవలసి ఉంటుందనుకోలేదా, తగిలించాలనుకోలేదా? కొంచెం మాకర్థమయ్యే తెనుగు మాట్లాడు." + +కిందటి రోజున పార్వతీశాన్ని తానా విధంగానే డబాయించిన సంగతి గుర్తు వచ్చి ఉమ ఒక్కక్షణం తెల్లబోయి ఫక్కున నవ్వేసింది. + +ఆ కథ విన్నాక రామకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. + +"వాడికి తెలియకపోవడమేమిటి? వాడు తన మిత్రుణ్ని పూర్తిగా బలపరుస్తున్నాడు. వాడు చెప్పిన హెచ్చరిక వింటే నువ్వు +...." + +"ఏమన్నాడేం?" + +"పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడన్న సామెత మీబోటి వాళ్ళను చూసే పుట్టిందన్నాడు." + +"అబ్బా అంతవాడయ్యాడా?" + +"నీ మీద వాడికి ఇంత కోపంగా వుంది." + +"ఎందుకు?" + +"నువ్వు ఏమీ ఎరగనట్లు నటిస్తున్నావని వాడి అభిప్రాయం." + +"నటన ఎందుకంటాడు?" + +"ఆదర్శాల పేరుతో మీరంతా నిజంగా కనిపిస్తున్న సమస్యల్ని ఎదుర్కోలేక పారిపోతున్నరని పనిలోపని నా మీద కూడా ఓ విసురు +విసిరాడు." + +"అంటే?" + +"జాగ్రత్తగా విను. ఈనాడు ప్రతి ఉద్యోగమూ పాడుగానే వుంది. కనుక ఏ పనీ చేయకుండా ఊరుకోవడమా ఆదర్శం అంటే? మనం +న్యాయంగా బతకడమూ, అన్యాయం చేయకపోవడమూ సాధారణుడి కర్తవ్యం. తనకు నష్టం కలిగినా అన్యాయాన్ని ఎదుర్కోవడం ఆదర్శ +లక్షణం. అంతేగాని పోలీసు ఆఫీసరుగా సెలెక్ట్ అవుతున్నాడు గనుక 'నమ్మరాదు' అనుకోవడం ఎప్పటికీ ఆదర్శం కాదు. నే +చెప్పాను--విన్నాడు కాదు. అయితే పిన్నికి ఆ తెలివి లేదు." అన్నాడు. + +ఉమ ఫక్కున నవ్వింది. "నిన్నటి చిరాకుకు మూలం అదన్నమాట." + +కొంచెంసేపు నిశ్వబ్దంగా కూర్చుని రామకృష్ణే ప్రారంభించాడు. + +"వాడి మాటలోనూ సబబు లేకపోలేదు." + +"నేనా రోజున పెద్దగా ఆలోచించి అన్నమాట కాదది. సైన్సు స్టూడెంటుకి పోలీసు ఉద్యోగం ఏమిటన్నాను. ఆ డిపార్టుమెంటు అంటే +అనుమానాలూ, అసహ్యమూ లేకపోలేదనుకో కాని, ఆ క్షణంలో ఆ ఆలోచనతో అన్న మాట కాదు." + +"అతని అభిప్రాయాన్ని ఆరు నెలలు మాట్లాడీ గ్రహించలేకపోయావు." + +"గ్రహించని మాట నిజమే. ఎందుచేత నంటే చెప్పలేను. బహుశా చదువుకున్న పడుచువాళ్ళకి, ముఖ్యంగా ఈ సర్వీసెస్‌లోకి +పోయే వాళ్ళకి డబ్బు మీదనే గాని మరో దృష్టి ఉండదనే భావం అంతరాంతరాల్లో ఉండి ఉంటుంది. రెండవది నాకూ పెళ్ళి ఆలోచన +లేకపోవడం కారణం అయి వుంటుంది." + +"ఇప్పుడూ...." + +"ఈ రెండు మూడు రోజుల నుంచీ ఆలోచిస్తున్నాననుకో." + +ఉమ ఒక్క నిముషం ఆలోచించింది. "నేనే ఆయనతో మాట్లాడుతా." + +"అలా చెయ్యి" రామకృష్ణ లేచాడు. + +"అతడికి నీ మీద మక్కువ ఉంది. నువ్వు ప్రతిస్పందన చూపగలుగుతే తప్పు లేదనుకుంటాను." + +"ఒక నిర్ణయానికి వచ్చేననుకోకు. నేను కాదనుకుంటే?" + +ఏం చేస్తామన్నట్లు రామకృష్ణ భుజాలు కదిలించాడు, "దురదృష్టవంతుడనుకుంటా." + +"నేను దురదృష్టవంతురాలిననవు." + +"ఉహూఁ. నువ్వు ఆశించినదేముంది పొందలేకపోయావనుకోవడానికి? అతడి విషయంలో అది కాదే...." + + + + +12 + + +భాస్కరరావు అందించిన గులాబీ పూవును ధాంక్స్‌తో అందుకుని ఉమ చిరునవ్వుతో కుర్చీ చూపించింది. + +"కూర్చోండి." + +ఇద్దరూ కూర్చున్నారు. సంభాషణ దొర్లించడానికై భాస్కరరావు క్రితం రోజు టీ పార్టీకి వచ్చి, తన యెడల చూపిన సహృదయతకు +అభినందన తెలిపాడు. + +"మీ అన్నగారు కూడా అనుకోకుండా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను." + +"అంతకు పూర్వమే రెండు రోజుల క్రితమే ఉత్తరం రాశాడు. అందువల్ల తాను వచ్చే ఆలోచన ఉన్నట్లే లేదు." + +"బయలుదేరబోయే ముందు నాకూ ఓ ఉత్తరం రాశారు. అది నా చేతికి అందక పూర్వమే ఆయన వచ్చేశారు." + +మాట జరగడం కోసమే మాట్లాడుతున్న సంభాషణ అనవసరమైన మలుపుకే తిరుగుతూంది. + +"బహుశా ఆ ఉత్తరం పోస్టు చేశాక, ఏదో అసంతృప్తి అనిపించి ఉంటుంది. వెంటనే బయలుదేరి ఉంటాడు." + +భాస్కరరావు తన జేబులోంచి ఉత్తరం తీసి ఆమె చేతికిచ్చాడు. చదివి అతని చేతికిచ్చేసింది. + +"అతని ఊహ నిజమే." + +"మీ మనస్సులో ఆసక్తి కలిగించలేకపోవడం నా దురదృష్టం." అన్నాడు భాస్కరరావు విచారంగా. + +"అది నా తెలివి తక్కువతనానికి నిదర్శనం కాకూడదా? ఇప్పుడు ఆలోచిస్తూంటే మీరు మీ ఆలోచనల్ని +దాచిపెట్టుకున్నారనిపించడంలేదు." + +ఇద్దరూ తమ తమ లోపాల్ని గుర్తించడంతో గతం అక్కడికి మూతపడింది. + +భాస్కరరావు ఈమారు తన ప్రతిపాదనను స్పష్టం చేశాడు. + +"మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నాను. కాదనవద్దు." + +ఉమ ఆలోచించింది. "మీ కుటుంబానికెవరికీ ఇది ఇష్టం ఉండదని అన్నయ్య చెప్పాడు." + +"నేనే చెప్పాను ఆయనకు." + +"మా వాళ్ళు మీకేమీ ఇవ్వరు. ఇవ్వలేకపోవడం కాదు. ఇవ్వరు." + +"మిమ్మల్నయినా ఇస్తారా?" అంటూ భాస్కరం చిరునవ్వు నవ్వాడు. + +ఉమ బల్ల మీదనే ఉన్న రామకృష్ణ ఉత్తరాన్ని ముందుకు తోసింది. అది రామకృష్ణ భాస్కరానికి రాసిందే. + +దాని అర్థం భాస్కరానికి తెలిసింది. ఆమెను ఒకరు ఇచ్చే పరిస్థితి లేదనీ, అంతా ఆమె ఇష్టమేననీ దానిలో రామకృష్ణ +సూచించాడు. + +భాస్కరం తల తిప్పాడు. "ఔను. ధాంక్స్!" + +"షరతు లేదో పెడుతున్నాననుకోకండి. ఇక్కడ మనం సాక్షిమాత్రులంగా ఉండి, బాధ్యతలన్నీ పెద్దవాళ్ళ మీదకు నెట్టివేసే +పరిస్థితి లేదు కనుక ఏ నిర్ణయానికీ బాధ్యులం మనమే అవుతాం." + +"చెప్పండి." + +"ధనాన్నీ పెద్ద సంబంధాల్నీ కాదని వస్తున్నట్లు మా అన్నయ్య చెప్పాడు." + +"మీ చదువుకీ, ఆలోచనలకీ, సంస్కారానికి పోటీ పెట్టి చూసుకున్నాను. మీ ముందు అవన్నీ విలువ లేనివి అనే నిర్ణయానికి +వచ్చానని చెప్పాను. ఆ మాట వారు చెప్పలేదా?" + +"మీకు కావలసినవి నాలో కల్పించుకుంటున్నారేమో చూసుకున్నారా?" + +భాస్కరరావు కళ్ళలో ప్రతిఫలిస్తున్న మెచ్చుకోలే దానికి సమాధానం. + +"అన్నింటి కన్నా ముఖ్యమైనది వేరే ఉంది. నేను దేవుడు, దయ్యం మీద పిసరంత కూడా నమ్మకం లేనిదాన్ని. నేను విలువ నిచ్చేది +మనుషులలోని మంచితనానికి. కుల, మతాలకు నా దృష్టిలో చారిత్రక ప్రాధాన్యం తప్ప మరోటి లేదు." + +భాస్కరరావు తల ఊపాడు. + +"ఎరుగుదును. ప్రతి నెల ఒకమారు తిరుపతి దేవుడు దర్శనం చేసుకుంటామని మా అమ్మ అన్నప్పుడు మీరిచ్చిన సమాధానాన్ని బట్టి +అర్థం చేసుకున్నాను." + +"ఏమన్నానో నాకిప్పుడు గుర్తు లేదు. వారిని నొప్పించలేదనుకుంటాను." + +"నాకు అన్ని పాపాలు చేసే అలవాటు లేదు సుమండీ!' అన్నారు. ఆ సమాధానాన్ని మా అమ్మా, అన్నా ఎన్నటికీ క్షమించరు." + +"తమ విషయం చెప్పుకుంటే నాకేమి అభ్యంతరం! శనివారం రాత్రి భోజనం మాని, ఫలహారంతో సరిపెట్టుకోవడం లేదని అవహేళన +చేసినందుకు." + +భాస్కరరావు ఏమీ అనలేదు. + +ఒక్క క్షణం పోయాక ఉమ అంది - + +"నేను ఊరుకుంటే పోయేది." + +"నాకు దేవుడంటే విశ్వాసం ఉంది." + +"సంప్రదాయాల మీద పట్టుదలా ఉందనుకుంటున్నా." + +"ఎందుకనిపించింది?" + +"మా అన్న సిఫారసు కోసం వెళ్ళడం బట్టి అనుకున్నాను." + +భాస్కరరావు ఆలోచించాడు. "ఔను." + +"మన ప్రవృత్తులలో పెద్ద తేడా కనిపించడంలేదూ?" + +"ఉండడం మీకు అభ్యంతరమా?" + +"మీ విశ్వాసాలకి నా అభ్యంతరం ఎందుకు? అయితే మీతోపాటు నేనూ పూజా పునస్కారాలకు కూర్చోవలసి ఉంటే?" + +ఎంత మక్కువ ఉన్నా భాస్కరరావు ఆ విషయంలో చటుక్కున అక్కర్లేదనలేకపోయాడు. సంకల్పం చేసేటప్పుడే "ధర్మ పత్నీ +సమేతస్య" అనుకోవాలి. పక్కన భార్య కూడా కూర్చుని ఆచమనం చేయాలి. ఇవన్నీ సంప్రదాయాలు మాత్రమేనా? ఒక +సంస్కారానికి ఆ ప్రతీకలే మత ధర్మాలు. మన సంస్కారం పెరిగినా, ఆ ప్రతీకలు సంప్రదాయ రూపంలో మిగిలాయి. అందులో భార్య +అభిప్రాయాలకు విలువ లేదు. పెళ్ళినాడే ఆమె వాటిని పక్కకు పెట్టాలి. "ఏకమవాజుపస్య" అని ఆ రోజునే నిర్దేశిస్తాడు. + +ఉమ తన స్వాతంత్ర్యం సంప్రదాయాలకు, మత విశ్వాసాలకూ కూడా విరుద్ధంగానే భావిస్తూంది. భాస్కరరావు ఆలోచనలో పడడం +గమనించింది. + +"అటువంటి ఆలోచనలే కష్టం అనిపిస్తుంది. నేనెరుగుదును." + +"నేనెప్పుడూ ఈ సమస్య ఇలా ఉంటుందనుకోలేదు." + +"మీరూ ఆలోచించండి. ఇవన్నీ జీవిత సమస్యలు. దినదినం, అనుక్షణం మనల్ని వెంటాడే సమస్యలూను." + +భాస్కరరావు చటుక్కున తెలివి తెచ్చుకున్నట్లు నిలువునా కూర్చున్నాడు. జేబు రుమాలు తీసి ఒక్కమారు ముఖం తుడుచుకున్నాడు. + +"వీనిని పరిష్కరించుకోవడం సాధ్యంకాదా?" + +"ఎందుక్కాదు? అయితే ఈ సమస్యలు మన సంస్కారానికి సంబంధించినవి గాక జ్ఞాతజ్ఞాతానికీ, అంతరాత్మకీ సంబంధించినవి. వాటిని +అధిగమించడం చాలా కష్టం. ఏమంటే అవి మన విశ్వాసాల రూపంలో...." + +తన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా అనిపించి భాస్కరరావు తత్తర పడ్డాడు. "మీ విశ్వాసాలకు ఆటంకం +కలిగిస్తాననుకోవద్దు." + +ఉమ నెమ్మదిగా అంది--"నేను మాత్రం సంస్కారానికీ, అంతరాత్మకీ మధ్య నున్న వైరుధ్యాలకి అతీతురాలినంటారా?" + +భాస్కరానికి ఏమి చెప్పడానికి తోచలేదు. తన కోరికను మర్యాదగా తోసి పుచ్చేందుకు ఇదంతా ఉపోద్ఘాతమేమో అనిపించింది. + +"దాంపత్య సంబంధాలు, వివాహ వాంఛా నిజానికి మనోద్వేగానికి సంబంధించిన ప్రవృత్తులు. కాని నేడవి పాదార్థిక బేరసారాలకు +దారితీయడం దురదృష్టం ప్రత్యేకంగా....ఇప్పుడీ ఘట్టంలో. నా దురదృష్టం." + +ఉమ అతని ముఖంలోకి చూసింది. " అదృష్ట దురదృష్టాలు మీ ఒక్కరికేనా? నాకు మాత్రం కావా?" + +ఆ మాట అర్థం ఏమిటో తెలియక భాస్కరరావు తెల్లబోయాడు. అంతలో సర్దుకున్నాడు. చెయ్యి జాపాడు. + +"మీకభ్యంతరం లేకపోతే ఆ అదృష్ట దురదృష్టాలేమిటో మన మిద్దరం కలిసే తేల్చుకుందాం." + +ఉమ చటుక్కున తన చేతిని అతని కందించింది. + +"ధాంక్స్ ఉమా!" + +ఇద్దరి ముఖాలూ ఉద్ధీప్తమయ్యాయి. ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా కూర్చున్నారు. భాస్కరరావే మళ్ళీ తమ ముందు +కర్తవ్యాన్ని సూచించాడు.. + +"మీ నాన్నగారి వద్దకు ఈ రోజే బయలుదేరుదాం ఏమంటావు?" + +"ఇంకొక్కటి మనం స్పష్టం చేసుకోవాలి." + +"పరీక్ష పూర్తవలేదన్నమాట" అన్నాడు నవ్వుతూ భాస్కరరావు. + +"హౌస్ సర్జన్సీ పూర్తి కావడంతో నేను బోర్డు కట్టబోవడంలేదు." + +"ఎం.డి. చేసే పట్టుదలతో ఉన్నావనీ పార్వతీశం చెప్పాడు." + +"ఔను" + +"నా అభిప్రాయం అదే. అయితే...." + +"ఊఁ...." + +"వెంటనే రిజిస్ట్రారాఫీసుకి వెడదాం." + +"నేనెప్పుడూ ఆలోచించలేదు, కాని, మా అమ్మా, నాన్నా దానికి ఒప్పుకోకపోవచ్చు." + +"నీ ఉద్దేశ్యం ఏమిటి?" + +"పెళ్ళి జరగవలసిన పద్ధతికి ప్రాముఖ్యం ఇవ్వాలా?" + +భాస్కరరావు నవ్వాడు. + +ఉమ తెల్లబోయింది "సంప్రదాయ పద్ధతికి ఒప్పుకుంటున్నాననా?" + +భాస్కరరావు తల ఊపాడు. + +"గౌరీ పూజ చేయాలే నువ్వు. దానికి ఎలా కూర్చుంటావు? అంతేనా? మీ నాన్నా, అమ్మా నిన్ను నాకు దానం చెయ్యాలి. దానం--భూదానం, +వస్త్రదానం, ఆస్తిదానం లాగే కదా ఇదీను. ఇవన్నీ ఎలా ఒప్పుకుంటావు?" + +"నేనవన్నీ ఆలోచించలేదు." అంది నీరసంగా. + +హోటల్ గదిలో రామకృష్ణ ముందు ఆ సమస్యను పెట్టేసరికి అతడు నవ్వాడు. + +మనం రెండు పడవల మీదా చెరోకాలూ పెట్టి ప్రయాణం చేద్దామనుకుంటే లాభం లేదే తల్లీ! సంప్రదాయం అన్నది గత సమాజం నుంచి +సంక్రమించిన వారసత్వం. సంస్కారం అన్నది కాలానుగుణంగా మనం పెంచుకున్న మానసిక ప్రవృత్తి. వీటిలో మనకు ఏది కావాలో +ఎక్కడికక్కడ తేల్చుకోవలసిందే గాని...." + +"మరి అమ్మా నాన్నా...." + +"ఈయన గారి అమ్మా, అన్నా ఉన్నారు. వారి మాట?" + +దానికి ఉమ వద్ద సమాధానం లేదు. + +"నూతన పరిస్థితులలో వివాహ వ్యవహారాన్ని పెద్దవాళ్ళ చేతుల నుంచి చిన్నవాళ్ళు పూర్తిగా తీసేసుకోవలసిందే." + +ఉమ క్షీణ స్వరంతో "వాళ్ళకి చెప్పను కూడా వద్దా?" అంది. + + "నిర్ణయించుకునేముందు నువ్వు వాళ్ళకి చెప్పలేదు. మేమిలా నిర్ణయించుకున్నాం, మాకు పెళ్ళి చేసేయ్యండని ఆ భారం వారికి +అప్పచెప్తానంటావు. అయితే ఆ చెప్పడంతో ఫలితాలు మీ మనోదారుఢ్యం మీద ఆధారపడి ఉంటాయి. అభ్యంతరాలనీ, కోపాల్నీ, +బెదిరింపుల్నీ, తిట్లు, ఏడుపులు, మొత్తుకోళ్ళనీ నిగ్రహించి నిలబడగల శక్తి ఉందా? వెళ్ళండి. చెప్పండి. స్నేహితుల్ని +పిలవడంలేదూ? అలాగే పిలవండి. ఇష్టం ఉండి వస్తే మంచిదే. రారూ, చేయగలిగేది లేదు--మీ నిర్ణయాన్ని వాళ్ళ అభ్యంతరాలకు +గురి చేయడం తప్ప." + +ఉమ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు భాస్కరరావు ముఖం చూసింది. + +"ఏమంటారు?" + +"మీ ఇష్టం." + +"మీ అమ్మగారి వద్దకు వెళ్ళి చెప్దాం" + +"వాళ్ళు తిడితే భరించగలవా?" భాస్కరరావు ఆశ్చర్యం కనబరిచాడు. + +"వెడదాం. చాటూమాటు భయం ఎందుకు?" + +భాస్కరరావు బావ ముఖం చూశాడు. వేంకటేశ్వరుడి పటం, శనివారం ఏక భుక్తం మీద పెరిగిన వాగ్వాదాన్ని స్వయంగా విన్నాడేమో +అతనికి జంకుగానే ఉంది. + +"అదే మంచిది. ఒకరి నొకరు తెలుసుకోవడానికీ ఇది అవసరమే. తర్వాత మా ఇంటికి వెళ్ళండి." + +"మీరూ రావాలి మాతో" అన్నాడు భాస్కరం. + + + + +13 + + +భాస్కరరావు తనతో వచ్చిన రామకృష్ణనూ, ఉమనూ పరిచయం చేస్తుంటే అన్న భోగేంద్రశాయికి వారి రాక ఉద్దేశం +అర్థమయిందనిపించింది. లేచి లోపలికి ఆహ్వానించాడు. కుర్చీలు చూపాడు. భార్యను పిలిచి మంచినీళ్ళు తెప్పించాడు. తల్లిని పిలిచి +వారిని పరిచయం చేశాడు. + +ఆమె 'బాగున్నావా?' అంటూ, "మళ్ళీ కనబడలేదేమమ్మా?" అని కుశల ప్రశ్నలు వేసింది. + +భాస్కరరావు భయాలకు వ్యతిరేకంగా వారు చూపుతున్న మర్యాదాభిమానాలకు రామకృష్ణ సంతోషపడ్డాడు. చటుక్కున ఆ +మాటనుపయోగించుకున్నాడు. + +"అది ఎప్పుడూ కనబడుతూనే ఉండేడట్లు చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది." + +"అంత అదృష్టానికి పెట్టిపుట్టవద్దా, నాయనా! అంత మాటన్నావు చాలు!" అంటూ అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది. + +రామకృష్ణ వదలలేదు. "మీరు 'ఊఁ' అనండి. నేను అది కోరడానికే వచ్చాను. మా చెల్లెల్ని మీ రెండో కోడలుగా చేసుకోండి." + +మర్యాద మాటల దశ దాటి కచ్చితమైన ప్రతిపాదన వచ్చేసరికి వాతావరణం బిర్రబిగిసినట్లయింది. + +ఆ ప్రసక్తి తేగానే భాస్కరరావు కనుసంజ్ఞతో ఉమ అతని పక్క నిలబడింది. ఇద్దరూ నమస్కరించేందుకై అన్నపూర్ణమ్మ వైపు +అడుగేశారు. + +"అదెలా సాధ్యం?" అన్నాడు భోగేంద్రశాయి. + +"నిన్ననే తాంబూలాలు పుచుకున్నాం వేరే సంబంధానికి. ఇదే నాలుగు రోజుల క్రితం అయితే" + +"రాజాము అగ్రహారీకుల సంబంధం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే." + +భాస్కరరావు తెల్లబోయాడు. "నా పెళ్ళికి నాకు తెలియకుండా మీరు తాంబూలాలు పుచ్చుకోవడమేమిటి?" + +"ఇంకెవరు పుచ్చుకుంటారోయ్, మహా పెద్ద కబుర్లు చెబుతున్నావు. రా, ఇవతలికి!" + +అన్నపూర్ణమ్మ విసురుగా వచ్చి అతన్ని ఉమ పక్క నుంచి లాగేయడానికి చేయి పట్టుకుంది. భాస్కరరావు ఆమెను దులపరించుకుని +తోసేశాడు. తాను ఉమకు అడ్డుగా నిలబడ్డాడు. + +"ఆ!" అంది అన్నపూర్ణమ్మ. + +భోగేంద్రశాయి ముఖంలో ఒక్క నిముషం కోప రేఖలు కనిపించాయి. కాని అంతలో సర్దుకున్నాడు. + +"అమ్మా! నువ్వూరుకో, ఉండు!" + +అన్నపూర్ణమ్మకు అంతమంది ముందు తన కొడుకు తనను విసిరికొట్టేయడం మహావమానం అనిపించింది. "నువ్వాట్టే కాలం బతికి +బట్టకట్టే లక్షణం కాదురోయ్, చిన్నాడా!" + +"పోనిద్దూ! వెధవ బతుకు బతికేం? ఏ తల్లి కన్నబిడ్డవురా అని ఎవరన్నా అడుగుతే ఏం చెప్పుకోవాలి?" + +"భాస్కరం!" సానునయంగా పలకరించబోయాడు శాయి. + +"ఏమిటి?" + +"పెద్ద మనుషులతో మాట తప్పడం ఎంత అప్రతిష్ఠ!" + +"ఇదిగో, అన్నయ్యా! ఇది నీ ప్రతిష్ఠకి సంబంధించిన సమస్య అనుకుంటున్నావు. ఇది నా బ్రతుకుకే సంబంధించిన +దనుకుంటున్నాను." + +"ప్రతిష్ఠపోయిం తర్వాత బ్రతుక్కు విలువేమిట్రా?" + +భాస్కరం ఉచ్చిపోయేలా చూశాడు. "నా బతుకు నాది కనకనా? నీ ప్రతిష్ఠ కోసం నా బ్రతుకు చెడాలి. భేష్!" + +బ్రతుకు, ప్రతిష్ఠ సంబంధంతో ఉన్న అసందర్భాన్ని అర్థం చేసుకున్న భోగేంద్రశాయి తగ్గలేదు. + +"మన భారతీయులకు కుటుంబ జీవితం మన వ్యక్తి జీవితంతో ముడిపడే ఉంది. అవి రెండూ భిన్నం కాదు." + +"ఊఁ!" + +ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా ఊరుకున్నారు. తమకు తెలియకుండానే కుటుంబ సంబంధాలతో వచ్చిన విపర్యాయాలలోతును +ఆలోచిస్తున్నట్లు తోచి రామకృష్ణ చిరునవ్వుతో చూస్తున్నాడు. + +"ఇది నా స్వంత విషయం. పెద్దవాళ్ళు కదా అని చెప్పవచ్చాను. నిజానికి చెప్పవలసిన పనిలేదు. ఇంక...." + +ఇంక ఈ విషయంలో సర్దుబాటు చేయబోవడం మంచి దనిపించి రామకృష్ణ అందుకున్నాడు. + +"మీ రిద్దరూ కూడా చిన్న విషయం మీద తొందరపడుతున్నారు." + +"ఏమిటండి? ఇది చిన్న విషయమా?" అన్నాడు భోగేంద్రశాయి చిరాగ్గా. + +"చెప్పొచ్చాడు!" అని విసురుకుంది అన్నపూర్ణమ్మ. + +"మీరూ అలా అంటా రేమిటి?" భాస్కరరావు అసంతృప్తి చూపాడు. + +"కాక, ఎవరి విషయం వాళ్ళకి గొప్ప అనిపిస్తుంది. మీరు అన్న మాట వినకుండా మీ ఇష్టానుసారం పెళ్ళి చేసుకుంటే ఆ కష్టమో, +సుఖమో మీది. వారికేం పోతుంది?" + +"కట్నం. ఏభైవేల కట్నం." + +రామకృష్ణ నవ్వాడు. + +"మీరు పెళ్ళి చేసుకుంటే కట్నం మీ అన్నయ్య కిస్తారా?" + +తన చెల్లెల్ని చెప్పవచ్చిన పెద్దమనిషి ధోరణి అర్థం కాక భోగేంద్రశాయి తేరిపార చూశాడు. బహుశా అతనికీ ఈ సంబంధం ఇష్టం +లేదేమో చెల్లెలి పట్టు మీద వచ్చాడేమో! ఇప్పుడీ అవకాశం చూసుకుని ఎదురు తిరుగుతూండవచ్చు ననిపించింది. + +"అలా చెప్పండి." + +"ఏభైవేలు నష్టపోయేది ఆయన." + +"కాక, కట్నం డబ్బు నా ఒళ్ళో పడుతుందా?" + +"ఔను మరి! అంత డబ్బు పోతున్నదని విచారం ఆయనకే లేనప్పుడు మీదేం పోయింది? ఇప్పుడు చెప్పండి. ఇది చిన్న విషయం +కాదంటారా?" + +అందరూ విస్తుపోయినట్లు కళ్ళప్పగించి నిలబడిపోయారు. + +"కొంచెం మనసులు శాంతించాక మాట్లాడుకోవచ్చు. నడవండి, ఉమా!" + +భోగేంద్రశాయి, అన్నపూర్ణమ్మ నోట మాట లేకుండా నిలబడిపోయారు. వధూవరుల్ని చెరోచేతా పట్టుకుని రామకృష్ణ గుమ్మం వైపు +నడిపించాడు. + +"పెళ్ళి కాకుండానే వేరింటి కాపురం పెట్టించేయండి" అన్నాడు భోగేంద్రశాయి. వెక్కిరింతగా. + +"ఔనండీ! ఆ విషయం తోచనేలేదు." అంటూ రామకృష్ణ తిరిగి చూశాడు. + +"అయినా ఆ విషయం ఆలోచించుకోవలసింది వాళ్ళు. "నఖలు తద్వాచ్యం వధూ బంధుభిః" + + + + +14 + + +ముగ్గురూ హోటలుకు వచ్చారు. గుమ్మంలో అడుగు పెడుతూనే రామకృష్ణ అనంతర కర్తవ్యం నిర్దేశించాడు. + +"ముందు భోజనం తరువాత సావకాశంగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ముఖాలు కడుక్కుని రండి! ఈ లోపున కౌంటరు వద్ద చెప్పి +వస్తా!" + +తన బంధువుల వ్యవహారానికి చిన్నపుచ్చుకొని నిస్తబ్దంగా ఉండిపోయిన భాస్కరాన్ని ఉమే కదిలించింది. + +"ఈ చిన్నదానికేనా ఇంత బాధపడడం? వెళ్ళి ముఖం కడుక్కుని రండి!" + +"ఇది చిన్న విషయమా?" + +"జీవితంలో అతి చిన్న సమస్య కూడా ఆ క్షణంలో భయంకరంగానే కనిపించవచ్చు. కాని తరువాత వచ్చేవి నిజంగానే భయంకరం +కావచ్చు." + +"మనసులో ఏం ఉన్నా అంత అనాగరికంగా వ్యవహరిస్తుందనుకోలేదు." + +అన్నగారి మాటలు, చేతల కన్నా తల్లి ప్రవర్తన అతనికి చాలా బాధ కలిగించిందని ఉమకు అర్థమయింది. + +"డబ్బు పోవడం కన్నా పెద్దరికం పోతుందనేది ఎక్కువ బాధ పెడుతుందంటాడు మా అన్నయ్య." అంది. + +అంతలో రామకృష్ణ వచ్చాడు. "భోజనం గదిలోకే తెస్తాడు. మీ రింకా ఇలాగే ఉన్నారేం? లేవండి." + +ముగ్గురూ భోజనాలు ముగించారు. సర్వరు తెచ్చిన కిల్లీలు నములుతూ కూర్చున్నారు. క్లీనరు వచ్చి బల్లలు శుభ్రం చేసి వెళ్ళాడు. +రామకృష్ణ సిగరెట్టు ముట్టించి, పెట్టె భాస్కరరావు ముందుకు నెట్టాడు. + +"ఇప్పుడు చెప్పవయ్యా!" + +"మిమ్మల్ని ఇరుకున పెట్టాను క్షమించండి." + +రామకృష్ణ చెయ్యి ఆడించాడు. + +"వదిలేయ్! అది కాదిప్పుడు ఆలోచించవలసింది. ముందేం చేద్దామనుకుంటున్నారు?" + +"చెప్పవలసింది మీరు. ముఖ్యంగా ఉమ. మా వాళ్ళనీ, వాళ్ళ సంస్కారాన్ని--ఇన్ ఆల్ ఇట్స్ న్యూడిటీ చూశారా మరి!" అంటూ +భాస్కరరావు ఉమ వంక క్షమించమన్నట్లు జాలిగా చూశాడు. + +దానికీ రామకృష్ణే సమాధానం ఇచ్చాడు. "ఇంతవరకు సగమే కనబడింది. ఇంక ఆవిడ తాలూకు వాళ్ళం మేమెలా వ్యవహరిస్తామో! మీకు +ధైర్యముంటే ఆ వైభోగమూ చూద్దురుగాని. ముందు తేల్చుకోవలసింది వేరు. మీ వివాహానికి మీ వాళ్ళు ఒప్పుకోరు. సాహసించి చేసుకుంటే +అనుక్షణం మీ బతుకుల మీద దండయాత్ర సాగిస్తూనూ ఉండవచ్చు. ఊరుకోనూ వచ్చు అందుచేత...." + +భాస్కరరావు ఆదుర్దాగా ప్రశ్నించాడు. "అలా అంటారేం? నా దేముంది తేల్చుకునేందుకు? ఉమ చెప్పాలి." + +"ఆమె కూడా చెప్పవలసే వస్తుంది. కానీ నీది కీలకం. మా వాళ్ళు కూడా ఇదే ధోరణి నవలంబిస్తే పెద్ద మునిగిపోయేది లేదు. +కానీ మీ వాళ్ళ వ్యతిరేకత...." + +"అదీ పరవాలేదు. వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గరుండవలసి వస్తే మీరు చెప్పే ఇబ్బంది గాని...." + +"అంటే నువ్వు...." + +"మా అన్నయ్య సలహానే పాటించవలసి వస్తుంది." + +"తప్పు లేదు. థర్టీస్‌లో కమ్యూనిస్టులం రాజకీయపు వెసులుబాటు కోసం ఉమ్మడి కుటుంబాల్ని బద్దలు కొట్టేశాం. ఈ వేళ +సామాజిక పురోగతి కోసం ఇంకా మిగిలి ఉన్న పేగు బంధాన్ని కోసెయ్యాలి. తప్పదు. మనం బయట పడాలంటే తప్పడం లేదు. ఏం +చేస్తాం?" + +భాస్కరం ఉమ దిశగా చూశాడు. + +"నన్నేం చెప్పమంటారు?" అంది నిస్సహాయంగా. + +"నీ మనసులోని మాటేదో చెప్పు" అని రామకృష్ణ అందించాడు. + +"దీనికి ఇదమిత్ధ మనే సూత్రం ఉందేమిటి? ఎప్పటికప్పుడు ఆ క్షణానికున్న పరిస్థితుల్ని బట్టి ఆలోచించి సర్దుకోవలసిందె +తప్ప...." + +భాస్కరరావు ఔనన్నట్లు తల ఊపాడు. రామకృష్ణ ఏమీ అనలేదు. + +"మీరుద్యోగానికి వెళ్ళిపోతున్నారు." + +"ట్రైనింగ్‌కి." అని సర్దాడు భాస్కరరావు. + +"అదే. మీరింక ఆ ఇంటిలో మకాం వేసేది ఉండదుకదా!" + +"నిజమే. మకాం వేసేది లేకపోయినా, ఆ ఇంటిలో ఉండే హక్కు అతనికుంటుంది. దానినతడు తన ఇల్లుగానే భావించగలడు." + +"కావచ్చు." ఉమ ఒప్పుకొంది. + +"అలాగే ఆయన తల్లికికూడా ఆయన ఎక్కడున్నా ఆ ఇంటికి రావడానికి, ఉండడానికీ హక్కు ఉంటుంది కదా!" అని రామకృష్ణ. + +"నిజంగా హక్కు ఉందా, లేక...." దానికేమి పేరు పెట్టాలో తెలియక ఉమ ఆగింది. + +"కానీ...." అని హెచ్చరించాడు రామకృష్ణ. + +భాస్కరరావు ఆసక్తితో వింటున్నాడు. + +"ఆ ఇంటిలో ఈయనకున్నది చట్టబద్ధమైన హక్కు. ఈయన ఇంటిలో ఆమెకుండేది నైతికమయిన హక్కు." + +"అంతేనంటావా?" అన్నాడు రామకృష్ణ. + +"నా ఉద్దేశంలో కుటుంబం గురించిన మన ఆలోచనా ధోరణి మారాల్సి ఉందంటాను. కేవలం భోజనం సరిగ్గా కుదరక పెళ్ళి చేసుకోవడం +అనవసరం. హోటళ్ళున్నాయి. వంట వాళ్ళున్నారు. కుక్కర్లున్నారు. బెర్నార్డ్ షా ఎక్కడో అన్నట్లు వివాహం అనేది చౌకలో +పిల్లల్ని బాగా పెంచేందుకు సమాజం కల్పించిన ఏర్పాటనే మాటను నేనంగీకరించలేను. వీటన్నిటినీ మించిన అవసరం దానికుంది. అది +కేవలం శారీరకమైనదే కాదు. మానసికం కూడా. అదే పడుచు వాళ్ళని సన్నిహితం చేస్తుంది. ఆ అవసరం అనుభూతం కానివాళ్ళకు +పెళ్ళితో పనిలేదు. ఓ పనివాడు చాలు. అమ్మ ఆసరా చాలు. ఓ హోటలు గదో, సత్రం చావిడో ఎక్కీతొక్కీను" ఆమె అక్కడ +ఆగింది. + +"ఇంతకీ నీ ఉద్దేశం?" అంటూ రామకృష్ణ ప్రోత్సహించాడు. + +"ఆ అవసరం కనబడ్డనాడు ఏర్పడిన కుటుంబం ఆ ఇద్దరిదే అవుతుంది. దాంట్లొ పై వాళ్ళకు చోటుండొచ్చు. కానీ హక్కు ఉండదు. +అమ్మయినా సరే, నాన్నయినా సరే." + +"ఊ, మీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు రామకృష్ణ. + +"ఉమ అబిప్రాయం సరైనదే ననుకుంటాను. నే నెప్పుడూ ఆలోచించలేదు కాని...." అన్నాడు భాస్కరరావు. + +"సమాజం ఇలా నడవాలని ముందే ఆలోచించుకుని ఎప్పుడూ నిబంధనలు పెట్టుకోదు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకోవడంలో మనం +తీసుకునే నిర్ణయాలే కార్యక్రమంలో సామాజిక నిబంధనలవుతుంటాయి. దురదృష్టం ఏమిటంటే మానవుడు తాను చేసిన పనినే తనది +కానట్లు, తనకు అతీతమైనదన్నట్లు భావించడమూ, దానిని సర్దుకోవాలంటే ప్రపంచం ఏమయిపోతుందోనన్నట్లు భయపడడమూను, +కానీండి." అన్నాడు రామకృష్ణ సాలోచనగా. + +* * * * * + +సుదీర్ఘంగా సాగిన ఆ వారం పదిరోజుల కథ విని సత్యవతి నవ్వి కొడుకును హాస్యం చేసింది. + +"అందరూ ఎరిగినదాన్నే ఇంత బరువుగా వినిపించడం మీ మార్క్సు గారి పద్దతా, ఏమిరా?" + + + + +15 + + +చంద్రశేఖర శాస్త్రి "రా, అమ్మా!" అన్నాడు ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు. + +"మీ స్నేహితులు ఏం చేస్తున్నారు? ఆయనకు ఏం కావాలో, ఏమిటో చూస్తున్నావా? అమ్మ అస్తమానం వంటింట్లో ఉంటుంది. ఆయనకు మన +ఇల్లు కొత్త, మొగమాట పడతారు" అంటూ చెప్పుకుపోతున్నాడు. + +తమ మనసులో కొట్టుమిట్టాడుతున్న ద్వైదీభావాన్ని ఒక క్రమంలోకి తెచ్చుకొనే వ్యవధి కోసం ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నంతోనే +తన ఎదుట ఉన్న కూతురితో ఏదో మాట్లాడేస్తున్నాడు. కాని దాని అర్థాన్ని గమనించుకోవడంలేదు. నిన్నటి నుంచీ ఇంటిలో ఉమ +పెళ్ళి విషయం మీదనే ప్రతి ఒక్కరూ రెండో వారితో చర్చిస్తున్నారు. ఇప్పుడీ మాటలతో శాస్త్రి వారి వివాహానికి తన అంగీకారం +తెలిపినట్లే అయింది. + +ఉమ ఉత్సాహంగా గదిలోకి అడుగు పెట్టింది. ఆమె వెనుకనే నమస్కారం తెలుపుతూ భాస్కరరావూ వచ్చాడు. + +"రండి, రండి! అమ్మా ఆ కుర్చీ ఇలా లాగు. కూర్చోండి!" + +గుమ్మంలోంచి సత్యవతి పలకరించింది "రమ్మన్నారుట ఎందుకు?" + +శాస్త్రి ఒక్క క్షణం విస్తుపోయినట్లు చూశాడు. అంతలో సర్దుకున్నాడు. + +"రామకృష్ణ చెప్పాడా? మంచిది. నేనూ అనుకుంటున్నాను. రా, ఇలా కూర్చో!" అంటూ సోఫాలో తన పక్కనున్న కాగితాలు తీసి +పక్కనున్న బల్ల మీద పడేశాడు. + +సత్యవతి చిరునవ్వుతో ఆయన పక్కనే కూర్చుంది. ఏదో మాటవరస కలుపుతూ, " ఇదిగో, వీళ్ళిద్ధరూ ఇక్కడనే వున్నారే!" +అంది. + +ఆ ఇద్దరూ ఒక్కచోటనే ఉన్నట్లు గుర్తించడమే ఆమెకు సమస్య అర్థమైనట్లూ, దాని కామె సుముఖురాలే నన్నట్లూ కనిపించింది. + +రామకృష్ణ జరగబోతున్న ఘట్టం గురించి ఆమెకు చెప్పే వుంచాడు. ఆమెకూ భాస్కరరావు నచ్చాడు. చేయబోయే ఉద్యోగం గురించీ, చదువు +గురించీ విన్నది, తృప్తి పడింది. + +తీరా తండ్రి ముందుకు వచ్చాక అసలు విషయం ఎలా ప్రారంభించాలో ఉమకు అర్థం కాలేదు. సలహా కోసం భాస్కరరావు ముఖం కేసి +చూసింది. అతనికీ బిడియంగానే ఉంది 'నువ్వే ప్రారంభించ ' మన్నట్లు తల ఎగరేశాడు. 'బాబోయ్' అన్నట్లామె కళ్ళు రెపరెప +లాడించింది. + +వారి హావభావాలు గమనిస్తున్న సత్యవతి ఫక్కున నవ్వింది. + +"ఏమిట్రా, మీ గొడవ!" + +ఆ మాట ఊతం తీసుకుని భాస్కరరావు చటుక్కున లేచాడు - + +"మీ ఆశీర్వచనం కోరివచ్చాము." + +చంద్రశేఖరశాస్త్రి ఏ మాటా చెప్పేలోపున ఆ జంట ఒకరి తర్వాత ఒకరికి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. దంపతులు +అప్రయత్నంగానే వారి తలలు స్పృశిస్తూ ఆశీర్వచనమూ చేసేశారు. + +"దీర్ఘాయుష్మాన్ భవ!" + +"దీర్ఘ సుమంగళీ భవ!" + +పాదాభివందనం చేసి నిలబడ్డ కూతురును సత్యవతి దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. + +"బాగుందే, తల్లీ! బాగుంది!" + +చంద్రశేఖరశాస్త్రి స్వరంలో కూడా డగ్గుత్తిక వినిపించింది, "కూర్చోండి. బాబూ!" + +నలుగురూ కూర్చున్నాక శాస్త్రి కూతుర్నే ప్రశ్నించాడు. + +"ఇంకేమిటి? ఏం చేయాలనుకుంటున్నావమ్మా?" + +ఆ ప్రశ్న కర్థం తెలియక ఉమ తెల్లబోయింది. తల్లివంక చూసింది. + +సత్యవతమ్మ హాస్యమాడింది. + +"ఏమనుకొంటుంది? ముహూర్తం పెట్టించమంటుంది." + +శాస్త్రి తాను కూడా హాస్యంలొ జత కలిపాడు. "మనం పెట్టించేందుకేముంది? ఒక్క నెలరోజుల వ్యవధిలో అదీ వాళ్ళే +పెట్టేసుకోగలరు." + +తామే ఒక నిర్ణయానికి వచ్చి, ఆశీర్వచనం కోరుతున్నామన్నందుకు కలిగిన మనస్తాపం సూచనేమో ననిపించి పడుచువాళ్ళిద్దరూ +ఉలిక్కిపడ్డారు. + +"అబ్బే, అదేం లేదండీ?" అన్నాడు భాస్కరరావు. + +"తప్పేం లేదు. మీరు మంచి పనే చేశారు." అని శాస్త్రి దిలాసా ఇచ్చాడు. + +తమ ఇంట కలిగిన అనుభవంతో పోల్చుకుని భాస్కరరావు ఉత్సాహపడ్డాడు. + +కూతురి ఆలోచన లేమిటో శాస్త్రి తెలుసుకోదలిచాడు. + +"నీ ఎం. ఎస్. ప్రయత్నం ఉందనుకుంటాను." + +"కాంపిటీటివ్ పరీక్షలకు కూర్చుంటాను." + +"నా ట్రయినింగ్ కూడా రెండేళ్ళే ఉంటుంది కదండీ! ఆమె చదువు మానరాదనే అనుకున్నామండీ!" + +శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. అనుకొన్నాడు--కూతురు జీవితంలో తమ ప్రమేయం ఏమీ మిగలలేదన్నమాట! + +ఆయన మనసు పదే పదే భాస్కరరావు గోత్రం ఏమయి ఉంటుందోనని జంకుతోంది. ఇంటిపేర్లను బట్టి గోత్రాలు అర్థం అవుతాయి. అయితే +కొంతవరకే. ఒకే ఇంటిపేరూ, భిన్న గోత్రాలు వాళ్ళున్నారు. అదీగాక అన్ని యింటి పేర్ల గోత్రాలూ తనకు తెలుసునా? పైగా +జిల్లాలు దాటీ, శాఖలు దాటీ వచ్చిన సంబంధం! నాడుల నిబంధన విధించాడనే ఏలేశ్వరోపాధ్యాయుల మనఃక్షోభ అర్దమయిందనిపించింది +శాస్త్రికి. తాను తప్పు చేస్తున్నానేమో అనిపించినా, కొడుకు చెప్పింది కూడా న్యాయమే అనిపిస్తోంది. పైగా ఈ పడుచు వాళ్ళ ధోరణి +చూస్తున్నాడు. తమ చిన్ననాటితో పోలిస్తే, ఆనాడు నలుగురైదుగురు పిల్లల్ని కన్న దంపతులు కూడా అంత దోస్తీ చూపేవారుకారు. +ఇక్కడింకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే కన్ను గిరిసి అభ్యర్ధనలు, 'అనుకొన్నాము'. ఇలాంటి వాళ్ళని గోత్రం పేరుతో వేరు +చేయడం న్యాయం మాట అటుంచి, సాధ్యమా? కానప్పుడు అవి తవ్వడం ఎందుకు? అని సరి పుచ్చుకుంటున్నాడు. + +"మంచిది అవన్నీ మాకు అర్థమయ్యే విషయాలు కాదు." + +భాస్కరం చాలా దృఢంగా చెప్పాడు--"ఇప్పుడు వెంటనే చదువు కట్టి పెట్టడంలో అర్థం లేదండి!" + +"ఔను నాన్నా! నేను ఎం. డి. యో, ఎం. ఎస్సీయో చేయవలసిందే" + +భాస్కరరావు ఆమె వంక సగర్వంగా చూశాడు. + +"ఎంతవరకు చదవాలి, ఎప్పుడాపాలి అన్నది వాళ్ళు చూసుకుంటారు. ముహూర్తం పెట్టించేయండి" అని సత్యవతమ్మ మగనికి సలహా +యిచ్చింది. + +"అన్నయ్యని పిలుచుకురా, తల్లీ!" శాస్త్రి కూతురికి పురమాయించాడు. + +ఆమె కిందికి వెళ్ళింది. + +"మీరా దృఢనిశ్చయంతో ఉన్నప్పుడు ఆ చదువేదో ముగిశాకే ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇప్పుడు తొందర పడటం ఏమంత మంచిది?" +అన్నాడు శాస్త్రి. కనీసం ఇప్పటికి దాటించేస్తే తరువాత చూసుకోవచ్చు ననే ధోరణిలో. + +భాస్కరరావు తెల్లబోయాడు. ఇటువంటి మునద్దీ పేచీ వస్తుందనే ఆలోచన వుంటే తమ ఎత్తుబడినే భిన్నంగా ఏర్పాటు చేసుకునేవాడు. +ఉమ యిక్కడుంటే సంభాషణ ఏ రూపం తీసుకునేదో? వివాహం వెంటనే జరిగి తీరవలసిందే ననడానికి మొగమాటపడ్డాడు. మనసులో ఎంత +కోరిక వున్నా పైకి తేలలేకపోయాడు. "పెద్ద వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలాగే"నని జారవిడవవలసి వచ్చింది. + +సత్యవతి అభ్యంతరం చెప్పింది--"ఒక నిర్ణయానికి వచ్చాక వాయిదాలెందుకు? చిన్నపిల్లలా, ఏమన్నానా?" + +భర్త ప్రయత్నం ఆమెకు అర్థం కాలేదు. తన వాదాన్ని ప్రత్యాఖ్యానం చేసే సాధనం కూడా ఆమే అందించి శాస్త్రి శ్రమ +తగ్గించింది. + +"పెళ్ళి అయ్యాక కూడా వయసు వచ్చిన వాళ్ళను దూరంగా ఉంచడం న్యాయం కాదు, ఆ కాస్త అడ్డు తీరితే యింక పిల్లలు. మరి +చదువేముంటుంది? చదువుకోదలచినప్పుడు వెంటనే పెళ్ళి చేసుకోవడంలో అర్థం లేదు." + +"ఆఁ, మీ చాదస్తం కానీ! వాళ్ళ కష్ట సుఖాలు వాళ్లెరగరా ఏం?" అంతకన్న పరాయి పడుచువాని ముందు ఆ కష్ట సుఖాల ఎరుక +స్వభావాన్ని సత్యవతి స్పష్టం చేయలేకపోయింది. + +భాస్కరరావు మనసూ ఆ అభ్యంతరాన్నీ అంగీకరించలేదు. ఈనాడు సంతాన నిరోధాన్ని సమాజమే తన చేతిలోకి తీసుకుంది. యిక సందేహం, +సిగ్గూ అనవసరమే. పైగా వధువు మెడిసిన్ చదువుకుంది. ఆమెకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియవా? యిన్ని ఆలోచనలూ +మనసులోనే. ఆ పెద్దల ముందు ఏమీ పైకి అనలేక పోయాడు. + +ఇంతలో రామకృష్ణను వెంటబెట్టుకుని ఉమ పైకొచ్చింది. వేరు ప్రశ్నకూ, మారు మాటకు అవకాశం ఇవ్వకుండా శాస్త్రి తన +అభిప్రాయాన్ని ప్రకటించాడు. + +"బాగానే ఉందోయ్! అయితే ఒకటే చెప్తున్నా--ఇద్దరికీ చదువులున్నాయి. కనీసం ఏ ఒక్కరు బయటపడాలన్నా రెండేళ్ళు పడుతుంది. +అంతవరకూ ఒకరు దక్షిణాన్నా, వేరొకరు ఉత్తరానా. ఇప్పుడు పెళ్ళి చేసుకుని సుఖం లేదు. అర్థమూ లేదు. ఏమంటావు?" + +ఉమ తెల్లబోయింది. + +రామకృష్ణకు తండ్రి ఆలోచన అర్థమయింది. తన మనసును తృప్తిపరచుకునే వరకు ఆయన ఆ వివాహం జరపలేడు. పోనీ అని ఆ +గోత్రమేదో తేల్చుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లూ లేదు. అడగలేదనేది స్పష్టమే. తెలుసుకుని మనసు బాధ పెట్టుకోవడం +కన్నా ఇదే మేలు. కాని, మళ్ళీ ఇదేమిటి?" + +ఈ మారు శాస్త్రి తన ఆలోచనలకు ఒక కారణాన్ని కూడా జతపరిచాడు. + +ఈ లోపున వాళ్ళ అమ్మగారూ, అన్నగారూ కూడా సర్దుకోగలుగుతారు. పెద్దవాళ్ళను సాధ్యమైనంత వరకు మంచి చేసుకోవడం మంచిది. +శుభప్రదమూనూ." + +రామకృష్ణ అనుమానిస్తూనే భాస్కరరావు ముఖం చూశాడు, నిస్పృహ నిర్వేదంతో కూడిన వినోదరేఖ కనపడింది. + +శాస్త్రి మళ్ళీ తన వాదాన్ని ప్రస్తరించాడు. "చూడు, నువ్వు చెప్పిందాన్ని బట్టి ఈ క్షణంలో వివాహం తలబెడితే వారెవరూ +వస్తారనుకోను. కొంచెం చల్లబడనిస్తే అన్నీ సర్దుకుంటాయి. లక్షణంగా పెళ్ళి చేసుకుంటూ పేచీలు అనవసరం." + +"ఒకవేళ...." + +"అలాగే ఆ కోపాలూ, తాపాలూ కొనసాగితే అప్పుడేమంటుంది. పెళ్ళి చేసేసుకుంటారు. ఏం?" + + + + +16 + + +క్రిందికి వచ్చాక రామకృష్ణ చాలా ఆలోచించేడు. తండ్రి ఆలోచనా ధోరణి అతనికి తెలిసి తెలియనట్లు ఉంది. అదేదో +తేల్చుకోవాలని నిశ్చయించుకొన్నాడు. మధ్యాహ్నం ఆయన విశ్రాంతి తీసుకొనే వేళకి తల్లిని తీసుకుని ఆయన గదికి బయలుదేరేడు. + +"భాస్కరం లేవగానే అల్మారాలో పళ్ళూ, బిస్కెట్లూ ఉన్నాయి. కాఫీ ఫ్లాస్కులో పోసేను. ఇయ్యి" అంటూ కూతురుకు పురమాయించి +సత్యవతి కొడుకు వెంట బయలుదేరింది. + +మెట్ల మీద కాలు పెడుతూ అతడు తల్లిని కదిలించేడు. "ఏమిటీ నాన్నగారి అభిప్రాయం? కావాలని వచ్చేడు గనక నిర్లక్ష్యమా? +ఉమ మనస్థితి కూడా చూసుకోవద్దా?" + +చిరకాల పరిచయంలో భర్త మనస్తత్వాన్ని సూచనగా గ్రహించగల సత్యవతమ్మ కొడుకును తొందర పడవద్దంది. + +"ఆయన మనస్సులో ఎక్కడో ఏదో అసంతృప్తి మెదులుతూంది." + +"నాకు తెలుసును, ఆ అసంతృప్తి ఎందుకో, ఆ కుర్రవానిది మన గోత్రమే అయితే నీకేమన్నా అభ్యంతరమా?" + +సత్యవతి తెల్లబోయింది. "వాళ్ళదీ భరద్వాజ గోత్రమేనా?" + +"ఏమో నేనడగలేదు. ఈ సందర్భంగా అసలు అడగను. దానిమీద నాకు సుతరామూ నమ్మకం లేదు." + +"ఏమో నాకేమీ తెలియదు"--సత్యవతమ్మ నాన్చింది. + +"అడగలేదు అయితేనేం? మన శాఖవాడు కాదు. ఏ మూలనుంచేనా బంధుత్వం ఉందనుకుందుకేనా మన పూర్వులూ, వాళ్ళ పూర్వులూ నాలుగైదు +తరాలకు మధ్యకాలంలో ఒక జిల్లాలో కూడా ఉన్నట్లు లేదు. అటువంటి సందర్భంలో చదువు, రూపం, గుణం వయస్సు సరిపడినప్పుడు, +కోరి వచ్చినవాడిని, ఉమ కూడా ఇష్టపడుతున్నప్పుడు--అర్థంలేని అభ్యంతరం చెప్పి తోసెయ్యడం--ఆలోచించు." + +గదిలో అడుగు పెడుతూండగనే తండ్రి వేసిన ప్రశ్నకు రామకృష్ణ తెల్లబోయేడు. + +"కుర్రాళ్ళిద్దరూ ఏమంటున్నారు?" + +తెల్లబోయిన కొడుకు వంక చూస్తూ శాస్త్రి మందహాసం చేశాడు. "ఏమిటలా చూస్తావు?" + +"నువిలారా, కూర్చో" అంటూ భార్యకు చోటు చూపిస్తూ అన్నాడు. + +"నే నాతని గోత్రం అడగలేదు. అడగతలుచుకోలేదు." + +"అనుకున్నాను" అన్నాడు రామకృష్ణ, "మరి పేచీయే లేదు." + +"ఎందుకు లేదు. నే నా పెళ్ళి చేయలేను. కన్యాదానం చేసే దెవరికి? ఫలానా గోత్రాయ, ఫలానా వారి పౌత్రాయ, ఫలానా వారి +పుత్రాయ, ఫలానా శర్మాయ--ఔనుగాని, అన్నట్లు ఆయనకు వడుగేనా...." + +"నే నడగలేదు" అన్నాడు రామకృష్ణ విసుగ్గా. + +"మరేం తెలుసుకున్నావోయ్?" + +"నాన్నా! ఆయన పెట్టెలో ఉన్న చొక్కాలూ, ప్యాంట్ల రంగులూ, నమూనాలూ తెలుసుకోవడం నాకంత ముఖ్యం అనిపించలేదు." + +"ఏం మాటరా అది?" అంది సత్యవతమ్మ మందలింపుగా. + +"ఔనమ్మా! మీరంతా నాలుగైదు వందలు పోసి ఒడుగులు చేశారు. మా అన్నదమ్ములం ఒక్కడి మెళ్ళోనేనా జంధ్యం ఉందనుకోను. కనీసం నా +మెళ్ళో లేదు. మంచా, చెడ్డా అని కాదు. దానికి నేడున్న విలువ మాత్రమే చెపుతున్నా మీకంత ముఖ్యం అయితే--అంటే ఇంతక్రితం +జంధ్యం వేసుకొని ఉండకపోతే--ఇప్పుడు వేసుకోవడానికి ఆయనకి అభ్యంతరం ఉండకపోవచ్చు--అదీ నేను చెప్పలేను సుమా....ఇంతకీ +నే నడగలేదు...." + +"ఉహూ" అన్నాడు శాస్త్రి. + +"అవన్నీ తెలుసుకోవడం, తేల్చుకోడం కష్టంకాదు. చిన్నచిన్న విషయాల్ని మేరువులంత చేసుకోవడంలో అర్థంలేదు" అంది సత్యవతమ్మ +సర్దుబాటుగా. + +"అది కాదమ్మా! ఆయన తన కీ నమ్మకాలు లేవంటాడనుకో...." + +"అదే చెప్తాడు...." అందామె. + +"వద్దు" అంటే ఏమవుతుందో ఆమె ఆలోచించలేదు. పిల్లనివ్వనంటుందా? అలా అనగలుగుతే ఓ పద్ధతి. కాని కూతురేమంటుంది? తమకుండే +అభ్యంతరాలు అమె కుండవని తెలుసు. అయితే ఏ పరిమితిదాకా? ఇష్టపడుతున్న పడుచువానికన్న అతని మెడలోని జంధ్యానికి +ఎక్కువ విలువ నిస్తుందా?--ఏమీ తేల్చుకోలేక పోయింది. + +"ఇవన్నీ ఆలోచించేనోయ్. ఆ స్థితికి నా మనస్సు సర్దుకునే వరకూ కన్యాదానానికి సంకల్పం చెయ్యలేను...." + +"అంతవరకూ కూర్చోనుంటారు." + +"నే నేమీ అనలేదు." + +రామకృష్ణకు ఏమీ తోచలేదు. పెళ్ళి చెయ్యలేనంటారు. మనిషిలో కోపమూ కనబడదు. అయితే.... అనుమానం ....స్పష్టం +చేసుకోవాలనుకున్నాడు. + +"మీకు మనస్సు కుదిరేవరకూ...." + +"కుదురుతుందని నేనూ చెప్పలేను." + +"అంటే?" + +"అది వాళ్ళ ఇష్టం...." + +"అంటే...." + +"ఒరేయ్. నా చేత వాగించకు. ఇంత గ్రంథం నడిపిన వాడివి ఇప్పుడు హఠాత్తుగా తెలుగు భాష అర్థం కాకుండా పోయింది?" + +మళ్ళీ అదే అనుమానం. ఆయన కంఠంలో కోపం లేదు. కాని ఆ మాటేమిటి? + +"అదేం మాటండి, వాడిని కోప్పడతారు? ఇంకా నయం! వాడంటూ పూనుకొని పొత్తు పరుస్తున్నాడనా?"--అంది సత్యవతి నొచ్చుకొంటూ. + +శాస్త్రి నొచ్చుకోలేదు. కోపమూ చూపలేదు. నవ్వేడు. + +"పోనీ వాడు కాదనుకో. ఆ పిల్లలు ఇద్దరూనేనాయె. ఈ నిర్ణయాలకు రాగల వాళ్ళు ఇతరుల ప్రమేయం లేకుండా ముందేం చెయ్యాలో +నిర్ణయించుకోలేరా, నన్నడుగుతే నా అభిప్రాయం చెప్పేను. నా నమ్మకాలు నాకున్నయి. మంచివో, చెడ్డవో వాటినే ఇతరులూ +నమ్మాలనను. నన్నెవ్వరూ శాసించకండి. ఇంక నన్ను బాధించకండి." + +ఇంతసేపటికి రామకృష్ణ తనకు అర్థం అయిందనుకున్నాడు. "రిజిష్టర్డ్ పెళ్ళి చేసుకోండి. దానికైనా నన్ను పిలవ" ద్దని +చెప్పడం అది. + +"మీ ఇష్టం" అంటూ రామకృష్ణ లేచేడు. + + + + +17 + + +రామకృష్ణ కిందికి వచ్చేసరికి సావిట్లొ ఉమ అతని కోసమే కాచుకున్నట్లుగా కూర్చుని ఉంది. అతడు కనబడగానే లేచి ఎదురు +వచ్చింది. + +"పొద్దుటి నుంచీ ఆలోచిస్తున్నాను. తేలడం లేదు. కాస్త చెప్పు." + +ఏమిటన్నట్లు రామకృష్ణ కనుబొమ్మ లెత్తాడు. + +"చదువు ఒక దశకు వచ్చేక, పెళ్ళికీ, దానికీ పోటీ పెట్టవలసిన పని లేదనుకుంటాను." + +"ఆ మాట ఎందుకు వచ్చింది?" + +"ఎం.డి. చెయ్యాలనుకోవడమే నాన్న అభ్యంతరానికి కారణమయితే...." + +"అలా అని ఎవరు చెప్పేరే చిట్టితల్లీ?"--అని రామకృష్ణ వెక్కిరించేడు. + +"నిజంగానే అంటున్నాను." + +"చదువు మానేస్తానంటే పెళ్ళి చెయ్యడానికి ఎవరూ సిద్ధంగా లేరు." + +"పెళ్ళికోసం తల్లకిందులైపోవడం లేదు. నేనేం." + +"నే నన్నానా ఆ మాట?" + +"మరి నీ మాట కర్థం ఏమిటి?"--ఉమ నిలదీసింది. + +"అదే మాటని ప్రశ్నార్థకంగా మారుస్తే నీకు అర్థం అయ్యేది. రెండేళ్ళ అనంతరమే కాదు. నాలుగేళ్ళ తరవాత కూడా ఈ పెళ్ళి +మాట ఎత్తవద్దంటే చదువుతూనే ఉంటావా?" + +తన మనస్సులో కలిగిన నిరాశని ఉమ పైకి తెలియనివ్వలేదు. "అయితే ఆయన్ని పంపెయ్యి." + +రామకృష్ణ కృత్రిమాశ్చర్యం కనబరిచేడు. "అదేమిటి? ఆయన ఏవో ట్రైనింగనీ, ఉద్యోగమనీ ఏవేవో అంటున్నాడనుకొన్నానే. +అవన్నీ మానేసి నాన్న దగ్గర శబ్దమంజరి పాఠం ప్రారంభించాలనుకుంటున్నాడా?" + +ఉమకి కోమ వచ్చింది. "ఒరేయ్! ఉట్టి సిల్లీగా మాట్లాడకు." + +"లేకపోతే నేను పొమ్మని చెప్పడం ఎందుకు? ఓ రోజో, రెండ్రోజులో...." + +"ఇంకోవారం కూర్చోమను, నాకు పోయిందేంలేదు. నేను పొద్దుటే మెయిలుకి పోతున్నా...." + +"ఉద్దరిస్తావు!" + +మాట పూర్తి చేయకుండానే ఉమ ముఖం వంక చూసి రామకృష్ణ మాట మార్చేడు. + +"ఇదిగో ఉమా! మనకి కావలసిం దేమిటో మనకి తెలిసి ఉండాలి. మనకు కావలసిందానిని సంపాదించుకొనే పట్టుదలా, స్థైర్యమూ, +ధైర్యమూ ఉండాలి." + +అతని మాటలలో ఏదో విశేష ముందని తోచి ఉమ నిలబడింది. + +"నాకు తెలుసు...." + +"అయితే మంచిదే. ధైర్యంగా ఉండు." + +"అంటే...." + +"ధైర్యమంటే ఏమిటంటావా?" + +"ఒరేయ్!" + +"తగ్గు. తగ్గు. అమ్మ ఏమంటుంది. నాన్న ఏమనుకుంటారో. ఇన్నేళ్ళు పెంచి, పోషించి, చదువు చెప్పించి ఇంతదాన్ని చేసేరే, వారి +మాట కాదనేదా? ఇంటికి రావద్దంటారేమో, మళ్ళీ ఎవర్నీ చూడ్డం పడదేమో! ఇలాంటి ఆలోచనలు కట్టిపెట్టడానికి చాలా ధైర్యం +కావాలి." + +ఉమ అతని ఉద్దేశాన్ని గ్రహించింది. కాని దానికి వెనుక నున్న కారణం స్పష్టం కాలేదు. తన చదువూ, భాస్కరరావు కుటుంబ +వ్యతిరేకతా మాత్రమే తండ్రి అభ్యంతరానికి కారణాలని ఆమె ఇంతవరకూ అనుకుంటూంది. కాని ఈ మాటలు వింటే వెనక పెద్ద గ్రంథమే +ఉన్నట్లు తోస్తూంది. ఏమిటో అది? + +"నీ మాటలు కాస్త అర్థమయ్యేలా చెప్పరా బాబు!" + +"నాకు తెలుగూ, ఇంగ్లీషూ తప్ప మరో భాష రాదు. అవి రెండూ నీకు తెలుసుననుకుంటాను"--అన్నాడు రామకృష్ణ ఆశ్చర్యం +అభినయిస్తూ. + +"వచ్చును"--ఉమ ఒప్పుకొంది. "కాని ఈ అబ్‌స్ట్రాక్ట్ కవిత్వం చచ్చినా అర్థం కావడంలేదు." + +"అయితే సరే." + +ఉమ శ్రద్ధగా వినడానికి మళ్ళీ కుర్చీలో చతికిలబడింది. కానీ, రామకృష్ణ అప్పటికేమీ చెప్పదలుచుకోలేదు. + +"నువ్వు చీర మార్చుకుంటావేమో, తయారవు. ఆయనతో చెప్తా. ముగ్గురం ఏ బ్యారేజిమీదకేనా పోదాం." + +ఏదో పెద్ద గ్రంథమే ఉన్నదనుకుంది. మాట్లాడ కుండా లేచి వెళ్ళింది. + +పక్కగదిలో ఉన్న భాస్కరరావు రామకృష్ణ పిలుపుతో గుమ్మంలోకి వచ్చేడు. + +"ఎండ చల్లబడింది ఇంట్లో ఏం కూర్చుంటాం? లేవండి. అలా బ్యారేజీవేపు పోయి వద్దాం" + +"నేను సిద్ధంగానే ఉన్నా నడవండి" అని భాస్కరరావు ముందుకు వచ్చేడు. + +"నా ఆలస్యమూ లేదు. రాండి"--రామకృష్ణ వీధి గుమ్మంవేపు నడిచాడు. భాస్కరరావు తెల్లబోయి నిలబడ్డాడు. ఏమీ ఎరగనట్లు +రామకృష్ణ వెనక్కి తిరిగిచూసి "ఆగిపోయేరేం? మంచినీళ్ళు ఏమన్నా కావాలా?" అని ప్రశ్నల వర్షం కురిపించేడు. + +భాస్కరరావు సిగ్గుపడి నసిగేడు. చేత్తో జేబు తట్టుకున్నాడు. + +"ఓహో నిన్న ఉమ కిచ్చారా?" రాత్రి ఇంటికి వస్తూనే పర్సూ, జేబులో వస్తువులూ టేబులు మీద పడెయ్యక ఉమ చేతి కివ్వమని +తానే చెప్పేడు. + +"పోనీండి. అదేం పనిలో, ఎక్కడ ఉందో రాండి నా దగ్గరుంది." + +ఈమారు భాస్కరరావు నసగలేదు. "ఇదేమిటి లెండి. ఆమె నడిగి తీసుకొనే వెడదాం." అన్నాడు ఖండితంగా. + +"అయితే ఉమని." + +"ఆమె కూడా వస్తారేమో అడుగుదాం." + +రామకృష్ణ ఏమనేలోపున ఉమ వచ్చేసింది. అన్నగారి వేపు చూసి, ఆశ్చర్యంతో--"నువ్వింకా ఇలాగే ఉన్నా వేమిటి? అమ్మ +పిలుస్తూంది. ఎందుకో...." అని కబురందించింది. + +"ఔను. మరిచేపోయేను." అంటూ రామకృష్ణ హడావిడిగా ఇంట్లోకి పరుగెత్తేడు. + +ఉమ పర్సును భాస్కరరావుకు అందిస్తూ--"చూసుకోండి. విడిగా ఉన్న చిల్లరా, తాళంచెవీ అందులోనే పడేశాను" అంది. + +పర్సు జేబులో పెట్టుకుంటూ--"నువ్వుకూడా రారాదూ, అలా తిరిగి వద్దాం" అన్నాడు. + +"మన ఇద్దరితో ఏదో మాట్లాడాలన్నాడు అన్నయ్య." + +"నన్ను ఒక్కణ్ణే బయలుదేరమని ఉంగిడెత్తించేసేరేం మరి." + +తన్ను ఆట పట్టించినట్లు అర్థం అయి భాస్కరరావు నవ్వేడు. ఉమ వంత కలిపింది. + +"అతడితో వచ్చిన ఇబ్బందే అది. నిజమేదో, హాస్యమేదో అర్థం కాదు. వేళాకోళం చేస్తూ నిజమనిపించేటంత గంభీరంగా ముఖం +పెడతాడు." + + + + +18 + + +ఇంటికి వచ్చేక కూడా రామకృష్ణ తమ సంప్రదింపుల పర్యవసానం ఏమిటో ఏమీ చెప్పలేదు. చంద్రశేఖరశాస్త్రి ఆ ప్రసంగమే +తేలేదు. రెండో కొడుకు కార్యదక్షత మీద ఆయన కెంతో నమ్మకం. + +కాని, తల్లి పట్టలేక అడిగేసింది. + +రామకృష్ణ తొణకకుండా సమాధానం యిచ్చేడు. "అమ్మా! యింక మీరు దానికి పెళ్ళి చెయ్యగలుగుతారనుకోను. తెలివితేటలూ, సాహసము +ఉంటే తెగబడి అదే చేసుకుంటుంది. లేకపోతే మీ దివ్య సన్నిధిలో పడుచుదనం వెళ్ళదీస్తుంది. తరవాత దాని ప్రారబ్దం!" అని +చెయ్యి విదిలించి లేచిపోయేడు. + +సత్యవతి నిర్ఘాంతపోయింది. మగణ్ణి నిలదీసింది--"ఏమిటి మీ ఉద్దేశ్యం?" + +శాస్త్రి తన ఉద్దేశ మేమిటో చెప్పలేదు. కాని, బోలెడంత దిలాసా మాత్రం ఇచ్చేడు. తన అభిప్రాయం ఏమిటో రామకృష్ణ +గ్రహించేడు. వ్యవహారం అతడే చక్కపరుస్తాడని ధైర్యం. ఆ ధైర్యంతోనే భార్యకు సర్ది చెప్పబోయేడు. కాని, ఆమెకు ఆ ధైర్యం +కలగలేదు. + +భాస్కరరావు వెళ్ళిపోతూ సెలవు తీసుకొంటూంటే మాత్రం దుఃఖం వచ్చింది. + +"అత్తయ్యగారూ!" అని నోరారా పిలిచి సెలవు తీసుకొంటూంటే ఆమె కళ్ళ నీళ్ళు తిరిగేయి. డగ్గుత్తికతో ఆశీర్వదించింది. + +"దయ ఉంచండి." అని అతడూ కదిలేడు. + +రిక్షాలో కాలు పెడుతూ అతడు ఉమ వేపు చూసిన చూపు నామె మరిచిపోలేననుకొంది. + +ఉమ కూడా ఏదో పోగొట్టుకొన్నట్లు రోజంతా పరధ్యానంగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఆమెను చూస్తూంటే తల్లి ప్రాణం +కొట్టుకుపోయింది. కౌగలించుకుని ఏడ్చింది. అంతలో కళ్ళనీళ్ళు తుడిచేసుకుంది. + +"ఏమే అమ్మా! చదువుకున్న దానివి. ఈ దిక్కుమాలిన ఆచారాలు తలా తోకా లేకుండా ఇలాగే ఉంటాయి ఎందుకు వెనకతీసేవే తల్లీ!" +అంది సత్యవతి. + +"మరేం చేయమంటావు? మీ రిద్దరూ కూడా రాకుండా పెళ్ళెందుకు చేసుకోడం? ఆయనా అదే అన్నారు. ఏదో ఒకవైపు వాళ్ళకి అనిష్టమయితే +సర్దుకోగలమనుకొన్నాము. అందర్నీ బాధపెట్టిన ఈ పెళ్ళికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి 'ప్రేమపాశం' ముగింపు రాకూడదు. +కాస్త యిబ్బంది వస్తే ఆదుకునే వాళ్ళు లేకుండా చేసుకోవడంలో అర్థం లేదు--అన్నారు. నాకూ అదే అనిపించింది. పోనీ, నాన్న +ఆగమన్నది రెండు మూడేళ్ళే కదా అనుకున్నాం." + +సత్యవతి నిర్ఘాంతపోయింది. ఇటీవలి కాలంలో చదువుకున్న ఆడపిల్లలూ, మగపిల్లలూ పెద్దవాళ్ళని ధిక్కరించి, స్వతంత్రించి +పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఆమె అనేకసార్లు ఇవే వాదాలతో నిరసిస్తూ వచ్చింది. + +"పెళ్ళి అన్నది అందరూ మెచ్చేదిగా ఉండాలి. అందరికీ సంతోషం కలిగించాలి. ఇంతప్పటి నుంచి నానా కష్టాలూ పడి పెంచుతారు. +కాస్త నలత వచ్చిందంటే నిద్రాహారాలు మాని గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తారు. అప్పులూ, సప్పులూ చేసి చదువులు +చెప్పిస్తారు. ప్రయోజకుల్ని చేస్తారు. ఈ కష్టానికా ఈ శిక్ష" అని తాను వాదించేది. + +తన కొడుకులలో రామకృష్ణ అందరికన్న గట్టిగా ఎదురు వాదించేవాడు. + +"కాపురం చేయవలసిందీ, కలిసి జీవించవలిసిందీ వాళ్ళమ్మా!" అని అతడు ఎదుర్కొనేవాడు--ఆ మాట జ్ఞాపకం వచ్చింది. + +"చిన్నన్నయ్య ఎందుకూరుకున్నాడు? వాడేమన్నాడు?" + + ఉమ ఉదాసీనంగా సమాధానం యిచ్చింది-- "ఏమీ అనలేదు. నాన్నలాగే వాడూ దాచేసేడు. మీ యిష్టం! నేనేం చెప్పేది లేదు +అనేసేడు." + + + + +19 + + +సత్యవతమ్మకు ఆ మాట విన్నాక ధైర్యం కలిగింది. రామకృష్ణ అలా అన్నాడంటే ఇదంతా అబధ్ధమేనని ఆమెకు అనిపించింది. + +కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కులం, మతం, సంప్రదాయాలూ ధిక్కరించి పెళ్ళి చేసుకునే వాళ్ళందరికీ రామకృష్ణ కొండంత ఆసరా. +పినతండ్రి కొడుకు శాఖాంతర వివాహం చేసుకోవడానికి అతడి సలహా. మేనత్త కూతురు కులాంతర వివాహం చేసుకోడానికి వాని సాయం +కోరింది. దాని మీద నాలుగేళ్ళక్రితం నడిచిన వాదోపవాదాలు ఎన్నటికీ మరవలేదే! + +"పిల్లలకు ఇష్టం కాని సంబంధాలను తల్లిదండ్రులు మాత్రం ఎందుకు చూస్తారేం?" అంది తాను ఓమారు. + +"పెళ్ళి అన్నప్పుడు ఎన్ని చూడాలి? కులం, గోత్రం, కుటుంబం, సంప్రదాయం, పరువులు, ప్రతిష్ఠలు, రోగాలు, రొచ్చులు--ఎన్ని +చూడాలి. పిల్లవాళ్ళు అంత ఆబ్జెక్టివ్‌గా, ఇంపెర్సనల్‌గా చూడరు. సెంటిమెంటల్‌గా ఆలోచిస్తారు" +అని శాస్త్రి వాదం. + +మిగిలిన పిల్లలంతా ఊరుకున్నారు. కానీ రామకృష్ణ ఒప్పుకోలేదు. పేర్లు మారినా ఒకే తరహా ఉదాహరణలు. తల్లిదండ్రులే +కుదిర్చిన పెళ్ళిళ్ళలో తనకు కనిపించినవో, కనిపించా యనుకున్నవో లోపాలు ఏకరువు పెట్టేశాడు. + +వెంకమ్మ ముఖం గుండ్రంగా ఇత్తడి సిబ్బిలా ఉండడం, పిచ్చమ్మ పేరు బాగుండక పోవడం, రామశాస్త్రి సన్నికల్లు పొత్రంలా +కుదిమట్టంగా అడ్డం బలిసి ఉండడం, రాఘవయ్య గెడకర్రలా పొడుగ్గా ఉండడం, సత్యనారాయణ తండ్రిని అమ్మా, ఆలీ బూతులు +తిట్టగలగడం--అన్నీ అతని వాదానికి బలకరాలే! ఎన్నో పేర్లు, ఎన్నో ఉపమానాలు, ఈసడింపులు, అనిష్ఠాలూను! + +"ఆ లోపాలు ఆ జంటలకు కనబడలేదు. సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు" అన్నారు తామిద్దరూ కూడా. + +"ఏం చేస్తారేమిటి? ఇంతే పెట్టి పుట్టాం కాబోలురా భగవంతుడా అని పెద్దవాళ్ళు చేసిన పనికి ఏడ్చి సరిపుచ్చుకుంటున్నారు" అంటూ +వెంకమ్మ, పిచ్చమ్మల భర్తల తరపున రామకృష్ణ తన బాధ ఒలకపోశాడు. + +తామిద్దరూ అతని అభినయం చూసి నవ్వకుండా ఉండలేకపోయారు. + +"మరైతే ఈ అడ్డతలల ఆడపిల్లలూ, సన్నికల్లు పొత్రం మగపిల్లలూ ఏమైపోవాలి." + +రామకృష్ణా నవ్వేశాడు. "ఈ అవకరాల పిల్లల కన్నెచెరలూ, బ్రహ్మచర్య వ్రతాలు విడిపించడం కోసమే దీక్ష పట్టినట్లు +మాట్లాడుతా వేమిటమ్మా? అలా అయితే ఈ ప్రేమ వివాహాల జంటలన్నీ రంభా-నలకుబేరులూ, రతీ-మన్మథులూనా ఏమిటి? వాళ్ళలోనూ +అవకరాలకు లోటా?" మళ్ళీ ఓ అరడజనుసార్లు వాళ్ళ జంటల్లో తనకు నచ్చని గుణగణాల వర్ణనా. + +'వాణ్ణి వాదాల్లో ఒప్పించగలగడం బ్రహ్మతరం కా'దనుకుంది తాను. మళ్ళీ తానే అన్నిటికీ అన్నీ చెప్పాడు. + +"నాకు అవకరంగా కనిపించినవి అందరికీ అలాగే అనిపించనక్కర్లేదు. ఎవరి ఆలోచన, ఇష్టం వాళ్ళవి. అదీగాక వాళ్లనే కోరి +చేసుకునే వారికి నాకు కనిపించిన అవకరాల్ని కనబడనియ్యని బలమైన లక్షణా లేవో కనిపిస్తాయి. 'తాను వలచింది రంభ--తాను +మునిగింది గంగ' అన్నమాట పుట్టింది అందుకే. అందుచేతనే ఆ ఎన్నికేదో వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే సర్దుకుంటారు. అలా కాదని ఏ +నాబోటి గాణ్నోసలహా అడుగుతేనూ, పెద్దరికం ఇస్తేనూ..." + +"ప్రతి చిన్నదానికీ సమష్టి చర్చలూ, సమష్టి నిర్ణయాలూ, సమష్టి బాధ్యతలూ కావాలనేవాడివేనా?" అంటూ శాస్త్రి కొడుకు +రాజకీయ దృక్పథాన్ని వేళాకోళం చేశాడు. + +రామకృష్ణ నవ్వాడు. + +"నవ్వక ఏం చేయమంటారు? తేడా తెలియకనేనా మీరా మాట అన్నది?" + +ఒక్క నిముషం ఊరుకుని, మళ్ళీ తానే పూర్తి చేశాడు. "మందికి సంబంధించిన విషయాలలో మేము సమష్టి చర్చలు జరగాలంటాం. మీకో, +నాకో తోచిన పద్ధతిని నిర్ణయించేసేసి, అగ్నిహోత్రావధానుల భాషలో 'తాంబూలాలు ఇచ్చేశాను. తన్నుకు చావండి' అంటే కుదరదంటాం. +అదీగాక ఇక్కడ కూడా ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళిద్దరినీ కూర్చుని ఆలోచించుకోనివ్వాలంటున్నాం కాని, మరొకటి కాదే! +భారత--పాకిస్తాన్‌లు వ్యవహారాలలో మూడోవాళ్ళ జోక్యం పనికిరాదని ఇందిరా గాంధీ అనలేదూ? అంతే!" + +"ఆ సమస్య వాళ్ళిద్దరిదే కాదోయ్! రెండు కుటుంబాలకీ, వాటి ప్రతిష్టలకీ సంబంధించినది. నువ్వు చెప్పినట్లే పోనీ పిల్లల +పెళ్ళి సమస్య రెండు కుటుంబాల సమష్టి సమస్య అని ఎందుకనుకోవూ!" అన్నాడు శాస్త్రి. + +అయినా రామకృష్ణ తగ్గలేదు. ఒక్కక్షణం సందేహించాడు. అంతలో దృఢం చేసుకున్నాడు. "పెళ్ళి అయిన మరుక్షణం నుంచి కొత్త జంట +కుటుంబం వేరు. అంతక్రితం తామున్న కుటుంబాల నుంచి వారు విడిపోతారు. వాటితో ఏమన్నా సంబంధాలు మిగిలినా అది ఐచ్ఛికమూ, +తాత్కాలికమూను. మన కుటుంబమే దానికి సాక్ష్యం." + +శాస్త్రి ఆలోచించాడు. "తర్కం దృష్ట్యా అంతేననుకో." + +కాని సత్యవతమ్మ 'అటువంటి పరిస్థితికి కారణాలు వేరు' అంటుంది. "అందుకేరా, కుటుంబాలు దూరం అయిపోతాయనే దగ్గర వాళ్ళను +ఏరుకోవడం. మేనరికాలూ, అవీ ఎందుకు వచ్చాయంటావు?" + +"ఒదిన మీ అన్న కూతురే ననుకుంటా?" + +సత్యవతమ్మ పెద్దకొడుక్కి మేనరికమే చేశారు. అయితే ఆ అమ్మాయి అత్తవారింటికి వచ్చినా, అత్తవారి వాళ్ళు తన ఇంటికి +వచ్చినా, హిస్టీరియా ఫిట్స్ వచ్చేస్తాయి. ఆమె బాధ చూడలేక కుటుంబంలో ఎవరూ కాకినాడ, రామారావు పేట పొలిమేరల్లోకి కూడా +వెళ్ళరు. ఆ కొడుకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. + +సత్యవతమ్మకి మాట తొణకలేదు. + +రామకృష్ణే మళ్ళీ ప్రారంభించాడు--"అనేక కారణాల చేత మీరు వివాహాల విషయంలో మీ పట్టుదలలు సడలించుకోవాలమ్మా! వెనకటల్లే +పిల్లలు ఆ విషయంలో మీ పెద్దవాళ్ళ సాయం మీద ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. ఎవరన్నా అమాయకులు "అమ్మా! +పెళ్ళే" అంటే. "నీకు కావాలసిన దాన్ని మచ్చిక చేసుకోరా, బాబీ!" అని చెప్పి పంపిన రోజులు వచ్చాయి. ఏమంటే ఈనాటి +అవసరాలు వేరు, మీ కాలంనాటి అవసరాలు వేరూనూ. మీ రోజుల్లో పెళ్ళి చేస్తామురా నాయనా అంటే మొండికేసి చదువుందనీ, ఉద్యోగం +రానీ, స్థిరపడనీ, ఫలానా పిల్ల--ఫలానా లక్షణాలు గల పిల్ల అని కాదు సుమండీ, వాడే చూపిస్తాడు. ఫలానా పిల్ల +మాత్రమే కావాలనీ అడ్డం వేసే కుర్రాళ్ళుండేవారేమో ఆలోచించండి." + +"అలాంటి వాళ్ళెంద రున్నారులే. ఏ నీబోటి గడుగ్గాయో తప్ప!" అని చంద్రశేఖర శాస్త్రి కొడుకుని డెకారించాడు. + +"ఎందరో ఉండరు. కాని, మనం ఈ సమస్యనింతగా చర్చించవలసి రావడమే నేను ఒంటరిగాణ్ని కానని అర్థం అవడంలేదా, +నాన్నా?" + +ఈ చర్చలు అనంతం. పిల్లలు నలుగురూ ఇంటికి వచ్చారంటే ఏదో రూపంలో పునరావృతం అవుతూనే వుండేది. + +తర్కానికైనా శాస్త్రి కొన్ని సందర్భాలలో సర్దుకునేవాడు. కాని సత్యవతమ్మ తల్లి ప్రాణం అంగీకరించేది కాదు. పిల్లలు +విడిపోవడం, దూరం కావడం అన్నదే ఆమెకు ఇష్టం కాదు. దూరంగా ఉంటున్నారంటే సమాజ గతిలో భాగంగా అంగీకరించేది కాదు. అమె +ఆప్యాయతలనూ, అనుబంధాలనూ ఆచారాలతో మేకుబందీ చేసుక్కూర్చుంది. + +కాని, ఆనాడు కూతురు ముఖం చూశాక ఆమె ఆలోచనలో పడింది. ఆలోచనలో కన్నా ఆత్మ పరీక్షలో పడిందనవచ్చు. చివరకు మళ్ళీ +అనుబంధాలే జయించాయి. ఆచారల మేకుబందీని పీకేయడానికి ఒప్పుకుంది. + +ఆమె ప్రోత్సాహాన్ని కూతురు చాలా నిరుత్సాహంతోనే ఆమోదించింది. + +"సరేలే!" + + + + +20 + + +శాస్త్రికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. సత్యవతమ్మకు ఆవేశం కన్నా వ్యవహార జ్ఞానం ఎక్కువ. ఆమె చెప్పిన పూర్వ +కథలన్నింటికన్నా ఇచ్చిన సలహా శాస్త్రిలో ఊపిరి పోసింది. + +"హఫీజ్ మహమ్మదును కలుసుకుని, ఇదంతా ఏమిటో తెలుసుకోండి." + +కటిక చీకట్లో పడి ఉన్న వాడికి కాంతిరేఖ కనబడినట్లయింది. + +"ఎంత పని చేశాడు ముసిలాడు: పెట్టిన చెయ్యి నరకడమంటే ఇదే... కృతఘ్నుడు!" + +ఈ శుభలేఖ రచనలో హఫీజ్ మహమ్మదు పాత్ర ఏమిటో, ఎంతటిదో తెలియకపోయినా ద్వేషనిరూపణకు ఒక దారి దొరికింది శాస్త్రికి. +ఒక్క నిముషం ఆగి, తన ఆలోచనను పూర్తిచేశాడు - + +"ఏం చేసినా పాపం లేదు!" + +సత్యవతమ్మ గట్టిగా నొక్కి చెప్పింది. "ఇదే నిజమయితే మన చేతులు దాటి పోయిందనుకోవాలి. అబద్ధమైతే అల్లరి చేసుకుని +ప్రయోజనం లేదు. ధైర్యంగా...." + +శాస్త్రికి లేనిదే ఆ ధైర్యం. సహజంగా ఆయన శాంతుడు. కాని కోపం, ఆవేశం వస్తే ఉగ్రనరసింహం. ఈ విషయంలో హఫీజ్ +మహమ్మదుకు ప్రసక్తి ఉందనిపించేనా ఆ ముసిలాడి పీక నులిమేస్తాడు. + +"తర్వాత ఏ మషయీది!" + +మనసుకి అనుమానం అన్నది కలగకపోవాలే గాని, ఒకమారు అది ప్రవేశించిందా--ఎక్కడెక్కడి ఘటనలనూ దానికి సరిపుచ్చే +అసాధారణ శక్తి దానికుంది. అంతలో కాదేమో అన్న సందేహమూ వస్తోంది. + +"అలాంటి ద్రోహం చేస్తాడా?" + +తానాతని కుటుంబానికి చేసిన సహాయమూ, ఉపకారమూ మరచిపోయాడా? + +చంద్రశేఖర శాస్త్రి పని చేస్తున్న కంపెనీ యజమాని హఫీజ్ మహమ్మద్ బాగా వయసు చెల్లినవాడు. ఆయన దగ్గర రమారమి +నలభయ్యేళ్ళ క్రితం సాధారణ గుమాస్తాగా ప్రవేశించిన శాస్త్రి ఈ వేళ ఆ కంపెనీ జనరల్ మేనేజరు. ఆ హోదా కన్న మిన్నగా +హఫీజ్ మహమ్మదుకు శాస్త్రి మీదే గట్టి నమ్మకం, అభిమానం, గౌరవమూను. అదో చిత్రమైన పరిస్థితులలో ఏర్పడింది. + +భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న కొత్తలో హఫీజ్ మహమ్మదు పెద్ద భార్య, కొడుకులు ముగ్గురూ నిజాం సంస్థానంలోకి +చేరుకున్నారు. ముస్లిం సంస్థానపు అస్తిత్వాన్ని కాపాడేందుకు నడుం కట్టిన కాశిం రజ్వీకి ప్రధానులైన సర్దారులుగా పనిచేశారు. +వారిలో ఒకరు బీబీ నగరంలో దురంత చర్యలు జరిపిన రజాకారు దళం నాయకుడు అంటారు. + +పోలీసు చర్య కాలంలో ఆ ముగ్గురూ హైదరాబాదు నుంచి ఎకాయెకి కరాచీలో అడుగు పెట్టారు. తన ఆస్తిలో వారి వాటాగా హఫీజ్ +మహమ్మదు అందినంత డబ్బు పోగుచేసి వాళ్ళకిచ్చేశాడు. దానికి ఫలితంగా నాలుగైదేళ్ళ పాటు వ్యాపారమూ దెబ్బతింది. ఓ ఏడాదిపాటు +ఆయన జైలు జీవితమూ చవిచూడవలసి వచ్చింది. + +ఆ కష్టాలకు నిలబడ్డాడే గాని వ్యాపారం అమ్ముకుని పాకిస్తాను పోవాలనే సలహాలను ఆయన చెవి చొరనివ్వలేదు. తన మూడో +భార్య తాలూకు మనవడిని తల్లీదండ్రీ లేని నాలుగేళ్ళ పసికూన అసదుల్లాను మేనమామలు తన దగ్గరుంచుకుంటామన్నా పంపలేదు. + +కుటుంబమూ, కంపెనీ చాలా చిక్కుల్లో ఉన్న నాలుగైదేళ్ళూ శాస్త్రి ఎంతో మెలుకువా, శక్తి సామర్థ్యాలూ చూపి వాటిని నిలబెట్టాడు. +ఆయన మీద వ్యాపారం వదిలినందుకు హఫీజ్ మహమ్మదుకు విచారించవలసిన అవసరం కలగలేదు. + +అవన్నీ గుర్తు చేసుకుని శాస్త్రి మళ్ళీ ఆక్రోశించాడు. + +"నాకేనటయ్యా ఇంత అపకారం తలపెట్టడం?" + +సత్యవతమ్మకు ఆయన మీద అనుమానం రావడంలేదు. + +"ఆయన ఎరిగుండకపోవచ్చు నండీ! ఇందులో ఏదో మెలిక ఉంది. వెళ్ళి మాట్లాడి రండి." + +అదీ నిజమేననిపిస్తోంది శాస్త్రికి. తమ ఇద్దరికీ మధ్య యజమాని--ఉద్యోగి సంబంధాలనూ, వయోభేదాల్ని మించిన ఆప్యాయత +ఏర్పడింది. మత భేదం, భాషా భేదం ఉన్నా ఇద్దరూ పరమమిత్రులయ్యారు. కొడుకులు తన్ను వదిలిపోయిన విచారాన్నీ మానసిక +వ్యథనూ చెప్పుకునేందుకు ఆయన శాస్త్రినే ఎన్నుకున్నాడు. ఎన్నో జీవిత రహస్యాలను ఆయనకు చెప్పుకుని ఊరట పొందేవాడు. + +మా తాత లక్నో నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన తండ్రి ఢిల్లీ దర్బారులో ఉండేవారట. ఆయనకు ఏడెనిమిది తరాల పూర్వీకులు +కుర్దిస్తాన్ నుంచి వచ్చారట." అంటూ ఆయన తరచూ చెప్పుకునేవాడు. + +అయితే వాళ్ళు ప్రభువులుగానో, బానిసలుగానో, వర్తకులుగానో బతికారు. సంపదలు గడించకపోయినా మర్యాదస్తులనిపించుకున్నారు. + +తన పూర్వులీ దేశానికి వచ్చి మూడు వందలేళ్ళయింది. తెలుగు దేశానికి వచ్చే నూరేళ్ళు పైనయింది. హఫీజ్ మహమ్మదు, ఆయన +కొడుకులు, కూతుళ్ళు, మనుమలు అంతా తెలుగుదేశంలోనే పుట్టారు. ఇస్లాంపేటలో ఇప్పుడున్న పెద్దమేడ, పార్కు వీధిలో ఉన్న పెద్ద +ఎగుమతి--దిగుమతి వ్యాపారం, నాలుగైదు లక్షల బ్యాంకు నిల్వలు--ఇవన్నీ తెలుగుదేశంలో ఉండి సంపాదించుకున్నవే! + +"నూరేళ్ళ నుంచి తెలుగుదేశంలో ఉన్నాం కాని తెలుగువాళ్ళం కాలేకపోయాం. ఆఖరుకి పది పన్నెండు తరాలుగా బతుకుతున్నా భారతదేశం మా +దనుకోలేకపోయాం" పాకిస్తాన్ చేరిన కొడుకుల్ని తలచుకుని బాధపడేవాడు. + +"శాస్త్రీజీ! రజాకారు గొడవల తరువాత కూడా ముస్లిములు తెలుగుదేశంలో నిరపాయంగా ఉండగలుగుతున్నారు. మరో, మరో రాష్ట్రం +అయితే రజాకారు దుండగాల వంటివి జరిగినాక, నెహ్రూ ప్రభుత్వం ఎంత తన్నుకున్నా సామాన్య ముస్లిం కుటుంబం బతుకు ఇంత నిరపాయంగా +ఉండేది కాదు." + +అది మెరమెచ్చు మాట కాదు. హృదయంలోంచి వచ్చింది కాని. ఆయన తాను తెలుగు నేర్చుకోసాగాడు. మనుమడు అసదుల్లాని తెలుగువాడుగా +తీర్చిదిద్దాడు. + +శాస్త్రి ఆ వృద్ధ మిత్రుని ప్రయత్నాన్ని అభినందించాడు. అసదుల్లా హైస్కూలు తరగతుల్లో సంస్కృతం తీసుకోదలచినప్పుడు ఆ +క్లాసు టీచరు నిరుత్సాహపరిచాడు. కాని తనే హుషారు చేసాడు. + +"ఏం భయం లేదు. నీకు కష్టం తోస్తే నా దగ్గరకు రా! నే చెప్తా!" అని భరోసా ఇచ్చాడు. + +ఆ అభయప్రదానం అసదుల్లాను తన కుటుంబం మధ్యకు తెచ్చింది. అంతవరకూ తన కొడుకులతో అతనికున్న స్నేహం సినిమాలూ, వినోద +విహారాల వరకూ మాత్రమే పరిమితం కాని. + +అంతే కాదు. + +ఆనాడిచ్చిన హుషారు తరువాత తన్నే ఇరుకున పెట్టింది. అయినా విచారపడలేదు. + +ఈనాడు విచారం కాదు, బాధ! + +"ఏమిటిది? ఎందుకిలా అయింది?" అని అంగలార్చాడు. + + + + +21 + + +"కానలేకపోయాను. తురకాడికి సూత్రభాష్యం ఏమిటని కానలేకపోయాను" అన్నాడు. + +తానెంత చెప్పినా ఆ శుభలేఖ నిజమైనదే అనే అనుమానం మగని మనసు నుంచి పోవడం లేదని సత్యవతమ్మకు అర్థమయింది. + +"మనవాళ్ళు ఇంగ్లీషూ, మరో భాషా చదువుకోగా లేనిది, తురకాడికి సంస్కృతం పనికిరాదా ఏమిటి? మీరూ, మీ అనుమానాలూను!" + +సత్యవతమ్మ ఇదే మాటతోనే ఆనాడు అటువంటి అసాంప్రదాయికపు పనికి ఒప్పించిందని శాస్త్రికి గుర్తుకు వచ్చింది. + +"ఇలా సమర్థించే కొంప నిక్కడికి తెచ్చారు" అని శాస్త్రి 'గయ్' మన్నాడు. + +పండితరాయల ఉదాహరణ నిచ్చి శాస్త్రే తన కాళ్ళకు బంధాలు వేసుకున్నా అప్పుడు గుర్తు చేయడానికి సత్యవతమ్మ సందేహించింది. +నవ్వి ఊరుకుంది. + +శాస్త్రికి తాను పుట్టిన ఊరు ముంగండంటే వెర్రి అభిమానం. ఆ ఊరు ప్రసక్తి వచ్చినప్పుడు ఏమాత్రం నిగ్రహించుకోలేడు. +శివాలెత్తిపోతాడు. ఎదుటివాడికి విసుగు కలుగుతుందేమోననే ఆలోచన కూడా రాదు. కొబ్బరి, అరటి తోటల మధ్య, తూర్పు +పడమరలుగా, దక్షిణోత్తరాలుగా వెళ్ళే రెండు రోడ్లకీ సంఖ్యానది అనే గోదావరి పాయ [ఇప్పుడిది మురుగు కోడుగా +ఉపయోగిస్తోంది]కీ మధ్య ఉన్న ముక్కోణాకారపు వైశాల్యంలో తీర్చిదిద్దినట్లు కట్టిన ఊరు. విశాలమైన వీధులు. పెద్ద +మంచినీళ్ళ చెరువు. చెరువు గట్టు మీద రావిచెట్టు నీడలు. ఆ నీడల్లో వారాల విద్యార్థుల వ్యాకరణ పఠనలూ, వేదఘోషలు. +పండిత పరివేష్ఠనలు. తాను విన్నవి, చూసినవి ఇంకా ఏ మార్పూ లేకుండా అదే విధంగా కొనసాగుతున్నట్టు చెప్పుకుపోతాడు. +మురిసిపోతాడు. కొత్తగా ఆ ఊరు చూసి వచ్చిన వాడికి అదంతా వట్టి కోతలుగా కనిపిస్తుందేమోనన్న అనుమానం కూడా ఉండదు. ఆ +సంగతులు చెప్పేటప్పుడు ఆయన ముఖాన కనిపించే దీప్తీ, కళ్ళలో అగుపించే మిలమిలలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. + +హఫీజు మహమ్మదు బహు తెలివిగా శాస్త్రి బలహీనతను ఉపయోగించుకొని, ముందుకాళ్ళకు బంధం వేశాడనీ, నోరు మెదపకుండా చేశాడనే, +శాస్త్రే ఎన్నోమార్లు తన వృద్ధ మిత్రుని కుట్ర బుద్ధికి తార్కాణం చూసి గలగలా నవ్వాడు--ఈ ఏడాదీ ఈ మధ్య కాలంలో. +హఫీజు కూడా తన కొంటి ఎత్తులు తలుచుకుని విరగబడి నవ్వాడు. + +ఒకరోజున మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా హఫీజు మహమ్మదు ప్రశ్నించాడు "శాస్త్రీ సాబ్ ముంగండ +ఎక్కడుంది?" + +"కోనసీమ నడిబొడ్డులో ఉన్న ఊరు. అంత అందమైన ఊరును మీరెక్కడా చూసి ఉండరు." + +హఫీజు ఎంతో ఆనందం కనబరిఛాడు. + +"ఆ, అలాగా!"లతో శాస్త్రికి బాగా పురి ఎక్కించాడు. ఒకమారు అటువంటి ఊరును చూడవలసిందే నన్న దృఢ నిశ్చయం తెలిపాడు. + +"తప్పకుండా, దానిదేముందీ? నాలుగు రోజులు వెసులుబాటు చూసుకుని కారులో పోయొద్దాం." + +"జగన్నాథ పండితరాయలది ఆ ఊరేనట కదా! ఆయన పుట్టి పెరిగిన ఇల్లో, కనీసం దాని గుర్తుగా ఓ దిబ్బో ఏమన్నా +ఉన్నాయా?" + +జగన్నాథ పండితరాయలు పేరు చెప్తే ముంగండ వాళ్ళ నాలిక కథాకళి నృత్యమే చేస్తుంది. ఆయన్ని గురించి ప్రచారంలో వున్న కథలు +నిజమయి, ఆయన జీవితం అలాగే సాగి ఉంటే, ఆ మహా పండితుడు బతికి తన ఊరు రావడం సాధ్యమే అయితే, ఆయన కీవేళ +ముంగండలో మంచినీళ్ళయినా పుట్టవు. అయితే ఆయన చచ్చిపోయే రమారమి నాలుగు వందల ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన తిరిగి వచ్చి +మంచినీళ్ళు అడిగే ప్రమాదం ఏ మాత్రం లేదు. + +కనుక వాళ్ళు ఆయన అనాచారాల్నీ, వెకిలి పనుల్నీ గొప్పతనంగా వర్ణించి ఆనందించగలుగుతున్నారు. ఆ విషయంలో శాస్త్రి శుద్ధ +ముంగండవాడు. + +"పండితరాయలది ముంగండ అనడమే గాని, ఆయన వంశం వాళ్ళమని చెప్పుకొనే వారెవ్వరూ లేరక్కడ. ఆయన ఇంటిపేరుతో కొన్ని +కుటుంబాలున్నాయి. కాని, ఆయన ఇల్లు ఇక్కడుండేదని చెప్పే ఓ మట్టి దిబ్బయినా లేదు" అని నిజం జెప్పేశాడు శాస్త్రి. అయితే +పండితరాయల్ని గురించి కథలు చెప్పడానికి ఇవేవీ ఆటంకం కావు. + +అచ్చ తెనుగులో చెప్పవలసివస్తే "ఈ తురక పిల్లని పక్కలోకి తెచ్చుకొంటేనా?" అంటూ లొట్టలు వేయడంగానే భావించవలసిన +అనౌచిత్యాన్ని రాగయుక్తంగా సంస్కృత శ్లోకంలో శాస్త్రి వినిపిస్తాడు. + +ఆ ముస్లిం పడుచు కోసం ఆయన తోడి పండితుల్ని వ్యతిరేకం చేసుకున్న కథలు వినిపిస్తాడు. + +హఫీజు మహమ్మదు హుక్కా పీలుస్తూ కన్నులరమోడ్చి శాస్త్రి చెప్తున్న కథలన్నీ విన్నాడు. ఆ గాధల్లో వినిపించే +రసికతకుగాక, వినిపించే మానవతకు జోహారులర్పించి, ప్రసంగాన్ని తనకు అవసరమైన ధోరణికి మళ్ళించాడు. + +"మహా జ్ఞానులు! మత భేదాలకూ, కుల భేదాలకూ వెనుక వున్న మానవతను వారు మరవలేదు." + +చంద్రశేఖర శాస్త్రి ఒప్పుకున్నాడు. + +"మనుష్యుణ్ణి తెలిసేందుకు సంకేతంగా ఒక్కొక్క భాష ఒక్కొక్క పదాన్ని ఎన్నుకొంది. 'మేన్' అన్నా 'మానవ!' అన్నా, +‘ఆద్మీ' అన్నా మనకు తోచే రూపం ఒక్కటే. రెండు కాళ్ళ మీద నిలువునా నిలబడి, బడబడ మాట్లాడగల ఆకారమే తోస్తుంది. +చేతులు, మెడ, తల, ఒక ప్రత్యేక విధమైన శరీర నిర్మాణం కనబడుతుంది. నలుపు తెలుపులు, పొట్టీ పొడుగులు, కళ్ళ +రంగులు, జుట్టు రంగులు, అవకరాలు--ఇవేమీ గణనకు రావు. అలాగే ఈ ప్రపంచ గతి కంతకూ సూత్రధారిగా ఏదో శక్తి +వున్నదనే భావన కూడా. ఆ భావన ఒకే రకం. కాని, దానికిచ్చిన పేర్లు, సంకేతాలు భిన్నం. "ఏకో దేవో కేశవోవా శివోవా" +అన్నాడు భర్తృహరి అనే కవి. హరిహరులకు ఏకాధ్యవసాయం చేశారు తిక్కయజ్వ 'రామ రహీం'--అంటూ ఆ ఆలోచనకు మరింత +వైశాల్యం ఇచ్చాడు కబీరు..." + +"హాఁ, హాఁ, ఖూబ్! సచ్ హై!" మొదలైన మెచ్చుకోలు మాటలతో హఫీజు శాస్త్రిని హుషారు చేస్తూ వచ్చాడు. + +శాస్త్రి ఆ హుషారులో కొట్టుకుపోయాడు. "శంకర భగవత్పాదులు అక్కడితో ఆగలేదు. ఆత్మ--పరమాత్మలకు అద్వైతభావం కల్పించి +పరమాత్మ అంటే ఎవరో కాదు 'సోహం'--‘వాడే నేను నేనే వాడు’ అన్నారు. అక్కడ నేను అన్నది ఆయన ఒక్కరేనని కాదు. +ఆలోచించగల ప్రతి మానవుడూ నని గాని..." + +చాలామంది ముంగండ వాళ్ళకిలాగే శాస్త్రికి కూడా జగన్నాథ పండితరాయల గురించిన శృంగార గాథలు తెలిసినంతగా మత భేదాలకు +అతీతమయిన మానవతాదృష్టి నాయన ఏ విధంగా ప్రదర్శించేరో బాగా తెలియదు. అయినా అసఫ్‌జా విలాసం, అల్లోపనిషత్తు +పేర్లు మరిచి పోలేదు. + +ఆ గాథల మధ్య హఫీజు అసలు విషయాన్ని బయట పెట్టాడు. "శాస్త్రిజీ! అసదుల్లా ఆనర్సు పూర్తి అయ్యాక అక్కడే +డాక్టరేట్‌కు." + +అసదుల్లా తెలివి తేటలమీద శాస్త్రికి చాలా మంచి అభిప్రాయం వుంది. అభినందించాడు. + +"మంచి ఆలోచన." + +"అయితే, శాస్త్రీజీ! అందుకు మీ సహాయం అవసరం ఉంటుందనుకొంటున్నాడు." + +బి.ఏ. మాత్రమే చదువుకున్న తాను డాక్టరేట్ చేయదలచిన అసదుల్లాకు ఏ విధంగా సాయపడగలుగుతాడో ఊహకు అందకపోయినా, +వాగ్దానం చెయ్యడానికది ఆటంకం కాలేదు. "దాని దేముంది?" + +అప్పుడు చెప్పాడు హఫీజు--ఆ సహాయం ఏమిటో, ఎటువంటిదో. అసదుల్లా అద్వైతం మీద డాక్టరేట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. +దానికై సంప్రదాయబద్ధమైన పరిజ్ఞానం సంపాదించడం కోసం శంకరుడు రాసిన సూత్రభాష్యం గురుముఖతః చదవాలనుకొంటున్నాడు. అందుకు +శాస్త్రియే సమర్థుడని విన్నాడు. ఆయన శిష్యరికం చేయగోరుతున్నాడు. + +శాస్త్రికి వాగ్బంధం జరిగిపోయింది. సూత్రభాష్యం మతాంతరుడికి పఠన పాఠనాలు జరపవచ్చునేమో ఎప్పుడూ ఊహించుకోలేదు. కాని +సంప్రదాయం ప్రకారం అది తప్పు అనిపిస్తోంది. కాని ఒక్క క్షణం క్రితం వరకు చెప్పిందేమిటి? తన ఊరివాడు, తన శాఖవాడు +మహా పండితుడు అని ఎంతో గొప్పగా చెప్పుకున్న మాన్య పండితుడికి లేని పట్టింపును తానిప్పుడేమని చెప్పగలడు? ఆయన షాజహాన్ +పెద్ద కొడుకు దారా షికోకు స్నేహితుడే కాదు. ఆయనకు ఉపనిషత్తులు పాఠం చెప్పాడు. వారిద్దరూ కలిసి ఆ ఉపనిషత్తులను +పారశీక భాషలోకి అనువదించారన్నాడు. అలాంటిది, తానేమని అభ్యంతరం చెప్పగలడు? + +"ఆలోచిద్దాం. ఇంకా వ్యవధి వుంది గదా!" అని అప్పటికి సాచివేశాడు. + +హఫీజు మహమ్మదు కూడా మరి ఆ విషయాన్ని ఎత్తలేదు. ఆయనకు శాస్త్రి ఛాందసాలు కొన్ని తెలుసు. ఆలోచించుకోడానికి +వ్యవధినిస్తూ ఊరుకున్నాడు. + + + +22 + + +కాని, ఆ సాచివేత ఎంతోకాలం సాగలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే చదువుతున్న తన ఆఖరు కొడుకుతో కలసి అసదుల్లా ఆ +ఏడాది ఆఖరులోపున రెండు మూడు సార్లు శాస్త్రి ఇంటికి వచ్చాడు. ఆయనతో అసలు విషయం ఎత్తక పోయినా ఆ జ్ఞాపకం కలిగిస్తూ +వచ్చాడు. + +వాళ్ళిద్దరూ ఒక ఈడువాళ్ళు కాలేజీల వరకు సహపాఠకులు, చిన్నప్పటి నుంచి తమ ఇంటికి రాకపోకలు వున్నవాడే. వచ్చినప్పుడు +శాస్త్రితోనూ, కబుర్లు విడెయ్యడం అలవాటున్నవాడే, అందులోనూ విశేషం లేదు. కాని హఫీజు ప్రస్తావన దృష్ట్యా తన ఆలోచనను +త్వరితపరచడం కోసమే అతడు వస్తున్నట్లనిపించింది. + +చివరకు ఓ రోజున ఆ ఆలోచనను తెంచుకోక తప్పలేదు. + +"ఒక మతం వాడు మరో మతం ప్రాతిపదికను తెలుసుకోవాలనుకోవడం తప్పా? పైగా గీత భాష్యాన్ని మతం అనడంకన్నా ఒక తాత్విక +దృక్పథంగా భావించడం న్యాయం కాదా?" వంటి ప్రశ్నలు తెచ్చాడు అసదుల్లా. + +తాత్వికాలోచనకు మత ప్రాతిపదికకూ భేదం, అంతరం లేని సమాజం హైందవ సమాజం. ఆ ఆలోచనే తోచలేదు శాస్త్రికి. ఎప్పుడూ +ఆలోచనలో పడ్డాడు కాని ప్రశ్న వేయక మానలేదు. + +"తెలుసుకోవడంలో తప్పేంలేదు. కాని అందుకు ముందు తన మతాన్ని గురించిన ప్రాథమిక పరిజ్ఞానమేనా కలిగి ఉన్నప్పుడు కదా ఇతర +మతాల్ని గురించీ, వారి తాత్విక దృక్పథాన్ని గురించీ తెలుసుకోవడంలో ప్రయోజనం?" + +అసదుల్లా ఆ సూచనను అందుకోదలచలేదు. + +"ఏ మతాన్ని అనుసరించాలో నిర్ణయించుకోదలచినవారికి మీరు చెప్పిందాని ప్రయోజనం. కంపేరిటివ్ స్టడీ చేయదలచినా అవసరమే." + +"మరి నీ ఈ ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?" + +అసదుల్లా ఒక్కక్షణం ఆలోచించాడు. "మతాభిమానం మాత్రం కాదు, చాచాజీ! ఒక విధంగా చెప్పాలంటే మత దురభిమానం యెడ అసమ్మతి +గానే ఈ ఆలోచన మొదట కలిగింది". + +శాస్త్ర్రి సాకూతంగా కనుబొమలు ఎత్తాడు. + +అసదుల్లా తర్వాత మాట చెప్పడమా, మానడమా అని చటుక్కున ఆగాడు. + +శాస్త్రి చిరునవ్వుతో "ఊఁ, ఆగావేం?" అన్నాడు. + +ఆయనకు తెలుసు అసదుల్లా నిరీశ్వరవాది. తమ ఇంట కొడుకులూ, కూతుళ్ళూ నలుగురూ ఏ పండుగలకో కలిసినప్పుడు ఏదోరూపంతో, +భౌతిక ఆధ్యాత్మిక వాదాల చర్చన వస్తూంటుంది. మనుష్యుని అల్పత్వాన్ని అల్పజ్ఞత్వాన్ని చూపించి దైవాన్ని దైవలీలల్ని +వివరించడానికి శృతులూ, స్మృతులూ, ధర్మశాస్త్రాలూ ఉదాహరిస్తూ ఓ రోజున వాదాలలో తానూ కలిశాడు. ఆనాడు అసదుల్లా +ఎదుర్కొన్న తీరును, తానూ ఎన్నటికీ మరువలేడు. ఆ వాదం నేటికీ చెవులలో ప్రతిధ్వనిస్తూంది. + +"మన అజ్ఞానం దేవుడున్నాడనడానికి కారణం అయితే దేవుడు అజ్ఞానంతో పుట్టాడనాలి. అజ్ఞానంలో నివసిస్తున్నాడనాలి. ఈనాడు +శాస్త్రవిజ్ఞానం పలు ముఖాలుగా వ్యాపించి దాన్నే రుజువు చేస్తోంది. శాస్త్ర పరిశోధనలు దేవుడి మాన్యాల నుంచి ఎంతెంతో భూమిని +స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆయన మూలమూలల కొదుగుతున్నాడు. అయినా మీరు ఆ మూలల్నే చూపించి, దేవుని ఆధిక్యానికి నిదర్శనం +అంటున్నారు. అంతకంటే దేవుడు లేడనడానికి వేరే బలం ఏం కావాలి?" + +ఏమి ఉపనిషత్తులు? మహర్షుల దూరదర్శన, దూరశ్రవణాది సిద్ధుల్ని అందరి లాగే తానూ ఆస్తికత్వాన్ని సమర్ధించడానికి +ఉదహరిస్తే నవ్వేశాడు. + +"దాదాజీ? మీ దేవుడు శుద్ధ దురభిమాని. అటువంటి శక్తి నాయన తన్ను భజన చేసిన వాళ్ళకే కలిగించాడు. కాని ఈ వేళ +శాస్త్రజ్ఞానం రేడియో, టీ.వీ.ల ద్వారా ఆ ప్రజ్ఞను రిక్షావాడికి కూడా కలిగిస్తూందే!" + +తాను తెల్లబోయాడు. మొదట కోపం వచ్చింది. "వితండ వాదం" అన్నాడు. కాని, తరువాత తన వాద లోపం కనిపించి ఫక్కున +నవ్వాడు. ఆస్తికత్వానికీ, మహత్వ ప్రదర్శనకి ముడిపెడితే వచ్చే ప్రమాదం అర్ధం చేసుకున్నాడు. లేకుంటే ఆస్తికత్వాన్ని +నిరూపించడం ఎలాగ? అని తనకే పెద్ద సమస్య తెచ్చి పెట్టాడీ పడుచు వాడు! + +అటువంటి మనిషి తానూ నాస్తికుడనని గంట మోగించడం అవసరమా అని తటపటాయిస్తూంటే నాస్తికుడికి సూత్రభాష్యం చెప్పడమా అనే +సందిగ్ధంలో పడ్డాడు శాస్త్రి. + +ఎంత మైత్రీ ఎంత గౌరవమూ ఉన్నా మతాంతరుడికి సూత్రభాష్యం పాఠం చెప్పవచ్సునేమో ఎంత ఆలోచించినా తెగలేదు. సంప్రదాయ దృష్ట్యా +అది అకార్యకరణం అనిపిస్తూంది. వెనుక ఆధారం ఏమాత్రం వున్నా ఈ అనాచారం నెత్తిన పడకుండా తప్పేది కదా అనుకున్నాడు +పదిసార్లు. ఉంటే – అన్న ప్రశ్న ఏమిటి? లేదు కనుకనే అరవయ్యయిదేళ్ళు వచ్చినా, విశ్రాంతి తీసుకునే పరిస్థితి +లేదనుకుంటాడు. ఇంకా చదువుకోవలసిన, పెళ్ళిళ్ళు కావలసిన, పిల్లలున్నారు. + +కుటుంబ పరిస్థితులన్నీ తిరగేసుకున్నాక హాఫీజ్ మహమ్మదు అభ్యర్ధనను తోసిపుచ్చి, ఆ వృద్ధమిత్రుడికి కష్టం కలిగించడం +తెలివైనపని అనిపించలేదు. + +పండిత రాయలంతటివాడు ‘ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ ఎవరైతేనేం కోరికలు తీర్చడం ప్రధానం అనుకున్నప్పుడు తనదేముంది? +తానెంతవాడు? + +అలాగని వెంటనే సర్దుకోనూ లేకపోయేవాడు. ఆఖరు నిముషం వరకూ ఈ అనాచారం నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మెలికలు వేస్తూనే +వచ్చాడు. + +నూత్ర భాష్య పఠన, పాఠనాలు అశుచిగా సాగించరాదు. అంటే తానే కాదు, అసదుల్లా కూడా శుచి నియమాలు పాటించాలి. + +అతడికి ఆ చదువేదో తన ఇంటి వద్దనే చెప్తాడు. + +అసదుల్లా శుచీ స్నాతుడై ధవళ వస్త్రాలు వేసుకు రావాలి. + +తాను దేవుని గదిలో ఉండి పాఠం చెప్తాడు. శిష్యుడు గది బయటనే ఉండాలి. + +ఇవన్నీ హిరణ్యాక్షవరాలేనని శాస్త్రి భావన. + +కొన్ని లక్షల ఆస్తికి ఏకైక వారసుడైన అసదుల్లా ధనగర్వంతో శాస్త్రినే తన ఇంటికి వచ్చి చెప్పమంటాడనుకున్నాడు. +చెప్పనంటే? – తర్వాత ఏమవుతుందనే విషయం మీద శాస్త్రి మనసు పోలేదు. + +అరేబియా ఎడారిలోనూ కుర్దిస్తాన్ కొండలలోనూ జీవించిన తమ పూర్వులు నీళ్ళు దొరక్క వారానికోమారు స్నానంతో తృప్తిపడ్డారో, ఏమో +– వాళ్ళ సంతతులు జల సమృద్ధిగల భారతదేశం వచ్చాక కూడా అక్కడి అవసరాన్ని ఇక్కడి ఆచారంగా పాటిస్తున్నారు. శరీరపు +గౌలను అణిచేందుకు అత్తరులో తడిసిన వత్తిని చెవి మడతలలో దోపి సంతృప్తి పడుతున్నారు. ముసలి హాఫీజ్ వరకూ ఉన్న ఈ +అలవాటును అసదుల్లా ఒక్కమాటు మార్చుకోగాలడా? + +ఇక ఆఖరుది బ్రహ్మాస్త్రమనే అనుకున్నాడు – ‘చదువు చెప్పేటప్పుడు నీ ముఖం కూడా కనబడకూడ’ దనడం కన్నా పెద్ద +అవమానం ఉండదనీ, నోటితో చెప్పకుండా పొమ్మన్నట్లే అవుతుందని ఆయన ఊహ. + +అయితే ఆయన అంచనాలన్నీ తల్లక్రిందులయిపోయాయి. పాఠం కోసం వచ్చిన ఆ యువకుణ్ణి బాగా ఎరిగినవాళ్ళే ముస్లిం అనుకోలేదు. + +కారు దిగి వచ్చి శాస్త్రిగారి కోసం వాకబు చేస్తుంటే ఉమ కూడా అతన్ని గుర్తు పట్టలేదు. + +"కూర్చోండి. నాన్నగారు జపం చేసుకుంటున్నారు. అయిపోవచ్చింది." + +ఆమె కుర్చీ చూపిస్తూంటే అసదుల్లా ఫక్కున నవ్వాడు. + +ఆమె తెల్లబోయి తేరిపార చూసింది. "మీరా? ఏమిటీ వేషం?" + +అతడు బిళ్ళగోచీ పెట్టి పంచె కట్టాడు. సన్నని లాల్చీ, పైన ఉత్తరీయం. + +"భాష్యం చెప్పించుకోడానికి." + +ఉమ తండ్రిని పిలిచింది. పాఠానికని వచ్చిన శిష్యుణ్ణి చూసి, శాస్త్రి పరాజయం అంగీకరించాడు. గురువుకూ, గురుపత్నికీ తెచ్చిన +బహుమతుల్ని చూసి ‘ఓరి పిడుగా!’ అనుకున్నాడు. గంపతో ఇన్ని బత్తాయిలూ, ఆపిల్సూ తెచ్చి డ్రైవర్ వారి ముందుంచాడు. + +శాస్త్రి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. + +"ఏమిటిది? ఇవన్నీ ఎందుకు?" + +ఉమ సమాధానం ఇచ్చింది. "శూన్య హస్తేన నోపేయాత్!" + +అసదుల్లా ఆమెకు థాంక్స్ చెప్పాడు. + +గురుపత్నికి చీర ఇవ్వడానికి ఉమా బెహన్ సహాయం కోరాడు. + +శాస్త్రి ఇంక ఆఖరు ఎత్తుగా శిష్యుణ్ణి బెదరకొట్టడానికి ప్రయత్నించాడు. పాఠం తెమలనివ్వలేదు. ఒక్కొక్క పదాన్నే +ఎత్తుకుని వివిధ వాక్యార్ధాలు, శ్లేషార్ధాలూ, పూర్వపక్ష సిద్ధాంతాలూ వివరిస్తూ, ఎక్కడెక్కడికో, ఏయే దర్శనాలూ, +శాస్త్రాలలోకో తీసుకుపోయి తిప్పి తిప్పి తీసుకురావడం ప్రారంభించాడు. + +ఆ గహనాతి గహన విహారాలకు అసదుల్లా మొదట కంగారు పడ్డాడు. అర్ధం కావడం లేదన్నాడు. జ్ఞాపకం ఉండడం లేదని +భయపడ్డాడు. అయినా వదలలేదు. నిలదొక్కుకున్నాడు. ఓ వారం అయ్యేసరికి ఫర్వాలేదనుకున్నాడు. పది రోజులకి శాస్త్రి +మెత్తబడ్డాడు. + +శాస్త్రి మంచి పండితుడు. మంచి బోధకుడు కూడా. మొదట ముఖవిధానం చెయ్యాలని ప్రారంభించినా చేతకాలేదు. కొంచెం చాదస్తమే చూపించాడు. +పాఠం చెప్పడంలో చెయ్యాలన్నా మోసం చెయ్యలేడు. + +సెలవులాఖరున వాల్తేరు వెడుతూ అసదుల్లా సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు శాస్త్రి సంతోషంతో ఆశీర్వదించాడు. అతనికి +తెలివి, పట్టుదల ఉన్నాయి. అవి రెండూ శాస్త్రికి తృప్తి నిచ్చాయి. + +అవన్నీ జరిగి ఇంకా మూడు నెలలు కాకపోయినా, ఏళ్ళు గడిచినట్లనిపిస్తోంది. ఆ ఘటనలు గుర్తు వచ్చి శాస్త్రి ఒక్క +నిట్టూర్పు విడిచాడు. + +"నా అనాచారం, అబ్రాహ్మణ్యం నా నెత్తికొట్టింది!" అనుకున్నాడు. + +* * * * * + +శాస్త్రి రిక్షా దిగుతూండగా మేడ మీది నుంచి చూసి హాఫీజ్ మహమ్మదు ఆయనకు ఎదురు వచ్చాడు. + +తీసుకెళ్ళి ఆయన కోసమేనన్నట్లు లేడి చర్మం పరచిన బల్లమీద కూర్చుండ బెట్టాడు. + +"ఆయీయే, తష్‌రీ్‌ఫ్ రఖియే!" + +ఆయన కెదురుగా అంతదూరాన బల్లమీద పరచిన పరుపులతో బాలీసు నానుకుని తాను కూర్చున్నాడు. + +ఆ వృద్ధుడు చూపుతున్న మర్యాద, ఆప్యాయం చూశాక, దారిలో వస్తూ తాను అడిగెయ్యాలనీ, కడిగెయ్యాలనీ, దులిపెయ్యాలనీ తయారు +చేసుకున్న మాటలేవీ శాస్త్రికి జ్ఞాపకం రాలేదు. ఇంకెలా ప్రారంభించాలో కూడా సాధ్యం కాలేదు. + +ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కొంచెం సేపు కూర్చుండిపోయారు. హాఫీజ్ మహమ్మద్ ప్రారంభించాడు. + +"శాస్త్రీజీ! తమరు వచ్చిన కారణం తెలుసు ననుకుంటున్నాను. ఒకవిధంగా తమ రాక కోసం కనిపెట్టుకునే ఉన్నానని చెప్పవచ్చు, +చాలా ఆశ్చర్యం. ఎంతో సంతోషం, ఆందోళనా కలిగించే వార్త వచ్చింది. పర్యవసానాలు ఎలా ఉన్నా." + +శాస్త్రి ఏమీ మాట్లాడలేదు. నోరు విప్పితే ఏడుపు వచ్చేలా ఉంది. కళ్ళనీళ్ళు కనబడకుండా రోడ్డుకేసి తిరిగి, రావి మీద గోల +చేస్తున్న పక్షులకేసి చూస్తున్నాడు. + +"ఈవేళ టపాతోనే వచ్చింది." + +శాస్త్రి తిరిగి చూశాడు. హాఫీజ్ మహమ్మదు బాలీసు కింది నుంచి తీసిన కవరు తనకు వచ్చినటువంటిదే! చూశానన్నట్లు తల +ఆడించాడు. తనకూ అటువంటిదే ఒకటి వచ్చినట్లు సూచనగా కోటు జేబు తట్టుకున్నాడు. అంతా సంజ్ఞలతోనే నోరు విప్పితే ఏడుపు +వచ్చేసేలా వుంది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. + +హాఫీజు ఆయన పరిస్థితికి సానుతాపం తెలిపాడు. + +"శాస్త్రీజీ! తప్పుగా భావించకండి. నన్ను అర్ధం చేసుకోండి. మీ కులాచారాలకు అవమానంగా భావిస్తారనీ, మీ మనసుకు బాధ +కలుగుతుందనీ మాత్రమే విచారిస్తున్నాను." + +చంద్రశేఖరశాస్త్రి భుజాన ఉన్న కండువాతో ముఖం దాచుకున్నాడు. తమ మానసికోద్వేగాల్ని అదుపులో పెట్టుకునేందుకన్నట్లు ఉభయులూ +కొద్దిసేపు ఆగారు.... + +మళ్ళీ హాఫీజ్ మహమ్మద్ ప్రారంభించాడు. ఉమ యెడ తనకున్న ప్రేమనంతటినీ ఒక్క వాక్యంతో వెలిబుచ్చాడు. + +"మాకీ వృద్ధాప్యంలో ఉమ వంటి దేవత ఆసరా దొరుకుతుందంటే మాకు అంతకన్నా వాంఛనీయం వేరే ఏం ఉంటుంది." + +శాస్త్రికి తెలుసు. మూడేళ్ళ వయసులో ఓనాడు మారాం చేసి తండ్రితో ఆయన ఆఫీసు కెళ్ళింది. తన సంతానంలో ఆమె ఆఖరుది. +అందుచేత విపరీతమైన ముద్దు. ఆయనకే కాదు, ఆ రోజున ఆఫీసులో అందరినీ ఆకట్టుకుంది. హాఫీజ్ మహమ్మద్ కారులో తన ఇంటికే +తీసుకెళ్ళాడు. చక్కని గౌను కొని అలంకరించాడు. + +ఆనాడు మొదలు ఉమ హాఫీజ్ మహమ్మద్ ఇంటికి కూడా బిడ్డ అయింది. అయన్ని ‘దాదాజీ’ అని పిలుస్తుంది. తమ ఎవరివద్దా +చేయనంతగా గారం చేస్తుంది ఆయన బీబీ వద్ద. + +అన్నీ తెలుసు. + +కాని, ఇదెలాగ? శాస్త్రి ఒక్క మాటలో ముసలివాని కోరిక తన కెంత భయంకర విషయమో చెప్పేశాడు. + +"అది మా కుటుంబానికెంత మచ్చ? కట్టకట్టుకుని కృష్ణలో దిగడం కన్నా గత్యంతరం ఉందా?" + +అర్ధమయిందన్నట్లు హాఫీజ్ మహమ్మద్ తల ఊపాడు. శాస్త్రి ఆచారపు పట్టుదల ఆయనకు తెలుసు. ఆఫీసుకు వచ్చేటప్పుడు +మంచినీళ్ళు కూడా తెచ్చుకుంటాడు. అవి అయిపోయినా, మైలపడినా అంతే! మరి ఎవరిచేతి నీళ్ళూ ముట్టుకోడు. గొంతు ఎండినా సరే, +ఇంటికెళ్ళాలి. స్నానం, సంధ్య కావాలి. అంతవరకూ ఏమీ నోట పెట్టడు. అది ఆయన నియమం. ఒక్కొక్కప్పుడది ప్రాణాంతకంగా +పరిణమించిన ఘట్టమూ లేకపోలేదు. అందులోనూ ఆయన పనిచేస్తున్నది విదేశీ వ్యాపారం చేస్తున్న కంపెనీలో. ఆఫీసులో ఆయన కింద +పనిచేసే వాళ్ళకే ఎన్నోమార్లు తామసం కలిగింది. కాని ఆయనలోని అసాధారణ మానవ ప్రేమా, నిష్కాపట్యం ఆయన ఆచారాల్నీ, +పట్టుదలల్నీ గౌరవ భావంతో సహించేటట్లు చేశాయి. + +అన్నీ ఎరిగి ఉన్న హాఫీజ్ ఆ మాటను సహించాడు. లేకుంటే మీతో సంబంధం చేయడంకన్నా కృష్ణలో దిగి ఆత్మహత్య చేసుకోవడం మేలు +అన్నమాటను ఎవరూ గౌరవంగా భావించలేరు. + +హాఫీజ్‌కు కూడా ఆ మాట అవమానం కన్న అనుతాపాన్నే కలిగించింది. బ్రాహ్మల మనుకునే వారిలోనే సవాలక్ష +భేధాలున్నాయని హాఫీజ్ ఎరుగును. విష్ణువును కొలిచేవారూ, శివుణ్ణి కొలిచేవారూ, ఉన్నారు. వీరికి భిన్నంగా స్మార్తులంటూ ఉన్నారు. +వీరంతా హిందువులే నంటారు. కాని ఆ ముగ్గురి మధ్యా ఇచ్చిపుచ్చుకోవటాల మాట అటుంచి కలిసి భోజనం కూడా చేయరని శాస్త్రే +ఆయనకు చెప్పాడు. + +అలాంటిది తాను హిందువేనా కాదు, ముస్లిము. + +"శాస్త్రీజీ! తమ కుటుంబం అవమానాలపాలు కావడమూ, ఆపదలలో చిక్కుకోవడమూ నా కభిమతం కాదు. ఈ ఘటన మీ కిష్టం కాదు. +కనుక ఇలా జరగరాదనుకుంటున్నాను. కాని, ఇదెలా జరిగింది? నా కర్ధం కావడం లేదు." + +హాఫీజ్ తన ప్రశ్నకు సమాధానం కోరి ఉండలేదు.అయితే దీనికంతకూ ఆయన వెనుక మద్దతు ఉన్నదేమో నన్న అనుమానం తొలగని +శాస్త్రి చటుక్కున అనేశాడు. + +"తమరే చెప్పాలి." + +తానేమీ చెప్పలేనన్నట్లు హాఫీజ్ తల తిప్పాడు. ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. మళ్ళీ హాఫీజ్ +ఎత్తుకున్నాడు. "ఈ వేళ ఆగస్టు పద్నాలుగు. రేపు సాయంకాలమే..." + +సుముహూర్తం--అన్నమాటను చటుక్కున మింగేశాడు. ఆ మాట చెవిని పడకపోయినా మనస్సుకు తగిలి శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. + +బెజవాడ--వాల్తేరుల మధ్య దూరం మూడువందల ఏభై కిలోమీటర్లే. ప్రభుత్వం ధర్మమా అని త్వరితంగా చేర్చే బళ్ళు కూడా ఓ +పుంజీడున్నాయి. కాని చోటు దొరకదు. వేళకి నడవవు. ఈ ఆదుర్దా మూలంగా తాను ప్రయాణం చేయగలనా అన్న అనుమానం--భయం +పట్టుకున్నాయి. + +హాఫీజ్ మహమ్మదు చకచకా అందుకున్నాడు. ఫోన్ మీద ఫస్టు క్లాసులో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అసాధ్యమనే +మాట వినబడుతోంది. + +"ఇంక రైల్వే అధికారులను మొహమాటపెట్టక తప్పేలా లేదు. అక్కడా లాభం లేకపోతే నా కారు తీసుకు వెళ్ళండి, మీ కుల ధర్మాలు +భంగం కావడం నాకిష్టం లేదు." + +శాస్త్రి ఏమీ అనలేదు. చూస్తూ కూర్చున్నాడు. రైల్వే అధికారుల్ని అందుకునే ప్రయత్నం చేస్తూనే తన ఆఫీసుకు ఫోన్ చేసి +క్యాషియర్‌ను పిలిచాడు. + +"నా ఖాతాలో రాసి రెండువేలు వెంటనే పంపండి." + +ముప్పయేళ్ళపై నుంచి పని చేస్తున్న శాస్త్రి వద్ద చేతిలో నూరు రూపాయలు కూడా ఉండవని హాఫీజ్ ఎరుగును. ఇస్తున్న +పది--పన్నెండు వందలూ, ఏమవుతున్నాయో యని ఆయనే అనేకసార్లు ఆశ్చర్యం వెలిబుచ్చాడు. + +డ్రైవరును పిలిచాడు. "పెట్రోలు, ఆయిలు నింపుకొని కారు గుమ్మంలో పెట్టు. జల్దీ ఆనా!" + +సలాము కొట్టి సత్తారు వెళ్ళాడు. + +ముసలివాడు ఏ మాత్రం తత్తరపడకుండా ముందే ఆలోచించుకున్నట్లు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుపోతుంటే శాస్త్రి నిశ్శబ్దంగా చూస్తూ +కూర్చున్నాడు. + +మనసులో ఆశ్చర్యం, అనుమానం మార్చి మార్చి కలుగుతున్నాయి. + +అయితే ఇప్పటి అనుమానం స్వభావం వేరు. హాఫీజ్ మహమ్మదు ప్రోత్సాహం ఆహ్వాన పత్రికకు వెనుక బలం అనే అనుమానం ఇప్పుడు +లేదు. అది స్పష్టమయింది. ఈ మారు కలుగుతున్నది, దానికి ప్రత్యక్ష విరుద్దమైనది. ఉమతో తన మనుమడి జీవితం +ముడిపడడం ఆయనకూ ఇష్టం కాదేమో! తాను నిర్ధనుడు. ఆయనకింద జీతానికున్న మనిషి. ధనం, హోదా పరిపాలన సాగిస్తున్న +కాలంలో ఉమ నాసిగా కనిపిస్తూండవచ్చు. తనకు మెహర్భానీ చేస్తున్నట్లు ఇదంతా నటన కావచ్చు. తనకు కలగగల నష్టాన్ని +సవరింపచేసేందుకే తన్ను ఉపయోగించుకోదలచాడేమో! + +తాను నీచంగా భావించే సంబంధం కూడా తనను అవాంఛనీయమని భావిస్తున్నారన్న ఆలోచనతో మనస్సు కొంతసేపు వ్యాకుల పడింది. + +దీనితో కొత్త భయం మరొకటి వచ్చి పడింది. + +ఈ వివాహ ప్రయత్నం హాఫీజ్‌కు తెలియదు. బహుశా ఇష్టమూ వుండదు. అయినా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. +అంటే--అసదుల్లా తగిన బందోబస్తుతో ఉండి ఉంటాడు. బ్రహ్మత్వం స్థానికుడైన ఒక అడ్వొకేట్‌ది. అందులోనూ ఆయనకు +విప్లవవాదియైన రచయితగా విద్యార్ధి వర్గంలో మంచి పేరున్నదని ఉమే చెబుతూండేది. + +సంస్కరణ వివాహాలు జరిపించేటప్పుడు వీరేశలింగం పంతులుగారు పోలీసుల మీద కన్నా విద్యార్ధుల మీద ఎక్కువ భరోసా ఉంచినట్లు +తాను చదివాడు. అవన్నీ గుర్తు వచ్చాయి. + +అన్ని కట్టుదిట్టాలు చేసికొని ఉండి ఉంటారు గనుకనే వివాహ పత్రికను ఇంత బాహాటంగా పంపగలిగారనిపించింది. లేకుంటే +గప్‌చిప్‌గా రిజిస్ట్రారాఫీసుకు వెళ్ళి తరువాత ఓ ఉత్తరం రాసిపడెయ్యొచ్చు, మానొచ్చు. ఎవరేం +చెయ్యగలుగుతారనుకున్నాడు. + +తాను వెళ్లి ఏం చేయగలడు? అసదుల్లా తనను లెక్కచేయకపోవచ్చు. అసలు ఉమనే కంటపడనీయకపోవచ్చు. బోలెడు అనుమానాలు. + +అవన్నీ హాఫీజ్ ముందు వెల్లడించడానికి శాస్త్రి సందేహించలేదు. అన్నీ విని హాఫీజ్ ఒక ప్రశ్న వేశాడు. + +"పోనీ నేను కూడా వస్తే?" + +"అదే మంచిదనుకుంటాను!" హాఫీజ్ ఒక్క క్షణం కూడా సందేహించలేదు. వెంటనే రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నం ప్రారంభమయింది. + +"అరే, బడేమియా!" + +బడేమియా పడుచువాడే. ఆంతరంగిక అనుచరుడు. ప్రయాణానికి చేయవలిసిన ఏర్పాట్లన్నీ వానికి పురమాయించాడు. + +"జల్దీ కర్ నా!" + +పనివాణ్ని తొందర పెట్టడమే కాదు, తానూ త్వరపడసాగాడు. + +"కారులో వెళ్ళండి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని రండి." + +ఓక్క నిముషం ఆగి, "బెహన్‌జీతో ధైర్యంగా ఉండమనండి." అన్నాడు. + + + + +23 + + +శాస్త్రి తిరిగి వచ్చేసరికి పెట్టే బేడా సిద్ధంగా ఉన్నాయి. పనివాళ్ళు వాటిని డిక్కీలోనూ, పైనా సర్దుతున్నారు. + +"ఏ బండికి దొరికాయి టిక్కెట్లు?" + +"మెయిలుకైతే రేపు పొద్దున్న వెయిటింగ్ లిస్ట్‌లొ ఉంటాయన్నారు. వద్దు, మనం కారులో పోతున్నాం." + +శాస్త్రి తెల్లబోయాడు. + +"అంత దూరం కారులో కష్టం కాదూ, తమకు?" + +"తప్పదు. శ్రమే మరి. కాని..." + +ఈ మారు శాస్త్రి తన అనుమానం నిజమే అనుకున్నాడు. ఈ పెళ్ళి జరగడం ఆయనకిష్టం లేదు. అందుకే ప్రయాణం. + +"శాస్త్రీజీ!" అన్న ఆడగొంతు వినబడి ప్రకృతిలో కొచ్చాడు. అప్రయత్నంగానే "జీ!" అన్నాడు. తల ఎత్తేసరికి హాఫీజ్ +భార్య జీనత్. + +"అదాబ్ అర్జ్!" అని నమస్కరించాడు. + +ఆమె ప్రతి నమస్కారం పలికింది. తమ దంపతులిరువురి తరపునా జీనత్ ప్రారంభించింది. + +"ఈ వార్త విషయంలో మా అనుమానాలు మాకున్నాయి. ఆ అనుమానం తీర్చుకునేందుకూ, అవకాశం ఉన్నంతలో తమకు కష్టం కలిగించరాదన్న +సంతృప్తి కోసమూనే వారు కూడా ప్రయాణమవుతున్నారు. పెద్దగా దూర ప్రయాణాలు చేసే ఓపిక లేకున్నా బయలుదేరుతున్నారు." + +"ఫర్వాలేదు, శాస్త్రీజీ నాకన్నా పెద్దగా చిన్నవారేం కాదు. కాని పని అలాంటిది." + +ఎప్పుడోగాని కంటబడని యజమాని భార్య స్వయంగా వచ్చి ఉపచార వ్యాక్యాలు పలకడం తృప్తి కలిగించినా, ఆమె తీరులోనే ఏదో +విలక్షణత తోచి శాస్త్రి ఇంకా ఏమంటుందోనని ఎదురు చూస్తున్నాడు. + +"అసదుల్లాను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కాని...." + +మాట మధ్యలోనే ఆగిపోయింది. కంఠం పట్టేసింది. ఆమె మాటను హాఫీజ్ పూర్తి చేశాడు. + +"ఆ నలుసు మీద ఈ ముసిలాళ్ళం ప్రాణాలు పెట్టుకుని ఉన్నాం. తమరు మా వంశాన్ని కాపాడుతామని...." + +ఇద్దరూ భిక్ష కోరుతున్నట్లు కుర్తా కొంగులు పట్టడం చూసి శాస్త్రి తెల్లబోయాడు. ఆ కుర్రాణ్ని చంపేస్తారనుకుంటున్నారేమిటీ +ముసిలాళ్ళు--అనుకున్నాడు. తన చేతికి ఓ కత్తి ఇచ్చి పొడిచెయ్యమన్నా ఆ పని చేయలేడు. + +"అసదుల్లా నా శిష్యుడు. నా కొడుకుల్లాంటి వాడు. అతనికపకారం చెయ్యగలనని తమకెల్లా అనిపించింది? ఎందుకనిపించింది?" + +"అది కాదు, శాస్త్రీజీ!" + +కాని ఆయనదేమిటో చెప్పలేకపోయాడు. శాస్త్రి ఒక్క క్షణం ఆగి, ఇంటినుంచి బయలుదేరినప్పటి తన ఆవేశాన్ని పైకి చెప్పేశాడు. + +"చెప్పొద్దూ? ఈ వ్యవహారం తమ ద్వారా ఫొక్తు పడిందనిపిస్తే మీ పీక పిసికెయ్యాలనిపించింది." + +ఆ ఆలోచన కలిగిందని చెప్పడానికి శాస్త్రికి నవ్వు వచ్చింది. మిత్రులిద్దరూ కలిసి ఒక్క నిమిషం నవ్వుకున్నారు. అంతలో +తన స్థితి గుర్తు వచ్చి శాస్త్రి ముఖం గంభీరమయింది. + +"కాని, తీరా వస్తే ఆ పని చెయ్యలేను!" + +"నా పీక పిసికేస్తే విచారం లేదు. భాయి సాబ్!కాని....కాని..." + +"చెప్పండి." + +"మా కోరిక ఇది. ఆ కుర్రాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనే నిశ్చయంతో ఈ ఏర్పాట్లకు పూనుకొని ఉంటే ఉమను +దిగదియ్యనని మాట ఇవ్వండి". + +శాస్త్రి అవాక్కయి నిలబడిపోయాడు. అయితే ఈ ప్రయాణం ఉద్దేశం ఏమిటనిపించింది. నవదంపతుల్ని ఆశీర్వదించడానికా తాము +వెళుతున్నది? + +ఇం తవరకు తోచివుండని ప్రశ్నలు పరంపరగా వచ్చిపడ్డాయి. + +ఈ శుభలేఖను నమ్మవలసివస్తే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకునే ఉండాలి. తల్లిదండ్రులో, బంధువులో కూర్చింది కాదు కదా. +అల్లాంటప్పుడు "దిగతియ్యను" అనే వాగ్దానానికి వుండే విలువ ఏపాటిది? తన మాట ఇంకా ఉమ వినే స్థితి ఉంటుందా? + +దిగతియ్యడం మాట వచ్చేసరికి కొత్త ఆలోచన వచ్చింది. తాను దిగతీస్తే, ఉమ వింటే-తరువాత ఆమె జీవితం ఏమిటి? ఏడాది +క్రితం ఆమెను చేసుకునేందుకు వచ్చిన భాస్కరరావు ఇప్పుడు ముందుకు వస్తాడా? + +అతని మీద ఆనాడు అంత ఆసక్తి ప్రకటించిన కూతురు ఈ వేళ ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? + +మనస్సు ఇటుంటే అప్పుడా ఆలోచన ఎందుకు వచ్చింది? లేక ఈ మధ్య కాలంలో ఏమన్నా అనుకోని పరిస్థితులు వచ్చాయా? + +కాలుజారి తప్పని పరిస్థితి వచ్చి ఈ పెళ్లికి సిద్దపడి వుంటే తాను దిగతీయడం వలన ప్రయోజనం ఏమిటి? + +తన మాట కోసం ఆ ముస్లిం దంపతులు తమ కుర్తా కొంగులు పట్టుకుని అలాగే ఎదురు చూస్తున్నారు. + +"మన మతాలూ, కులాలూ జీవితాన్ని దుఃఖపెట్టేందుక్కాదు శాస్త్రీజీ!" + +తమ మత ధర్మానుసారం పెళ్ళి అయితే చాలు ముస్లిములకి. వాళ్ళ కులాలూ, మతాలూ వాళ్ళకి అట్టేపట్టవు. + +కాని తమ కల్లాకాదే! తాము హిందువులు, బ్రాహ్మణుడు, స్మార్తుడు, వేగినాటి. మతమే కాదు. తమలో అంతశ్శాఖల పట్టింపూ వుంది. +శాఖలే కాదు, గోత్రాలూ. ఇవన్నీ ఆర్య, అనార్య సంప్రదాయాల కిచడీ అని తన కొడుకు అపహాస్యం చేసినా అది ఉంది.ఈవేళ +కాదన్నా ఒక్కమారు మారిపోదు. + +"అసదుల్లా మనసు మెత్తని వాడు. ఉమకా వయసు వచ్చింది. చదువుకుంది. చిన్ననాటి నుంచి అరమరికలు లేకుండా తిరిగిన +వాళ్ళు..." + +హాఫీజ్ ఈ ఆహ్వాన పత్రిక యధార్ధమే అయి వుంటుందనే ఆలోచనతో దానికి పూర్వరంగాన్ని చూపుకుపోతున్నాడు. + +శాస్త్రి ఇంకా తెముల్చుకోలేకుండా వున్నాడు. ఏ విధంగానైనా ఈ పెళ్ళికి అంగీకరించవలసివచ్చేలాగే వుంది. ఉమ మొండికేస్తే తాను +చెయ్యగలదిలేదు. ఇంత వరకూ వచ్చాక తాను దిగతియ్యడంలో అర్ధం మాత్రం ఏం వుంది? + +"సరే ......." నన్నాడు శాస్త్రి. + +అంతలో మరో ఆలోచన. తన రెండో కొడుకు రామకృష్ణను తీసుకువెళ్ళడం ఎందుకేనా మంచిదనిపించింది. ఆ ‘ఎందుకేనా’ అన్నదేమిటో +స్పష్టంగా లేదు. + +"రామకృష్ణను తీసుకెళదాం." + +ఆ సూచనకు హఫీజు ఎగిరి గంతేశాడు. రామకృష్ణకూ, అసదుల్లాకూ మంచి స్నేహం. ఇల్లాంటి విషయాలలో పడుచు వాళ్ళతో వ్యవహారం +సులభమని ఆయన అభిప్రాయం. + +శాస్త్రి ఆమోదానికి అభినందించి, శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. + +రామకృష్ణ పనిచేస్తున్న కాలేజీ ఫోన్ నంబరు తెలుసుకుని హఫీజు ఎస్.టి.డి. చేశాడు. కానీ వచ్చిన సమాధానం నిరుత్సాహకరం. +రామకృష్ణ కాలేజీకి క్రితం రోజు నుంచీ రాలేదు. సెలవు పెట్టాడు. + +"సరే.....ఇంటి వద్దనే పికప్ చేద్దాం" అన్నాడు హఫీజు. + + + + +24 + + +కారు విజయవాడ పొలిమేరలు దాటి, వేగం అందుకుంది. పొగల తెరలు పరుచుకుంటూ పోతున్న లారీని దాటిపోయేందుకు డ్రైవరు +హారన్‌తో హెచ్చరిస్తున్నాడు. గదుముతున్నాడు. బతిమాలుతున్నాడు. కస్సుమంటున్నాడు. ఎట్టకేలకు లారీవాడు దారి ఇవ్వగా +దూసుకు ముందుకుపోయాడు. + +అంత వరకూ మాట్లాడకుండా ఊరుకున్న హఫీజు ఈ మారు అటువంటి ఇరుకున పడకుండా హెచ్చరించాడు. + +"ఆహిస్తా ఛలో భయ్యా!" + +శాస్త్రి ఇవేవీ గమనిస్తున్నట్లే లేదు. సీటుకు చేరబడి ఎదుటికి నిర్నిమేషంగా చూస్తూనే వున్నాడు. లారీ ఎక్జాస్ట్ పొగ +కమ్ముకున్నప్పుడు గుర్తించినట్లు లేదు. చెవులు గింగుర్లెత్తేలా మోగిన హారన్ కదిలించినట్లు లేదు. హఫీజుకు మిత్రుని అవస్థ +చూస్తే జాలి వేసింది. ఏవన్నా మాటల్లో పెట్టి దృష్టి మరలించకపోతే మనిషి దెబ్బతినేస్తాడనిపించింది. + +"శాస్త్రీజీ!" + +"జీ." + +"ఏమిటంత ఆలోచనతో ఉన్నారు?" + +"ఇంకేముంది? మన ఎదుట ఉన్నదొక్కటే సమస్య. ఇదెట్లా తటస్థపడింది? ఎందుకు తటస్థపడింది? దీని నుంచి బయటపడటం +ఎట్లాగ – అంతే. అదే ఆలోచన" + +"ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం తెలియందే చివరి దానికి అసలు అవకాశమే లేదు కదా!" + +"చెప్పండి. ఇదెట్లా తటస్థపడింది?" + +హఫీజు ఒక్కక్షణం ఆగి – "నాకూ అంతు దొరకడం లేదు" అన్నాడు. ఒకింతసేపు పోయాక మళ్ళీ అన్నాడు. + +"లోక వ్యవహారం దృష్ట్యా...." + +"అంటే – పరిచయం ఉండడం. వయస్సు రావడం ..." + +"నా కంతే తోస్తుంది." + +"అంటే?" శాస్త్రి వాక్యం ముగించడానికి తటపటాయించాడు. + +"దీని నుంచి బయట పడడం సాధ్యం కాదు. ఆ ఆలోచన అనవసరం." + +"ఒక్కటి చెప్పండి" + +ఏమీ అనకుండా శాస్త్రి మిత్రుని వాక్యం కోసం చూశాడు. కానీ ఆయన సందేహిస్తున్నట్లు కనిపించింది. + +"చెప్పండి" + +"వాదం కోసమే నా ప్రశ్న. ఏమీ అనుకోకుండా ఉంటే...." + +శాస్త్రి మందహాసం చేశాడు. + +"ఏదన్నా అనుకునే అవసరమూ, అనుకున్న ఘట్టమూ గడిచిపోయాయి. మన మిద్దరం ఒకే కారులో ఉన్నాం. ఒకేచోటికి వెళుతున్నాం. +మన ఉద్దేశం కూడా ఒకటే ననుకుంటా." + +"ఠీక్ హై, ఠీక్ హై." + +ఇద్దరూ ఒక నిమిషం ఊరుకున్నారు. + +"మనది కేవలం చర్చ కోసం చర్చ మాత్రమే. అల్లాగే తీసుకుందాం" + +ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్ధంకాక శాస్త్రి నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. + +"దీనినుంచి బయటపడడం సాధ్యం కాదని మీ అనుతాపం." + +"నిజమే మరి. దీర్ఘకాల పరిచయమూ, వయస్సూ ఈ ఘట్టాన్ని సృష్టించినప్పుడు ...." + +"దీని నుంచి బయటపడాలని కోరడం ఎందుకు? దీన్ని సముచిత పర్యవసానంగా ఎందుకు తీసుకోకూడదు?" + +"మీ ముస్లిములు ఒప్పుకోగలరా? ఓ ఏడాది క్రితం సౌదీ అరేబియాలో రాజకుమారినీ, ఆమెను ప్రేమించిన వాడినీ బహిరంగంగా రాళ్ళతో +కొట్టి చంపేశారే? పది పదిహేను రోజుల క్రితం ఇరాన్‌లోనూ అటువంటిదే జరిగింది. అందుచేత..." + +మాట అనేశాక కానీ అందులో వున్న అసంబద్ధత మనస్సుకు తోచలేదు. + +హఫీజు చిరునవ్వు నవ్వాడు. + +"దానిలోనే అర్ధం అవడం లేదా? జీవగత అనుబంధం, ఆసక్తి, ఇచ్ఛ మొదలయిన మన ఆచారాలూ, నిషేధాలు శిక్షా స్మృతులకూ +లొంగవని, వాని పరిధులూ, పరిమితులూ భిన్నమని తెలియడంలేదా?" + + ఈ మారు చిరునవ్వు వంతు శాస్త్రిది. + +"మనదాకా వస్తే తప్ప అర్ధం కాదనేది ఇలాంటి సందర్భాల్లోనే" + +ముస్లిం దేశాలలో జరుగుతున్నది మనకి ఆదర్శం కావాలా? + +"కాదు, అక్కడ స్త్రీ, పురుషు లిద్దరూ ఒక మతం వాళ్ళు, ఇక్కడ అది కూడా కాదే." + +"జీవగతోత్తేజాన్ని కూడా తొక్కేసేటంతటి బలం కలదా మతం?" + +శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. + +"అకడమిక్‌గా చర్చిస్తున్నామని మరవకండి" అని హెచ్చరించాడు హఫీజు. + +"మతాలనే కాదు. కుల, ధన, భేదాలనూ, శిక్షాస్మృతినీ కూడా లెక్కచేయని బలం దానికుంది. సందేహంలేదు. కాని, కాని..." + +"ఆచారాల బలం అంటారు...." + +"సామాజిక నియమాలే ఆచారాలు కదా!" + +"అయితే?...." + +"చెప్పండి" + +"రామకృష్ణ పునర్వివాహం గురించి మీరు చెప్పాలి. ఆమెది భిన్న మతం అన్నారు గుర్తుందా?" + +"ఔను" + +"మరిప్పుడీ సందేహం, అభ్యంతరం ఏమిటి?" + +"వారు విశిష్టాద్వైతులు" + +"చెప్పారు" + +"మేము అద్వైతులం" + +"నాకా భేదాలు అర్ధం కావు" + +"వారూ అద్వైతులే. కొంచెం భేదం. అది తాత్త్వికాలోచనలకు పరిమితం." + +"ఈ తాత్త్వికాలోచనలతో కనిపించే భేదం ప్రకృతికీ – మనిషికీ మధ్య, దేవునికీ – మనిషికీ మధ్య, మనిషికీ, మనిషికి +మధ్య వున్న, ఉండగల సంబంధాల సమన్వయం గురించినవే కదా!" + + అంతవరకూ అభ్యంతరం చెప్పవలసింది కనిపించకపోయినా శాస్త్రి చటుక్కున కాదనలేకపోయాడు. ఆలోచనలో పడ్డాడు. + +"అయిదారేళ్ళ క్రితం అనుకుంటా ఇలస్ట్రేటెడ్ వీక్లీలో కన్నడ రచయిత – ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. అనంత మూర్తి +అనుకుంటా. వారి నవల ‘సంస్కారం’ కు అనువాదం చదివాం." + +"ఔను..." + +"అప్పుడే అందులో ఉన్న సంఘర్షణ గురించి మీరు చెప్పారు." + +"ఔను..." + +"ఆంధ్రలో మీరు ఆ మతం వారిని." + +"విశిష్టాద్వైతుల్ని, వారిని మధ్వ బ్రాహ్మణులంటాం." + +"కానీ, కర్ణాటకలో మిమ్మల్ని వారు బ్రాహ్మణులుగా చూడరని చెప్పారు." + +"ఔను..." + +"కాని, రామకృష్ణ ఎంపికకు మీరు అభ్యంతరం చెప్పలేదు." + +"లేదు. అది నిషేధించడం తగిన అభ్యంతరం కాదు. ఆలోచనా ధోరణిలో ఉన్న భేదం తప్ప రెండు మతాలూ వేద ప్రమాణాన్ని +అంగీకరిస్తున్నవే." + +"అసలు దేవునికి కన్న దేవుని వాక్యానికి విలువనిస్తున్నారనాలా?" + + ఆ నవల మీద వచ్చిన చర్చలో వినబడ్డ మాటలే. కాని, సందర్భాన్ని బట్టి వాటికానాడు కనిపించని కొత్తబలం కనిపించి +శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. + + + + +25 + + +చీకటి పడే వేళకి కారు రాజమండ్రీ చేరింది. + +"ట్రావెలర్స్ బంగళాకి వెడదాం. కారు పంపుతే రామకృష్ణ వస్తారు. ఈ లోపున మనం విశ్రాంతి తీసుకోవచ్చు." + + శాస్త్రికి ఆ సలహా బాగానే వుంది. కొడుకును వెంటనే కలుసుకోవడం, సంప్రదించడం అవసరమనిపిస్తున్నా, కారులో జరిగిన +చర్చలు మధ్యాహ్నం కనిపించిన ఆదుర్దాను సర్దేసేయి. + +"సరి. నేను గోదావరీ స్నాన పుణ్యం కూడా దక్కించుకుంటా, ఈ లోపున ." + +"మీ భోజనం?" + +"రాత్రి భోజనం మానేసి ఐదారేళ్ళయింది. రెండు అరటి పళ్ళు చాలు. గోదావరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటా." + +"రామకృష్ణ కోసం వెడుతున్నాడుగా డ్రయివర్. బజారులో దొరికిన పళ్లు తెమ్మంటా." + +శాస్త్రి గోదావరికి బయలుదేరాడు. మధ్యాహ్నం కలిగిన మానసిక వ్యథ ఇప్పుడేమాత్రం లేదు. హఫీజ్‌తో చర్చలలో మతం +వచ్చింది. ప్రపంచ రాజకీయాలు కదిలాయి. సాహిత్యం ప్రసక్తి వచ్చింది. హాస్య ప్రసంగాలు నడిచాయి. ఏమి జరగనట్లే గోదావరి +స్నానానికి బయలుదేరాడు. తనకే ఇదేమిటనే ఆలోచన కలుగకపోలేదు. అది ఆశ్చర్యం కలిగించిందేగాని, అంతకన్న ఏమీ చలనం +లేదు మనస్సుకి. తెచ్చుకోవాలనుకున్నా ఇందాకటి దు:ఖం లేదు. + +స్నానం, సంధ్యా ముగించుకుని వచ్చేసరికి పట్టణంలోకి వెళ్ళిన డ్రయివరూ వచ్చాడు. అతనితో ఓ పాతికేళ్ళ పడుచు వచ్చింది. +వచ్చేసరికి ఆమె హాఫీజుతో మాట్లాడుతోంది. తన్ను చూడగానే కుర్చీలోంచి లేచి ముందుకు వచ్చి నమస్కారం చేసింది. + +"వారేనమ్మా! మీ మామగారు" అంటూనే ఆమెని పరిచయం చేశాడు హాఫీజు. + +"మీ కోడలు భాయీసాబ్." + +శాస్త్రి తెల్లబోయాడు. రామకృష్ణ పెళ్లి చేసేసుకున్నాడన్నమాట. తమకి చెప్పకుండానే – మాట మాత్రంగా కూడా! మనస్సుకి కష్టం +అనిపించింది. ఏమీ అనలేకపోయాడు. ఈ హఠాద్వార్తకి సహజంగా నోట రావలసిన ఆశీర్వాదం కూడా చేతకాలేదు. ఉండమన్నట్లు చేయి +ఊపి తన గదిలోకి వెళ్ళిపోయాడు. + +అన్య గోత్రీకుడికే కన్యాదానం చేయడానికి తాను నిరాకరించడం చేత కొడుకు తనకు చెప్పకుండానే, పిలవకుండానే పెళ్ళి +చేసేసుకున్నాడన్నమాట! ఉమ విషయంలో తాను ఇచ్చిన సలహా అది. ఇప్పుడు రామకృష్ణను తప్పుపట్టవలసిన పనేముంది? + +"క్షమించండి మామయ్యగారూ! నేను లోపలికి రావచ్చా?" + +గుమ్మంలోనే క్షమాపణ చెప్పుకుంటూ అనుజ్ఞ కోరుతున్న ఆ యువతిని శాస్త్రి సాదరంగా ఆహ్వానించాడు. కుర్చీ చూపి కూర్చోబెట్టాడు. + +"వాడేడీ? నువ్వొక్కర్తెవే వచ్చావు. పెళ్ళెప్పుడు చేసుకున్నారు." + +"ఆగష్టు తొమ్మిదిన రిజిస్ట్రారాఫీసుకు వెళ్ళేం." + +"అన్న చెల్లెళ్ళిద్దరికి స్వాతంత్ర్య దినోత్సవాలతో తమ జీవితాల్ని ముడిపెట్టుకోవాలనే ఆలోచన ఒక్కమారే కలిగిందేం?" + +కల్పన ఉలికిపడింది. + +తానన్న మాటకి శాస్త్రి నాలుక కరచుకున్నాడు. అన్న వివాహాన్ని అభిశంసించడమా? – ఆ వాక్యానికేమిటర్ధం? + +"రేపు శనివారం ఇద్దరం బెజవాడ రావాలనుకున్నాం. ఇంతలో, నిన్న విశాఖ నుంచి వదినగారు టెలిఫోన్ చేశారు. వెంటనే అటు +వెళ్ళారు." + +"మంచి పనే చేసేడు." + +ఇక శాస్త్రి జాగ్రత్తపడి కల్పన కుటుంబం, ఆమె ఉద్యోగం, భవిష్యత్తును గురించిన వారి ఆలోచనలు ఆనుపూర్వికగా, +సవివరంగా తెలుసుకున్నాడు. ఆశీర్వదించి పంపేడు. + +"రాండి, తప్పక వస్తూ పోతుండండి." + +అయిదారేళ్ళుగా తమ ఒత్తిడిని పాటించకుండా పెళ్ళిని నిరాకరిస్తూ వచ్చిన కొడుకు పెళ్ళి చేసుకున్న వార్త శాస్త్రిని ఆలోచనలో +పెట్టింది. మధ్యాహ్నంకన్నా మనస్సు ఘటనలను పర్యాలోచించగల నిబ్బరం ఏర్పడింది. + +తన విశాఖ ప్రయాణం ఉద్దేశం ఏమిటి? ఆ వివాహం జరగకుండా నిషేధించడానికా? ఆ జంటను ఆశీర్వదించడానికా? అర్ధం +కావడంలేదు. + +తీరా వెళ్ళి తాను చెయ్యగల దేమిటి? ఏడ్చి, బతిమాలాలి. ఇప్పుడా మాటకి ఏడ్పు రావటంలేదు. బతిమాలడం అంటే ఏమని? ఈ +పెళ్ళి చేసుకోవద్దనా? ‘ఎందుచేత వద్దంటున్నావు’ అని అడిగితే ఏం చెప్పాలి. + +వరుడుగా అసదుల్లాని ఎంచలేడు. స్ఫురద్రూపి, మంచి విగ్రహం మంచితనం ఉంది. చిన్నప్పటి నుంచి తానెరుగును. పిల్లనివ్వకూడని +దుర్లక్షణాలు ఏమీ లేవు. మంచి తెలివీ, విజ్ఞతా, చదువూ ఉన్నాయి. + +ఇక అభ్యంతరం మతం. దారిలో సాగించిన చర్చలూ, ఇక్కడికి వచ్చాక చూసిన కోడలూ మత భేద అభ్యంతరాన్ని +నిరాకరిస్తున్నాయి. అయినా ఎక్కడో ఉంది. మనసు అంగీకరించడంలేదు. ఎందుచేత? + +అంగీకరించలేక బతిమలాడుకుంటే ఉమ అంగీకరిస్తుందనే అనుకుందాం. తరువాత బాధ్యత? ఆమెకు తాను పెళ్ళి చేయగలడా? శుభలేఖల +వరకూ వచ్చిన ఈ మతాంతరపు పెళ్ళి ఆమె వైవాహిక జీవితానికి పెద్ద ప్రతిబంధకం కాక మానదు! చివరకు చేతులు ఎత్తేసి +ఆమెను యావజ్జీవ బ్రహ్మచర్యం చేయమనాలి. లేదా, ‘నీకు తోచిన వాడిని నువ్వే వెతుక్కో తల్లీ!’ అనాలి. ఆ మాత్రం దానికి +ఆ పని ఇప్పుడే చెయ్యెచ్చునుగా? + +ఆ మాట తోచేసరికి శాస్త్రికి తన జీవితం పొడుగునా తన అనుభవం – ఇలా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతుండడమూ, వాటికి +తల ఒగ్గుతూ అందులోనే చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తూ కాలక్షేపం చేస్తూ పోవడమూ బాగానే కనిపించింది. ప్రపంచం అంతా అలాగే +ఉంటుందా? లేక, తన ఒక్కడికేనా ఈ అనుభవం? + + + + +26 + + +గతమంతా ఒక్కమారు నెమరుకు వచ్చింది. + +జీవితంలో వేసిన ప్రతి అడుగూ మరో ప్రపంచంలో పెడుతున్నట్లే ఉండడం చంద్రశేఖర శాస్త్రికి చిన్నప్పటి నుంచీ అనుభవమే. + +ఇష్టం లేమి, సందేహం, తటపటాయింపు, మొరాయింపు, మెడ్డువారీ. + +చివరకు ఆ నూతన ప్రపంచంలో అసంతృప్తితోనైనా అడుగుపెట్టక తప్పడంలేదు. తీరా అడుగు వేశాక మరింక ఆ బెదురూ, భయమూ +కనిపించకపోవడమే కాదు, ఒక్కొక్కప్పుడు ఆ పాత ప్రపంచంలో ఎలా బ్రతికామా అని ఆశ్చర్యపడిన ఘట్టాలు కూడా లేకపోలేదు. +మరి వెనక్కి తిరిగి పోదామనిపించనేలేదు. ఎప్పుడూ. అనిపించినా అది సాధ్యం కాదు. + +జీవితాన్నే మార్చిన ఘట్టాలతోనే కాదు, అతి సామాన్యమైన చిన్న చిన్న విషయాలలో కూడా అదే అనుభవం. + +చిన్నప్పుడు శీతాకాలంలో ముంగండ చెరువు పెద్దపావంచాల పిట్టగోడ చివరన ముడిచిపెట్టుక్కూర్చుని, చలికి ‘ఉహుహూ’ అని +వణికిపోతూ తుండు ఒంటి నిండా బిగలాక్కుంటూ నీళ్ళలో దిగకుండా కాలయాపన చేస్తూ వచ్చిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. + +ఎవళ్ళకి వాళ్ళు తాము కదలకుండానే పక్కవాడిని ‘దిగరా’ అని పొడిచేవాడు. రెండోవాడు తప్పకుండా కసిరేవాడు. + +"అబ్బ, ఉండరా! ఒక్క నిముషం. ఆ నీటి కాకిని చూడు. అదీమారు తేలినప్పుడు" అని నడువు పెట్టేవాడు. + +నీటి కాకి తేలడానికీ, తాము నీటిలో దిగడానికీ నిజానికేమీ సంబంధం లేదు. అదేం మొసలి కాదు – కాలు పట్టుకుని లాక్కుపోతుందనే +భయం లేదు. జాప్యం చేయడానికి అదో హద్దు. అందరూ అలాంటివాళ్ళే, కనుక సంతృప్తి పడేవారు. కబుర్లు చెప్పుకుంటూ బైఠాయించేవారు. +కొద్దిసేపటిలోనే నీటి కాకి తేలడం హద్దుగా పెట్టుకున్న మాట మరిచిపోయేవారు. ఆ కాకి మునుగుతూ, తేలుతూ తన వేట తాపత్రయంలో +తానుండేది. తామంతా అక్కడే కూర్చుండిపోయేవారు. + +ఇంక ఆలస్యం చేయడానికి వీలులేనంతగా వేళ మించేది. లేచేవారు. నిలబడి రెండు చేతుల వేళ్ళతో చెవులూ, ముక్కులూ మూసుకుని ఒక్క +ఊపుతో పల్టీకొట్టి నీటిలో పడేవారు – ఒకరి తరువాత ఒకరు. + +దిగేవరకే చలి! + +తర్వాత ఓ అరగంటసేపు చెర్లో ఈత కొట్టేవారు. మోకాలి బంటి నీటిలో పావంచాల మీద నిలబడి తడిగుడ్డలతోనే సంధ్యావందనం +చేసేవాడు. చలే అనిపించేదికాదు, మరి! + +ఇంత చిన్న విషయం నుంచి తన జీవిత విధానాన్నే మార్చివేసిన విద్యా విషయం వరకూ....అదే అనుభవం. + +ఏభయ్యేళ్ళకు పూర్వం తమ కుటుంబంలో ఇంగ్లీషు చదివిన వారెవరూలేరు. + +సంస్కృత పండితుడుగా, వైయాకరణిగా పేరు మోసిన సుబ్రహ్మణ్యశాస్త్రి తన కొడుకును తనంతవాణ్ణి చేయాలని పూనుకున్నాడు. +చంద్రశేఖరశాస్త్రి ఆయన ఆశల్ని, ఆశయాల్ని సఫలం చేశాడు. పద్దెనిమిదేళ్లు వచ్చే సరికి మంచి సాహిత్య జ్ఞానం +సంపాదించాడు. కౌముది జిహ్వాగ్రాన పెట్టుకున్నాడు. పాణినీయం, భట్టోజీ దీక్షితీయమూ తమ ఊరి చెరువుగట్టు మీది రావిచెట్ల +గుబురుల్లోని రామచిలకలక్కూడా నేర్పేశాడని గ్రామస్థులంతా మెచ్చుకునేవారు. సరిగ్గా ఆ సమయంలోనే తన విద్యా వ్యవసాయంలో +పెద్ద మార్పు వచ్చింది. + +తన కొడుకుకు సాంప్రదాయక విద్యలోనే తర్ఫీదునివ్వాలనే ఆలోచన సుబ్రహ్మణ్యశాస్త్రిలో ఏర్పడడానికో కారణం వుంది. హూణ +విద్య నేర్చుకున్న వాళ్ళంతా వీరేశలింగాలూ, వెంకటరత్నం నాయుడులూ కాకపోయినా, వర్ణాశ్రమ ధర్మాల యెడ వారి శ్రద్ధాసక్తులు +వేర్వేరు అంతరువులతో తగ్గిపోతుండడాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రాచీన సంప్రదాయాల యెడ నిరసన భావం వారిలో పెరుగుతోంది. +వేదాల అపౌరుషేయతను ప్రశ్నిస్తున్నారు. బాలగంగాధరతిలక్ ‘వేదకాల నిర్ణయం’ పాఠ్యగ్రంథంలా చదువుతున్నారు. పెండ్యాల +సుబ్రహ్మణ్యశాస్త్రి ‘భారత విమర్శ’ చదవండని ఒకరికొకరు సలహాలిస్తున్నారు. కట్టు, బొట్టు, జుట్టులతో హూణ +సంప్రదాయాలననుసరిస్తున్నారు. ఈ ధర్మ భ్రష్ఠత తమ ఇంట్లో అడుగుపెట్టరాదని ఆయన కోరిక. + +హూణ విద్య నేర్చి, ధర్మభ్రష్టు లయినందుకు బహుమానమేమో అన్నట్లు అటువంటి వారి జీవితాలు బాగానే వెడుతున్నాయి. ధనం +సంపాదించుకుంటున్నారు. వారికే సంఘంలో మన్నన, మర్యాదా లభిస్తున్నాయి. + +సుబ్రహ్మణ్యశాస్త్రికి ధనం మీద పెద్ద మమకారం లేదు. నాలుగు వేళ్ళూ లోపలికి పొతే చాలు. ఆ మాత్రానికి లోటు లేదు. +కోనసీమలో నాలుగైదెకరాల బోదె కొబ్బరితోట, మరో మూడు నాలుగెకరాల ఊడ్పుచేస్తూ ఉందంటే – రాజును తాతా "అని పిలవ్వచ్చు" +సామాన్య సంసారి. ఆయనకామాత్రం ఉంది. ఏటా ఓ నాలుగు నెలలు సంచారం చేస్తే నాలుగైదు వందలు చేతిలోపడే వార్షికాలున్నాయి. +దీనితో తన కుటుంబం సుఖంగా జీవిస్తోంది. తన కొడుకు కూడా అదే విధంగా ధర్మభ్రష్టుడు కాకుండా సుఖ జీవితం గడపగలగాలని +ఆయన అభిలాష. విశ్వాసం. + +అయితే ఆ విశ్వాసం ఎంతో కాలం నిలవలేదు. నలుగురు ఆడపిల్లలకి పెళ్ళిళ్లు చేసేసరికి ఆస్తి మెట్టుమెట్టుగా 'హ్రస్వం లఘు' +అయింది. ఆ రోజుల్లో కట్నాలనీ, కానుకలనీ ఓ పెద్ద సమస్య కాదు. ఆయనకున్న పేరు ప్రతిష్టల ఫలితంగా ఆడపిల్లలకి +మంచి సంబంధాలే వచ్చాయి. శుభాకార్యాలనేసరికి వార్షికాలిచ్చేవాళ్లు ఇబ్బడి ముబ్బడీ ఇచ్చిన వాళ్ళున్నారు. అయినా ముంగండలాంటి +ఊళ్ళో కార్యకరామత్తులు చేయబూనుకున్నప్పుడు ఒకటి రెండెకరాలు కరా రావుడు చుట్టకుండా బయటపడడం అంత సులువేం కాదు. అంతటితో +తేలి బయటపడడమే గొప్ప. + +నాలుగైదు పెళ్ళిళ్ళు పూర్తి అయ్యేసరికి ఆస్తి మూడు వంతులు హరించి పోయింది. పెళ్ళిళ్ళప్పుడు ఇబ్బడి ముబ్బడీ ఇచ్చిన +పండితాభిమానులు మరుసటి సంవత్సరం మామూలుగా కూడా సత్కారం చేయలేకపోయారు. ఒక ఏడాది వార్షికం తగ్గించాక మరుసటి +సంవత్సరమైనా దాన్ని యధాస్థితికి తెచ్చే స్తోమతా కనబడలేదు. + +"శాస్త్రులుగారూ! ఏదో ఇలాగ పోనీయండి. తమ పాండిత్యానికి తగిన సత్కారం ఎన్నడూ చేయలేకపోయామే అనేదే మా విచారం, అయితే +మా పనీ అంతంతగానే ఉంది. వెనుకటి రోజులుకావు..." + +ప్రపంచయుద్ధం, యుద్ధానంతరపు ఆర్ధిక బాధలు, సత్యాగ్రహాలు, ఆర్థిక మాంద్యం, ప్రతి ఒక్కటీ తాత చేతికి శుక్రాచార్య +ప్రతినిధి స్వరూపాలే. కటువుగా చెప్పినా, మృదువుగా చెప్పినా, కాణీ ఇచ్చినా, కాసిచ్చినా కొద్ది గొప్ప పాఠ భేదాలతో అవే +మాటలు పొడుగునా వినపడుతూండేసరికి సుబ్రహ్మణ్యశాస్త్రి నిలబడి ఆలోచించక తప్పలేదు. + +తాను నిరసించే హూణ భాషనే చదువుకున్న తన ఈడువాళ్ళే ఊళ్ళో నలుగురైదుగురు సుఖ జీవితం గడుపుతున్నారు. వారిలో ఒకరు +హైస్కూలు హెడ్మాస్టరు. స్కూల్లోనూ, ఊళ్ళోనూ కూడా మంచి మన్నన పొందుతున్నాడు. మరొకాయన లాయరు. ఒకరు డాక్టరు. ఇద్దరు +స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్లు. స్థిరమైన ఆదాయాలు – నిజం చెప్పాలంటే వాళ్ళనే ‘నప్రతిగ్రహీత’లనాలి. + +కొత్త ఆలోచనలకు అవసరం ఏర్పడ్డాక సుబ్రహ్మణ్య శాస్త్రికి తన సంపాదన యాచనగా తోచడంలో ఆశ్చర్యం లేదు. అంతవరకూ +హూణ భాషగా ఈసడించినది ఇంగ్లీషు అయింది. ధర్మభ్రష్టులుగా కనిపించిన వారిలో కూడా ఆర్ష సాంప్రదాయాల యెడ అభిమాన చిహ్నాలు +కనిపించసాగాయి. క్రాపులలో దాగి ఉన్న పిలకలనిప్పుడు గుర్తిస్తున్నాడు. హడావుడిగానైతేనేం ఆచమనం చేసి గాయత్రీ జపం పూర్తి +అయిందనిపిస్తున్నారని సంతోషిస్తున్నాడు. రిటైరయ్యాక భగవద్గీత, సుందరకాండ పారాయణం చేస్తున్నారు. కొందరు బ్రహ్మసూత్రాలకు +శంకర భాష్యం చెప్పించుకొనేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. + +ఇవన్నీ బేరీజు వేసుకున్నాక సుబ్రహ్మణ్య శాస్త్రి తన విశ్వాసాల్ని మార్చుకోడానికి సందేహించలేదు. ధర్మభ్రష్టత పూర్తిగా +విద్య వలన కలగదు. వ్యక్తుల సంస్కారం ప్రధానం. కడుపు నిండే పద్ధతిని బట్టి ఆ సంస్కారం ఉంటుందనే నిర్ణయానికి +వచ్చాడు. కొడుకును పిలిచాడు. + +ఆ విధంగా చంద్రశేఖరశాస్త్రి తన జీవితంలో వచ్చిన తొలి మలుపు మొగదలకి చేరాడు. + + + + +27 + + +ఆనాడు తాను చేసిన మెడ్డువారీ గుర్తుకు వచ్చి ఈ వేళ కూడా శాస్త్రి నవ్వుకున్నాడు. తాను అంత మూర్ఖంగా ఎలా +మాట్లాడగలిగేనాయని సిగ్గు కూడా కలిగింది. కుటుంబ పరిస్థితులు, తన సంపాదనలు, ప్రపంచ గతిని వివరించి తండ్రి తన్ను +ఇంగ్లీషు చదువుకోమన్నాడు. దానికి కావలసిన సమాచారం అంతా ఆయనే సేకరించాడు. + +"రెండేళ్ళలో నిన్ను బెనారస్ మెట్రిక్ కు కట్టిస్తానని కామేశ్వరరావు చెప్పాడు." + +కాని, ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పేసరికి తండ్రి కొయ్యబారిపోయాడు. అలాగని తాను చెప్పినదీ ఏం లేదు. అంతవరకూ ఆయన +చెప్పిన వాదాలే. అయితే ఉదాహరణలు మాత్రం తనవి. + +సూరయ్యగారి వెంకటశాస్త్రి ఉద్యోగంలో సెలవు దొరకలేదని వారు బ్రాహ్మలకి కాళ్ళు కడిగి తండ్రి తద్దినం అయిందనిపించేశాడు. + +చిన్నాన్నగారి గోపాలం ఆఫీసు నుంచి చొక్కా తీస్తూంటే జందెంకూడ లేచి వచ్చింది. చూసుకోనేలేదు. మర్నాడు స్నానం చేసేటప్పుడు పెళ్ళాం +చెప్పే వరకూ వాడు చూసుకోనేలేదు. అప్పుడైనా మాట్లాడకుండా వెతికి తెచ్చి గప్‌చుప్‌గా మెళ్ళో తగిలించుకున్నాడే +గాని, కనీసం గాయత్రీ మంత్రాన్నైనా అనుకోలేదు. + +రామచంద్ర చయనులు బహిష్టయిన భార్యా, తానూ యింతింత దూరంలో మంచాలేసుకుంటారు. కబుర్లు చెప్తూ మధ్య మధ్య ఆమెను కర్రతో +పొడిచి చక్కలిగిలి పెడుతూంటాడు. + +ఇలాగే అనేక అక్కార్యకరణాలూ, అబ్రహ్మణ్యాలూను. తాను తెచ్చిన వాదాలు, చేసిన బోధలే కొత్త మాటలతో వినబడేసరికి +ముసలాయన నీరయిపోయాడు. అయితే ఏమనలేదు. ఆ సంవత్సరం సంచారానికి వెళ్ళేటప్పుడు మాత్రం బయలుదేరదీశాడు. + +ఇంటికి తిరిగి వస్తూనే చంద్రశేఖరశాస్త్రి స్వయంగా కామేశ్వరరావును కలుసుకున్నాడు. బెనారస్ మెట్రిక్ చదవడానికి కావలసిన +పుస్తకాలూ, సరంజామా చూసుకున్నాడు. తండ్రితో తాను ఇంగ్లీషు చదవదలచానని చెప్పేశాడు. ఆయన ఉత్సాహమూ చూపలేదు, వద్దనీ +అనలేదు. + +"నీ ఇష్టం. నా జీవితాధ్యాయం స్వస్త్యంతానికి వస్తోంది. కష్టసుఖాలూ లాభ నష్టాలూ, మంచి చెడ్డలూ నీవి నువ్వే చూసుకోవాలి" +అన్నారు. + +చంద్రశేఖరశాస్త్రి పోయిన కాలాన్ని కూడదీసుకునేందుకు దీక్ష పట్టాడు. సహజంగా తెలివి ఉంది. పట్టుదలా ఉంది. ఒక భాషలో +మంచి పాండిత్యం ఉంది. వయస్సులో గ్రహణ శక్తీ కృషితో ధారణ శక్తీ నిశితం అయ్యాయి. + +మెట్రిక్ పాసయ్యాడు. పోయి కాకినాడలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. రెండేళ్ళు ఇట్టే గడిచాయి. మంచి మార్కులతో +పాసయ్యాడు. ఏది చదివినా స్కాలర్‌షిప్ దొరికే అవకాశం ఉంది. లెక్చరర్లు ప్రోత్సహించారు. + +శాస్త్రి తండ్రి సలహా అడిగాడు. + +చదువుతున్నది ఇంగ్లీషయినా, సాధ్యమైనంత వరకు బ్రాహ్మణధర్మం చెడగొట్టుకోకుండా అవకాశాల కోసం ఆయన వెతికారు. + +"వైద్యం అన్నావూ, అడ్డమైన వాళ్ళనీ ముట్టుకోవాలి. నానా పుళ్ళూ కడగాలి. అది మనం బ్రాహ్మలం చేయలేం. అందుకే మనువు +దానిని అపాంక్తేయంగా బహిష్కరించాడు. మనకు తగదు." + +"యుద్ధం ప్రారంభమయింది గనుక మంచి ఉద్యోగాలు దొరుకుతాయంటున్నారు. కాని నాకది ఇష్టంలేదు." + +"వద్దు. మరొకటి బి.ఎల్. కావడం....కాని ఛెస్! పాడు వృత్తి. తెల్లారి లేస్తే అన్నీ అబద్ధాలే! అసలు ఆ బతుకే ఓ +అబద్ధాలపుట్ట. మనకది వద్దు." + +"అలాగే." + +"ఇంజనీరింగ్ అన్నావూ, మంచి ఉద్యోగాలే దొరుకుతాయి. జీతపురాళ్ళే గాక పైపరమానం కూడ బాగానే ఉంటుంది. చేతికింద పదిమంది +ఉంటారు. కాని తిరుగుడు. నెలలో ఇరవై రోజులు మకాములే. నిత్య ప్రయాణాలతో చివరికి సంధ్యావందనం కూడ వెక్కసమైపోతుంది. +వద్దది." + +".... ...." + +ఈమారు కొడుకు సమాధానం ఏదీ ఇవ్వలేదని సుబ్రహ్మణ్యశాస్త్రి గమనించనే లేదు. + +"నా దృష్టిలో మేస్టరీ అంత రాజ ఉద్యోగం లేదు. విద్యాదానం చేశామని తృప్తి ఉంటుంది. ఎక్కడికీ కదలనక్కరలేదు. వారానికో +రెండు రోజులు సెలవులు. వానాకాలం అనీ, శీతాకాలం అనీ, వేసవికాలమనీ ఏటా నాలుగు నెలలు సెలవులే. కనుక నా మాటవిని +బి.ఎ. లో చేరు." + +తండ్రిని సలహా అడగకపూర్వమే చంద్రశేఖరశాస్త్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంగ్లీషు చదువు ప్రారంభించినప్పటినుంచి అతని +మామ్మగారు అతని ముఖంలో సబ్‌డివిజనల్ ఆఫీసరు కళనే చూస్తున్నారు. + +ముంగండకి రెండు మైళ్ళలో గన్నవరం వద్ద సబ్‌డివిజనల్ ఆఫీసు వుంది. వశిష్ఠానదిమీద పడవల కాలవను దాటించేందుకు +కట్టిన ఆక్విడక్ట్ అక్కడుంది. దాని మొగలో ఈవలి ఒడ్డున గోదావరి పక్కనే ఆఫీసు, ఏటికాలవకీ, గోదావరికీ మూలలో చాలా +సుందరమైన ప్రకృతి దృశ్యం మధ్యనున్న ఆ బంగళాను ఆమె గోదావరి స్నానాలకు వెళ్ళినప్పుడూ, వరదలలో ఆక్విడక్టువద్ద నది +ఉరవడి దృశ్యాలు చూడబోయినప్పుడూ గమనిస్తూంటుంది. రైతులు, కాలవలమీద కాంట్రాక్టర్లూ, కళాసీలు ఎప్పుడూ ఓ అరడజను మందికి +తక్కువ కాకుండా అక్కడుంటారు. ఆకుమడుల కాలంలో వర్షాలు బిగపడితే, నీటి ఎద్దడి ఏర్పడితే రైతులు ఎకరానికింతని చందాలు +వేసుకుని ఆఫీసరుగారికి సమర్పిస్తుంటారని పల్లెటూళ్ళలో బాగా ఎరికే. ఆయన ప్రయాణాలకో 'బోట్ హౌస్ ' ఉంటుంది. ఇవన్నీ +వింటూంటే, చూస్తుంటే ఆ ముసలమ్మకు అంతకన్న మంచిదీ, పెద్దదీ ఉద్యోగం ఉంటుందనిపించలేదు. ఇంజనీరింగ్ చదివినవాళ్ళకి ఆ +ఉద్యోగం వస్తుందని ఆమె విన్నది. కనుక మనుమడిని ఆ చదువుకు వెళ్ళమంది. + +ఆమె అభిప్రాయం చంద్రశేఖరశాస్త్రికి నచ్చింది. + +"కుల విద్య మానుకుని, మ్లేచ్చ చదువులకి అడ్డు పడ్డాక కూడా వార్షికాలూ, మాసికాలేనా ప్రారబ్దం!" అన్నాడు. + +ఆ నిర్ణయాన్ని తండ్రి కాదనలేదు. + + + + +28 + + +చంద్రశేఖరశాస్త్రి వెళ్ళి గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. + +అక్కడి జీవితం అంతా కొత్తగా ఉంది. కాకినాడలోలాగా అక్కడ వారాలు చేసుకోవడం సాధ్యంకాదు. పట్టణంలో దూరాభారాల సమస్యేకాదు, +అసలు చదువు స్వభావమే అంత. + +కాలేజీ హాస్టలులో ఎంత జాగ్రత్తగా ఉండదలచినా బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోవడం ఏ విధంగానూ సాధ్యమనిపించలేదు. రెండోరోజునే +సహపాఠకులకి అతని ఆచారపు పట్టుదలల సడి తగిలింది. డైనింగ్ హాలులో ఎంత మూలకు చేరి ఆక్షణం గడుపుకుపోదా మనుకున్నా +కుదరకుండా చేస్తున్నారు. పనికట్టుకుని వచ్చి భుజం తట్టి పలకరిస్తున్నారు. యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. మొదటిమారు అలా +ముట్టుకున్నప్పుడు భోజనం వదలి వెళ్ళిపోయాడు. అది మరింత అలుసయింది. కొంతమంది జాలిపడి అటువంటి పరిస్థితి రాకుండా చేయడానికి +సిద్ధపడ్డారు. కాని ఓ వారం అయ్యేసరికి అదీ సాధ్యం కాలేదు. + +ఇంక నలుగురితో కలిసిపోయి ఆచారపు పట్టింపు కట్టిపెట్టడమో, చదువు కట్టిపెట్టి రైలెక్కేయడమో! + +శాస్త్రి రెండవదే ఎన్నుకున్నాడు. చదువు--బ్రాహ్మణ ధర్మం సహజీవనం చేయలేవనే ధోరణి బలమవుతున్న కొలదీ భార్య +ఆకర్షణ బలపడసాగింది. పరిచయం నెలరోజులదే అయినా కొత్తగా కాపురానికి వచ్చిన ఆ మగ్దమోహన మూర్తి అతనికి +అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. అదో పెద్ద బెడదయిపోయింది. + +కొడుకు ఇంజనీరింగ్ చదువుకు మొగ్గుదల చూపగానే ఏడాదిక్రితమే యుక్తవయస్కురాలయిన కోడల్ని తీసుకురావడం ధర్మం అనుకున్నాడు +సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆమె పుట్టింటివైపు నుంచికూడా ఒత్తిడి రావడం ఆయన ఆలోచనకు వత్తాసయింది. + +ఇంటర్మీడియట్ పరీక్షలయి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చంద్రశేఖరశాస్త్రి అత్తవారి ఇంటిమీదుగా వచ్చాడు. అక్కడకు వెళ్ళిన +రోజునే భార్య ఏకాంతంలో దొరికింది. మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. +అటూ ఇటూ దగ్గరలో ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు తమ తమ పనుల్లో ఉన్నారు. అతడు చల్లగా గది తలుపులు బిగించాడు. + +విధవ వదినగారు ఆ సంగతి పసికట్టింది. చెల్లెల్ని కోప్పడింది. "గర్భంగాని వస్తే నలుగురూ పొడుస్తారే" అని తానే ఆమె +బుగ్గలు పొడిచింది. తర్వాత అతడు అక్కడున్న నాలుగు రోజులూ మళ్ళీ అటువంటి వీలుదొరక్కుండా శ్రద్ధ తీసుకుంది. + +అల్లుడి ఆరాటం కనిపెట్టి మామగారు వియ్యంకుడికి పునస్సంధానం విషయం హెచ్చరిస్తూ జాబు రాశాడు. వెంటనే సుబ్రహ్మణ్యశాస్త్రి ఆ +ప్రయత్నం చేశాడు. చదువు చెడిపోతుందని శాస్త్రి బెట్టుచేసినా ఎవరూ లెక్కచేయలేదు. అతని ప్రణయగాధ అప్పటికే అందరికీ +తెలిసిపోయింది. నవ్వుకున్నారు ఆ బెట్టు చూసి. పైకి మాత్రం "ఈడేరిన పిల్లని నాలుగైదేళ్ళు నీ చదువు పూర్తయ్యేదాక పుట్టింట +వదిలివేయడం మర్యాదకా" దని మృదువుగా కోప్పడ్డారు. కార్యం కానిచ్చేశారు. + +అదివరకు శబ్దార్ధాలే గాని, భావాల లోతులు తెలియని ఘట్టాలన్నీ ఇప్పుడు మనసులో మెదులుతుంటే సంసారానందంతోపాటు కావ్యానందం కూడా +అతని అనుభూతిలోకి వచ్చింది. + +అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణోరవిదిత గతియామా రాత్రి రేవవ్యరం సేత్--అన్న భవభూతి శ్లోకంలోని లోతులు అతనిని +తీరిక సమయాలలో గిలిగింతలు పెట్టసాగాయి. ఓ రోజున చివరికి బిచాణా కట్టేశాడు. + +జ్ఞాతాస్యాదో వివృత జఘనాం కో విహాతుం సమర్ధః అన్న కాళిదాస మహాకవి పరిజ్ఞానానికి జోహారులర్పించి రైలెక్కేశాడు. + +వస్తూ అత్తవారింటికే ముందు దారితీశాడు. అతడు చదువు కని మద్రాసు వెళ్ళగానే పుట్టింటివారు సత్యవతిని తీసుకుని వెళ్ళిపోయారు. + +హఠాత్తుగా, అనుకోకుండా వచ్చి గుమ్మంలో బెడ్డింగు దింపుతున్న చెల్లెలి మగణ్ణి చూసి విధవ వదినగారు చిరునవ్వు నవ్వింది. + +"సెలవు లిచ్చారేమిటోయ్?" + +"నేనే వాళ్ళకి సెలవిచ్చేశానండీ!" + +అయితే భార్యకోసమే కాలేజీ వదిలేశానన్నది ఒక్క భార్యతో తప్ప మరెవరితోనూ శాస్త్రి చెప్పలేకపోయాడు. హాస్టలులో ఉండి +బ్రాహ్మణ్యం కాపాడుకోవడం ఎంత కష్టమో--కాదు, అసంభవమో--వర్ణించాడు. తండ్రిగారి సలహాను మొదటనే పాటించనందుకు లెంపలు +వేసుకున్నాడు. కులం పోయాక కోటి సంపదలుంటేమాత్రం లాభమేమిటిలే అని ముసలమ్మ గన్నవరం సబ్ డివిజనల్ ఆఫీసరు బంగళా వంక +చూసి ఒక్క నిట్టూర్పు విడిచింది. + +అక్కడితో అతని చదువు ఆఖరయిపోయింది. ఆ ఏడాదికి కాలేజీలో చేరే గడువయిపోయింది. మరుసటి ఏడాదికి పరిస్థితులే మారిపోయాయి. +తండ్రి పోవడం, కుటుంబ భారం మీదపడటం, ఉన్న కొద్ది ఆస్తీ అమ్మి అప్పులు తీర్చవలసిరావడం, ఉద్యోగాన్వేషణ, +ఉద్యోగం--అదంతా ఓ గొప్ప పరుగుపందెంలా సాగిపోయింది. డిగ్రీమీద తన కుండిన ఆశ తీరలేదు. అదేమో తన సంతానంద్వారా తీరింది. + +ఆ ఘట్టాలన్నీ మనస్సులో తిరిగి శాస్త్రి ఒక నిట్టూర్పు విడిచాడు, అయితే తన జీవితంలో ఇదో కొత్త ఘట్టమేమో +అనుకున్నాడు. + + + + +29 + + +దీర్ఘప్రయాణంలో అలసిపోయి వున్న వృద్ద మిత్రుణ్ని చూశాక శాస్త్రి వెంటనే బయలుదేరుదామని తొందర పెట్టలేకపోయాడు. ఇప్పుడు +తనకే తొందర అనిపించడంలేదు పైగా అంతవరకూ మనసులో తిరిగిన ఆలోచనల ఫలితంగా తాను పరుగెత్తి వెళ్ళి చేయవలసిందీ, +చేయగలదీ కూడా లేదనిపించింది. మరి తొందరెందుకు? + +"రేపు పొద్దున్న బయలుదేరుదాం. మీరూ అలిసిపోయారు. విశ్రాంతి తీసుకోండి." అన్నాడు. + +హఫీజ్ మహమ్మదు ఆశ్చర్యపడ్డాడు. శాస్త్రిలో మార్పు ఏమిటో అర్థంకాలేదు. 'కృష్ణలో దిగడం తప్ప దారి లేదనుకున్నాడే ఈ +మారు దిగడానికి గోదావరి నెన్నుకోలేదు గదా కొంపతీసి '--అనుకున్నాడు. + +మిత్రుని మనసులో కదులుచున్న ఆలోచనలను గమనించినట్లు శాస్త్రి తన సూచనకు తాత్విక వివరణనివ్వడం ప్రారంభించాడు. + +"భగవదుద్దిష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనది నిమిత్త మాత్రమే అనడం కన్నా ఎక్కువ చేయడం కేవలం అహంభావం. +ప్రతారణమున్నూ కనుక మనం పరుగెత్తి వెళ్ళి చేసేదీ, తాపీగా వెళ్ళినా జరిగేదీ, అసలు వెళ్ళకపోయినా ముంచుకుపోయేదీ ఒకటిగానే +ఉంటుంది. సమయానికి వెళ్ళి అడ్డుపడ్డామనీ, ఇంకా ముందు వెళ్ళి వుంటే ఇలా జరగకనేపోయేదనీ భావన ఆత్మ తృప్తి, అహంకార +ప్రస్తారం, లోక ప్రతారణాను. అన్నీ పూర్వోద్దిష్ట ప్రకారమే జరుగుతాయి. అది భగవదుద్దిష్టం. ఆ ఉద్దిష్టం మన +ప్రారబ్ధ కర్మానుసారంగా వుంటుంది. ఆ వివాహం రేపు జరగవలసి వుంటే అది కర్మాధీనంగా భగవదుద్దిష్టమేమో! అందుకే మధ్యాహ్నం +మీకా వాగ్దానం ఇచ్చానేమో!" + +చటుక్కున గుర్తు వచ్చింది--"మీ కర్మ సిద్ధాంతం భగవంతుడి ప్రమేయాన్ని రద్దు చేసేసిందంటాడు అసదుల్లా. మీరు గతంలో చేసిన +కర్మలే ఇప్పటి మీ జీవితాన్ని నడిపిస్తున్నాయంటే నిజానికి మీ జీవితంలో దేవుడి ప్రమేయం లేదనే చెప్పాలి' అంటూండేవాడు." + +శాస్త్రిని ఏదో విధంగా మాటల్లో పెడితే తప్ప ఈ పిల్లల మూలంగా ఆయన మతి చలిస్తూందనిపించింది. + +* * * * * + +రామకృష్ణ కల్పించుకున్నాడు. + +"ఏమిటీ మీ అభిప్రాయం?" + +"మన తప్పు ఇతరుల మీద పెట్టవద్దనే. ఆమె ఇష్టం ఎక్కడుంటే అక్కడే పెళ్ళి చేసుకోవచ్చు. దానికి ఇతరులు కుట్ర +చేశారనే ఆరోపణ ఎందుకనిగాని." + +"మీ అభిప్రాయం తెలిసింది గనక సంతోషం. అల్లాగనే చేసుకుంటుంది. అయితే అంత మాత్రం చేత ఈ లేఖ కుట్ర ఫలితం కాకపోదు. +మాన నష్టం దావాలో మీరూ ఒక ముద్దాయిగా ఉందురుగాని..." అన్నాడు రామకృష్ణ. + +భాస్కరరావు తెల్లబోయాడు. + +"మాన నష్టం...?" + +"ఏం ఆశ్చర్యంగా ఉందా? ఆడపిల్లల జీవితాలతో చెలగాట మనుకున్నావుట్రా?" పళ్ళు కరకరలాడుతుంటే భాస్కరరావు తిరగబడి +చూశాడు. + +పార్వతీశం! + +"ఆ మాట అంటున్నది నువ్వేనట్రా!" + +"ఆవిడ మానాన ఆమె చదువో, దేశోపకారమో అని తన్నుకుంటుంటే, వెధవ పెద్దరికం నెత్తినేసుకుని పెళ్ళి ముగ్గులోకి ఈడ్చిందే +నేను. ఎవరితో... నీతో...స్వతంత్రంగా ఆలోచించుకోలేని నీతో." + +రామకృష్ణ అతన్ని వారించాడు. + +"తొందర పడకు. చేసుకోదలచిన పిల్లతో మాట్లాడకుండానే పెద్దలతో మాట్లాడి సంప్రదాయం నిలబెట్టుకోదలచుకున్న దానిని గురించి +శ్రద్ధ తీసుకోకపోవడంలో తప్పు నాదీ ఉంది. వదిలెయ్యి. మనమంతా ఒకే విధంగా సంప్రదాయాలకు దాసులమే. ఏమిటి +భాస్కరరావుగారూ! మీ...!" + +"ఇష్టం లేనప్పుడు లేదని తోసెయ్యకుండా, రిజిస్ట్రేషన్‌కు తేదీ కూడా నిర్ణయించి ఈ విధంగా చెయ్యడంలో +అర్థమేమిటి? నన్నవమానంపాలు చెయ్యాలని కాకపోతే..." + +"ఇష్టం... అనిష్టం సమస్యకి తర్వాత వద్దాం కాని, అవమానం అన్నారు చూడండి మిమ్మల్ని అవమానం పాలు చేసిందీ, అసలు +తాను మనుష్యుడే కాదని రుజువు చేసుకున్నదీ వేరొకరు. వారెవరో మీరే చెప్పగలరనుకుంటా. ఈ కాగితం మీద అక్షరాలెవరివో గుర్తు +పట్టగలరా?" + +రామకృష్ణ జేబులోంచి ఓ కాగితాల బొత్తి తీసి విప్పి పట్టుకున్నాడు. అదొక ప్రెస్ ప్రూఫ్ కాపీ. + +భాస్కరరావు దానికేసి ఓమారు చూసి తల తిప్పుకున్నాడు. + +"నాకు తెలియదు." + +"నాకూ తెలియదు. ఇందులో ఇద్దరి దిద్దుబాట్లున్నాయి. సిరాతో చేసినవి. ఆకుపచ్చ బాల్ పాయింట్‌తో చేసినవీ. వాటి +మాటే నేనడిగేది." + +"నాకెల్లా తెలుస్తుంది?" + +ఆ కంఠస్వరంలో అమాయకత్వం కాక తప్పించుకోవాలనే ధోరణి వ్యక్తం అవుతూంటే రామకృష్ణ మరింత నిలదీశాడు. + +"మీ అనుమానం నాకూ తోచింది. అయితే మీ స్వభావం తెలుసుకుందామని..." + +"దీనితో స్వభావం మాటెట్లా తెలుస్తుంది." + +పార్వతీశం చటుక్కున అనేశాడు. + +"పెళ్ళి చేసుకోదలచిన పడుచును ఒకడు అవమానిస్తుంటే నువ్వెవరి తరఫున నిలబడుతున్నావో..." + +"అది ఆమె తెచ్చుకున్న అవమానం. ఆమె ప్రవర్తనలో ఆ లోపం ఉన్నదని..." + +"డర్టీ రోగ్...!" + +ఆ స్వరం వినబడిన వేపు భాస్కరరావు తిరిగాడు. ఉమ ముఖం తిప్పుకునే ఉంది. కాని ఆ ముఖంలో అసహ్యం కొట్టవచ్చినట్లు +కనిపిస్తోంది. ఏదో అనబోతున్న తండ్రిని వారిస్తోంది. తాను లేచాడు. + +"మీరా ప్రశ్న వెయ్యవలసింది నన్ను కాదు, ప్రెస్ వాడిని." + +"తొందరపడతారేం? కూర్చోండి. కొన్ని సంగతులు మీకు తెలియవనుకున్నప్పుడు తెలుసుకునే వెళ్ళడం మంచిది" అని అడ్వొకేట్ శాస్త్రి +సలహా ఇచ్చాడు. + + "ఆ దిద్దుబాట్లు చేసిన ఆయనకు ప్రెస్ యజమాని మిత్రుడయి ఉండాలి. ఆయన ఇది తన ప్రెస్‌లోనే వెయ్యలేదని +బుకాయించాడు." అని రామకృష్ణ అందుకున్నాడు. + + "ఆ ప్రెస్ పేరేమిటి?" + + "అదంత అవసరమా?" అన్నాడు అడ్వొకేట్. + + "మరేది ముఖ్యం?" + + "ఒరేయి! నే చెప్తావుండు ఏది ముఖ్యమో?" అని పార్వతీశం అందుకున్నాడు. "ఈ శుభలేఖలు ఈ ఊళ్ళో నిన్న పంచేరు. +నిన్నటికి అందేలాగ పొరుగూళ్ళకి పంపించారు. నువ్వు రావడాన్ని బట్టి నీకూ అల్లాగే పంపించి ఉంటారనుకోవాలి." + + "నాకు మొన్న వచ్చింది" అనేశాడు భాస్కరరావు. + + "ఎవరా పంపింది?" + +"అందరికీ పంపిన వారే అయి ఉంటారు." + +"అదే మేం చెప్పేదీ. ఆ పంపిన వారెవరని మా ప్రశ్న." + +"గత పరిణామాల దృష్ట్యా దానితోపాటు వివరణా వ్రాసి ఉంటారు. వారెవరు?" + +"అల్లా ఎందుకనుకున్నారు?" + +"ఆ శుభలేఖలోని ఒక భాగస్వామితో నీకు ఉన్న లేక ఉందనుకున్న బంధుత్వం దృష్ట్యా వివరణతో నేను వ్రాసినట్లే..." +నన్నాడు పార్వతీశం. + +"నాకది అందలేదని చెప్పాను." + +"అందే వ్యవధీ, అవకాశమూ లేదని నేనూ చెప్పాను. నా టెలిగ్రాం అందేటప్పటికే నువ్వు బయలుదేరి వచ్చేవని తెలుస్తోంది. +మరెందుకు బయలుదేరినట్లు?" + +అంతవరకూ ఆ గొడవలేమిటో జ్ఞాతాజ్ఞాతంగానే ఉందిగానీ స్పష్టంకాలేదు ముసలి వాళ్ళిద్దరికీ. కలుగజేసుకునేందుకు వీలుకాకుండా ఉమ +తండ్రినీ, అసదుల్లా తాతనూ ఆపుతున్నారు. ఇక ఊరుకోలేకపోయారు. + +"ఏమిటీ గందరగోళం?" + +"బాత్ క్యా హై?" + +"ఉమ, భాస్కరరావులు రిజిస్ట్రారాఫీసుకి దరఖాస్తు ఇచ్చేరు." + +"ఎప్పటికి?" అన్నాడు చంద్రశేఖరశాస్త్రి ఆదుర్దాగా. + +రామకృష్ణ గ్రహించాడు. + +"ఫర్వాలేదులెండి. మౌఢ్యం వెళ్ళాకనే ఏర్పాటు చేసేరాయన." + +"ఇప్పుడా మౌఢ్యమే నన్ను కాపాడింది." అనేసింది ఉమ. + +"నేనూ అల్లాగే అనుకోవచ్చునేమో?" + +"మీ ఇద్దరిలో ఎవరికి ఆ ఆలోచన కలిగినా చాలును. మేము అంతా నమ్మగలం. ఇద్దరికీ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయం +కుదరడం మరింత మంచిది." అన్నాడు రామకృష్ణ. + +చంద్రశేఖరశాస్త్రి ఈమారు ఊరుకోలేకపోయాడు. మాట పట్టింపులతో కుర్రవాళ్ళు తాముగా కుదుర్చుకున్న వివాహ సంబంధాన్ని +చెడగొట్టుకుంటున్నారనిపించింది. ఇక ఊరుకోకూడదనిపించింది. + +"తొందరపడకండి. ఈ రభస సృష్టించినది ఎవరో తుంటరులే కాని నిజం కాదని ఇద్దరూ ఎరుగుదురు. మీ మాటలు చూస్తే ఆ తుంటరు +లెవరో కూడా ఇద్దరికీ తెలుసుననే తోస్తుంది. ఇక తగు వేమిటి?" + +"తగువంతా అటు తర్వాతనే. ఈ ఘటన మీద ఆయన అభిప్రాయం గురించే" అన్నాడు రామకృష్ణ. + +"ఆవేశం, దుఃఖం, మానసిక బాధ మొదలైనవి అనేక దురభిప్రాయాలకి దారి తీస్తాయి. ప్రతి దానికి కత్తా, బద్దా--అని +కూర్చోకూడదు." + +చిన్న సమస్యను కొండంత చేసుకుని యావజ్జీవం పెంచుకోవలసిన సద్భావాన్ని చెడగొట్టుకోరాదని ఆయన దృక్పథం. + +ముసలాడు ఘటికుడు ఇట్టే తేల్చిపారేసేడని నవ్వుకున్నాడు అడ్వొకేట్ శాస్త్రి. + +ఇంక ఏం మాట్లాడినా బాధ్యతా రహితంగా వ్యవహరించాడనే మాట వస్తుందని అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. + +"క్యోఁ భాయీసాబ్?" + +"సచ్ హై, సచ్ హై." + +ఉమ ఉలికిపడ్డట్టు తేరుకుంది. + +"ఇందులో కత్తెయ్యనా, బద్దెయ్యనా అనే మీమాంస ఏంలేదు. ఆడదాని విషయంలో మగవాని ఆలోచన ఎల్లా ఉంది, ఉంటుందనేదీ అసలు +సంగతి" అంది ఉమ. + +"తాను పెళ్ళి చేసుకోవాలనుకున్న పడుచును ఒకడు అవమానిస్తే వాని మీద కన్న ఆ పడుచు మీద కోపం చూపే మనిషిని..." +రామకృష్ణ ముగించకుండానే పార్వతీశం అందుకున్నాడు. + +"కోపం అంటావేమిటి... తానూ అవమానించడానికి సిద్దం అయ్యాడు మగాడు." + +భాస్కరరావు ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లు నిలబడ్డాడు. + +"నమస్కారం శాస్త్రి గారూ! తమ దర్శనం మళ్ళీ చేసుకుంటాను. ఉంటారుగా?" + +"కూర్చో బాబూ! మాట్లాడుకుందాం" + +"కాదండి... నేను ఇంటికి వెళ్ళి కొన్ని పనులు చక్కబెట్టుకు రావాలి. లే. ఉమా వెళ్ళి వద్దాం." + +ఉమ ఖండితంగా చెప్పేసింది. + +"మీతో నే నెక్కడికీ రావలసిన పని లేదు. రావడం లేదు. మీరు మళ్ళీ నా కోసం ఎక్కడికీ రావలసిన పని లేదు. రావద్దు." + +చంద్రశేఖర శాస్త్రి "ఆ! ఆ!" అన్నాడు. + +రామకృష్ణ--"తొందరపడకు ఉమా" + +అడ్వొకేట్, శాస్త్రి కూర్చోండి భాస్కరరావుగారూ....వెళుదురుగాని....తొందరేం ఉంది?" + +కానీ ఉమ ఏ మాత్రమూ తగ్గలేదు. పైగా "అన్నేమిటి, నాన్నేమిటి మగాళ్ళంతా ఒక్కటే! తన అన్న చేసిన వెధవ పనికి +ఆయననేమీ అనలేక, అటువంటి దానికి అవకాశం కలిగించే ననగలిగిన మనిషితో నాకు ఏ ప్రమేయం లేదు. పెట్టుకోను. మీ రెవ్వరూ +నాకేమీ చెప్పవద్దు." + +ఇంకామె మరోమాట జారనివ్వలేదు. + +భాస్కరరావు వెళ్ళిపోయాడు. + +"అమ్మా!....తొందరపడుతున్నావు." + +"లేదు నాన్నగారూ....రిజిస్ట్రాఫీసుకి వెళ్ళకుండానే ఆయన స్వభావం అర్థం అయింది. అందుకు సంతోషపడాలి." + +చంద్రశేఖర శాస్త్రికి మాత్రం సంతోషానికి బదులు దిగులు కలిగింది. + +"సరే....సరే....నీ ఇష్టం!...." + + + + +[సమాప్తం] + + + + + +End of the Project Gutenberg EBook of Subhalekha, by Rama Mohana Rao Mahidhara + +*** END OF THIS PROJECT GUTENBERG EBOOK SUBHALEKHA *** + +***** This file should be named 39004-0.txt or 39004-0.zip ***** +This and all associated files of various formats will be found in: + https://www.gutenberg.org/3/9/0/0/39004/ + +Produced by volunteers at Pustakam.net + +Updated editions will replace the previous one--the old editions +will be renamed. + +Creating the works from public domain print editions means that no +one owns a United States copyright in these works, so the Foundation +(and you!) can copy and distribute it in the United States without +permission and without paying copyright royalties. Special rules, +set forth in the General Terms of Use part of this license, apply to +copying and distributing Project Gutenberg-tm electronic works to +protect the PROJECT GUTENBERG-tm concept and trademark. Project +Gutenberg is a registered trademark, and may not be used if you +charge for the eBooks, unless you receive specific permission. If you +do not charge anything for copies of this eBook, complying with the +rules is very easy. You may use this eBook for nearly any purpose +such as creation of derivative works, reports, performances and +research. They may be modified and printed and given away--you may do +practically ANYTHING with public domain eBooks. Redistribution is +subject to the trademark license, especially commercial +redistribution. + + + +*** START: FULL LICENSE *** + +THE FULL PROJECT GUTENBERG LICENSE +PLEASE READ THIS BEFORE YOU DISTRIBUTE OR USE THIS WORK + +To protect the Project Gutenberg-tm mission of promoting the free +distribution of electronic works, by using or distributing this work +(or any other work associated in any way with the phrase "Project +Gutenberg"), you agree to comply with all the terms of the Full Project +Gutenberg-tm License (available with this file or online at +https://gutenberg.org/license). + + +Section 1. General Terms of Use and Redistributing Project Gutenberg-tm +electronic works + +1.A. By reading or using any part of this Project Gutenberg-tm +electronic work, you indicate that you have read, understand, agree to +and accept all the terms of this license and intellectual property +(trademark/copyright) agreement. If you do not agree to abide by all +the terms of this agreement, you must cease using and return or destroy +all copies of Project Gutenberg-tm electronic works in your possession. +If you paid a fee for obtaining a copy of or access to a Project +Gutenberg-tm electronic work and you do not agree to be bound by the +terms of this agreement, you may obtain a refund from the person or +entity to whom you paid the fee as set forth in paragraph 1.E.8. + +1.B. "Project Gutenberg" is a registered trademark. It may only be +used on or associated in any way with an electronic work by people who +agree to be bound by the terms of this agreement. There are a few +things that you can do with most Project Gutenberg-tm electronic works +even without complying with the full terms of this agreement. See +paragraph 1.C below. There are a lot of things you can do with Project +Gutenberg-tm electronic works if you follow the terms of this agreement +and help preserve free future access to Project Gutenberg-tm electronic +works. See paragraph 1.E below. + +1.C. The Project Gutenberg Literary Archive Foundation ("the Foundation" +or PGLAF), owns a compilation copyright in the collection of Project +Gutenberg-tm electronic works. Nearly all the individual works in the +collection are in the public domain in the United States. If an +individual work is in the public domain in the United States and you are +located in the United States, we do not claim a right to prevent you from +copying, distributing, performing, displaying or creating derivative +works based on the work as long as all references to Project Gutenberg +are removed. Of course, we hope that you will support the Project +Gutenberg-tm mission of promoting free access to electronic works by +freely sharing Project Gutenberg-tm works in compliance with the terms of +this agreement for keeping the Project Gutenberg-tm name associated with +the work. You can easily comply with the terms of this agreement by +keeping this work in the same format with its attached full Project +Gutenberg-tm License when you share it without charge with others. + +1.D. The copyright laws of the place where you are located also govern +what you can do with this work. Copyright laws in most countries are in +a constant state of change. If you are outside the United States, check +the laws of your country in addition to the terms of this agreement +before downloading, copying, displaying, performing, distributing or +creating derivative works based on this work or any other Project +Gutenberg-tm work. The Foundation makes no representations concerning +the copyright status of any work in any country outside the United +States. + +1.E. Unless you have removed all references to Project Gutenberg: + +1.E.1. The following sentence, with active links to, or other immediate +access to, the full Project Gutenberg-tm License must appear prominently +whenever any copy of a Project Gutenberg-tm work (any work on which the +phrase "Project Gutenberg" appears, or with which the phrase "Project +Gutenberg" is associated) is accessed, displayed, performed, viewed, +copied or distributed: + +This eBook is for the use of anyone anywhere at no cost and with +almost no restrictions whatsoever. You may copy it, give it away or +re-use it under the terms of the Project Gutenberg License included +with this eBook or online at www.gutenberg.org + +1.E.2. If an individual Project Gutenberg-tm electronic work is derived +from the public domain (does not contain a notice indicating that it is +posted with permission of the copyright holder), the work can be copied +and distributed to anyone in the United States without paying any fees +or charges. If you are redistributing or providing access to a work +with the phrase "Project Gutenberg" associated with or appearing on the +work, you must comply either with the requirements of paragraphs 1.E.1 +through 1.E.7 or obtain permission for the use of the work and the +Project Gutenberg-tm trademark as set forth in paragraphs 1.E.8 or +1.E.9. + +1.E.3. If an individual Project Gutenberg-tm electronic work is posted +with the permission of the copyright holder, your use and distribution +must comply with both paragraphs 1.E.1 through 1.E.7 and any additional +terms imposed by the copyright holder. Additional terms will be linked +to the Project Gutenberg-tm License for all works posted with the +permission of the copyright holder found at the beginning of this work. + +1.E.4. Do not unlink or detach or remove the full Project Gutenberg-tm +License terms from this work, or any files containing a part of this +work or any other work associated with Project Gutenberg-tm. + +1.E.5. Do not copy, display, perform, distribute or redistribute this +electronic work, or any part of this electronic work, without +prominently displaying the sentence set forth in paragraph 1.E.1 with +active links or immediate access to the full terms of the Project +Gutenberg-tm License. + +1.E.6. You may convert to and distribute this work in any binary, +compressed, marked up, nonproprietary or proprietary form, including any +word processing or hypertext form. However, if you provide access to or +distribute copies of a Project Gutenberg-tm work in a format other than +"Plain Vanilla ASCII" or other format used in the official version +posted on the official Project Gutenberg-tm web site (www.gutenberg.org), +you must, at no additional cost, fee or expense to the user, provide a +copy, a means of exporting a copy, or a means of obtaining a copy upon +request, of the work in its original "Plain Vanilla ASCII" or other +form. Any alternate format must include the full Project Gutenberg-tm +License as specified in paragraph 1.E.1. + +1.E.7. Do not charge a fee for access to, viewing, displaying, +performing, copying or distributing any Project Gutenberg-tm works +unless you comply with paragraph 1.E.8 or 1.E.9. + +1.E.8. You may charge a reasonable fee for copies of or providing +access to or distributing Project Gutenberg-tm electronic works provided +that + +- You pay a royalty fee of 20% of the gross profits you derive from + the use of Project Gutenberg-tm works calculated using the method + you already use to calculate your applicable taxes. The fee is + owed to the owner of the Project Gutenberg-tm trademark, but he + has agreed to donate royalties under this paragraph to the + Project Gutenberg Literary Archive Foundation. Royalty payments + must be paid within 60 days following each date on which you + prepare (or are legally required to prepare) your periodic tax + returns. Royalty payments should be clearly marked as such and + sent to the Project Gutenberg Literary Archive Foundation at the + address specified in Section 4, "Information about donations to + the Project Gutenberg Literary Archive Foundation." + +- You provide a full refund of any money paid by a user who notifies + you in writing (or by e-mail) within 30 days of receipt that s/he + does not agree to the terms of the full Project Gutenberg-tm + License. You must require such a user to return or + destroy all copies of the works possessed in a physical medium + and discontinue all use of and all access to other copies of + Project Gutenberg-tm works. + +- You provide, in accordance with paragraph 1.F.3, a full refund of any + money paid for a work or a replacement copy, if a defect in the + electronic work is discovered and reported to you within 90 days + of receipt of the work. + +- You comply with all other terms of this agreement for free + distribution of Project Gutenberg-tm works. + +1.E.9. If you wish to charge a fee or distribute a Project Gutenberg-tm +electronic work or group of works on different terms than are set +forth in this agreement, you must obtain permission in writing from +both the Project Gutenberg Literary Archive Foundation and Michael +Hart, the owner of the Project Gutenberg-tm trademark. Contact the +Foundation as set forth in Section 3 below. + +1.F. + +1.F.1. Project Gutenberg volunteers and employees expend considerable +effort to identify, do copyright research on, transcribe and proofread +public domain works in creating the Project Gutenberg-tm +collection. Despite these efforts, Project Gutenberg-tm electronic +works, and the medium on which they may be stored, may contain +"Defects," such as, but not limited to, incomplete, inaccurate or +corrupt data, transcription errors, a copyright or other intellectual +property infringement, a defective or damaged disk or other medium, a +computer virus, or computer codes that damage or cannot be read by +your equipment. + +1.F.2. LIMITED WARRANTY, DISCLAIMER OF DAMAGES - Except for the "Right +of Replacement or Refund" described in paragraph 1.F.3, the Project +Gutenberg Literary Archive Foundation, the owner of the Project +Gutenberg-tm trademark, and any other party distributing a Project +Gutenberg-tm electronic work under this agreement, disclaim all +liability to you for damages, costs and expenses, including legal +fees. YOU AGREE THAT YOU HAVE NO REMEDIES FOR NEGLIGENCE, STRICT +LIABILITY, BREACH OF WARRANTY OR BREACH OF CONTRACT EXCEPT THOSE +PROVIDED IN PARAGRAPH 1.F.3. YOU AGREE THAT THE FOUNDATION, THE +TRADEMARK OWNER, AND ANY DISTRIBUTOR UNDER THIS AGREEMENT WILL NOT BE +LIABLE TO YOU FOR ACTUAL, DIRECT, INDIRECT, CONSEQUENTIAL, PUNITIVE OR +INCIDENTAL DAMAGES EVEN IF YOU GIVE NOTICE OF THE POSSIBILITY OF SUCH +DAMAGE. + +1.F.3. LIMITED RIGHT OF REPLACEMENT OR REFUND - If you discover a +defect in this electronic work within 90 days of receiving it, you can +receive a refund of the money (if any) you paid for it by sending a +written explanation to the person you received the work from. If you +received the work on a physical medium, you must return the medium with +your written explanation. The person or entity that provided you with +the defective work may elect to provide a replacement copy in lieu of a +refund. If you received the work electronically, the person or entity +providing it to you may choose to give you a second opportunity to +receive the work electronically in lieu of a refund. If the second copy +is also defective, you may demand a refund in writing without further +opportunities to fix the problem. + +1.F.4. Except for the limited right of replacement or refund set forth +in paragraph 1.F.3, this work is provided to you 'AS-IS' WITH NO OTHER +WARRANTIES OF ANY KIND, EXPRESS OR IMPLIED, INCLUDING BUT NOT LIMITED TO +WARRANTIES OF MERCHANTIBILITY OR FITNESS FOR ANY PURPOSE. + +1.F.5. Some states do not allow disclaimers of certain implied +warranties or the exclusion or limitation of certain types of damages. +If any disclaimer or limitation set forth in this agreement violates the +law of the state applicable to this agreement, the agreement shall be +interpreted to make the maximum disclaimer or limitation permitted by +the applicable state law. The invalidity or unenforceability of any +provision of this agreement shall not void the remaining provisions. + +1.F.6. INDEMNITY - You agree to indemnify and hold the Foundation, the +trademark owner, any agent or employee of the Foundation, anyone +providing copies of Project Gutenberg-tm electronic works in accordance +with this agreement, and any volunteers associated with the production, +promotion and distribution of Project Gutenberg-tm electronic works, +harmless from all liability, costs and expenses, including legal fees, +that arise directly or indirectly from any of the following which you do +or cause to occur: (a) distribution of this or any Project Gutenberg-tm +work, (b) alteration, modification, or additions or deletions to any +Project Gutenberg-tm work, and (c) any Defect you cause. + + +Section 2. Information about the Mission of Project Gutenberg-tm + +Project Gutenberg-tm is synonymous with the free distribution of +electronic works in formats readable by the widest variety of computers +including obsolete, old, middle-aged and new computers. It exists +because of the efforts of hundreds of volunteers and donations from +people in all walks of life. + +Volunteers and financial support to provide volunteers with the +assistance they need are critical to reaching Project Gutenberg-tm's +goals and ensuring that the Project Gutenberg-tm collection will +remain freely available for generations to come. In 2001, the Project +Gutenberg Literary Archive Foundation was created to provide a secure +and permanent future for Project Gutenberg-tm and future generations. +To learn more about the Project Gutenberg Literary Archive Foundation +and how your efforts and donations can help, see Sections 3 and 4 +and the Foundation web page at https://www.pglaf.org. + + +Section 3. Information about the Project Gutenberg Literary Archive +Foundation + +The Project Gutenberg Literary Archive Foundation is a non profit +501(c)(3) educational corporation organized under the laws of the +state of Mississippi and granted tax exempt status by the Internal +Revenue Service. The Foundation's EIN or federal tax identification +number is 64-6221541. Its 501(c)(3) letter is posted at +https://pglaf.org/fundraising. Contributions to the Project Gutenberg +Literary Archive Foundation are tax deductible to the full extent +permitted by U.S. federal laws and your state's laws. + +The Foundation's principal office is located at 4557 Melan Dr. S. +Fairbanks, AK, 99712., but its volunteers and employees are scattered +throughout numerous locations. Its business office is located at +809 North 1500 West, Salt Lake City, UT 84116, (801) 596-1887, email +business@pglaf.org. Email contact links and up to date contact +information can be found at the Foundation's web site and official +page at https://pglaf.org + +For additional contact information: + Dr. Gregory B. Newby + Chief Executive and Director + gbnewby@pglaf.org + + +Section 4. Information about Donations to the Project Gutenberg +Literary Archive Foundation + +Project Gutenberg-tm depends upon and cannot survive without wide +spread public support and donations to carry out its mission of +increasing the number of public domain and licensed works that can be +freely distributed in machine readable form accessible by the widest +array of equipment including outdated equipment. Many small donations +($1 to $5,000) are particularly important to maintaining tax exempt +status with the IRS. + +The Foundation is committed to complying with the laws regulating +charities and charitable donations in all 50 states of the United +States. Compliance requirements are not uniform and it takes a +considerable effort, much paperwork and many fees to meet and keep up +with these requirements. We do not solicit donations in locations +where we have not received written confirmation of compliance. To +SEND DONATIONS or determine the status of compliance for any +particular state visit https://pglaf.org + +While we cannot and do not solicit contributions from states where we +have not met the solicitation requirements, we know of no prohibition +against accepting unsolicited donations from donors in such states who +approach us with offers to donate. + +International donations are gratefully accepted, but we cannot make +any statements concerning tax treatment of donations received from +outside the United States. U.S. laws alone swamp our small staff. + +Please check the Project Gutenberg Web pages for current donation +methods and addresses. Donations are accepted in a number of other +ways including including checks, online payments and credit card +donations. To donate, please visit: https://pglaf.org/donate + + +Section 5. General Information About Project Gutenberg-tm electronic +works. + +Professor Michael S. Hart was the originator of the Project Gutenberg-tm +concept of a library of electronic works that could be freely shared +with anyone. For thirty years, he produced and distributed Project +Gutenberg-tm eBooks with only a loose network of volunteer support. + + +Project Gutenberg-tm eBooks are often created from several printed +editions, all of which are confirmed as Public Domain in the U.S. +unless a copyright notice is included. Thus, we do not necessarily +keep eBooks in compliance with any particular paper edition. + + +Most people start at our Web site which has the main PG search facility: + + https://www.gutenberg.org + +This Web site includes information about Project Gutenberg-tm, +including how to make donations to the Project Gutenberg Literary +Archive Foundation, how to help produce our new eBooks, and how to +subscribe to our email newsletter to hear about new eBooks. diff --git a/39004-0.zip b/39004-0.zip Binary files differnew file mode 100644 index 0000000..aa3acb6 --- /dev/null +++ b/39004-0.zip diff --git a/LICENSE.txt b/LICENSE.txt new file mode 100644 index 0000000..6312041 --- /dev/null +++ b/LICENSE.txt @@ -0,0 +1,11 @@ +This eBook, including all associated images, markup, improvements, +metadata, and any other content or labor, has been confirmed to be +in the PUBLIC DOMAIN IN THE UNITED STATES. + +Procedures for determining public domain status are described in +the "Copyright How-To" at https://www.gutenberg.org. + +No investigation has been made concerning possible copyrights in +jurisdictions other than the United States. Anyone seeking to utilize +this eBook outside of the United States should confirm copyright +status under the laws that apply to them. diff --git a/README.md b/README.md new file mode 100644 index 0000000..bd024d9 --- /dev/null +++ b/README.md @@ -0,0 +1,2 @@ +Project Gutenberg (https://www.gutenberg.org) public repository for +eBook #39004 (https://www.gutenberg.org/ebooks/39004) |
